పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
నాకు నచ్చిన సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాకు నచ్చిన సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, అక్టోబర్ 2015, సోమవారం

కాకతీయ సామ్రాజ్ఞి - రాణీ రుద్రమదేవి




రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం .. నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

చిన్నప్పుడు అసెంబ్లీలో చాలా శ్రద్ధగా పాడుతూ ప్రతిరోజూ గుర్తు చేసుకునే వీరులలో రుద్రమదేవి ఒకరు.చరిత్ర, రాజుల పాలన అంటేనే యుద్ధాలు,పోరాటాలు,కుట్రలు కుతంత్రాలు.కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమదేవి ధీరవనిత, ధైర్యసాహసాలకి మారుపేరు, శత్రువులకి  సింహస్వప్నం,భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన రాణుల్లో రుద్రమదేవి ఒకరు. 800 వందల ఏళ్ళ క్రితమే ఇప్పుడు సర్వసామాన్యమైన మహిళా సాధికారతను సాధించటమే కాదు శత్రువు ఎంతగొప్ప వీరుడైనా తన పేరు చెప్తేనే వణికిపోయేలా రాజకీయ, యుద్ధవిద్యల్లో ఆరితేరిన యోధురాలు.తన శౌర్య పరాక్రమాలతో శత్రురాజులను గడగడలాడించటమే కాదు,ప్రజారంజకంగా ,ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా చూసి, శత్రుదుర్భేధ్యమైన కోటలు,ప్రజల జీవనాధారమైన నీటి కోసం సముద్రాలను తలపించే చెరువులు కట్టించి సుపరిపాలన అందించిన కాకతీయ సామ్రాజ్ఞి. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటూ కర్ణాటక, తమిళనాడు,మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లలో రాజ్యం వీరభోజ్యం అనే మాట నిజం చేస్తూ దక్షిణాపధంలో సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పింది.

కాకతీయుల రాజధాని ఓరుగల్లు. కాకతీయ పాలకుల్లో ప్రముఖుడైన గణపతి దేవుడి చిన్న కుమార్తె రుద్రమ. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి పరిస్థితుల ప్రకారం రుద్రమదేవిని కుమారుడిగా పెంచి, అన్ని విద్యలు నేర్పించి, తన ప్రతినిధిగా ప్రకటించాడు గణపతిదేవుడు.ఆడపిల్ల అని భయపడకుండా కూతురిని కొడుకులాగా పెంచి రాజ్యార్హతను కల్పించిన గణపతిదేవుడు నిజంగా గొప్పతండ్రి. రుద్రమదేవి చక్రవర్తిగా క్రీస్తు శకం 1262 - 1289 అంటే 27 సంవత్సరాల పాటు పాలన సాగించింది. రుద్రమదేవి పాలనా కాలమంతా యుద్దాలతోనే గడిచింది.ముందుగా స్త్రీ  అధికారాన్ని, పాలనని  సహించలేని సామంతులు, దాయాదులే అంతర్గత శత్రువులుగా  చేసిన తిరుగుబాట్లన్నిటినీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది రుద్రమ. ఓరుగల్లు కోటను ముట్టడించిన దేవగిరి యాదవ మహారాజు మహాదేవుడిని యుద్ధంలో ఓడించి బంగారు వరహాలను పరిహారంగా పొంది అతన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టింది.రుద్రమదేవి జరిపిన పోరాటాలన్నిటిలో ఆమెకు అండగా నిలిచిన సేనా నాయకులు ప్రసాదాదిత్య,గోనగన్నారెడ్డి, మల్లికార్జున నాయకుడు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.

ఇటలీ దేశ రాయబారి మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించి రుద్రమను అత్యంత సమర్దురాలైన పాలనా దక్షత గల చక్రవర్తిగా అభివర్ణించాడు.కాకతీయుల వంశ చరిత్ర,పాలన,సాధించిన విజయాలు చాలావరకు వారు వివిధప్రదేశాల్లో వేయించిన శిలాశాసనాల్లో తెలుస్తుంది.ఓరుగల్లుకోట,రామప్పగుడి,వేయి స్తంభాలగుడి, కాకతీయుల శిల్పకళాపోషణకు,నైపుణ్యానికి నిదర్శనాలు.రుద్రమకాలంలోని కాకతీయుల సేనాని జాయప్ప పేరిణీ శివతాండవం సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం,సాహిత్యం,నృత్యం,శిల్పకళ ఎంతో  గొప్పగా విలసిల్లాయి.

14 ఏళ్లకే రాజ్యాధికారం చేపట్టిన రుద్రమకు 25 వ ఏట నిడదవోలు రాజు చాళుక్య వీరభధ్రుడితో వివాహం జరిగింది. వీరికి ముమ్ముడమ్మ,రుద్రమ్మ  ఇద్దరూ ఆడపిల్లలే.. తనకు పుత్ర సంతానం లేకపోవటంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడిని దత్త పుత్రుడిగా యువరాజుగా పట్టాభిషేకం చేసింది.ఎన్నోసార్లు ఓటమి పాలైన వల్లూరు రాజు అంబదేవుడు రుద్రమదేవి మీద కక్ష కట్టి,రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించి,1289 లో పాండ్యులు,చోళులు,ఇతర సామంత రాజుల దాడిలో యుద్ధంలో ఎదురుగా రుద్రమను గెలవలేక, యుద్ధవిరామ సమయంలో శివపూజ చేసుకుంటున్న రుద్రమను దొంగచాటుగా చంపించాడని నల్గొండ చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది.ఆ తర్వాత రాజ్యం చేపట్టిన ప్రతాపరుద్రుడి పరిపాలనా కాలం అంటా కూడా యుద్దాలతోనే గడించింది.కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాల కారణంగా ముస్లింరాజుల  దండయాత్రల్లో ఓటమి పాలయ్యాడు.యుద్ధంలో బందీగా చిక్కిన ప్రతాపరుద్రుడిని ఢిల్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలోని నర్మదా నదిలో దూకి చనిపోయాడని 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో తెలుస్తుంది. 

చిన్నప్పుడెప్పుడో చదివిన వీరనారి రాణీ రుద్రమదేవి చరిత్ర మళ్ళీ ఇప్పుడు గుణశేఖర్  రుద్రమదేవి - The warrion Queen సినిమా వలన గుర్తుకొచ్చింది. మనం ఎప్పుడో  చదివిన ఇలాంటి గొప్ప చరిత్రని ఇప్పటి వాళ్లకి  సినిమా ద్వారా  తెలియచేసిన దర్శకుడు,నిర్మాత గుణశేఖర్ ప్రయత్నం అభినందనీయం. మహేష్ బాబు " అర్జున్" సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ లాగానే ఈ సినిమాలో కాకతీయసామ్రాజ్యం అప్పటి కోటలు,ఆలయాల్లో శిల్పకళ, కాకతీయుల కీర్తి తోరణాలు అన్నిటినీ ఆర్ట్  డైరెక్టర్ తోటతరణి డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.

రుద్రమదేవి పాత్రకి తగినట్లుగా అనుష్క బాగుంది.ఒక్క సినిమాలోనే రుద్రమదేవి వీరత్వం చూపించటం అంటే సినిమా అంతా యుద్ధాలే ఉంటాయి కాబట్టి అలాంటి సీన్స్ కొన్నే ఉన్నాయి. అనుష్క,నిత్యామీనన్ చాలా అందంగా  కనిపించారు. రాణా  మామూలు సినిమాల్లో హీరో గా కంటే మొన్న బాహుబలిలో ఇప్పుడు ఈ సినిమాలో రాజుల పాత్రలకే చక్కగా సరిపోయాడు అనిపించింది. మహామంత్రి శివదేవయ్య గా ప్రకాష్ రాజ్ యుక్తిగా రాజుకి సలహాలిస్తూ  రాజ్యాన్ని కాపాడటం అప్పటి రోజుల్లో ఇలాంటి మంత్రులు ఉండబట్టే రాజులు అంత చక్కగా పరిపాలించేవారు అనిపిస్తుంది.కృష్ణంరాజు  "తాండ్రపారాయుడు" ముసలివయసులో  ఇలా ఉండేవాడన్న మాట అనిపిస్తుంది :) ఇక సినిమాలో అందరికీ నచ్చిన, మెచ్చిన అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్ర బాగుంది. బయటికి బందిపోటుగా ఉంటూ రుద్రమదేవికి సహకరించి, శత్రువుల్ని మట్టుబెట్టే   గోనగన్నారెడ్డి గురించి  ఈ సినిమా ద్వారా ఎక్కువగా తెలిసిందని చెప్పొచ్చు.తెలంగాణా యాస సరిగ్గా అలాగే మాట్లాడుతూ అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఒకప్పటి "ద్యావుడా..." లాగా ఇప్పటి "గమ్మునుండవో" లాంటి మాటల్ని కొన్ని వర్గాల అభిమానులు కొన్నాళ్ళపాటు మర్చిపోకుండా తలుచుకుంటారేమో.బందిపోటుకి తెలంగాణా భాష పెట్టి ,రాజులకి పెట్టకపోవటం కొంతమందికి నచ్చలేదట, 

సినిమాలో అందరికీ నచ్చిన కొన్ని అల్లు అర్జున్ డైలాగ్స్ :

నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా,ఈడా ఉంటా..

పద్మవ్యూహంలో ఇరుక్కోనికి నేను అభిమన్యుడ్ని  కాదు వ్యూహకర్తల
అమ్మామొగుడు శ్రీ కృష్ణుడసంటోడ్ని.

ఉంటే  వైకుంఠo లేకపోతే ఊకుంటం

పులిపాలు పిండేటోనికి బర్రెపాలు పిండుడు పందెమేందిరా

నా చర్యలకి ఆశ్చర్యపోవుడు తప్ప నన్ను చెరసాలలో వేసేటోడు పుట్టలే

మంచికి మంచి తోడు  అన్నట్లు చాళుక్యవీరభద్రుడు,గోనగన్నారెడ్డి,మంత్రి శివదేవయ్య లాంటి వాళ్లతోడు ఎంతటి వీరులకైనా అవసరం అనిపిస్తుంది.ఏడు కోటల నిర్మాణం,వాటి ఉపయోగంలో యుద్ధతంత్రం బాగుంది.వేలమంది సైనికులు రుద్రమని పాములాగా చుట్టుముట్టినప్పుడు గద్ద రూపంలో సైనికులతో గోనగన్నారెడ్డి ఎంట్రీ, అక్కడి యుద్ధవ్యూహం బాగున్నాయి.మనం చిన్నచిన్న సమస్యలకే భయపడిపోతుంటాం అలాంటిది అప్పటి మన రాజులు ఎదురుగా కత్తులు పట్టుకుని వచ్చే శత్రువులని ఎంత ధైర్యగా ఎదుర్కున్నారో కదా,అందుకే చరిత్రలో వీరులుగా నిలిచిపోయారు అనిపిస్తుంది.ప్రస్తుతం మనకి అప్పటి రాజుల్లాగా ధైర్య సాహసాలు,దాతృత్వం లాంటి గొప్ప లక్షణాలు లేకపోయినా,వారి దాయాదుల్లాగా కుట్రలు,కుతంత్రాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి..ఎంతైనా మంచికి వారసులున్నట్లే చెడుకి కూడా ఉంటారు కదా..!

రుద్రమదేవికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఒక ప్రత్యేకత.తెలుగు చరిత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ చెప్పిన ఈ చరిత్ర  India’s first historical stereoscopic 3D film గా చరిత్రలో నిలిచిపోతుంది.మన చరిత్ర,సంస్కృతిని ఇప్పటి తరాలకు తెలియచేసే ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే బాగుంటుంది.మొత్తానికి మొన్న బాహుబలి, ఇప్పుడు రుద్రమదేవి చిన్నప్పుడు NTR  కాలంలో వరసగా వచ్చే రాజుల సినిమాల జ్ఞాపకాలను గుర్తుచేశాయి.

చరిత్ర ఎప్పటికీ గొప్పదే ఆ చరిత్రను సృష్టించిన వీరులు,వారి సాహసాలు ఇంకా గొప్పవి. చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన,  స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నతమైన రూపం రుద్రమదేవి. ఓరుగల్లు భద్ర కాళికి వీరభధ్రుడు తోడై సృష్టించిన వీరనారి రుద్రమదేవి చరిత్ర సినిమాగా బాగుంది. 

రుద్రమదేవి -  The warrion Queen



11, ఆగస్టు 2015, మంగళవారం

బాహుబలి Vs ఒక్క హీరో, వేల మంది రౌడీలు




భారతీయ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన, కలెక్షన్ల పరంగా సంచలనమైన, తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా అని ఎంతగా మెచ్చుకున్నారో, అంతగా విమర్శలకు కూడా గురయిన సినిమా  బాహుబలి.ఈ సినిమా ఎవరికెలాగ ఉన్నా నాకు నచ్చింది.సినిమాలో జలపాతాలు,మంచుకొండలు, మాహిష్మతి రాజ్యం, రాజమందిరాలు, అన్నీ వింతగా, అద్భుతంగా,అప్పటి రాజులు,రాజమాతలు ఇలా ఉండే వాళ్ళన్నమాట అనిపించేలా అన్నీ బాగున్నాయి. సినిమాలో అన్నిటికంటే నాకు నచ్చింది మనుషుల వ్యక్తిత్వాలు.రమ్యకృష్ణ , నాజర్, ప్రభాస్, రానా,తమన్నా ఎవరి పాత్రకి తగినట్లు వాళ్ళు నటించారు.ఆ పాత్రలకి వీళ్ళే సరిపోయారు అనిపించేలా యువరాజులుగా రానా, ప్రభాస్, వారికి తగినట్లు రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటన అందరినీ మించిపోయింది."మనం" సినిమాలో  గత జన్మలు ఉన్నాయి అని చెప్పినట్లు, రానా,ప్రభాస్,రమ్య కృష్ణ ముగ్గురూ కూడా గత జన్మలో రాజులేనేమో వాళ్ళే ఇప్పుడు మనకిలా  కనిపిస్తున్నారు అనిపించేలా ఉన్నారు.

తన  వక్రబుద్ధి కారణంగా రాజు కాలేక,తన అవిటితనం వల్ల రాజు కాలేకపోయానని, సోదరుడి మీద,సోదరుడి కొడుకు మీద ద్వేషం పెంచుకుని, తన కొడుకుని రాజు చేయాలని తపనపడి,కుతంత్రాలు చేస్తూ, సోదరుడి భార్య దేవసేనని కొడుకు హింసిస్తుంటే "చిత్ర హింసలకేమీ లోటు లేదు కదా" అని దేవసేనని వెటకారంగా పరామర్శిస్తూ, భల్లాల దేవుడి విగ్రహం ప్రజల మీద పడుతున్నప్పుడు ఏమీ కంగారు పడకుండా,బాధ పడకుండా "వందడుగుల విగ్రహం వంద మందినైనా బలికోరదా" అంటూ నవ్వే బిజ్జలదేవుడు పాత్రలో నాజర్ చక్కగా సరిపోయారు. కొడుకు మీద అమితమైన ప్రేమతో, పుత్రోత్సాహంతో  గుడ్డివాడైన దృతరాష్ట్రుడి పాత్ర ఈ బిజ్జలదేవుడిది అనిపిస్తుంది.

రానా,ప్రభాస్ పేరుకే సోదరులైనా, మహాభారత కాలం నుండి ఉన్న సోదరుల పోరు వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంది. అప్పటిలాగే ఇప్పుడు కూడా మంచికి,చెడుకి జరిగే పోరాటం వీరి కధ .ఇలాంటి పోటీలు,పోరాటాలు,కుతంత్రాలు  అప్పటి పురాణాలు, రాజుల కాలంలోనే కాదు ఇప్పటి సామాన్య మానవుల్లో కూడా సర్వసాధారణం అయిపోయింది. అన్నదమ్ముల పిల్లల మాటకేమో కానీ సొంత వాళ్ళు కూడా పాండవుల్లా ఒక్క మాట మీద నిలబడే రోజులు ఇప్పుడు లేవంటే అతిశయోక్తి కాదేమో.. ప్రభాస్ శివుడిగా అల్లరిగా , బాహుబలిగా  గంభీరంగా , రానా క్రూరుడైన భల్లాలదేవుడిగా బాగా నటించారు. చిన్నప్పుడు టీవీ  లో చూసే  టిప్పు సుల్తాన్, మృగనయని సీరియల్స్ లో ఉండే రాజుల్లాగా  ఇద్దరూ చాలా బాగున్నారు. 

శత్రుదేశపు రహస్య గూఢచారిని పట్టుకునే ప్రయత్నంలో  భల్లాల దేవుడికి తనకి కట్టుకున్న తాడు కొసని అప్పగించి లోయలోకి  దూకే బాహుబలిని చూసి అన్నదమ్ములిద్దరికీ ఇప్పటికింకా విరోధం రానట్లుంది, ఒకరికొకరు బాగానే సహాయం చేసుకుంటున్నారు అనుకునేలోపే ఆ తాడు పట్టుకోకుండా వదిలేస్తున్న భల్లాలదేవుడిని చూస్తే  ఇప్పటికే రాజ్యం కోసం పోటీ మొదలయ్యిందన్నమాట అనిపిస్తుంది. అసూయ మనిషితో ఎంతటి ఘోరాన్నైనా చేయిస్తుంది అనటానికి సాక్ష్యం భల్లాలదేవుడి పాత్ర.

అనుష్క - దేవసేన తనేనా అనిపించేంత డీ గ్లామ రైజ్డ్ పాత్రలో, చేతులు, కాళ్ళకి సంకెళ్ళతో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండి కూడా భల్లాల దేవుడిని  నిర్లక్ష్యంగా చూస్తూ,అతన్ని నాశనం చేయటానికి బాహుబలి వస్తాడని నమ్మకంతో భల్లాల దేవుడి చితి కోసం కట్టెపుల్లలు ఏరుతూ తను అనుకున్నది జరిగి తీరుతుందని ఎదురుచూస్తుంటుంది. బాహుబలి పేరు కూడా అందరూ మర్చిపోయారు అన్న భల్లాల దేవుడి కళ్ళముందే ప్రజలంతా బాహుబలిని తలచుకుంటూ ,సంగీత నృత్య కళాకారులు ఉత్సాహంగా ఆడి  పాడుతున్న సమయంలో దేవసేన ఆనందం చూస్తే  ఆ తల్లి నమ్మకాన్ని నిజం చేయటానికే దేవుడు (శివుడిని) బాహుబలిని బతికించాడేమో అనిపిస్తుంది. కట్టప్ప తనని తప్పిస్తానన్నా వినకుండా కొడుకు వస్తాడని ఎదురుచూసే దేవసేన నమ్మకాన్ని చూస్తుంటే, మనిషి జీవితంలో అన్నీ కోల్పోయినా ఇంకా సాధిస్తామనే నమ్మకానికి, ఆశ కి ఉన్న గొప్పతనం ఇదేనేమో  అనిపిస్తుంది.

కట్టప్ప విశ్వాసపాత్రుడైన సైన్యాధికారి, అలాగే బానిస కూడా. రాజు లేని రాజ్యం మీద శత్రు దేశాలు తిరుగుబాటు చేసినప్పుడు శివగామికి అండగా ఉంటూ రాజ్యాన్ని కాపాడిన కట్టప్ప కధ 2 nd పార్ట్ లోపూర్తిగా  తెలుస్తుందేమో. మనసులో బాహుబలి అంటే అభిమానం ఉన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో దుష్టుడైన రాజు దగ్గర కూడా విశ్వనీయమైన బానిసగా ఉంటున్న కట్టప్ప పాత్ర ఒక రాజ్యానికి కానీ, మనిషికి కానీ ఇలాంటి నమ్మకమైన మనిషి అవసరం చాలా ఉంది అనేలా ఉంది.

ఇక అందరికంటే ఎక్కువగా అందరూ మెచ్చుకున్న పాత్ర శివగామి. రమ్యకృష్ణ సింపుల్ గా ఉన్నా ఒక మహారాణి, రాజమాత అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది.రమ్యకృష్ణ స్క్రీన్ మీద కనిపించినంత సేపు తననే చూడా లనిపించే మేకప్, నటన,గంభీరంగా మాట్లాడే విధానం అన్నీ చాలా బాగున్నాయి.రాజు లేని రాజ్యాన్ని కాపాడే ధీరవనితగా, సొంత కొడుకనే స్వార్ధం లేకుండా, తనబిడ్డతో పాటూ పాలిచ్చి,బాహుబలిని కూడా సమర్ధుడిగా, వీరుడిగా  పెంచుతుంది. శత్రువుతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరు వీరోచితంగా యుద్ధం చేశారు అని కాకుండా ఎవరు మానవత్వంతో, నాయకుత్వ లక్షణాలతో అందరినీ కలిపి నడుపుతూ యుద్ధం చేశారనే నిశిత దృష్టి తో రాజుకి కావాల్సిన  అర్హతలున్న బాహుబలిని రాజుని చేసి తన బుద్ధికుశలతని, నిష్పక్షపాతాన్ని,రాజనీతిని  చాటుతుంది.తను చనిపోతూ కూడా ధైర్యంగా బిడ్డని కాపాడుతుంది. ఈ రోజుల్లో తమవాళ్ళు  అనుకున్న వారికి తగిన అర్హతలు లేకపోయినా పదవులు,అధికారాలు కట్టపెట్టే వాళ్ళకి  అప్పట్లో శివగామిలాంటి రాజమాతలు ఆదర్శమైతే బాగుంటుంది కదా..ధీరత్వం,మాతృత్వం,రాజతంత్రం,నిస్వార్ధం ఇలా ఎన్నో ఉత్తమ గుణాలతో రాజమౌళి సృష్టించిన శివగామి పాత్ర చాలా బాగుంది.

కొడుకు మీద ప్రాణాలు పెట్టుకుని పెంచిన  తల్లిగా రోహిణి పాత్ర బాగుంది.కొడుకు కోసం శివలింగానికి అభిషేకం చేస్తు కష్టపడుతుందని, తల్లి కోసం శివుడినే గంగమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన కొడుకుని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూనే, నా కోరిక తీరుతుందా,కొడుకు కోరిక తీరుతుందా అని అమాయకంగా అడిగే తల్లిగా  ఆరాటం,, అమ్మమొక్కు కోసం తల్లి మీద మీద ప్రేమతో ఆ శివయ్యనే  కదిలించిన సన్నివేశం  చాలా బాగుంది. తల్లిప్రేమ శివుడితో అంత కష్టమైన పనిని కూడా చేయించింది అనిపిస్తుంది.

వెనకటిరోజుల్లో గొప్పవాళ్ళని కారణజన్ములు అన్నట్లు ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుందట. ఆ కారణం వల్లనే శివుడి కి కూడా ఆ కొండ మీదకి వెళ్ళాలనే కోరిక కలిగిందేమో, కానీ ఎంత ప్రయత్నించినా జలపాతం ఎక్కటం సాధ్యం కాదు, అప్పుడు అతనికి ఒక చెక్క మాస్క్ కనిపించి కొండ ఎక్కటానికి ప్రేరణ కల్గిస్తుంది. మొత్తానికి కొండెక్కి  తన ఊహాసుందరినిచూస్తాడు.ఊహాసుందరిగా తమన్నా పరిచయం చాలా అందంగా ఉంది..  తమన్నా( అవంతిక)  దేవసేనని భల్లాల దేవుడి దగ్గరి నుండి విడిపించటానికి  ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారుల్లో సభ్యురాలు...ప్రభాస్ మొదటిసారి చూసినప్పుడు వెనక రాజభటులు తరుముతుంటే పరిగెత్తుతూ వస్తున్న తమన్నాని చూసి ఇప్పుడు ప్రభాస్ వెళ్లి  కాపాడతాడేమో అనుకునే లోపే తమన్నా తన యుద్ధ ప్రావీణ్యాన్ని చూపి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ సినిమాలో తమన్నా పాత్ర 2011 లో వచ్చిన " ఉరిమి" సినిమాలో జెనీలియా పాత్రలాగా అనిపించింది. ఆ సినిమాలో కూడా అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో  అల్లరిపిల్లలాగా నటించే జెనీలియాని యుద్ధవీరురాలిగా చూపించారు.

సినిమాలో అవంతిక,శివుడి ప్రేమ గురించి ఎన్నో రకాల కామెంట్స్ వచ్చాయి. కొందరికి నచ్చింది,కొందరికి నచ్చలేదు. అప్పటిదాకా గొప్ప లక్ష్యం కోసం తిరుగుతున్న అవంతిక ప్రభాస్ ని చూడగానే ప్రేమలో పడటం
చాలా మందికి నచ్చలేదు..లక్ష్యాల కోసం తపించే వాళ్ళందరూ ప్రేమించకూడదని,పెళ్లి చేసుకోకూడదని
ఎక్కడా రూల్ లేదు కదా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తమ లక్ష్యాన్ని సాధించటానికి అండగా ఉంటూ, బాధ్యతలు  పంచుకునే వ్యక్తిని జంటగా కోరుకోవటంలో తప్పులేదని నా అభిప్రాయం...అప్పటిరోజుల ప్రకారం అది గాంధర్వ వివాహం అని కూడా అంటారేమో. ప్రభాస్ తమన్నా మేకప్ మార్చుతున్నప్పుడు తను పెట్టుకున్న మాస్క్ అతని దగ్గర కనిపించేదాకా ప్రభాస్ తో యుద్ధం చేస్తూనే ఉంటుంది.మాస్క్ చూశాక తన కోసం ఎంతో  కష్టపడి, ప్రమాదకరమైన కొండ ఎక్కి వచ్చాడని తెలుసుకుని, అప్పుడు అతన్ని ఇష్టపడుతుంది.అమ్మాయిలూ,అబ్బాయిలు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవటం ప్రేమలోభాగం కదా !

శివగామి,దేవసేన , అవంతిక ముగ్గురిని ఈ మధ్య సినిమాల్లో తమకంటూ నటించే అవకాశం లేని హీరోయిన్స్ లాగా కాకుండా ఎవరి పాత్రలో వాళ్ళని  ఉన్నతంగా, ధైర్యశాలిగా చూపించటం రాజమౌళి ప్రత్యేకత.

కాలకేయుడు, అతని సైన్యం మనుషులు  ఇలా కూడా ఉంటారా అనేంత వికృతంగా తయారుచేశారు.కాలకేయుడి రూపమంత  వికృతంగానే ఉన్నాయి మాటలు,చేష్టలు కూడా.శివగామిని అనకూడని మాటలు అని చావు కొని తెచ్చుకున్న కాలకేయుడి లాంటి వికృత బుద్ధి ఉన్న మనుషులు ఈ సినిమాలోనే కాదు బయట కూడా కనపడుతూనే ఉంటారు.కాలకేయుడి గ్యాంగ్ కోసం కనిపెట్టిన వింత భాష కూడా బాగుంది.

యుద్ధం సీన్ చాలా బాగుంది. యుద్ధంలో అనుసరించిన వ్యూహాలు అప్పట్లో రాజులు  ప్రాణాలకి తెగించి మరీ ఇలా యుద్ధాలు చేసేవాళ్ళు కదా అనిపించేలా ఉన్నాయి. భల్లాల దేవుడికి మంచి ఆయుధాలు ఇచ్చి,బాహుబలికి అవసరమైనవి ఏమీ ఇవ్వకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా గెలవాలో చూపించిన యుద్ధతంత్రాలు బాగున్నాయి. .వందల సంఖ్య లో వస్తున్న సైనికుల మీద గుడ్డలు వేస్తే  తప్పించుకుని పైకి రాలేరా అనుకునేంతలోనే చమురుతో తడిపిన ఆ గుడ్డతో పాటే శత్రు సైనికులను కాల్చేయటం,తమ రాజ్య ప్రజలనే ఎదురుగా  పెట్టినా రానా వాళ్ళని కూడా చంపుకుంటూ పోతే,ప్రభాస్  యుక్తితో వాళ్ళని కాపాడటం,శత్రు దేశపు జెండా ఎగరగానే నిరుత్సాహంతో పారిపోతున్న సైనికులని మళ్ళీ ధైర్యం చెప్పి యుద్ధం చేయించిన బాహుబలి పాత్ర నిజమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు అంటే   ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంది.చివరగా బాహుబలి చేతిలో చావబోతున్నకాలకేయుడ్ని తనే చంపానన్న గొప్ప పేరు కోసం భల్లాల  దేవుడి ప్రయత్నం అతని కుతంత్రాలకి ఉదాహరణ.

"ధీవరా"పాట, చిత్రీకరణ,ఈ పాటలో ప్రభాస్ కొండ ఎక్కటానికి చేసే ప్రయత్నం బాగా చిత్రీకరించారు. "పచ్చబోట్టేసిన పిల్లగాడా" పాట బాగుంది.ఈ పాట సినిమాలో సగమే ఉంది.. "ఎవ్వడంట  ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది" కీరవాణి స్వరంలో బాగుంది.పాటల్లో,యుద్ధంలో, ఇంకా వేరే సన్నివేశాల్లో కూడా వినిపించే సంగీతం బాగుంది.చివరిగా ఒక చోటికి చేరిన కట్టప్ప, కొండజాతి వాళ్ళు, తిరుగుబాటుదారులు,దేవసేన,బాహుబలి గతం తెలుసుకున్న అందరి మొహాల్లో విషాదంతో పాటూ ఎలాగైనా కలుసుకున్నామన్న సంతోషం, అమరేంద్ర బాహుబలికి  ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత స్పష్టంగా కనిపిస్తూ వాళ్ళతో పాటూ మనకి  కూడా గతంలో ఏమైందో తెలియలేదే అనే  ఫీలింగ్ తో సినిమా అయిపోతుంది.

చాలామంది ఈ  సినిమాలో చాలా లోపాలు,తప్పులు ఉన్నాయన్నా ,రాజులు,యుద్ధాల సినిమాలు పూర్వకాలం నుండి ఉన్నా ఇప్పటి రోజుల్లో ఇలాంటి సినిమా తీయటం నిజంగా ఒక గొప్ప ప్రయత్నం  అని చెప్పొచ్చు.యుద్ధంలో వాడే ఆయుధాలు,గుర్రాలు,ఏనుగులు ఇలా ప్రతి ఒక్కటీ సొంతగా సృష్టించి,ఎన్నో ప్రయోగాలతో ఈ సినిమా పూర్తవ్వటానికి సంవత్సరాల పాటు రాజమౌళి  టీమ్ పడ్డ కష్టం కూడా సామాన్యమైనదేమీ కాదు. గ్రాఫిక్స్,విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్  అద్భుతంగా నిజంగా అప్పటి రోజుల్ని చూస్తున్నామేమో అనిపించేలా ఉన్నాయి. .ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక్క హీరో వేల మంది రౌడీల్ని కూడా చితక్కొట్టే  కధల్లా కాకుండా, మన చరిత్రలో ఒకప్పుడు నిజంగానే జీవించిన ఇలాంటి  వీరుల కధతో వచ్చిన బాహుబలి సినిమా నాకు నచ్చింది..Waiting For బాహుబలి పార్ట్ 2

ఈరోజుల్లో వస్తున్న సినిమాల్ని ఒక్కసారి చూడటమే కష్టం .. కానీ వాళ్ళు ముందుగానే చూసినా మాకోసం రెండోసారి కూడా సినిమా చూసిన మా చెల్లి, మరిది గారికి కూడా ఈ సినిమా రెండోసారి చూస్తున్నట్లు విసుగనిపించలేదు అని చెప్పటం బాహుబలి మ్యాజిక్ అనొచ్చేమో .... ఇప్పుడు నచ్చలేదు అంటున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ రాబోయే బాహుబలి పార్ట్ 2  - "బాహుబలి : The Conclusion"  కూడా తప్పకుండా చూస్తారని నాకనిపిస్తుంది.

బాహుబలి : The Beginning



19, మే 2015, మంగళవారం

S/O సత్యమూర్తి - Pious Obligation Of A Son



Doctrine of Pious Obligation -

The moral liability of sons to pay off and discharge their Father's Non-Avyavaharika Debts. 


ఒక మనిషి అప్పు తీసుకుని,తీర్చకపోవటం చట్టం దృష్టిలో నేరమే కాదు, దేవుడి దృష్టిలో పాపం కూడా. అలా ఎవరి దగ్గరైనా అప్పుచేసిన మనిషి అప్పు తీర్చకుండానే చనిపోతే ఆ పాపం వలన అతనికి స్వర్గంలోకి ప్రవేశం ఉండదు కాబట్టి,తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పించే వాడే  కొడుకు కాబట్టి ఆ అప్పు తీర్చి,తండ్రిని పాపవిముక్తుడ్నిచేసే "పవిత్రమైన బాధ్యత"ను (Pious Obligation)  కొడుక్కి అప్పగించింది Family Law .. తండ్రి ఆస్తుల మీద హక్కే కాదు  అప్పులకు  బాధ్యత కూడా కొడుకు తీసుకోవటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం... Pious Obligation కేవలం అప్పులకు సంబంధించినదే కాదు తండ్రి చేసిన పాపం , పుణ్యం అన్నిటిలో బాధ్యతా తీసుకోవటమే..

అలాంటి ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించిన ఒక మంచి కొడుకే  విరాజ్ ఆనంద్ S/O సత్యమూర్తి."విలువలే ఆస్తి" గా బ్రతికే తండ్రికి తగిన కొడుకు. అందరిలాగా మానాన్న నాకు అనుభవించటానికి బోల్డంత ఆస్తి ఇచ్చాడు అనకుండా బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు అంటాడు.అలా అనటమే కాదు అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయిన తండ్రి బాధ్యతల్ని కూడా బాధతో కాకుండా ఆనందంగానే  స్వీకరిస్తాడు. 

తండ్రి చనిపోయేనాటికి ఆస్తులు,అప్పులు సమానంగా ఉన్నాయి. IP పెట్ట మన్న కొందరి సలహాని కాదని తన తండ్రిని ఎవరు గుర్తు పెట్టుకున్నా గొప్పవాడిగానే గుర్తుంచుకోవాలని అప్పుల్ని తీర్చేసి,తల్లి,మతిస్థిమితం లేని అన్న,వదిన వాళ్ళ పాపతో కుటుంబ బాధ్యత మొత్తం తనొక్కడే తీసుకుని చిన్నఇంటికి మారిపోతాడు.ఇక అక్కడి నుండి జీవితం కోసం పోరాటం మొదలు పెడతాడు విరాజ్.వెడ్డింగ్ ప్లానర్ గా వెళ్లి,అక్కడ సమంత పరిచయం అయ్యి,ప్రేమించి,తన తండ్రి  మీద గొడవల్లో ఉన్న ఆస్తి అమ్మాడన్న నిందని తొలగించటానికి తమిళనాడులో రౌడీ ఉపేంద్ర దగ్గరికి వెళ్లి,ప్రాణాలకు తెగించి మరీ అక్కడ తను అనుకున్నది సాధించటమే కధ...

సినిమాలో కొన్ని పాత్రలు మనం నిజజీవితంలో చూసే ఎంతో మంది మనుషుల ఆలోచనా విధానాలని,వ్యక్తిత్వాలను కళ్ళముందుంచుతాయి.

నాన్నా పులి కధలో .. మూడోసారి కూడా పిల్లాడు పిలిచినప్పుడు తండ్రి వెళ్లి ఉంటే పిల్లాడు బ్రతికేవాడు కదా.!కొన్నిసార్లు మోసపోయినా దానివల్ల మంచి జరిగితే మంచిదే కదా..అనే నాన్న క్యారెక్టర్ ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మళ్ళీ ఎదుటివాళ్ళకి సహాయం చేయగల మంచి మనసున్న మనుషుల్ని గుర్తుచేస్తుంది.

"భార్యంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత,పిల్లలంటే మొయ్యాలనిపించే బరువు" ఎంతో ఇష్టపడి ఇంటికి తెచ్చుకునే భార్య,కోడలు ఎలా ఉండాలో సింధుతులాని పాత్ర అలాగే ఉంది.పిచ్చి భర్త,అప్పులపాలైన అత్తగారి ఇల్లు వదిలి రమ్మని తండ్రి అడిగినా వెళ్ళకుండా,తన నగలు కూడా ఇచ్చేసి, కష్టాల్లో బాధ్యతల్లో పాలుపంచుకుని,మంచి భార్య,కోడలు అంటే ఇలాగే  ఉండాలి అనిపిస్తుంది. 

నేను ఒకప్పుడు మా వాళ్లకి ఉద్యోగం కోసం వస్తే మీ నాన్న కుదరదు అన్నాడు,అప్పట్లో మీకు డబ్బుందని గర్వం ఉండేది అనే ఇంటి ఓనర్.. ఒకప్పుడు తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నీకోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మాటలతో హింసిస్తూ ఆనందించే మనషుల ప్రవర్తనని చూపిస్తుంది.

అన్న కూతురి  స్కూల్ ఫీజ్ కోసం ఫ్రెండ్ దగ్గర హెల్ప్ కోసం వెళ్తే వెడ్డింగ్ ప్లానర్ గా పంపిన ఫ్రెండ్ మంచితనం గురించి గొప్పగా ఫీల్ అయ్యేలోపే, తనతో ఎంగేజ్ మెంట్ జరిగి,తన తండ్రి చనిపోయి,ఆస్తులు పోవటం వలన  ఆగిపోయిన అమ్మాయి పెళ్లి అని,కావాలనే అక్కడికి తనని పంపిన ఫ్రెండ్ ని చూస్తే, మన పక్కనే ఉంటూనే సమయం చూసి,  దెబ్బకొట్టాలనుకునే ఇలాంటి శాడిస్ట్ మనుషుల్ని మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసిన జ్ఞాపకం తప్పకుండా వస్తుంది. 

తమ్ముడి కూతురి పెళ్ళికి వచ్చి,తమ్ముడు తనని మోసం చేసి ఆస్తి ఎలా తీసుకున్నాడో చెప్పే ఎమ్మెస్ నారాయణ ప్రస్తుత కాలంలో సొంత అన్నదమ్ముల చేతిలో మోసపోయి, ఆస్తులు పోగొట్టుకుని వీధుల్లో పడుతున్న ఎంతోమందికి ప్రతిరూపంలా అనిపించాడు.ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళని పిచ్చివాళ్ళని చేయటానికి, అవసరమైతే చంపటానికి కూడా వెనుకాడని కొందరు మనుషులు గుర్తొచ్చారు. 

గెలుపంటే పెద్ద పెద్ద కార్లు,ఆస్తులు,అంతస్తులు సంపాదించటమే కానీ విలువలు అంటూ అన్నీ కోల్పోయి,వీధుల్లో తిరగటం కాదని గట్టిగా నమ్మే వ్యక్తి రాజేంద్రప్రసాద్. తండ్రి అప్పుల కోసం ఆస్తులు వదిలేసిన హీరోని ఎగతాళి చేస్తుంటాడు.వాళ్ళు మాత్రమే గొప్ప అనుకుని,ఎదుటి వాళ్ళని అసమర్ధులు అనుకునే ఇలాంటి వాళ్ళని మన చుట్టూ చాలా మందిని చూస్తుంటాము.

లైఫ్ లో పట్టుకోవటం గొప్పా,వదిలేయటం గొప్పా? గెలవటం గొప్పా, వోడిపోవటం గొప్పా? అన్న రాజేంద్ర ప్రసాద్ మాటలకి "రావణాసురుడు సీతని పట్టుకుని రాముడి చేతిలో చచ్చాడు,వదిలేసుంటే బతికుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, యుద్ధంలో పోయారు అదే జూదంలో ఓడిపోయ్యుంటే హాయిగా బ్రతికిపొయ్యే వాళ్ళు. కాబట్టి కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదలటం,గెలవటం కంటే ఓడిపోవటం మంచిది" అని చెప్పే మాట నిజమే కదా మన పురాణాల్లో ఉన్నగొప్పనీతిని చాలా ఈజీగా, సింపుల్ గా చెప్పేశాడు అనిపించింది. 

అందరితో మంచి అనిపించుకోవాలి అనుకునేవాళ్ళు భారతంలో కర్ణుడి లాగానే అందరికీ అన్నీఇచ్చేసి,ఏమీ లేకుండానే పోతారు అని రాజేంద్రప్రసాద్ అనే మాట కొన్నిసార్లు నిజమే కదా? అనిపిస్తుంది..

ఇంక ఉపేంద్ర గురించి తమిళనాడులో మహా ఘోరమైన,భయానకమైన  రౌడీగా పరిచయం
చేయబడినా అతని నటన,హావభావాలు అంత పెద్ద రౌడీలాగా ఏమీలేడే  అనిపించేలా ఉన్నాయి..భార్య స్నేహ మీద గౌరవం, ప్రేమతో మంచివాడిగా నటించే మంచి భర్త,చెల్లి కోసం తాపత్రయపడే  మంచి అన్న.. మొత్తానికి మంచి విలన్ ఉపేంద్ర. 

పాప పెద్ద టెడ్డీ అడిగితే,చిన్న టెడ్డీ అయినా సరే కొనివ్వటం, స్టేజ్ మీద షో చూడాలన్న పాప కోసం తను డాన్స్ వేయటం,వదినని  టీజ్ చేశాడని పోకిరీని చితక్కొట్టటం,పాప స్కూల్ ఫీజ్ కోసం తనని పెళ్ళి చేసుకోబోయి, క్యాన్సిల్ అయిన అమ్మాయి పెళ్ళికి వెడ్డింగ్ ప్లానర్ గా వెళ్లి,నీకు బాధగా లేదా అంటే మా నాన్న పోయిన బాధ ముందు ఇదెంత అనటం,ప్రేమించిన అమ్మాయి కోసం,తండ్రి మీద ఉన్న చెడ్డ పేరు పోగొట్టటం కోసం ప్రాణాలకు కూడా తెగించటం ఇలా అన్నివిషయాల్లో తనవాళ్ళను,ముఖ్యంగా చిన్న పాపని సంతోషంగా ఉంచాలని తపన పడే హీరోని చూస్తుంటే చిన్నప్పటి నుంచి,ఇప్పటికీ కూడా మనకోసం చిన్నవైనా,పెద్దవైనా త్యాగాలు చేసే మన తమ్ముడు కానీ, అన్నకానీ తప్పకుండా గుర్తొస్తారు .. నాకు మా తమ్ముడు గుర్తొచ్చినట్లు :)

నమ్మిన విలువల కోసం ఎంత కష్టాన్నైనా అనుభవించి,ఒక మంచి కొడుకు, తోబుట్టువు,స్నేహితుడు,భర్త,ముఖ్యంగా మంచిమనిషి అంటే ఇలా ఉండాలి అనిపించే ఇలాటి S/O సత్యమూర్తి లు చాలామంది ఉంటారు.గెలుపు, సంతోషం అనేవి ప్రతి మనిషి కోరుకుంటాడు,కానీ ఎవరికి ఎలాంటి గెలుపు సంతోషాన్ని ఇస్తుంది అనేది ఆ మనిషి మనసుకి సంబంధించిన విషయం.తండ్రి వదిలి పెట్టిన బాధ్యతల కోసం పోరాడుతూనే మా నాన్న లేకపోతే నేను జీరోనా అని ప్రశ్నించుకుని, కాదు I Am Some Thing అని ప్రూవ్ చేసుకున్న విరాజ్ ఆనంద్ కధ నాకు నచ్చింది.

బ్రతికుండగానే తీసుకున్నఅప్పులు ఎగ్గొట్టటానికి,బాధ్యతల నుండి తప్పుకో వటానికి,అక్రమాస్తుల్నికాపాడుకోవటానికి, తోడపుట్టిన వాళ్లకి ఇవ్వవలసిన ఆస్తుల్ని కూడా మాకే కావాలంటూ ఏళ్లతరబడి కోర్టుల్లో దావాలు నడుస్తున్న ఈరోజుల్లో, తండ్రి చస్తే మహా అయితే 2,3 నెలల్లో మర్చిపోవచ్చు కానీ కోట్ల ఆస్తి ఎన్నాళ్ళకి సంపాదించాలీ,ఆయనకీ మంచి పేరు ఉంటే ఏంటి? ఊరంతా తిడితే ఏంటీ< అనుకునే ప్రాక్టికల్  మనుషులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. 

 తండ్రి చేసిన అప్పులకోసం ఆస్తులు వదిలే కొడుకులు కూడా ఉంటారా?మరీ సినిమా కాకపోతే అనేది కొందరిసందేహం.. ఇంక ఈ సినిమా ఇంతకు ముందు చూసిన కొన్ని సినిమాల్లా అనిపించటాలు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీవదిలేస్తే వెనకటి రోజుల్లో వచ్చే"మంచి మనసుకు మంచి రోజులు" లాంటి సినిమాల్లాగా మంచి వాళ్లకి కొన్నాళ్ళు కష్టాలు వచ్చినా మళ్ళీ తప్పకుండా మంచి జరుగుతుందని,కొన్ని సార్లు కోట్ల విలువ చేసే డబ్బు కూడా చేయలేని గొప్ప పనులు మంచితనంతో సాధించొచ్చు అని చెప్పిన ఈ సినిమా,అల్లు అర్జున్ యాక్షన్,కొన్ని డైలాగ్స్ ,పాటలు నాకు నచ్చాయి. 

చల్ చలే చలో .. లైఫ్ సే మిలో 
ఇదో కొత్త చాప్టర్ .. Just Say Hello




రాజ్యం గెలిచినోడు రాజవుతాడు 
రాజ్యం విడిచినోడే రామచంద్రుడు 
యుద్ధం గెలిచినోడే వీరుడు శూరుడు 
యుద్ధం విడిసోటేడే దేవుడు



6, డిసెంబర్ 2014, శనివారం

OH My God - Act Of God


Act of God

An event that directly and exclusively results from the occurrence of natural causes that could not have been prevented by the exercise of foresight or caution; an inevitable accident.

మనిషి ముందు చూపుతో కనిపెట్టలేని,ముందు జాగ్రత్తతో ఆపలేని సంఘటనలని,ప్రమాదాలని ఉదాహరణకి వరదలు,భూకంపాలు,సునామీ  లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలని  Act Of God అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం చెల్లించకుండా తప్పుకోవటానికి కొన్ని సందర్భాల్లో  "Act Of God"  Law ని  ఉపయోగిస్తుంటారు. 

ఈ  Act Of God గురించి తీసిన హిందీ సినిమా "OH My God". పరేష్ రావల్, అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా, మిథున్ చక్రవర్తి  నటించిన ఈ సినిమాలో  పరేష్ రావల్ (కాంజీలాల్ మెహతా )పరమ నాస్తికుడు. ముంబయి చోర్ బజార్ లో  దేవతా మూర్తులు,పూజా సామగ్రి అమ్మే ఒక వ్యాపారి.  దేవుడంటే నమ్మకం లేకపోయినా దేవుడికి సంబంధించిన సామాగ్రిని భక్తులకు తనకి ఇష్టమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. దేవుడే లేడని దైవభక్తిని, భక్తులను ఎగతాళి చేస్తుంటాడు. అతని భార్య సుశీల దైవభక్తురాలు. 

కృష్ణాష్టమి రోజు పరేష్ రావల్ కొడుకు  ఉట్టి కొట్టే ఫంక్షన్ లో ఆడటం చూసి అక్కడికి వెళ్లి కొడుకుని ఆపి,పక్కనే ఉన్న మైక్ లాక్కుని అన్ని ఆలయాల్లో కృష్ణుడు పాలు,వెన్న తాగుతున్నాడని ,ఒక్క గంట మాత్రమే ఈ అవకాశం  ఉంటుందని చెప్పగానే అప్పటిదాకా అక్కడున్న జనమంతా ప్రసంగం చెప్తున్న స్వామీజీని ,ఉట్టిని వదిలేసి కృష్ణుడి మందిరాలకి పరుగులు తీస్తారు. దీంతో ఆగ్రహించిన స్వామీజీ నిన్ను దేవుడు శిక్షిస్తాడని శపిస్తాడు. ఇలాంటి శాపాలకి భయపడనని ఇంటికి వచ్చిన కాసేపటికే చోర్ బజార్ లో భూకంపం  వలన పరేష్ రావల్ షాప్ ఒక్కటే కూలిపోయిందని టీవీలో న్యూస్ వస్తుంది. 

భార్యా.బంధువులు అందరు నువ్వు దేవుడిని ఎగతాళి చేసినందుకు ఆ శాపం వలనే ఇలా అయ్యిందని తిడుతూ బాధ పడుతున్నా అవేమీ లెక్క చెయ్యకుండా కూలిపోయిన శిధిలాల్లో ఇన్సూరెన్స్ పాలసీ వెతికి తీసుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళిన పరేష్ రావల్ కి అక్కడ ఆఫీసర్ భూకంపం Act Of God వలన అయ్యింది కాబట్టి కంపెనీ  నష్టపరిహారం ఇవ్వదు  అంటాడు.  పరేష్  రావల్ లో అప్పటిదాకా లేని భయం,బాధ కనపడుతుంది.ఇన్సూరెన్స్ ఆఫీసర్ ని చితక్కొట్టి,నాలో కూడా దేవుడే ఉన్నాడు కదా దేవుడే కొట్టాడనుకో అని చెప్పి వచ్చేస్తాడు.

ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి ఈ నష్టం దేవుడి వలన జరిగింది కాబట్టి దేవుడి మీద కోర్టులో దావా వేస్తానని కోర్టుకి వెళ్తాడు. అక్కడ లాయర్లు ఇతని వింత మాటలు విని మావల్ల  కాదంటూ పారిపోతారు. అప్పుడు లాయర్ ఓంపురి ఈ కేస్ నేను చేస్తానని దేవుడికి ప్రతినిధులుగా చెప్పుకునే కొందరు ప్రముఖ స్వామీజీలకి నోటీస్ లు పంపుతాడు.దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు భగవంతుడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి భగవంతుడి తరపున నష్టపరిహారం కూడా మీరే చెల్లించాలని తన కేస్ తనే వాదించుకుంటాడు పరేష్ రావల్ . 

ఇతని ఆరోపణలు సమంజసమేనని భావించిన జడ్జ్ కేస్ విచారణకి స్వీకరించగానే ఇలాగే Act Of God వలన నష్టపోయిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్తారు. దీంతో  స్వామీజీలు,మాతలు,అన్ని మతాలకు చెందిన మతాధిపతుల ఆగ్రహానికి గురవతాడు. వారి భక్తులు ఆగ్రహంతో   పరేష్ రావల్ మీద దాడి చేస్తారు.సరిగ్గా సమయానికి అక్షయ్ కుమార్ వచ్చి ప్రమాదంలో ఉన్న పరేష్ రావల్ ని తన బైక్ మీద ఎక్కించుకుని కాపాడతాడు. ఇంటిమీదకి కూడా వెళ్లి భార్యా బిడ్డల మీద కూడా దాడి చేయటంతో అతన్ని వదిలి అందరూ వెళ్ళిపోతారు. 

చివరికి ఒంటరిగా మిగిలిన పరేష్ రావల్ ఇంటికి కృష్ణ వాసుదేవ్ యాదవ్ (అక్షయ్ కుమార్) గా వచ్చిన గోపాలుడు (భగవంతుడు)నాస్తికుడైన పరేష్ రావల్ తో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చదివించి భగవద్గీతలోని  సృష్టించేదీ భగవంతుడే ,నాశనం చేసేది భగవంతుడే అన్న మాటతో కోర్టు కేస్ గెలిపిస్తాడు.. 

భగవంతుడు ప్రతి మనిషిలో ఉంటాడు కానీ మేమే దేవుడి ప్రతినిధులమని చెప్పుకుని,దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, విలాసాలని అనుభవిస్తున్న స్వామీజీలు,బాబాలు ఇప్పడు లోకంలో దేవుడి కంటే ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళ గురించి,వాళ్ళని గుడ్డిగా నమ్మి,నష్టపోయే జనం గురించి సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా.  కొన్ని విషయాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నా కాసేపు సరదాగా చూడటానికి బాగుంది,దేవుడిని నమ్మే భక్తులకు సంతోషం కలిగిస్తుందీ సినిమా. 

దైవారాధన, మానవశక్తి రెండు కలిస్తేనే కార్యసాధన సాధ్యమంటాడు భగవంతుడు.  ఏ కులమైనా,మతమైనా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు.తన భక్తులైనా కాకపోయినా ఈ భూమి మీద జీవరాశి నంతటినీ కాపాడేది భగవంతుడే.. నమ్మిన వారిని వెన్నంటి కాపాడే సర్వాంతర్యామి సర్వకాల సర్వావస్థల్లోనూ  ఏ రూపంలోనైనా అవతరిస్తాడని భక్తుల నమ్మకం.ఆ భగవంతుడి మరో రూపం ఈస్వామీజీలు, గురూజీలే  ఐతే అందరికీ మంచిదే. 

అలాగే ప్రకృతి వైపరీత్యాలు Act Of God అని అనకూడదేమో ఎందుకంటే మనిషి తన అవసరాల కోసమో,స్వార్ధం కోసమో చేస్తున్న కొన్ని పనుల కారణంగానే ఈ భూకంపాలు, సునామీలు, వరదల లాంటి భీభత్సాలు సంభవిస్తున్నాయని, దేవుడికి భక్తుడికి మధ్య ఉండాల్సింది భక్తి అనే వంతెన మాత్రమే కానీ బాబాలు, స్వామీజీలు,గురువులనే దళారులు కాదు అనేది  అందరూ అంగీకరించాల్సిన నిజం...  

ఇది సినిమా కాబట్టి సరిపోయింది కానీ నిజంగా దేవుడి ప్రతినిధులమని చెప్పుకునే కొందరు స్వామీజీలని చిన్న మాట అన్నా తట్టుకోలేని వారి అతి విదేయ భక్తులు,శిష్యులు  చాలా మందే  ఉంటారనుకుంటాను. ఇప్పటి రోజుల్లో అలాంటి స్వామీజీలు, గురువులని ఈ సినిమాలో లాగా చేస్తే "అనుకోకుండా ఒకరోజు" సినిమాలో ఛార్మి లాగా "నీడల్లే తరుముతు ఉంది" అని పాడుకోవాల్సి వస్తుందేమో.. 

ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే తెలుగులో  కూడా వెంకటేష్,పవన్ కళ్యాణ్ హీరోలు గా "గోపాలా గోపాలా" పేరుతో ఈ సినిమా రాబోతుంది. మన సినిమా ఎలా ఉంటుందో త్వరలోనే  చూద్దాం .. 


'వసతి వాసయతీతి వా వాసుదేవః'  
మనలో తానుగా ఉండేవాడూ,తాను మనలో ఉన్న కారణంగా 
మనల్ని జీవించి ఉండేలా చేసేవాడు ఆ భగవంతుడే.. 




15, అక్టోబర్ 2012, సోమవారం

అందమైన అబద్ధం ...అప్పుడప్పుడూ..!




అబద్ధం చెప్పటం మనిషికి సరదా కాదు,కావాలని ఎవరూ అబద్ధాలు చెప్పరు.. కానీ జీవితంలో ఒక్కసారైనా అబద్ధం చెప్పని మనిషి వుండరేమో.."నేను ఎప్పుడూ  అబద్ధం ఆడలేదు" అని ఎవరైనా అంటే అంతకు మించిన అబద్ధం  ఉండకపోవచ్చు నాకు తెలిసి :)

కొంతమందికి అబద్ధం ఆపద్ధర్మం ఐతే.. మరి కొంతమందికి అబద్దం ఆడటమే హాబీ కూడా కావచ్చు.
వీళ్ళని అబద్ధాల కోరులు అని కూడా అంటారు లెండి..

ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఆడే అబద్ధాలు వారిమధ్య సంబంధాలను కాపాడుకోవటానికి, అది ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు...లేదా ఇతరులనుండి రహస్యాలు దాచటానికైనా కావచ్చు. మొత్తంగా ఏదో ఒక విషయంలో ఎపుడో ఒకపుడు అబద్ధాలు చెప్పేస్తూంటాము ...

ఒక్కోసారి మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనకోసం ప్రేమగా వంట చేస్తే అది బాగా లేకపోయినా,
వాళ్లకి నచ్చిన డ్రెస్ మనకు నచ్చకపోయినా , ఇంటికి వస్తున్నామని ముందుగా చెప్పకుండా వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ మీకేమన్నా ఇబ్బందా? అంటే మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం అబ్బే అదేమీ లేదండీ అంటూ ... ఎదుటి వాళ్ళ మనసు బాధపడకూడదని చెప్పే మొహమాటపు అబద్ధాలు,

నువ్వు చాలా అందంగా వున్నావని,నీ ముందు ఎవరైనా తక్కువే అంటూ ఇష్టమైన వాళ్ళను పొగిడేసి,వాళ్ళను సంతోషపెట్టే అందమైన అబద్ధాలు..చిన్నప్పుడు స్కూల్, ఎగ్గొట్టి తాతయ్యనో అమ్మమ్మనో చంపేసే అల్లరి అబద్ధాలు,ఆఫీస్ కి లేట్ గా వెళ్లినప్పుడు హెడ్ కి  చెప్పే కట్టుకదల అబద్ధాలు...

 ఇంకా మన బ్లాగ్ లోకం లో ఐతే  ఏ  పోస్ట్  పెట్టినా,అది పూర్తిగా నచ్చినా,నచ్చకపోయినా  చాలా బాగుంది అని మెచ్చుకునే అబద్ధాలు..అంటే ఇలాంటి అబద్ధాలు కొత్త వాళ్ళని ప్రోత్సహించి,వాళ్ళు మరింత బాగా రాయటానికి ఉపయోగ పడుతుంటాయి కూడా...నాకు ఈ పరిస్థితి రాలేదు లెండి ఎందుకంటే మన బ్లాగర్లందరూ చక్కగా రాస్తారు కదా అందుకని..

రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన "ఏప్రిల్ ఒకటి విడుదల" సినిమా అందరికీ తెలిసిందే..
 

అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం (రాజేంద్రప్రసాద్) ఒక అనాధ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరం లో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి (శోభన) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళి కి ఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దాలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి (కృష్ణ భగవాన్) సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.

భువన ట్రాన్సుపర్ మీద రాజమండ్రి వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.

అప్పటి నుండి అతడు నిజాలు చెపుతుండటం వలన ఆతనికి ,ఇంకా ఆ కాలనీలో  చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి.చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే అతడిని తల్లిలా పెంచిన వసుంధర గోపిని చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపదసమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.

ఇదీ సినిమా కధ..  అబద్ధం చెప్పటం హాబీగా పెట్టుకున్న మనిషికి నిజాలే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే అది ఎంత ఘోరంగా వుంటుందో సరదాగా చూపించారు..అప్పుడప్పుడు అబద్ధం అనే ముసుగు వేసుకోకపోతే తనకే కాక ఎదుటివారికి కూడా ఎంత ప్రమాదమో ఈ సినిమా చెప్తుంది. 

రాజేంద్రప్రసాద్ సరదా నటన, సంభాషణలు,,శోభన సహజమైన అందం,నటన ఇంకా మిగిలిన హాస్యనటుల
హాస్యం ఈ సినిమాను  హాస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచేలా  ఇప్పటికీ టీవీలో వస్తున్నా  చూడాలనిపించేలా  చేయగలిగింది...

ఈ సినిమాలో పాటలు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్.. "మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా "  పాట  వింటే చాలు సినిమా అంతా  కళ్ళముందు కదులుతూ ఒక చిన్న నవ్వు వచ్చేస్తుంది వెంటనే..

ఈ మధ్య FM లో ఈ పాట  వినగానే ముఖ్యంగా ఈ పాటలో ఒక లైన్ ... 
భోజనానికి పిలిచి, వంట గురించి  అభిప్రాయం అడిగిన వాళ్ళతో 

 "అపార్ధం చేసుకోరుగా ... అనర్ధం చేయ్యబోరుగా 
 యదార్ధం చేదుగుంటది ... పదార్ధం చెత్తగున్నది 
 ఇది విందా నా బొందా ... తిన్నోళ్ళు  గోవిందా"

అని వినగానే నాకు అనిపించింది నిజంగా కొన్ని సందర్భాల్లో  అబద్ధం ఆడకుండా తప్పించుకోలేము,అది చాలా కష్టం కూడా  కదా అని..
 "ప్రాణ మాన విత్త హానులదప్పింప కల్లలాడువారుకవులుసుమ్ము" అని,
"వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి"  అని ఇలా అబద్ధం విషయంలో మన పెద్దలు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు...అలాగని పెద్దలే చెప్పమన్నారు కదా అని అదే పనిగా అబద్ధాలు చెప్తూ వుంటే నాన్నా  పులి  లాగా అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్ కదా ..!
 
"మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా"



                         

14, మే 2012, సోమవారం

పవన్ ......... ఆనందం అల్లరి చేస్తే నీలా ఉంటుందే ...


"పవన్ కళ్యాణ్" మా అమ్మతో సహా మా ఫామిలీ మొత్తానికి అభిమాన నటుడు,ముఖ్యంగా మా చెల్లి రమ్య పవన్ కి పెద్ద ఫ్యాన్..పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే సినిమా హాల్ లోనే చూడాలన్నది మా ఖచ్చితమైన నిర్ణయం..అలాగే చూసే వాళ్ళం కూడా.. కానీ ఖుషి తర్వాత పవన్ సినిమా ఒక్కటి కూడా సరిగా హిట్ కాకపోవటం పవన్ కి ఎంత బాధ కలిగించిందో చెప్పలేను కానీ మాకు మాత్రం చాలా బాధ అనిపించేది.ముఖ్యంగా పంజా సినిమా మరీ నిరాశ కలిగించింది..


పవన్
కళ్యాణ్ ఇన్నాళ్ళ ఓటమిని మర్చిపోయేలా చేసిన సినిమా "గబ్బర్ సింగ్" ..ఆడియో వచ్చినప్పటి నుంచే సినిమా కోసం వెయిట్ చేసిన అభిమానులు ఆనందించేలా వుంది ఈ సినిమా విజయం ..కేవలం పవన్ అభిమానులే కాదు... తమ అభిమాన హీరోల కోసమే మాట్లాడటం కాకుండా, నిజంగా సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు కూడా వున్నారు..

ఇంక
మేమందరం సినిమా వచ్చినప్పటి నుండి అదే పనిలో ఉన్నాము.. మా చెల్లి వాళ్ళ ఫామిలీ,తమ్ముడు వాళ్ళు అందరూ రిలీజ్ రోజే చూసేశారు,మేము ఈ రోజే చూశాము.. సినిమా చూస్తున్నంత సేపు సరదాగా,విసుగు లేకుండా గడిచిపోయింది.. దేవిశ్రీ సంగీతం చాలా బాగుంది. స్టోరీ అంతగా లేకపోయినా entertainment కోసం ఈ సినిమా చూడొచ్చు... ఇంక శ్రుతిహాసన్ కి కూడా ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో తన కెరీర్ లో...


పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్,ఖుషి తర్వాత నాకు చాలా నచ్చిన మూవీ గబ్బర్ సింగ్..అప్పట్లో ఖుషీ కూడా ఇలాగే మే నెలలో చూసాము..మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మాకు...
"ఆకాశం అమ్మాయైతే" పాట నాకు చాలా నచ్చింది.. ఇంక "కెవ్వు కేక" పాట మా ఇంట్లో మా బుడుగులందరికీ తెగ నచ్చేసింది.. పాట టీవీలో వస్తుంటే , ఎక్కడ వున్నా పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరకొచ్చేస్తున్నారు.. ""
ఏమి చేస్తాం "జీ టీవీ ఆట - 2" ప్రభావం అనుకుంటా"...

"మేము ట్రెండ్ ఫాలో అవ్వం,సెట్ చేస్తాం" అంటూ,వాళ్ళు అల్లరి చేస్తూ ప్రేక్షకులతో కూడా ఆనందంగా అల్లరి చేయించిన పవన్ & టీం వేసవికి సాధించిన విజయానికి అభినందిస్తూ...
నాకు నచ్చిన ఈ పాట ...

ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే ... నీలా ఉంటుందే..
ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే ... నాలా ఉంటుందే




3, మార్చి 2012, శనివారం

ఇష్క్ --- నాకు నచ్చిన ప్రేమకధ


ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో నితిన్ ,నిత్యా మీనన్ నటించిన "ఇష్క్" నాకు నచ్చిన సినిమా ..
నితిన్ సినిమాలో ఇంతకు ముందు సినిమాలకు పూర్తి భిన్నంగా
కూల్ రొమాంటిక్ హీరోలా బాగున్నాడు.

సినిమా కధ విషయానికి వస్తే సరదాగా,అల్లరిగా ఉండే రాహుల్(నితిన్),అంతే అల్లరిగా
చిలిపితనంగా ఉండే ప్రియ(నిత్యా మీనన్) ఇద్దరూ డిల్లీ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణంలో
ఎయిర్ పోర్ట్ లో కలుసుకుంటారు.
అల్లరి పనులు చేస్తున్న రాహుల్ ను మొదట్లో ప్రియ కోపగించుకున్నా తన పర్స్,ఫోన్
విమానంలో మర్చిపోయినప్పుడు రాహుల్ హెల్ప్ చేయటం,అంతకు ముందే రోడ్డు మీద ట్రాఫిక్ లో
ఒక చిన్న పాప టెడ్డీ కింద పడిపోతే అంత ట్రాఫిక్ లో కూడా జాగ్రత్తగా టెడ్డీ ని పాపకి అందించిన
రాహుల్ మీద మంచి అభిప్రాయం ఏర్పరుచుకుంటుంది ప్రియ.
హైదరాబాద్ కు వెళుతున్న విమానం అనుకోకుండా గోవాలో ఆగిపోవడంతో తనకు గోవా అంటే
ఇష్టమని ఇప్పటికి చాలా సార్లు చూడాలనుకుని చూడలేదని రాహుల్ తో చెప్తుంది ప్రియ.
అప్పుడు నీకు గోవా చూపిస్తానని మాట ఇచ్చి,గోవాలో ఉన్న తన ఫ్రెండ్ పెళ్ళికి తీసుకెళతాడు.
హైదరాబాద్ తిరిగి వెళ్ళే సమయానికి రాహుల్,ప్రియ ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు.


హైదరాబాద్
వెళ్ళాక తెలుస్తుంది రాహుల్ కి ప్రియ అన్న శివ (అజయ్) తన అక్కని కాలేజ్ లో
ప్రేమిస్తున్నానని వేధించి, తన చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి అని.
ఇక అప్పటి నుండి రాహుల్,శివ ల మధ్య జరిగిన పోటీలో రాహుల్ ఎలా విజయం సాధించి
ప్రియను పెళ్లి చేసుకున్నాడన్నది సినిమా కధ.

హింసలు,గొడవలు లేకుండా సరదాగా సాగిపోయే ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు
మంచి ఫీలింగ్ ని కలుగచేశాయి...ఇప్పుడెంతో గొడవ జరుగుతుందేమో అన్న సందర్భాల్లో కూడా
రాహుల్ ప్రాక్టికల్ జోకులు మనల్ని నవ్విస్తాయి.
సినిమాలో ఎక్కువమంది హాస్య నటులు లేకపోయినా ఆలీ ఉన్న ఒక్క సీన్లో నవ్వకుండా ఉండలేరు.

ఇంక నిత్యా మీనన్ చాలా ముద్దుగా,బొద్దుగా అందంగా ఉంది.అందరు ఆడపిల్లల్లాగే బంగారు గాజులంటే
పిచ్చి ప్రియాకి కూడా ఈ సినిమాలో .. గోవాలో రాహుల్ ఫ్రెండ్ పెళ్ళిలో నిత్యామీనన్,నితిన్
బంగారు నగలకి మోడలింగ్ చేసే మోడల్స్ లా, ముచ్చటైన జంటగా అందంగా ఉన్నారు.
నిత్యా మీనన్,నితిన్ చాలా క్యూట్ గా బాగున్నారు,నటన కూడా బాగుంది.


ఇష్క్
ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు,అక్క-తమ్ముడూ,అన్నా - చెల్లి
తల్లిదండ్రులు - పిల్లల మధ్య ప్రేమను కూడా చక్కగా చూపించిన సినిమా..
ఇబ్బందికరమైన డ్రెస్ లు,డైలాగ్ లు లేకుండా ఫామిలీ అందరూ కలిసి చూడగలిగేలా బాగుంది.

ఇష్క్ సినిమాకి "పిసి శ్రీరామ్" సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత అందాన్నిచ్చిందని చెప్పొచ్చు.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం చాలా బాగుంది.
పాటలు వింటుంటే ఏవో వెనకటి పాత పాటలు వింటున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇప్పటి అర్ధం కాని గజిబిజి పాటల రోజుల్లో ఈ పాటలు చాలా బాగున్నాయి..

నాకు నచ్చిన పాట
... చిన్నదాన నీకోసం ...





ఇష్క్ ఒక క్యూట్ స్టోరీతో ... ఒక క్యూట్ జంట తో ... నాకు నచ్చిన ఒక క్యూట్ లవ్ స్టోరీ..


8, జనవరి 2012, ఆదివారం

విలేజ్ లో వినాయకుడు


ఈ రోజు జీ తెలుగు లో విలేజ్ లో వినాయకుడు సినిమా చూశాక ఆ సినిమా గురించి
నా బ్లాగ్ లో రాద్దామనిపించింది..
నాకు ఇష్టమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

చక్కని పల్లెటూరి వాతావరణంలో తీసిన ఈ సినిమాలో హీరో (కార్తీక్) కృష్ణుడు కిండర్ గార్డెన్ టీచర్.
హీరోయిన్ కావ్య ( శరణ్యా మోహన్) మెడికో ఇద్దరు మంచి స్నేహితులు, ప్రేమికులు.
వాళ్ళ ప్రేమ విషయం తండ్రికి చెప్పి పెళ్ళికి ఒప్పించటానికి ఇంటికి వచ్చిన కావ్య తన పిన్ని,బాబాయిలు అందరికీ
ఈ విషయం చెప్పి వాళ్ళ పెళ్ళికి తండ్రిని ఒప్పించమని అడిగేలోపే కార్తీక్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు.

లావుగా వున్న కార్తీక్ ని చూసిన అందరూ ఈ పెళ్లి మాకిష్టం లేదని చెప్పేస్తారు.
ఇంక కావ్య తండ్రికి కావ్యకి కాబోయే భర్త మీద ఎన్నో ఆశలు కోరికలు వుంటాయి
అల్లుడు పెద్ద హోదాలో వుండాలని డిసిప్లిన్ వుండాలని,అందగాడై వుండాలని ఇలా ఎన్నో..
అంతగా అల్లుడిని ఊహించుకున్న అతనికి కార్తీక్ ని చూడగానే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది.
అతన్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని తన స్నేహితుడైన యండమూరి వీరేంద్రనాథ్ కి చెప్తాడు.
అందులో భాగం గా యండమూరి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు..
ఇటు కార్తీక్ ఆ కుటుంబం లో ఒకడిగా కలిసిపోవాలని వాళ్ళ ప్రేమాభిమానాలను పొందటం కోసం,
ప్రయత్నిస్తుంటాడు.
అందులో భాగంగానే ఇంట్లో కొన్ని విషయాల్లో జోక్యం చేసుకున్న కార్తీక్ ని ఇంటినుంచి వెళ్ళగొడతాడు కావ్య తండ్రి.
చివరికి కార్తీక్ మంచితనాన్ని అర్ధం చేసుకున్న కావ్య వాళ్ళ నాన్న పెళ్లి జరిపించటంతో ఈ కధ సుఖాంతమవుతుంది.

ఇంక ఈసినిమాలో మనసులో ఏదున్నా చెప్పేసే..అమాయకమైన,ఎదుటి వాళ్ళ బాధను అర్ధం చేసుకునే
వ్యక్తిగా,చిన్నపిల్లాడి మనస్తత్వం తో కార్తీక్ నటన చాలా బాగుంటుంది.
యండమూరి కావ్య తండ్రికి ఆస్తి లేదు అప్పుల్లో వున్నారని చెప్పినప్పుడు తెగ ఫీల్ అయ్యి ,
ఇంటికి వచ్చి వాళ్ళ కష్టాల్లో పాలుపంచుకోవాలని ప్రయత్నించే కార్తీక్ కారెక్టర్ చాలా బాగుంటుంది.

నాకు ఇలాంటి కారెక్టర్స్ చూసినప్పుడు అనిపిస్తుంది వాస్తవంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని..

ఇంక ఈ సినిమాలో కావ్య తండ్రి లాంటి తల్లిదండ్రులకి ఈ లోకంలో కొదువ లేదు ...
అల్లుడి ఆస్తిపాస్తులు,వుద్యోగం,హోదాలకి ఇచ్చినంత ప్రాముఖ్యత అతని మనస్తత్వానికి ఇవ్వరు.
వాళ్ళు కష్టపడ్డా వాళ్ళమ్మాయి సుఖంగా వుండాలని ఎంత కట్నాలైనా ఇచ్చి పెళ్లి చేస్తారు..
ఎంత గొప్ప స్థాయిలో వున్నా,ఆస్తిపాస్తులున్నా మంచి మనసు,ప్రేమ ,
ఎదుటి వాళ్ళ హృదయానికి తగినట్లు స్పందించే గుణంలేని వాళ్ళతో కూతురు పడే కష్టాన్ని
చూసిన తల్లిదండ్రులు తర్వాత ఎంత బాధపడినా వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకోలేరు.

అమ్మాయిలూ,తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఒకటే అబ్బాయిల అందంలో,ఆస్తిపాస్తుల్లో,
హోదాలో మాత్రమే సుఖసంతోషాలు లేవు..
జీవితం అంటే ప్రేమించటం ... ప్రేమించబడటం.
"Love means each person is free
to follow his or her own heart."


చినుకై వరదై సెలయేటి తరగై...
ఉరికే మదిని కడలల్లె కరిగించి కలిపేసుకున్నావు..



4, జనవరి 2012, బుధవారం

కొంటె బాపు గీతలు - ముళ్ళపూడి రాతలు


మొన్న ఆదివారం ఈ టీవీలో "పరిపూర్ణ మహిళ" చూశాను అందులో ఒక ఆవిడని మీరు,మీ వారు
10 రోజులుగా ఏవో గొడవలవల్ల మాట్లాడుకోవటం లేదు.అప్పుడు మీ వారు మిమ్మల్ని బుజ్జగించి,
నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే అది ఎలా చేస్తారో మీ వారిలాగా మీరు యాక్ట్ చేసి చూపించండి
అని అడిగారు జడ్జెస్.కానీ ఆవిడకి సరిగా చేయటం రాలేదు..

నాకనిపించింది ఈవిడ పెళ్లి పుస్తకం సినిమా చూస్తే ఖచ్చితంగా విన్ అయ్యేది.
పాపం సినిమా చూడలేదో , లేకపోతె సీన్ గుర్తుకు రాలేదో అని.
పెళ్లి పుస్తకం సినిమాలో రాజేంద్రప్రసాద్ బాస్ కూతురుతో చనువుగా ఉంటున్నాడని దివ్యవాణి అలిగితే,
ఆ అలకని రాజేంద్రప్రసాద్ ఎంత చక్కగా తీర్చాడో చూడండి.

కొంటె బాపు గీతలున్న,ముళ్ళపూడి రాతలున్న "పెళ్లి పుస్తకాన్ని" చదివి అప్పచెప్పుదాం
అన్నరేంజ్ లో గుర్తుంచుకుని పాటించాల్సిన మంచి విషయాలు ఎన్నో వున్నాయి ఈ సినిమాలో
నాకు ఎప్పటికీ నచ్చే సినిమాల్లో పెళ్లి పుస్తకం ఒకటి. ఇందులో ఈ సీన్,ఈ పాట రెండు చాలా బాగుంటాయి .

సరికొత్త చీర ఊహించినాను




18, డిసెంబర్ 2011, ఆదివారం

కన్నెపిల్ల కోరుకునే తలంబ్రాలు..



శ్రీరాముడిలా అగ్నిప్రవేశం చేయిస్తాడో?
హరిశ్చంద్రుడిలా అంగడిబొమ్మను చేస్తాడో?
ధర్మరాజులా జూదంలో పణంగా పెడతాడో?
నలుడిలా నట్టడవిలో వదిలిపెడతాడో?

తెలియకపోయినా భర్త అనే మగవాడిని నమ్మి అతనితో జీవితాన్ని పంచుకుంటుంది స్త్రీ ..

అరచేతిలో స్వర్గం చూపించే మోసగాళ్ళు ఎప్పుడూ వుంటారు..
వాళ్ళ చేతిలో మరే యువతీ మరోమారు మోసపోకూడదని
సబల చేసిన ప్రయత్నమే తలంబ్రాలు

పల్లెటూరి నుంచి నగరం వచ్చి దిక్కు తోచని స్థితిలో వున్న రాధికను(జీవిత) మాయ మాటలతో
లొంగదీసుకుంటాడు మధు(రాజశేఖర్)..ఆమెను మోసం చేసి ,వారంరోజుల్లో మన పెళ్లి అని నమ్మబలికి,
పెళ్లి నాలుగు రోజులు ఉందనగా..ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు..

పెళ్లి తేదీ రానే వస్తుంది..ఏ క్షణాన అయినా మధు రావచ్చని,పెళ్లి కూతురుగా అలంకరించుకుని సిద్ధంగా వుంటుంది రాధిక.ఇంతలో తలుపు చప్పుడు కాగానే ఆత్రంగా తలుపు తీసిన రాధికకు ఇంటి యజమాని కనపడి ఇల్లు ఖాళీ చేయమంటాడు..రాధిక ఏం చెప్పినా వినకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్ళగొడతాడు..

దిక్కుతోచక మధును వెతుక్కుంటూ చివరకు మధు వుండే చోటుకు చేరుకుంటుంది రాధిక.మధు ఇంట్లో లేడని తెలుసుకుని..దాహంతో ఇంటి బయట వున్న పంపు దగ్గర నీళ్ళు తాగబోతుంది.ఇంతలో ఓ చెయ్యి పంపును కట్టేస్తుంది.తలెత్తి చూడగానే ఎదురుగా మధుని చూసిన రాధిక ప్రాణం లేచివస్తుంది.."ఎందుకొచ్చావ్.." అంటాడు మధు ఊహించని ఆ మాట రాధికకు బాణంలా గుచ్చుకుంటుంది."మీ కోసమేనండీ..మీరు తప్ప నాకేవరున్నారు" అంటుంది ప్రాధేయపడుతూ ..తప్పమ్మా... అలాంటి ఆశలేమైనా వుంటే ఒదిలేసుకో.జీవితమంతా నేను ప్రేమిస్తూనే వుంటాను కానీ ...పెళ్లి మాత్రం చేసుకోను.ఐ హేట్ మారేజ్ అంటాడు స్టైల్ గా సిగరెట్ తాగుతూ..

అప్పటికి అర్ధం అవుతుంది రాధికకు తను మోసపోయానని..రాధికకు తను నిలుచున్న భూమి కుంగిపోతున్న ఫీలింగ్..ఏమీ చేయలేని నిస్సహాయతతో మధు వంక అసహ్యంగా చూస్తుంది రాధిక..ఇంతలో ఆ ఇంటి మేడ పైనుండి ఏవండీ..అనే పిలుపు వినిపిస్తుంది పైన పాతికేళ్ళ యువతిఇంకా అక్కడే ఉన్నారెంటండీ..దాంతో మాటలేంటి..?మీరు రండి.." అంటుంది మధుని ఉద్దేశించి,"ఎవరో పిచ్చిది పిచ్చాసుపత్రి ఎక్కడ అంటే...అడ్రెస్ చెబుతున్నా"అంటాడు మధు తడబడుతూ.."వెళుతుంది లెండి మీరు రండి.క్యాంపు కెళ్లాలన్నారు కదా... పెళ్లి సరిగా నాలుగు రోజులుందనగా మీ బాస్ క్యాంపుకు పంపిస్తున్నారు..ఏమన్నా అంటే వుద్యోగం మానేస్తానంటున్నారు..మీరెళ్ళిరండి  మీరొచ్చేసరికి పట్టుచీర కట్టుకుని రెడీగా వుంటాను"అంటుందా అమ్మాయి అమాయకంగా..

ఆ అమ్మాయి పరిస్థితి చూడగానే అయ్యో అంటూ విరగబడి నవ్వుతుంది రాధిక..ఆవేదన,ఆక్రోశం,అసహాయత కలగలిసిన ఆ నవ్వును ఎప్పటికీ మరిచిపోలేము..పిచ్చిదని రాధికను పోలీసులకు పట్టిస్తాడు మధు..
అసహాయస్థితిలో వున్న రాధికను ఒకప్పుడు మధు పక్క ఇంట్లో వుండే ప్రసాద్ (కళ్యాణ్ చక్రవర్తి)కాపాడి సింగర్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించేలా సహాయపడతాడు ..

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాధిక జీవితంలోకి వస్తాడు మధు..తన మాయమాటలతో మళ్ళీ రాధిక జీవితాన్ని
నాశనం చేయాలన్న దురుద్దేశంతో వచ్చిన మధు మోసాన్ని తెలుసుకోలేని రాధిక జరిగినవన్నీ మర్చిపోయి... మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది..ఐతే పెళ్లి సమయంలో మధు నిజస్వరూపాన్ని తెలుసుకున్న రాధిక తనలాగా మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని మధుని తన చేతులతో తానే అంతం చేయడంతో కధ ముగుస్తుంది..

ఈ సినిమాలో ముక్కుమొహం తెలియని వ్యక్తిని నమ్మటం రాధిక తప్పు అలా నమ్మింది.. కాబట్టే మోసపోయింది అనుకుంటే..ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు,పెద్దలు అందరు ఉండి చేసిన పెళ్ళిళ్ళలో ఎందరు మోసపోవటం లేదు?
కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందరు మోసపోవటం లేదు?సమస్య తెలిసిన వ్యక్తిని నమ్మటమా?తెలియని వ్యక్తిని నమ్మటమా అని కాదు నమ్మకద్రోహానికి గురవటానికి తెలిసిన,తెలియని అన్న బేధం లేదు..జీవితంలో మోసపోయినా,నమ్మకద్రోహానికి గురి అయినా ఆత్మవిశ్వాసంతో జీవించిన రాధిక కధ ఎప్పటికీ ఆదర్శం..

అలాగే మధు లాంటి మగవాళ్ళు వున్న ఈ సమాజంలోనే ప్రసాద్(కళ్యాణ్ చక్రవర్తి ) లాంటి మానవత్వం వున్నమనుషులు కూడా వుంటారు.యాంటీ హీరోగా రాజశేఖర్,తన నటనతో రాధిక పాత్రలో జీవించిన జీవిత హీరోయిన్లుగా "కోడిరామకృష్ణ" గారు తీసిన తలంబ్రాలు సినిమా అన్ని తరాలు చూడదగిన చిత్రం..

ఈ సినిమాలో పాటలు బాగుంటాయి మల్లెమాల గారు రాసిన "నిన్న నువ్వు నాకెంతో దూరం"
పాట నాకు చాలా నచ్చే పాట..

నిన్న నువ్వు నాకెంతో దూరం




1, డిసెంబర్ 2011, గురువారం

నాకు నచ్చిన సినిమా - ఆనందం


మనసుతోటి మనసునే ముడేసే మంత్రమే ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే క్షేత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ప్రేమ
తియ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ...
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమా
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించటమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం

ఆనందం నాకు చాలా నచ్చే సినిమా..
ఆకాష్,రేఖ,వెంకట్,తనూరాయ్ నటించిన, శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన
ఈ సినిమా 28th September 2001 లో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా కధ విషయానికి వస్తే ఆకాష్ (హీరో) రేఖ ( హీరోయిన్) పక్క పక్క ఇళ్ళల్లో వుంటూ,
ఒకే కాలేజ్ లో చదువుతుంటారు.కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ద్వేషం ,కోపంతో
ఎప్పుడు గొడవలు పడుతూ వుంటారు..
కొన్నాళ్ళకి రేఖ తండ్రికి ట్రాన్స్ ఫర్ అవటంతో వేరే వూరికి వెళ్ళిపోతారు.

అక్కడ వాళ్ళు వెళ్ళిన ఇంట్లో అంతకు ముందు తనురాయ్ ( సెకండ్ హీరోయిన్) కుటుంబం వుండేది.
సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక,తను ప్రేమించిన అబ్బాయి(వెంకట్) ఉత్తరం సరైన సమయలో అందక
ఆత్మహత్య చేసుకుంటుంది.తనురాయ్ చనిపోయిన తర్వాత వచ్చిన ఉత్తరం చూసిన రేఖ
తనూరాయ్ చనిపోయిన విషయం ఆ ప్రేమికుడికి (వెంకట్) తెలిస్తే ఏమవుతాడో అన్న బాధతో
తనే తనూరాయ్ లాగా ఉత్తరాలు రాస్తుంటుంది రేఖ.

కానీ
ఆ ఉత్తరాలు ఆకాష్ కి చేరుతుంటాయి.కారణం వెంకట్ ఆకాష్ కి క్లోజ్ ఫ్రెండ్
తనూరాయ్ తో పెళ్లి ఏర్పాట్లు చేసుకుని,తన దగ్గరికి వెళ్ళబోతున్న సమయంలో
యాక్సిడెంట్ లో చనిపోతాడు.ఈ విషయం తెలిస్తే తనూరాయ్ బ్రతకదని
వెంకట్ పేరుతో ఆకాష్ ఉత్తరాలు రాస్తుంటాడు..

అలా ఉత్తరాలు రాసుకున్న ఆకాష్,రేఖ ఒకరి కొకరు ఎదురుపడి అసలు విషయాన్ని తెలుసుకుంటారు.
తర్వాత ఇద్దరు ఎదుటి వాళ్ళ బాధను అర్ధం చేసుకునే మంచి మనసును,మానవత్వాన్ని
ఒకరిలో ఒకరు గుర్తించి,అభిమానం పెంచుకుని దెబ్బలాటలు,గొడవలు
మర్చిపోయి ఒకటవుతారు. ఇదీ కధ..
సినిమాలో హీరోలు, హీరోయిన్స్ ఇద్దరు బాగుంటారు,బాగా నటించారు.
ఇంక ఈ సినిమాలో నాకు నచ్చింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
పాటలు ఎన్నిసార్లు విన్నా ఇప్పటికి కూడా బోర్ అనిపించదు.

నాకు ఎక్కువగా నచ్చే పాటలు ఎవరైనా ఎపుడైనా బిట్ సాంగ్స్.

ఎవరైనా
ఎపుడైనా సరిగా గమనించారా - 1

ఫాల్గుణ మాసం తర్వాత చైత్రం వచ్చేసరికి మారిన ఋతువుకి
చలి మెల్లగా తొలగి పోయి ,కొత్త చిగుళ్ళు తొడగటం,ఉగాదికి ప్రకృతి కొత్త అందాలు సంతరించుకోవటం
అనే భావాన్ని ప్రస్తుత పరిస్థితిలో
సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక బాధపడుతున్న తనూరాయ్ జీవితంలోకి వెంకట్ ఆగమనంతో
కలిగిన మనోధైర్యం, కొత్త జీవితం గురించి చిగురించిన ఆశలకు అన్వయిస్తూ ..
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ సాహిత్యం అద్భుతంగా వుంటుంది.

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా - 1



ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా
చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడినుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పో పొమ్మంటూ తరిమేస్తుంది.
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపం తనే చూస్తూ పులకిస్తుంది..

తువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు తలపుల వనమైందో!
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా
చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

ఎవరైనా ఎపుడైనా చిత్రం చూసారా - 2

చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం మంచి మనస్సుతో
రాసిన లేఖలను "ఒక చల్లని మది పంపిన లేఖ" అంటూ...
వ్యక్తిగతంగా ఎప్పుడూ ద్వేషించుకునే ఇద్దరు ఇలా ఉత్తరాల ద్వారా ఒక్కటి కావటం
"గగనాన్ని నేలను కలిపే వింతల వంతెనగా" వర్ణిస్తూ..
విధి ఎప్పుడు ఎలాజీవితాన్ని మలుపు తిప్పుతుందో తెలియదు
అందుకే చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపించినా విధిరాత అక్షరము కూడా అర్ధమవదని
సిరివెన్నెల గారు రచించిన ఈ బిట్ సాంగ్స్ రెండు చాలా బాగుంటాయి..

ఎవరైనా ఎపుడైనా చిత్రం చూసారా - 2



ఎవరైనా ఎపుడైనా చిత్రం చూసారా
నడిరాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖ
గగనాన్ని నేలను కలిపే వీలుందని చూపేలా
వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కానీ విధిరాత

కన్నులకే కనపడని మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ
ఎవరైనా ఎపుడైనా చిత్రం చూసారా
నడిరాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖ

ఇవీ నాకు చాలా నచ్చిన ఇప్పటికీ టీవీ లో వస్తే వదలకుండా నేను చూసే ఆనందం సినిమా విశేషాలు.

ఆనందం




Related Posts Plugin for WordPress, Blogger...