పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, మే 2012, ఆదివారం

అమ్మ లాలి చాలునే ... నిన్ను కమ్మంగ లాలించునే...


"అమ్మవంటిది ... అంతమంచిదిఅమ్మఒక్కటే"
-- ఆత్రేయ


అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
-- దాశరథి. కృష్ణమాచార్య


"అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే "
-- సి. నారాయణరెడ్డి


పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
--వేటూరి. సుందరరామమూర్తి


ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
-- సిరివెన్నెల. సీతారామశాస్త్రి


పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ
-- చంద్రబోస్


ఇవన్నీఅమ్మ గురించి గొప్పగొప్ప రచయితలూ, కవులు చెప్పినమాటలు,
గొప్పవాళ్ళ
మాటల్లోనేకాదు...
ప్రతీ మనిషి మనసులోని మాట "అమ్మకనిపించే ... కనిపెంచేదేవత" అని.


అమ్మ నేను సంతోషిస్తే తను చిరునవ్వవుతుంది...
నా కష్టంలో తను కన్నీరవుతుంది..
నా విజయం లో తానే విజేతగా సంబరపడుతుంది...

నా
ఓటమిలో ఓదార్పవుతుంది ..
నా సమస్యకు పరిష్కారమవుతుంది..
నా అలకను తీర్చే అక్షయపాత్ర అవుతుంది...

నా
చుట్టూ ఆవరించిన శూన్యం నన్ను నిస్తేజం చేసినప్పుడు,
నిస్సహాయంగా నిలిచినప్పుడు, శూన్యమనే చీకటిని తొలగించే
కాంతి పుంజంలా అమ్మమాట, అమ్మ చెప్పే ధైర్యం
నన్ను చైతన్యవంతం చేస్తుంది.


మనిషికి దేవుడు ఇచ్చిన వరం అమ్మప్రేమ.. ఆవరాన్ని పొందిన ప్రతి మనిషీ అదృష్టవంతులే..
అమ్మప్రేమను గురించి "అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా" పాట నాకు చాలా ఇష్టం..
బిడ్డపైన అమ్మకు వుండే ప్రేమాభిమానాలను తెలుపుతూ అమ్మపాడే పాట ఇది..

అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతూ, కధలు చెప్పమని ముద్దుగా అల్లరిచేసే చిన్నారి అల్లరికి సంతోషిస్తూ..
ఎంతో ముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పెళ్లై అత్తవారింటికి వెళ్తే తనను చూడకుండా ఎలావుండగలననే కన్నతల్లి బాధను వ్యక్తపరుస్తూ...
నువ్వు ఎక్కడవున్నా ఆనందంగా వుండాలి,కలతలు,కష్టాలు లేకుండా నీకలలన్నీ పండి నీ జీవితం సంతోషంగా వుండాలని మనసారా బిడ్డను దీవిస్తూ ...

అమ్మ మనసును ప్రతిబింబించే ఈ పాట రచనా,సంగీతం "పాలగుమ్మివిశ్వనాధం" గారు..
ఈ పాటను "శ్రీమతి వేదవతీ ప్రభాకర్" గారు పాడారు..
నాకు చాలా ఇష్టమైన పాట మా అమ్మకోసం , అమ్మలందరికోసం..

మాతృదినోత్సవ
శుభాకాంక్షలు.


అమ్మదొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

అమ్మ
దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ ...
నా కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ

గలగలమని నవ్వుతు కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

కథ చెప్పేదాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు

అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే

గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి

అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే ... నాకు బెంగRelated Posts Plugin for WordPress, Blogger...