పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, జూన్ 2015, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 21దాదాపు 2 నెలల తర్వాత రాస్తున్నాను.. కొంపతీసి మీరంతా కధ  మర్చిపోలేదు కదా..

క్లుప్తంగా ముందు కధ .. 

బాగా చదివి,గవర్నమెంట్ సీట్లు తెచ్చుకోలేక నాన్న కష్టపడి సంపాదించిన డబ్బునంతా బెంగుళూరు యూనివర్సిటీకి ఫీజుల రూపంలో ఖర్చుపెట్టించిన అన్న,ఇద్దరు అక్కల్లా కాకుండా నాన్న ఆశయానికి, నాన్నకి  ఏకైక వారసుడిగా డాక్టర్ అవ్వాలని, దేవుళ్ళ కి మారు రూపాలైన మా పెద్దల దీవెనలతో,వివేకానంద స్ఫూర్తితో ఎంసెట్ లో చాలా మంచి ర్యాంకు తెచ్చుకుని మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గరి నుండి  సీనియర్లు, తోటి క్లాస్ మేట్స్ టీజింగ్ లు ఎదుర్కుంటూ కాలేజ్ కి వెళ్తున నాకు కావ్య పరిచయం ఒక గొప్ప మార్పు,ఒక మంచి మలుపు .కాలేజ్ లో  పరిస్థితి అలాగుంటే ఇటు మా ఇంట్లో మా అన్నకి,కజిన్ భార్యకి అక్రమ సంబంధం ఉందని, మా పెద్దలే మాట్లాడటం,మా చిన్నక్క కొన్నాళ్ళు కనపడకుండా ఎటో పోయిందని మా పెద్దల పెంపకం గురించి మా బంధువుల ఇళ్ళల్లో చెవులు కొరుక్కోవటం, ఇలాంటివన్నీ కొంచెం బాధ అనిపించినా, ఇంకో సంతోషం మా అన్నకి ఎంగేజ్ మెంట్ కావటం.

ఇక ప్రస్తుతానికి వస్తే 

హైదరాబాద్ లో మా అన్న ఎంగేజ్ మెంట్ అవ్వగానే కాలేజ్ కి వచ్చిన నాకు నా రూమ్మేట్స్ అందరూ ఎక్జామ్స్ కోసం ట్యూషన్స్ పెట్టించుకున్నారని,ఆ విషయం నాకు చెప్పలేదని కావ్య ద్వారా తెలిసి ఉక్రోషంగా వాళ్ళని కడిగెయ్యాలని బయల్దేరాను.కాలేజ్ కి వెళ్లేసరికి మా గ్యాంగ్ అంతా వాళ్ల రెగ్యులర్ మీటింగ్ ప్లేస్, మా బాయ్స్ హాస్టల్ ఎదురుగా ఉన్న చెట్ల కింద ఉండే టీ  స్టాల్ దగ్గరే కన్పించారు.గంటలు గంటలు అక్కడ కూర్చుని ఎవరెటు పోయారు,ఎవరితో పోయారు అంటూ చెత్తా చెదారం మాట్లాడుకోవటం వాళ్లకి సరదా. ఆవేశంగా ,ఆగ్రహంగా అక్కడికి వెళ్ళిన నేను నోరు తెరిచి మాట్లాడబోయేలోపే ఏంటి మాధవ్ దారి తప్పి వచ్చావా ఏంటి? నువ్వు అమ్మాయిలతో తప్ప మాతో మాట్లాడవు కదా.. అయినా "నీ కావ్య"ని వదిలి ఇలా వచ్చావేంటి? ఈ మధ్య గంటలు గంటలు ఇంతా బయటా మీటింగులు, ముచ్చట్లు ,ఏవేవో జరుగుతున్నాయి కదా అంటూ అందరూ ఒకరికొకరు సైగలు చేసుకుంటూ వెటకారంగా నవ్వుతూ మాట్లాడుతున్నారు.

వీళ్ళు ఎందుకు కావ్య గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు వెటకారంగా నవ్వుతున్నారని అర్ధంకాక ఈ కంగారులో వాళ్ళని అడిగి,  కడిగేయాలని  వచ్చిన ట్యూషన్ విషయం మర్చిపోయి నేనే ఆలోచనలో పడ్డాను . అంతలోనే తేరుకుని కావ్య విషయం మీకెందుకు? అయిన అ "నీ కావ్య"ఏంటి? తను నాకు మంచి ఫ్రెండ్ ఏదో మాట్లాడుతూ అలా కూర్చుంటాము దానికే మీరిలా మాట్లాడాలా? ఆడవాళ్ళ గురించి ఇలాగేనా మాట్లాడేది అంటూ కంగారుగా  ఏదేదో మాట్లాడిన నా అయోమయం చూసిన నా మిత్రబృందం నన్ను బాగా ఇబ్బందిలో పెట్టామన్న సంతోషంతో  ఏమీ తెలియనట్లు మరీ అంత నటించకురా .. మాకేమీ తెలియదనుకున్నావా? కావ్య ఇంటికి తమరి రాకపోకలు,కాస్త ఫ్రీ టైం  దొరికితే లైబ్రరీలో సైలెంట్ గా మీ ముచ్చట్లు ,ఇంతకుముందు కావ్య ఇంటికి అందరం కలిసి హేమంత్ తో వెళ్ళేవాళ్ళం  అలాంటిది ఇప్పుడు ఒక్కడివే మాకెవరికీ చెప్పకుండా కావ్య ఇంటికి వెళ్ళటం,అక్కడే లంచ్ లు, టీ  టైం దాకా కబుర్లు, నీకోసం తన వెయిటింగ్ లు ఇవన్నీ ఏంటో మరి, నీకు.మేమేమన్నా వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నామా.. మాకూ తెలుసురా ఈ ముచ్చట్లన్నీ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు.

మీకెందుకు తెలియవులే మీరు లేస్తే ఇలాంటి రాజకీయాలేగా చేసేది అని మనసులో అనుకుని, నేను సైలెంట్ గా ఉండకూడదు గొడవైనా సరే వీళ్ళకి తగిన సమాధానం చెప్పాలి. లేకపోతే  నా వల్ల కావ్యకి చెడ్డపేరు వస్తుంది అని అలోచించి, మీ ఇష్టమొచ్చినట్లు అనుకోండి, నాకు అనవసరం.. మీరనుకునేలా  నాకు కావ్యకి మధ్య ఏమీ లేదు, "పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది" అని మా నాన్నమ్మ ఒక సామెత చెప్పేది.మీకు అలాంటి ఫ్రెండ్స్  ఉన్నారని అందరినీ అలాగే అనుకుంటున్నారు అనగానే సోహిల్ అందుకుని "పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందని" మా జేజమ్మ కూడా సామెత చెప్పేది అనగానే, అందరూ వెధవ  నవ్వులు నవ్వటం మొదలుపెట్టారు. ఇంకా అలాంటి వాళ్లతో ఎంత మాట్లాడినా లాభం లేదు అనిపించి అక్కడి నుండి పక్కకి  వెళ్ళిపోయాను.

ఒంటరిగా రూమ్ కి వెళ్తున్న నాకు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి.ఒక ఆడ,మగ స్నేహంగా ఉండటం తప్పా? మా అన్న, కజిన్ భార్యతో కలిసి సంగీతం నేర్చుకుంటూ సరదాగా  వాళ్ళింటికి వెళ్తే వాళ్ళిద్దరికీ ఏదో అక్రమ సంబంధ వుందని అనుమానించటమే కాదు అప్పుడే చదువు అయిపోయి,కొత్తగా ఉద్యోగం లో చేరి  ఆరోజుల్లో నెలకి నాలుగు వేలు మాత్రమే సంపాదిస్తున్న మా అన్న కజిన్  భార్య కోసం  ఎప్పటినుంచో హైదరాబాద్ లో వెల్ సెటిల్డ్  అయిన వాళ్ళ  ఫ్యామిలీ నంతా పోషిస్తున్నట్లు, ఆయన జీతం నాలుగు వేలతోనే వాళ్లకి ఆస్తులు పోగేసి ఇస్తున్నట్లు మా సొంత పెద్దలే అనుమానిస్తూ మాట్లాడుతారు..అయినా మా అన్న కూడా మా పెద్దలు  ఒక స్త్రీ గురించి అవమానకరంగా మాట్లాడుతుంటే  ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కి కావ్య విషయంలో ఎదురు సమాధానం చెప్పినట్లు తను కూడా నాకు, కజిన్ భార్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి, మా పెద్దల నోర్లు మూయించొచ్చు కదా.. తెలిసీ తెలియనట్లు నటిస్తాడా? లేకపోతే  నిజంగా తెలియదా ,,లేకపోతే  అలా అక్రమ సంబంధం ఉందని అందరూ మాట్లాడుకోవటం తన స్టేటస్ సింబల్ అనుకుంటున్నాడేమో కొంపతీసి.. అయినా మా అన్న అప్పట్లో అలాగ ఉన్నాడు కానీ ఇప్పుడు మహిళా సాధికారత  గురించి,కళాత్మక జీవనం గురించి వేదికలెక్కి ఉపన్యాసం చెప్పే గొప్ప స్థాయిలో ఉన్నాడులెండి..

ఇంక మా చిన్నక్క విషయం..  ఆడపిల్ల ఉదయం కాలేజ్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి రాకపోతేనే భయపడే ఆరోజుల్లో రెండురోజులు ఎక్కడ ఉందో తెలియకుండా ఉండి, ఇంటికి వస్తే తను నిజంగా ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోకుండా, బాధపడకుండా  మా చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్న అబ్బాయిలు కూడా ఉన్నారా లేదా అని వెతికి రావటం, ఏదేదో ఆలోచించటం ఎందుకిలా చేస్తారు మనుషులు, మొత్తానికి ఒక ఆడ,మగ క్లోజ్ గా ఉంటే  అనుమానించే సమాజం మనది. ఇప్పటిదాకా మా అన్న అక్రమ సంబంధం , మా చిన్నక్క  వ్యవహారాలకే సగం కుంగిపోయిన నేను ఇప్పుడు కావ్య విషయంలో నా మీద పడ్డ అపవాదుతో పూర్తిగా కుంగిపోయాను.. "ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను" అన్న రేంజ్ లో నిరాశా నిస్పృహలు నన్ను ఆవహించాయి...

మొత్తానికి ఎలాగోలా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయి పడుకున్న నాకు ఫోన్ రింగ్ వినిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు తీస్తారులే  అనుకుని లాగే పడుకున్న నాకు ఫోన్ రింగ్ ఆగిన 2 నిమిషాల తర్వాత మాధవ్ నీకే ఫోన్ అంటూ హేమంత్ మాట వినిపించింది. ఇప్పుడు నాకెవరబ్బా అని వెళ్ళిన నాకు హేమంత ఫోన్ ఇస్తూ కావ్య నిన్ను గురించి అడిగింది అందుకే పిల్చా అంటూ  ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండానే ఫోన్ నాకిచ్చి పక్కకి వెళ్ళిపోయాడు హేమంత్ .. అటునుండి కావ్య .. మాధవ్ ఇవాళ కాలేజ్ లో జరిగిన విషయం తెలిసింది. రేపు ఒకసారి ఇంటికి రా .. అమ్మ కూడా నీతో మాట్లాడుతుంది.నువ్వు చాలా ఫీల్ అయ్యావట కదా హేమంత్ చెప్పాడు. తప్పకుండా ఇంటికి రా .. Ok నా అంటూ ఫోన్ కట్ చేసింది.కావ్యతో మాట్లాడిన తర్వాత నా మనసు  నెమ్మదించింది.

డిన్నర్ టైం కల్లా మా రూమ్మేట్స్ పెద్ద మాధవ్ , సోహిల్, దివాకర్, కూడా ఏమనుకున్నారో ఏమో మరి అందరూ మధ్యానం  జరిగిందంతా మర్చిపోయినట్లు మాట్లాడుతూ ఏంటి మాధవ్ మరీ చిన్న పిల్లాడిలా ఏదో సరదాకి అన్నందుకు అంత  ఫీల్ అవుతావెందుకు? అయినా మేమన్నదాన్లో తప్పేముంది? ఈరోజుల్లో క్లాస్మేట్స్ తో లవ్, మారేజ్ అన్నీ మామూలే కదా ..ఇప్పుడు మన ఫ్రెండ్స్ పెద్ద మాధవ్,రేణుక పెళ్లి చేసుకోవాలి అనుకోట్లేదా  అలాగే మీ ఇద్దరి మధ్య కూడా ఏదో ఆలోచన ఉందనుకున్నాము. లేకపోతే  లేదని చెప్పు అంతే  కానీ ఇంతలా ఫీల్ అయితే మాకు లేనిపోని అనుమానాలు తప్పకుండా వస్తాయి.  నీకు ఎలాంటి ఫీలింగ్స్  లేకపోయినా కావ్య మనసులో ఏముందో ఆలోచించు.. ఇవాళ నిన్ను బాధ పెట్టినందుకు వాళ్ళ అన్న హేమంత్ తో సహా కలిపి మరీ మా అందరికీ క్లాస్ పీకింది కావ్య. నీ బాధ తన బాధ లాగా ఫీల్ అయ్యింది కూడా తెలుసా ?...అంటూ అందరూ డిన్నర్ ముగించి వెళ్ళిపోయారు.

వాళ్ళు చెప్పే మాటలు విన్న నా మనసులో ఆలోచన మొదలయ్యింది. కావ్య   నిజంగానే  నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.మా బ్యాచ్ లోనే కాదు క్లాస్ మేట్స్ లో కూడా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది..మా ఇంట్లో విషయాలన్నీ తనకి చెప్పినా మంచి మనసుతో అర్ధం చేసుకుంటుంది. హేమంత్ ని చెడు అలవాట్ల నుండి మార్చమని కూడా నన్నే అడిగింది.ఎవరూ చెప్పని కాలేజ్ లో సీక్రెట్స్ నాతో  షేర్ చేసుకుంటుంది.కొత్తలో హేమంత్ వాళ్ళతో కలిసి ఇంటికివెళ్తే ఒక్కసారి పలకరించి, బయటికే రాకుండా తన రూమ్ లోనే వుండేది, ఆంటీనే  మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నేనొక్కడినే వెళ్ళినా కావ్య కూడా నాతో  పాటూ హాల్లోనే కూర్చుని,టీవీ చూస్తూ అన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటుంది. పైగా నన్ను వీళ్ళు ఇవాళ అనుమానించినందుకు తను ఫీల్ అయ్యింది అని తెలిస్తే ఏదో తెలియని సంతోషం.మనకోసం మనం బాధపడటం గొప్ప కాదు మన బాధని వాళ్ళ బాధగా ఫీలయ్యే ఆత్మీయులు ఉన్నవాళ్ళే నిజమైన  అదృష్టవంతులు కదా అనిపించింది.

ఇంతగా అందరూ మా స్నేహాన్ని అనుమానిస్తున్నా కావ్య మళ్ళీ ధైర్యంగా రేపు వాళ్ళ ఇంటికి రమ్మంది అంటే ఇదంతా కేవలం స్నేహమేనా లేక వీళ్ళంతా అన్నట్లు తన మనసులో ఇంకేమైనా ఉందా? అనే ఆలోచన మొదటిసారి కలిగింది. ఒక్కోసారి మనంతట మనకి కలిగే ఫీలింగ్స్ కన్నా ఎదుటివాళ్ళ మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. "ప్రేమ వెలసింది మనసులోనే మౌనదేవతగా" పాట ఎక్కడినుండో వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది.. నిజమా లేక భ్రమా ?Related Posts Plugin for WordPress, Blogger...