పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, జనవరి 2015, సోమవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 16




కాలేజ్ నుండి రూమ్ కి వచ్చిన తర్వాత కూడా నాకు కావ్య  మాటలే గుర్తొస్తున్నాయి.హేమంత్ తో ఇప్పుడెలా మాట్లాడాలి? ఏమి మాట్లాడాలి? కావ్య ముందైతే ఒప్పుకుని వచ్చాను కానీ ముందుకెలా వెళ్ళాలో అర్ధం కావటం లేదు. మొత్తానికి ఇప్పుడు నా ఆలోచనంతా హేమంత్ చుట్టూనే తిరుగుతుంది. వాడు ఎటు వెళ్తున్నాడు,ఏమి చేస్తున్నాడు అని వాడినొక నీడలా ఫాలో అవ్వటమే పనిగా పెట్టుకున్నాను.ఆ పనిలో భాగంగానే ఇంతకుముందు హేమంత్ వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వస్తావా అని అడిగినా రానని తప్పించుకునే నేను ఆ రోజు వాళ్ళు బయటికి బయల్దేరగానే నేను వస్తాను హేమంత్ అనగానే బోలెడు ఆశ్చర్యంతో అబ్బో ఏంటి మాధవ్ ఇవాళ విశేషం  రా తప్పకుండా అంటూ నన్ను కూడా వెంట తీసుకెళ్ళారు.

డైరెక్ట్ గా ఒక బార్ కి వెళ్లి మొత్తం అయిదుగురం ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నాం.నేను  ఆ వాతావరణాన్ని గమనిస్తున్నాను. అన్నిరకాల మనుషులు  ఉన్నారక్కడ. అప్పటిదాకా అఫిషియల్ గా కూర్చుని మాట్లాడుతున్న మనిషి కూడా కొంచెం మందు తాగగానే ప్రపంచాన్నే మర్చిపోయి తన మీద తనకే నియంత్రణ పోయినట్లుగా ఏదేదో మాట్లాడుతూ, తిడుతూ కొందరు,పీకలదాకా తాగి నడవటం కూడా చేతకాని స్థితిలో బేరర్లు తీసుకుపోయి ఆటోలు, కార్లుంటే కార్లు ఎక్కిస్తూ కొందరు, కొంతమందైతే అక్కడే కూర్చుని ఇంట్లో భార్య, కుటుంబసభ్యులు తననెలా వేధిస్తున్నారో చెప్పుకుంటూ బాధపడుతూ కేకలు పెడుతూ ,మొత్తానికి ఆ ప్రదేశం అంతా వింత వింతగా,అసహ్యంగా అనిపిస్తుంది నాకు.

ఈలోగా మావాళ్ళు కూడా కావాల్సినవి ఆర్డర్ చేస్తూ మాధవ్ ఏంటి సంగతి అన్నారు.నేను కంగారుగా లేదు..లేదు నేను వూరికే మీతో పాటూ వచ్చాను,నాకేమీ వద్దు అన్నాను. సరేలే అలవాటు లేకుండా నువ్వు ప్రయోగం చేసినా నిన్నురూమ్ కి   మోసుకుపోయే ఓపిక మాకు లేదు అని నవ్వుకుంటూ నాకు కూల్డ్రింక్, చికెన్ బిర్యానీ తెప్పించారు.నేను వివేకానంద శిష్యుడినే కానీ శాఖాహారిని మాత్రం కాదు. చికెన్ అంటే చాలా ఇష్టం నాకు  :) మొత్తానికి తాగి తందనాలాడటం అంటే ఏంటో ఆరోజు బాగా దగ్గరగా చూశాను..మావాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? తాగగానే ఎక్కడెక్కడి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి.కాలేజ్ లో ఏ అమ్మాయి ఎలాంటిది?ఎవరికి ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?ఎవరు ఎవరికి బాయ్ ఫ్రెండు,గర్ల్ ఫ్రెండు..ఇలా వాళ్ళ మాటల్లో ఎప్పుడూ నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 


నేను చికెన్ బిర్యానీ తింటూ ఆలోచిస్తున్నాఈ క్యాండిల్ లైట్ అంటూ మసక చీకటి ఒకటి..ఏమి తింటున్నామో, తాగుతున్నామో తెలిసి చావకుండా.. అయినా ఇదీ ఒకందుకు మంచిదేలే ఎవరు ఎవరికీ తెలియకుండా చీకట్లో ఉండటం.హేమంత్ తో ఎలా మాట్లాడాలి ఎలాగోలా మాటలు మొదలు పెట్టాలని నేనే.. ఏంటి హేమంత్ ఇలాంటి ప్లేస్ లకి మీరు రావటం అవసరమా నాకైతే చూడటానికే అసహ్యంగా ఉంది.ఇక్కడ మనల్ని చూస్తే మన పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు చెప్పు అన్నాను.దానికి వాళ్ళు ఒరేయ్ మాధవ్ నీ మాటలు వింటుంటే మేమేదో పచ్చితాగుబోతులం అయిపోయినట్లు మా మీద మాకే అనుమానం వస్తుందిరా.ఏదో సరదాగా కొంచెం రిలీఫ్ కోసం ఇలా వస్తే ఈరోజుల్లో తాత కాలంవాడిలాగా ఏంట్రా ఆ మాటలు? అయినా లిమిట్ మించనంత వరకు ఏదీ తప్పు కాదురా. అని నా మాటలు కనీసం వినిపించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఎలాగో రూమ్ కి చేరాము. 

ఉదయాన్నే లేచి కాలేజ్ కి బయల్దేరుతూ చూస్తే ఎక్కడి వాళ్ళక్కడే ఇంకా పడుకుని ఉన్నారు.వీళ్ళకి తోడూ మళ్ళీ హేంగోవర్.. అంత చేతకాని వాళ్లకి ఎందుకో వేషాలు అనుకుని నా పని నేను చేసుకుని కాలేజ్ కి వెళ్ళాను.రాత్రి జరిగిన విషయాలన్నీ కావ్యకి చెప్పాలి అన్న ఆత్రం పెరిగిపోతుంది. లంచ్ బ్రేక్ లో కావ్య,నేను లైబ్రరీకి వెళ్లి కూర్చుని జరిగిన విషయాలన్నీ చెప్పేశాను.సరే మాధవ్ మొత్తానికి వాళ్ళు నిన్నుకూడా అక్కడికి తీసుకెళ్ళారన్నమాట..! జాగ్రత్త వాళ్ళని మార్చేలోగా వాళ్ళే నిన్నుమార్చేస్తారేమో అని నవ్వుతూ క్లాస్ కి వెళ్ళిపోయింది కావ్య. నిజమే కదా వాళ్ళు అలాగ చేసినా చేస్తారు.ముందు నేను గట్టి మనసుతో ఉండాలి అనుకున్నాను.

అప్పటినుండి అదేపనిగా హేమంత్ ఒక్కడు ఉన్నప్పుడు ఏదో మాటల్లో చెప్పి నట్లు  మావూరిలో ఒక తాగుబోతు తన వ్యసనంవల్ల ఎంత నష్టపోయాడో, కుటుంబానికి ఎలా దూరమయ్యాడో ఏదో మాటల్లో చెప్పినట్లు చెప్పటం, సరదాగా మొదలైన ఇలాంటి అలవాట్లు వ్యసనాలుగా ఎలా మారతాయో చెప్తూ ఎలాగైనా తన మనసు మార్చాలని ఒక కౌన్సిలర్ అవతారం ఎత్తాను. అప్పుడప్పుడు నామాటలు విన్నట్లే ఉండేవాడు.కానీ వాడి పని వాడు చేస్తూనే ఉండేవాడు.చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉంది నా పరిస్థితి.

అసలు ఇంతకీ నాకు తెలియని విషయం ఏంటంటే ఏ మనిషైనా సరే తను చేయాల నుకున్నదే చేస్తాడు ఎదుటివాళ్ళ మాటలు,చేతల ప్రభావం వాళ్ళ మీద కొంత వరకే ఉంటుంది.వివేకానందుడు మనసులో సంకల్పం ఉంటె ఎంత కష్టమైనా సాధించొచ్చు అన్నాడు నిజమే కానీ ఎవరి మనసులో? నా పనులకి సంబంధించి నా మనసులో ఒక సంకల్పం ఉన్నట్లే హేమంత్ పనులకి సంబంధించి తన మనసులో తనకి ఒక సంకల్పం ఉంటుంది.దాన్ని నేను నా మనసులో సంకల్పంతో ఎలా మార్చగలను?? అయినా అప్పట్లో నా అజ్ఞానం కాకపొతే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగి పబ్బుల్లో పడిపోతున్న రోజులు.. అలాంటిది అప్పట్లో వాళ్ళు అలాచేయటంలో తప్పేముంది?? ఈ జ్ఞానోదయం నాకు ఇప్పుడు కలిగింది కానీ ఆరోజుల్లోనే కలిగినట్లయితే ఈ కధే ఉండేది కాదు.


 ఇలా నేను రోజూ వివేకానందుడిబోధనలు చెప్పటం వినీ వినీ హేమంత్.పెద్ద మాధవ్,సోహైల్,దివాకర్లకి మనసులో ఒక్కరోజైనా నిజంగా మనం అంత పెద్ద తప్పు చేస్తున్నామా? అనే ఆలోచన అయినా వస్తుందేమో అని ఒక ఆశ,నమ్మ కం కూడా.కనీసం హేమంత్ అయినా మారితే బాగుండు కావ్య ముందు నా మాట నిలబడుతుంది అని నా ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నిస్తున్న రోజుల్లో నా మాటలకు,చేతలకు విసిగిపోయిన నా మిత్రబృందం నలుగురు ఒకచోట చేరి సరే మాధవ్ నీ మాటే నిజమనుకుందాము.వివేకానందుడి బోధనలవల్ల నువ్వనుకుంది సాధించావు, ఇకముందు కూడా ఏదైనా సాధిస్తానని నీ నమ్మకం కదా..!సరే మరి నీకొక చాలెంజ్ నువ్వు అది పూర్తి  చేస్తే మేమంతా నువ్వు చెప్పినట్లు వింటాము.లేకపోతే నువ్వే మేము చెప్పినట్లు వినాలి సరేనా?? అన్నారు.. ఇదేంట్రా నాయనా కావ్య ఇచ్చిన సమస్యకే ఇప్పటిదాకా పరిష్కారం రాలేదనుకుంటే మళ్ళీ ఇంకొక సమస్యా? సరే ఏది ఏమైనా వెనక్కి తగ్గకూడదు అనుకుని సరే మీ చాలెంజ్ కి నేను ఒప్పుకుంటున్నాను అన్నాను.. 
 

Related Posts Plugin for WordPress, Blogger...