9, జనవరి 2013, బుధవారం
మా సంక్రాంతి ముగ్గులు...
7, జులై 2012, శనివారం
ఆషాఢం --- గోరింటాకు

హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ??? సుమారు 2 నెలల తర్వాత ఈ రోజే నా చిన్నిప్రపంచం లోకి వచ్చాను. చాలా రోజులైనట్లుగా వుంది బ్లాగ్ లో పోస్ట్ లు పెట్టి.ఈ మధ్య కొన్ని కారణాల వలన బ్లాగ్ రాయటం కుదరలేదు. కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మీ అందరితో మాట్లాడాలనిపించింది అందుకే ఈ పోస్ట్.. కొన్ని సార్లు ఎంత బిజీగా వున్నా,ఎన్ని చికాకులు వున్నా ఇష్టమైన పని చేయటం ఎప్పుడూ కష్టంగా అనిపించదేమో అలాంటిదే ఈ "నా చిన్ని ప్రపంచం" కూడా...

ఆషాఢం.........
కొత్త జంటల్ని విడదీసి , ఎడబాటు కలిగించి,ఒకరి తలపుల వానలో మరొకరు తడిచి పోయేలా చేసి,విరహము కూడా మధురమే కదా అనుకునేలా చేసేది ఆషాఢం.
ఆషాఢం శూన్యమాసమని శుభకార్యాలు కూడా వాయిదా వేస్తారు కానీ ఈ నెలలో వచ్చే తొలి ఏకాదశి,జగన్నాధ రధయాత్ర, గురు పౌర్ణమి,బోనాలు ఇలా అందరూ భక్తిగాఆచరించే పర్వదినాలు,ఉత్సవాలు ఈ మాసంలో వున్నాయి.
వర్షాకాలం మొదలయ్యి నల్ల మబ్బులు కమ్ముకునే మాసం ఆషాఢం.. ఐతే ఈ నెలలో కనిపించే మేఘాలు అంతగా కురవ వట .. దట్టంగా కమ్ముకుని వర్షం పడుతున్నట్లే అనిపించి చెదిరిపోతాయట . అందుకే నమ్మించి మోసం చేసే వాళ్ళను ఆషాఢభూతులు అంటారట.
ఆషాఢం గురించి అందరూ ఇప్పటికే చెప్పేసి ఉండొచ్చు, అందుకే ఆషాఢంలో నాకు ఇష్టమైన గోరింటాకు గురించి చెప్పాలనిపించింది. ఆషాఢంలోముఖ్యమైన ఆచారం గోరింటాకు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం నాకు.
ఈ గోరింటాకు వెనకటి రోజుల్లో ఇంట్లో పెరటిలో, తోటల్లో వున్న చెట్లకి గోరింటాకు కోసుకు వచ్చి , రోటిలో వేసి మజ్జిగ,చింతపండు ,రేగి కాసు వేసి, మెత్తగా అయ్యేదాకా కష్టపడి రుబ్బి,ఇంట్లో ఆడపిల్లలందరూ పోటీ పడి గోరింటాకు పెట్టుకునే వారట మా అమ్మ చెప్తుంటారు.మళ్ళీ ఆ గోరింటాకు పండటానికి తీసుకునే జాగ్రత్తలు కూడా వుండేవట.
ఇప్పుడు అంత కష్టం ఏమీ లేకపోయినా పచ్చి గోరింటాకు దొరకటం మాత్రం చాలా కష్టం.. కోన్ మేహేంది ఎంత అందంగా పెట్టినా గోరింటాకు పెట్టుకున్నంత అందం,కళ వుండదు. అందుకే ఈ ఆషాఢంలో ప్రత్యేకమైన గోరింటాకును కొనుక్కుని
గోరింటాకు సరదా తీర్చేసుకున్నాము.ఎర్రగా పండిన ఆ గోరింటాకు అందం,సువాసన ఇష్టపడని వాళ్ళు వుండరేమో..
7, మార్చి 2012, బుధవారం
♥ Colours Of Life ♥
మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన
పెళ్ళిలో పెళ్లి కూతురికి పండే ఎర్రని గోరింటాకు తో మొదలై పెళ్లి పట్టు చీర,గాజులు,
పాపిటలో ఎర్రని కుంకుమతో పెళ్లి కూతురు వివాహిత స్త్రీగా మారే దాకా ఎరుపుదే ప్రాధాన్యత.
- ఎరుపు రంగు వేగం, శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక,ఇది ఉత్తేజకరమైన రంగు.
- ఎరుపురంగు ఇష్టపడే వ్యక్తి సాహసోపేతమైన వ్యక్తిత్వం కలిగి వుంటారు.
- ఇతరులను అధిగమించాలని చూస్తుంటారు.
- అలాగే ప్రమాద సూచికగా కూడా ఎరుపునే సూచిస్తారు.
పచ్చందనమే పచ్చదనమేతొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు.
శుభ సందర్భాల్లో ఆకుపచ్చకు ప్రాధాన్యత ఉంది.శుభకార్యాలు,పండుగలు
పచ్చని మామిడాకు తోరణాలతోనే మొదలవుతాయి.
- ఆకుపచ్చ రంగు ఇష్టపడే వాళ్ళు తోటివారికి సాయపడేందుకు ప్రయత్నిస్తారు.
- ఎవరైనా బాధల్లో వున్నట్లు కనిపిస్తే, వారిని ఓదార్చేందుకు చూస్తారు.
- సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు,కొన్ని సార్లు నిర్దయగా కూడా ఉంటారు.
- ఆకుపచ్చ రంగు హాస్పిటల్స్ లో ఉపయోగిస్తారు..ఈ రంగు కళ్ళకు మంచిది.
- ఇది నూతనోత్సాహాన్ని, శాంతిని ఇచ్చే రంగు
మా ఇంట్లో పూలకుండీల మధ్యలో కాసేపు కూర్చోవటం,మొక్కలకి నీళ్ళు పోస్తూ
వాటిని పలకరించం నాకు చాలా ఇష్టం..♥
U.S మిలటరీ లో ధైర్య సాహసాలకు గుర్తింపుగా "పర్పుల్ హార్ట్" అవార్డ్ ఇస్తారు.
ఈ రంగు సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక.
- పర్పుల్ కలర్ ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలనుకుంటుంటారు.
- నమ్మిన వారికోసం ఏదైనా చేయగల ఔన్నత్యం ఈ రంగు ఇష్టపడే వారి సొంతం.
- లేనిపోని లౌక్యాలను ప్రదర్శించరు,వినయంగా అమాయకంగా ఉంటారు.
- ఈ రంగును వాడితే డిప్రెషన్, అభ్రదతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలను అణచిపెట్టుకోవడం జరుగుతాయి.
వుంటాయి.పర్పుల్ గులాబీలు నాకు చాలా ఇష్టమైన పూలు.♥
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
అనంతమైన ఆకాశం,అంతులేని సముద్రం,అందరూ ఇష్టపడే కన్నయ్య రంగునీలం.
ప్రశాంతమైన రంగు.
ఈ రంగును ఎక్కువగా ఉపయోగించటం వలన స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ,
సుఖనిద్ర, సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు.
- స్వచ్చత,శాంతం,అనర్గళంగా మాట్లాడటం,ఆత్మవిశ్వాసం,
- మనసులో ఒకటి పైకి ఒకటి లాగా ఉండని మనస్తత్వం ఈ రంగును ఇష్టపడే వాళ్ళ ప్రత్యేకతలు.
♥ నాకు ఇష్టమైన సముద్రం,ఆకాశం,కృష్ణయ్య అన్నీ నీలమే..ఆక్వా బ్లూ నాకు చాలా ఇష్టం.♥
జగాన వలపే నిండాలి లే
ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాలా
పింక్ రిబ్బన్ బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహనకు,దానికి వ్యతిరకంగా పోరాడే హోప్ ను
కలిగించే సింబల్ గా ఉపయోగిస్తున్నారు.
జైపూర్ లో పింక్ రంగులో ఉండే కట్టడాలతో పింక్ సిటీ ప్రసిద్ధి చెందింది.
- పింక్ కలర్ఇష్టపడేవారుఅందంగా,చిలిపిగాఉంటారట.
- పింక్ కలర్ సంతోషాన్ని,ఉత్సాహాన్నీ కలిగిస్తుంది.
తియ్యతియ్యని కలలను కనటమే తెలుసు కమ్మని ప్రేమలో
చాలా సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.
నాకే కాదు అందరికీ చాలా ఇష్టమైన chocolates బ్రౌన్ కలరే ! మరీ ఎక్కువ
chocolates తినటం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా అప్పుడప్పుడు తినటం అవసరం :)
♥ chocolates, ఇంకా కాఫీ కూడా నా ఫేవరేట్.♥
కొండబంతి గోరంత పచ్చ
పసుపు రంగు శుభకరమైన రంగుల్లో ఒకటి.గడపకి పసుపు రాయటం శుభకార్యాలకి,
పండగలకి ఆహ్వానం పలకటానికి .పసుపు రాసిన గడపలు లక్ష్మీ కళతో వుంటాయి.
శాస్త్రీయంగా కూడా పసుపు వాడకం మంచిది.పసుపురంగులో గొప్ప కళ ఉంది.
- పసుపు రంగు గులాబీలు స్నేహానికి గుర్తు..
- పసుపు రంగు ఇష్టపడే వారు హుషారుగా ఉత్సాహంగా ఉంటారు.
- ఆత్మస్థైర్యంతో ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. లాజికల్ గా మాట్లాడతారు.
♥ పసుపు రంగు చామంతులు,పసుపుగా పండిన మామిడిపళ్ళు ,పచ్చని బంగారం నాకు చాలా ఇష్టం.♥
తెల్లని తెలుపే ఎద తెలిపే
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
తెలుపు స్వచ్చతకు,నిర్మలత్వానికి ప్రతీక.ఎండాకాలంలో తెల్లటి కాటన్ డ్రెస్ లే ఎక్కువగా వాడతారు.
కళ్ళకు హాయిగా ప్రశాంతంగా అనిపించే రంగు.
- తెలుపు రంగు ఇష్టపడేవాళ్ళుసహజ సిద్ధమైన వైఖరిని,విషయాల పట్ల స్ఫష్టమైన అవగాహనను కలిగి ఉంటారు.
- సున్నితమైన మనస్కులు కూడా.
- అంతే కాదు తెలుపును ఇష్టపడే వాళ్ళు దేన్నీ అంత సులభంగా మెచ్చుకోరు .
♥ సమ్మర్ లో తెల్లటి మల్లెపూలు ,తెల్లటి కాటన్ డ్రెస్ లు నా ఫేవరేట్ ♥
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారునలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నలుపు రంగు ఎక్కువగా ఆశుభానికి,శని కి ప్రతీకగా సూచిస్తారు.
కానీ వర్షాన్నిచ్చే నల్లటి మేఘాలు,మనిషికి విశ్రాంతి నిచ్చే రాత్రి అన్నీ నలుపే..
అలాగే ఆడపిల్ల కాటుక కళ్ళు,నల్లని పొడవైన కురులు ఇష్టపడని వాళ్ళుండరు.
- నలుపు రంగును ఇష్టపడే వాళ్ళు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
- వాళ్ళపై వేరొకరు ఆధిపత్యం చెలాయించటం వీళ్ళకి నచ్చదు.
- చరిత్రను ఇష్టపడే వారు నల్ల రంగు కార్లంటే ఆసక్తి కలిగి ఉంటారట.
♥ నాకు కూడా నల్లని పొడవైన జడ,నల్లపూసల గొలుసు చాలా ఇష్టం.♥
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో ...
ఏ రాజు ఎదలోతు చవిచూసేనో..
ఈ సంజెలో కెంజాయలో
సంజె కెంజాయ రంగుగా,చెంగావి రంగు గా ఈ రంగును వర్ణిస్తారు.
యోగులు, మునీశ్వరులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు.
- ఈరంగు ఇష్టపడే వారు మాటకారులు
- వీళ్ళు ఎప్పుడూ చురుకుగా,సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్నికలిగిఉంటారు.
- నారింజ రంగు ధరించేవారు అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకుంటారు.
♥ చిన్నప్పుడు జింగ్ థింగ్ గోల్డ్ స్పాట్,ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ నాకు చాలా ఇష్టమైనవి.♥
ప్రకృతి లోని అందమైన రంగుల్లాగే మనజీవితం కూడా సకలవర్ణ శోభితం కావాలని కోరుకుంటూ
అందరూ సంతోషంగా జరుపుకునే హోలీ పండుగ శుభాకాంక్షలు

16, డిసెంబర్ 2011, శుక్రవారం
ధనుర్మాసం మొదలయ్యింది...!

ధనుర్మాసం వచ్చేసింది..
కొత్త సంవత్సరం ఆగమనాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటి నుండి మొదలు పెట్టి సంక్రాంతి పండుగ వరకు
ఇంటి వాకిళ్ళను కళ కళ లాడేలా తీర్చిదిద్దే రంగవల్లులతో
హరిలోరంగా హరి అంటూ భగవన్నామస్మరణ చేస్తూ వచ్చిన హరిదాసుతో ,
ధనుర్మాసం లో విష్ణు మూర్తికి పూజ చేసే "తిరుప్పావై పాశురాలతో" మన ఇళ్ళల్లోనే కాదు ..
మన బ్లాగ్ లలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది..
నేను కూడా ఈ సంవత్సరం నా "భక్తిప్రపంచం" బ్లాగ్ లో "తిరుప్పావై పాశురాలు" పోస్ట్ చేస్తున్నాను..
ఈ ధనుర్మాసం అంతా మీరు కూడా మంచి మంచి ముగ్గులు వేయాలని,
చక్కగా ధనుర్మాసం పూజలు చేసుకోవాలని కోరుకుంటూ..


10, డిసెంబర్ 2011, శనివారం
చలికాలం .......!!!!
రాత్రి ఎంత త్వరగా పడుకున్నా పొద్దున్నే లేవాలనిపించటం లేదు
దుప్పటి గట్టిగా బిగించి కళ్ళు తెరవాలనిపించటం లేదు..
పొద్దున్నే స్నానం చేయాలంటే భయంగా వుంటుంది...
చక్కగా జుట్టుకి నూనె పెట్టి జడ వేసుకుందామని చూస్తే కొబ్బరి నూనె డబ్బాలో
నూనె బదులు గడ్డ కట్టిన నెయ్యి కనిపిస్తుంది ..
సాయంత్రం బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే 6 గంటలకే చీకట్లు ..
తెల్లవారుఝామున మొక్కలపై అందంగా కనపడుతున్న మంచు బిందువులు..
మరి చలికాలం వస్తే ఇలాగే వుంటుంది కదా..
డిసెంబర్ ,జనవరి నాకు ఇష్టమైన నెలలు
డిసెంబర్ లో నేను పుట్టాను.. నేను చదువుకుంది సిస్టర్స్ స్కూల్ లో కావటంతో
డిసెంబర్ లో మాకు ఎక్కువ క్రిస్మస్ సెలవులు ఉండేవి..
అలాగే డిసెంబర్ వెళ్తూ జనవరి వస్తూ తీసుకువచ్చే కొత్త సంవత్సరం అంటేనే
అందరికీ ఉత్సాహమే కదా అలాగే నాకు కూడా..
ఇంకా ఈ చలికాలానికి మాత్రమే ప్రత్యేకమైన నాకు ఇష్టమైన కొన్ని విశేషాలు..
అమ్మ చేసే సున్నిపిండితో పాటు వాడే వింటర్ కేర్ ప్రొడక్ట్స్


ఇంటి ముందు వేసే ముగ్గులు

తీర్మానాలతో ఆనందకరమైన ఆహ్వానం..

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చలికాలం అందాలను ఆస్వాదిస్తూ,చలికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ
హాయిగా ఎంజాయ్ చేద్దాం..

6, ఆగస్టు 2011, శనివారం
ఆరారుకాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు...
భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
ప్రకృతిలోని అణువణువు అందమైనదే..
ఎగిరే పక్షుల గుంపుల కిలకిలా రావాలు... ఇలా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు... ఎన్నెన్నో అద్భుతాలు...
ఎలాంటి వారినైనా పరవశింపజేసే గుణం ఒక్క ప్రకృతికే ఉంది.
ఆరు ఋతువులు,పన్నెండు నెలలు,365 రోజులు అన్నీ మనిషి సంతోషంగా జీవించటానికి భగవంతుడు
ప్రసాదించిన వరాలు ..
ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి సౌందర్యం ... లేకపోతె ప్రకృతి వైపరీత్యం

గ్రీష్మము - Summer

వర్షము - Rainy season

శిశిరము - Winter

సాగే జీవన గానం అణువణువున ఋతురాగం అంటూ ఆరు ఋతువుల ను మన జీవితంలోని అనుభవాలతో
పోల్చుతూ ఆహ్లాదంగా సాగిపోయే ఈపాట ఆరు ఋతువుల అందాలను మరింత అందంగా ఆవిష్కరిస్తుంది.
వాసంత సమీరం లా నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా
ఒక శ్రావణ మేఘం లా శరత్చంద్రికల కల లా..
హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా
కాలం.. జాలం.. లయలో కలల అలల సవ్వడి లో
కాలం.. జాలం.. లయలో కలల అలల సవ్వడి లో
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
సంగీతం : బంటి, రమేష్
సాహిత్యం : బలభద్రపాత్రుని మధు
గానం : సునీత, బంటి.
♥♥♥♥♥♥♥♥












