పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
మహిళాలోకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మహిళాలోకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2015, ఆదివారం

మహిళ – సమాజంలో ఎలా ఉండాలి - Article in Mana Telugu Times




మహిళా దినోత్సవం సందర్భంగా నేను రాసిన వ్యాసం manatelugutimes లో ప్రచురించారు.అంతమంది రచయితల మధ్యలో నా వ్యాసం చూసుకోవటం చాలా సంతోషంగా ఉంది. 
Thank You So Much Mana Telugu Times Team  
మహిళ – సమాజంలో ఎలా ఉండాలి - http://www.manatelugutimes.com/archives/1037

 "ఆడదే ఆధారం మన కధ  ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం." ఇది ఒక సినిమా పాట మాత్రమే కాదు అక్షరసత్యం కూడా. పురాణ కాలం నుండి ఇప్పటిదాకా స్త్రీ ప్రధాన పాత్ర పోషించని చరిత్రే లేదంటే  అతిశయోక్తి కాదేమో.మంచి సమాజానికి మూలం మంచి కుటుంబం అయితే  ఆ మంచి కుటుంబానికి మూలం మంచి మహిళ మాత్రమే. తల్లిగా, బిడ్డగా, తోబుట్టువుగా,భార్యగా,స్నేహితురాలిగా ఇలా ఎన్నో రూపాల్లో మగువ లేని ప్రపంచాన్ని ఊహించలేము.

ఒకప్పుడు స్త్రీని వంటింటి కుందేలుగా ఉంచేశారని,మహిళలకి తీరనిఅన్యాయం జరుగుతుందని భావించిన కొందరు అభ్యుదయ భావాలు కలిగిన సంఘ సంస్కర్తలు,మేధావులు ఎన్నో శ్రమలకోర్చి ఒకప్పటి దురాచారాలైన సతీ సహగమనం ,బాల్య వివాహాలు,కన్యాశుల్కం లాంటివి నిర్మూలించి వాటి స్థానంలో వితంతు వివాహాలు,స్త్రీ విద్య లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రోత్సహించారు,మహిళల రక్షణ కోసం తగిన చట్టాలను చేసి, స్త్రీలకు సముచిత స్థానాన్ని, గౌరవాన్ని కల్పించి ఒక గొప్ప మార్పుకు కారణమయ్యారు.కానీ ప్రస్తుత పరిస్థితులని చూస్తే ప్రతి మార్పు మంచితో పాటు చెడుకు కూడా స్థానం కల్పిస్తుంది అనిపిస్తుంది.

మా అమ్మమ్మ కాలంలో ఆడపిల్లలు పెళ్లి కాగానే,పుట్టింటి వాళ్ళు పెట్టిన పసుపు-కుంకుమ,చీరె- సారే చూసుకుని మురిసిపోయి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత కూడా , అటు పుట్టిల్లు,ఇటు మెట్టిల్లు క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళమని, పుట్టింటి ఆస్తులను ఆశించే వాళ్ళము కాదని మా అమ్మమ్మ చెప్పేది. కానీ తర్వాత కాలంలో వచ్చిన NTR's women's right on father's property(1985) కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ఎన్నో వివాదాలకి కారణమయ్యింది. అప్పటిదాకా ఇచ్చిన కట్నంతో తృప్తి పడే ఆడపిల్లలు అటు అత్తింటి వాళ్ళ ఒత్తిడివల్ల కానీ,వాళ్ళ ఇష్టపూర్వకంగా కానీ ఆస్తుల కోసం పుట్టింటి గడపను వదిలి కోర్టుల  గడపను తొక్కుతున్నారు.ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువయ్యింది.రియల్ ఎస్టేట్ పుణ్యమా అని ఊహించని రీతిలో ధరలు పెరిగిన భూముల కోసం తల్లిదండ్రుల మీద, తోడబుట్టిన సోదరుల మీద partition suit (విభజన దావా) కోసం  కోర్టులకి వస్తున్న ఆడవాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.ఆశ  ఉండొచ్చు కానీ అది దురాశ కాకూడదు కదా.. !

"సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా" మహిళ ఉండాలని, ఆమే ఆదర్శ మహిళ  అని ఒకప్పటి అభిప్రాయం కానీ ప్రస్తుతం పదిమందిని ఆదరించటమేమో కానీ ఇప్పుడు కుటుంబమంటే  భార్యా,భర్త,వాళ్ళ పిల్లలే.ఒకవేళ ఎవరైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు అంటే..  ఎంత కలిసి ఉన్నా మనసుల్లో  ఎన్నో బేధభావాలు తప్పకుండా ఉంటాయి.దేవత సినిమాలో సావిత్రిలాగా మాకు సేవలు చేయకపోయినా పర్లేదు కానీ మా మీద ఏ 498 (a )కేసో పెట్టకపోతే చాల్లే అనుకునే తల్లిదండ్రులు,అక్కచెల్లెళ్ళు,అన్నదమ్ములు ఉన్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.కేవలం ఇలాంటి కేసులకి భయపడి,దూరంగా ఉంటేనే మంచిదనుకుని గత్యంతరం లేక కన్నకొడుకుని,తోబుట్టువుల్ని వదులుకుని ఎవరికీ వారే అన్నట్లు ఒంటరిగా ఉంటున్న కుటుంబాలు  ఎన్నో..

కుటుంబ హింసకి సంబంధించి నిజంగా హింసకి గురయిన ఆడవాళ్ళు చట్టాన్ని ఆశ్రయిస్తే మంచిదే కానీ, కేవలం భర్తని బెదిరించి లొంగదీసు కోవటానికి,అతని కుటుంబ సభ్యుల మీద కక్ష తీర్చుకోవటానికి మాత్రమే చట్టాలను ఆయుధాలుగా ప్రయోగిస్తున్న స్త్రీల పుణ్యమా అని నిజంగా బాధపడుతున్న వాళ్లకి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. పంతాలు,పట్టింపుల కోసం పిల్లల్ని కూడా బలి చేయటానికి వెనుకాడని, మాత్రుత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి వాళ్ళ వలన 498 a ipc కేసులు పెట్టే వాళ్ళందరూ ఇలాగే  తప్పుడు కేసులు పెడుతున్నారనే అపోహ కలుగుతుంది.తద్వారా నిజమైన బాధితులను కూడా న్యాయవ్యవస్థ అనుమానాస్పద దృష్టితో చూడాల్సి వస్తుంది.

ఇంక అత్యాచారాలు,ప్రేమోన్మాదాలకి నేటి సమాజంలో కొదవే లేదు.ఎదుటివారి ప్రేమ,స్నేహం లో ఎంత నిజాయితీ ఉంది అనేది తెలుసుకోవాల్సిన వివేకం ప్రతి మహిళకీ అవసరం.తమ ప్రేమ నిజమైనంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా అంటే నిజాయితీగా ఉంటారనే నియమమేమీ లేదు కదా..ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళు.కానీ ఇప్పుడు అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలు కూడా ఉంటున్నారనేది నిర్వివాదాంశం.అలాగే  పరిస్థితులు ఏవైనా సరే .. పెళ్ళయ్యి, పిల్లలు ఉన్న మహిళలు కూడా ప్రేమికుడితో కలిసి ఎటో  వెళ్ళిపోతున్న కేసులు ప్రస్తుత కాలంలో నమోదు కావటం మరొక విచారించాల్సిన విషయం. మనము  ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివాళ్ళ వలన ప్రమాదం రాదని నమ్మలేని ఈ రోజుల్లో "తెలుసుకొనవె యువతీ అలా నడుచుకోనవే యువతీ" అని చెప్పే పెద్దల మాటల్ని వినటంలో తప్పులేదు కదా..!

అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారు అంటారు కదా.. అది కూడా నిజమే "తోటి ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళకి ఉండే అసూయ" గురించి చెప్పనలవి కాదేమో.స్నేహశీలిగా,అందరితో కలుపుగోలుగా ఆప్యాయంగా ఉండే మహిళలు ఉన్నట్లే  ఎవరి ముందు వాళ్లకి తగిన మాటలు మాట్లాడుతూ,ఒకరి గురించి ఇంకొకరి దగ్గర అవాకులు,చవాకులు మాట్లాడి,ఎవరి మీదైనా కోపం వచ్చిందా వాళ్ళని ఎంత ఇబ్బందులకైనా గురి చేయగల చుప్పనాతి శూర్పణఖలు కూడా ఉంటారు.ఇద్దరు ఆడవాళ్ళు ఒకచోట కలిస్తే మగవాళ్ళ గురించి మాట్లాడతారో,లేదో తెలియదు కానీ మరొక స్త్రీ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటారనేది జగద్విదితమే.. ఒకప్పుడు ఇవి ఇంటి అరుగుల దగ్గర,నీళ్ళ పంపుల దగ్గర జరిగితే, ఇప్పుడు విద్యాధికులైన మహిళలు సంచరించే నెట్ ప్రపంచం లో కూడా ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయట. ఒక మగవాడి వలన కూడా జరగనంత కీడు ఇలాంటి మహిళల వల్ల  మరో  మహిళకి జరగటం బాధాకరమైన విషయం.

ఎన్నో రంగాల్లో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సాధించి,ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహిళలున్న మన ప్రపంచంలో కేవలం క్షణికమైన కోపావేశాలు,స్వార్ధం,ఈర్ష్యా ,ద్వేషం,అసూయల మూలంగా సృష్టికి కారణ భూతమైన మహిళ ఆ సృష్టినే నాశనం చేసే ఒక భయానక భూతంగా కూడా మారిపోతుంది.సృష్టిలోని ఏ జీవి  కూడా తన సహజ లక్షణాలను వదులుకోదు.అటువంటిది ప్రేమ,దయ,జాలి,ఆప్యాయత,అనురాగం,క్షమ,సహనం ఇలా ఎన్నో మంచి గుణాలకి నెలవుగా, భగవంతుడు తనకు మారుగా సృష్టించిన స్త్రీ మాత్రం తన సహజ లక్షణాలను కోల్పోయి సమాజంలో ఎన్నో అనిశ్చిత పరిస్థితులకి దారితీసేలా ప్రవర్తిస్తుంది.

తప్పుని ఖండించాలి,చెడుని శిక్షించాలి  అలాగే అది తప్పా,ఒప్పా అన్న విచక్షణా జ్ఞానాన్ని కూడా తప్పకుండా కలిగి ఉండాలి.మంచి కోసం వచ్చిన మార్పుని మంచి కోసమే ఉపయోగించాలి.మహిళలమైన మన ద్వారా మరొక మహిళకి అన్యాయం జరిగేలా  ప్రవర్తించకూడదు..అప్పుడే ప్రతి మహిళా ఆదర్శ మహిళ అవుతుంది.మంచి అమ్మ  ద్వారా మంచి పిల్లలు,మంచి పిల్లలతో మంచి కుటుంబం,మంచి కుటుంబాలతో మంచి సమాజం తయారవుతుంది ,ఎందరో మహానుభావులు మహిళల కోసం చేసిన త్యాగాలకి ఒక అర్ధం,పరమార్ధం ఏర్పడుతుంది.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలని కించపరచటానికి ఈ వ్యాసం  రాయలేదు.అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారని నా అభిప్రాయం కాదు.ప్రస్తుతం జరుగున్న కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నా ఆలోచనలను  ఇలా  పంచుకుంటున్నాను..

ప్రేమకు, సహనానికి మరో రూపమైన ఎందరో మహిళామణులు
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 


8, మార్చి 2013, శుక్రవారం

Happy Women's Day...



మంచితనం మమకారం  మానవత్వంతో పరిమళించే సౌగంధి 
ప్రేమ ఆప్యాయతలను పంచటంలో ఎవరూ సాటిరాని మాతృమూర్తి 
నింగీ నేలా నాదే  అంటూ చైతన్యంతో, సంకల్పబలంతో 
అంతులేని ఆత్మవిశ్వాసంతో సాగుతున్న మహిళలందరికీ 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 


 ♥ Every Home, Every Heart, Every Feeling, 
Every Moment Of happiness is incomplete without you, 
Only you can complete this world
Happy Women’s Day!

25, డిసెంబర్ 2012, మంగళవారం

ఏమైపోతుంది సభ్యసమాజం ... ఏమైపోతుంది మానవ హృదయం




2012 యుగాంతం ప్రపంచం అంతా అంతమైపోతుంది.. ఇంక ఈ  భూమి మీద మనుగడ లేదు అని అందరూ భయపడ్డారు.కొందరు బాధ పడ్డారు.కొంతమంది చూద్దాంలే అంత  తేలికగా యుగాంతం అవుతుందా అనుకున్నారు.కొందరు ఉంటే  ఎంత పొతే ఎంతలే అని వేదాంతం చెప్పారు.కానీ ప్రస్తుత సమాజాన్ని,పరిస్థితులను చూస్తుంటే నాకనిపిస్తుంది 2012 యుగాంతం మనుషులకా? మనుషుల్లోని మానవత్వానికా ??  అని..

ఆడవాళ్ళ మీద అత్యాచారాలు,హత్యలు,ప్రేమోన్మాదుల దాడులు
భార్యను బయటికి గెంటేస్తున్న భర్తలు, భర్త ఇంటిముందు  భార్యల మౌన దీక్షలు.

భార్య మీద అనుమానంతో పిల్లలకు DNA టెస్టులు చేయించమనే తండ్రులు
భర్త మీద కోపంతో క్షణికావేశంలో కడుపున పెట్టుకుని కాపాడాల్సిన పిల్లలను  కడతేర్చే మాతృమూర్తులు

కీచకావతారం ఎత్తుతున్న గురుదేవులు
బడిలో బాలికకూ,విశ్వవిద్యాలయంలో మహిళలకు తప్పని లైంగిక వేధింపులు

బతికుండగానే కన్నతల్లిదండ్రులను స్మశానానికి చేరుస్తున్న సుపుత్రులు,పుత్రికలు
తమ కడుపున పుట్టిన పిల్లలే తమని వేధిస్తున్నారంటూ కాపాడమని HRC ని ఆశ్రయిస్తున్న పండుటాకులు.

ప్రజారక్షణే మీ కర్తవ్యం  కదా మమ్మల్నిరక్షించమని  వచ్చిన మహిళను కోరిక తీర్చమనే రక్షక భటులు
తన కింద పనిచేసే మహిళా ఉద్యోగితో అక్రమసంబంధం పెట్టుకుని ఆమెను వంచించే న్యాయమూర్తులు.

ఇలాంటివన్నీ గత కొన్ని సంవత్సరాలుగా " FIR " " CRIME REPORT " అంటూ టీవీల్లో యాంకర్లు
మహా సీరియస్ గా వీటి గురించి చెప్తూ ఉంటారు...వాటిని చూస్తూ,వింటూ ఇదేముందిలే ఇలాంటివి రోజూ జరుగుతూనే వున్నాయి అనుకోవటం,వాటిలో నిజానిజాలు ఎంత? ఎవరిది తప్పు ? అని మనమే నిర్ణయించేసుకోవటం కాసేపటి తర్వాత ఆ విషయాలు మర్చిపోవటం.. వదిలేయటం.. ఇలా మనమందరం ఈ దారుణాలను,అమానుష సంఘటనలను సమాజంలో భాగంగా చాలా తేలికగా తీసుకునే స్థాయికి వచ్చాము...

ఇలాంటి సమయంలో రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన  ఇంతకుముందు కేసుల్లాగానే  విచారణ,పరిష్కారం అంటూ సంవత్సరాలు పడుతుందిలే  అనుకున్నాము.. కానీ ఈ అత్యాచారం విషయంలో ప్రజల్లో,మహిళా సంఘాల్లో,ముఖ్యంగా యువతరంలో కలిగిన స్పందన అనూహ్యం, ప్రశంసనీయం. వారిలో చెలరేగిన ఆవేశం,దోషులకు ఉరిశిక్షపడాలనే ఆవేదన ప్రభుత్వాన్ని,పాలకులను  ఆలోచనలో పడేలా చేసింది.వీరి దీక్షకు మధ్యవయస్కులు, సాదారణ పౌరులు కూడా మద్దతు పలకటం సమాజంలో మిగిలి ఉన్న మానవత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా హింసాత్మక చర్యలకు కూడా ప్రభుత్వం వెనుకంజ వేయకపోవటం శోచనీయం...

అమ్మాయిల మీద దాడులు జరిగినప్పుడు అసలు అమ్మాయిల వస్త్రధారణ సరిగా లేదు అందుకే
మగవాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు అంటాడు ఒక అధికారి.

అసలు ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరిగే సాతంత్ర్యం,హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తాడు  మరో నాయకుడు ..

 అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో తిరిగే ఆడపిల్లలు ఇలాంటివి జరుగుతాయని తెలియదా అంటారు పెద్దవాళ్ళు.

అసలు ఆడవాళ్ళదే  తప్పు ఎక్కడ ఎలా ఉండాలి?ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? అని తెలుసుకోవాలి అంటారు సాంప్రదాయవాదులు.( ఇది కొంతవరకు నిజమే)

చట్టం,న్యాయం తన పని తాను  చేసుకుపోతుంది అంటారు మేధావులు..

సరే వీళ్ళ మాటలే నిజమని ఒప్పుకుంటే  సినిమాలు,సినిమాల్లో చెడుని చూసి పెడత్రోవ పట్టే యువత
అంత తేలికగా సినిమాలను చూసి ప్రభావితం అయ్యేటట్లయితే సినిమాల్లో మంచిని చూసి నేర్చుకోవచ్చు
కదా  మంచి వస్త్రధారణ,ప్రవర్తన ఉన్న మహిళల మీద దాడులు జరగట్లేదా?బయట తిరిగే స్వాతంత్ర్యం
లేకపోతె పోనీ ఆఫీసుల్లో స్వేచ్చగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయా??కార్యాలయాల్లో,కాలేజీల్లో ప్రయాణాల్లో,కనీసం ఇంట్లో  ఇలా ఇంకెన్నో చోట్ల చెప్పుకోలేని ఇబ్బందులకు గురయ్యి మౌనంగా బాధపడే
మహిళలు ఎందరో  లేరా?

వీటన్నిటికీ కారణం నేరస్తుల్లో చట్టం,న్యాయం మమ్మల్ని ఏమి చేస్తాయిలే అన్న తెగింపు, ఎన్ని తప్పులు
చేసినా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకో గలము అనే లెక్కలేనితనం..దీనికి పరిష్కారం లైంగిక నేరాల చట్టాలను సవరించి, మరింత పటిష్టం చేయటం,ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి వేగవంతంగా విచారణ పూర్తి  చేయటం,ప్రలోభాలకు లొంగకుండా తీర్పును వెలువరించి,శిక్షను అమలుచేయటం ప్రస్తుత కర్తవ్యం. .అని అందరి అభిప్రాయం .

 అలాగే ప్రభుత్వం, పాలకులు మహిళలలోని లోపాలను ఎత్తిచూపి మీ వల్లనే ఇలా జరుగుతున్నాయంటూ
తప్పును ఆపాదించి,నిందించకుండా మీ ప్రయత్నం లో భాగంగా సరైన శాసనాలను,చట్టాలను చెయ్యాలి.
మహిళలకు రక్షణ కల్పించాలి..ఆపదలో ఉన్నామని ఆశ్రయించిన వాళ్లకు సత్వర సహాయం అందించే రక్షణ యంత్రాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. మనుషుల్లో సాటి మనిషిని మనిషిగా గౌరవించే  సహృదయం,మానవత్వం, నైతికవిలువలు, మంచి.చెడుల విచక్షణా జ్ఞానం పెంపొందాలి.

ఈ సమస్య తీరిపోతే ఇంకే సమస్య రాదన్న నమ్మకం లేకపోయినా, ఉరిశిక్ష,లేక ఇంకే కఠిన శిక్ష పడితేనో
ఇంకో నేరస్తుడెవడూ ఇలాంటి నేరం చేయడన్న నమ్మకం లేకపోయినా మంచి మనస్సుల్లో  మొదలైన
ఈ ఉద్యమం రాజకీయరంగు పులుముకోకుండా  అనుకున్న లక్ష్యం సాధించాలని కోరుకుంటూ,
సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు  మళ్ళీ జరగకూడదని,  తాను ఎలాంటి తప్పు
చేయకపోయినా  దారుణమైన శిక్ష అనుభవిస్తున్న బాధితురాలికి సరైన న్యాయం జరగాలని
సాటి మనుషులుగా ఆకాంక్షించటం మానవత్వం  ఉన్న ప్రతి  మనిషి  కర్తవ్యం...




15, మే 2012, మంగళవారం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం...


"వెలుగు పధకం" మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు ప్రవేశ పెట్టిన పధకం. ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద,పేద మహిళలను లక్షాధికారుల్ని చేయటం.. మహిళలను స్వయం సహాయక సంఘాలుగా, "సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (SHG)" గా ఏర్పాటు చేసి,వాళ్లతో డబ్బులు పొదుపు చేయించి,కొంత బాంక్ ల ద్వారా అప్పు ఇప్పించి ఆ డబ్బుతో మహిళలకు స్వయం ఉపాధి కల్పించటం ఈ పధకం లక్ష్యం. దీని కోసం జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి దాకా సిబ్బందిని నియమించి వాళ్ళ ద్వారా ఈ పధకాన్ని అమలు చేసే వాళ్ళు..కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పధకం పేరు "ఇందిరా క్రాంతి పధం" గా మార్చారు.

ఇప్పుడు ఇంతకీ ఈ "వెలుగు పధకం" గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ప్రత్యేకతలు వున్నాయి...
మహిళలను మోటివేట్ చేస్తూ,వాళ్ళు సాధికారత సాధించేలా ప్రోత్సహించే పనిలో భాగం గా వాళ్లకి కొన్ని trainings నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ క్లాసెస్ లో మొదటిది వాళ్లకు ఒక ప్రార్ధనా గీతం వుంటుంది. ఆ పాటను ఈ ప్రాజెక్ట్ CEO స్వయంగా రచించి,రూపకల్పన చేశారట. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు ఎంతవరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించారో, ఎంతమంది మహిళలు లక్షాధికారులు అయ్యారో తెలియదు కానీ... నాకు మాత్రం "వెలుగు ప్రార్ధనాగీతం "గా వాళ్ళు పిలుచుకునే ఇన్స్పిరేషన్ సాంగ్ చాలా నచ్చింది..

ఈ పాట నాకు ఈ వెలుగు ప్రాజెక్ట్ లో APM గా వర్క్ చేస్తున్న నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది..
నా చిన్ని ప్రపంచం లో "ఇన్స్పిరేషన్ సాంగ్స్ కలెక్షన్" లో యాడ్ చేయాలనిపించింది..


జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం
జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

గగనమెంత వురిమినా గిరికి చలనముండునా
గంగ పొంగిపొరలినా నేల భీతి చెందునా
ఆత్మబలం కూడగట్టి ... ఆకశాన్ని వంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా
చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా
ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

పేదరికం కసిరినా పెనుచీకటి ముసిరినా
వేలజనం మేలుకుంటే వేకువ రాకుండునా
అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం



30, ఏప్రిల్ 2012, సోమవారం

కన్నె అందమా ... కనకమందమా...??


మా ఆయన బంగారం,మా బాబు బంగారు కొండ,ఆ అమ్మాయి పుత్తడి బొమ్మ అంటూ మంచి వాటిని పోలిక పెట్టటానికి బంగారమే వాడుతుంటాము.బంగారం మీద మోజు పడని వాళ్ళు,కావాలని కోరుకోని వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి..
బంగారం లేనిదే కుటుంబాల్లో శుభకార్యాలు జరగవు.అమ్మాయి పెళ్లి లో ప్రముఖ పాత్ర పోషించేది బంగారమే... ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటారు.అలాగే డబ్బు తర్వాత స్థానం మాత్రం ఈ బంగారానిదే..ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందన్న ఆర్ధికశాస్త్ర ప్రాధమిక సూత్రం కూడా ఈ బంగారం మోజు ముందు చిన్నబోతుంది.

వందేళ్ళ క్రితం బంగారం రూపాయి నలభై పైసలట. మన ఇళ్ళల్లో తాతయ్యలో, బామ్మలో మా రోజుల్లో తులం బంగారం ముప్ఫై రూపాయలు అంటే వినటానికి తమాషాగా ఉంటుంది, అలాగే ఆరోజుల్లోఎక్కువ బంగారం ఎందుకు కొనలేదో వీళ్ళు అని కొంచెం బాధగా కూడా అన్పిస్తుందేమో కానీ... 1925 లో తులం బంగారం ధర 18 రూపాయలు మరి ఇప్పుడు బంగారం ధర 30,000 అవుతున్నా ధరతో సంబంధం లేకుండా కోనేస్తున్నాం.. రేటులో ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా కొనాలన్న ఆలోచన మాత్రం మానుకోము. అందాలకి,అలంకరణలకి మాత్రమే కాదు ఆపదలో కూడా ఆదుకునే ఈ బంగారం ధర ఇప్పుడు చుక్కల్లోనే అయినా బంగారం స్థానం మాత్రం మన మనసుల్లోనే..ఎందుకంటే అది బంగారం కదా మరి.

బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ,ఆభరణాలు పెట్టుకోవాలని కోరుకోని ఆడవాళ్ళు వుండరు కదా..అలాగే నాకు కూడా చాలా ఇష్టమైనది బంగారం.బంగారం నగల యాడ్స్, నగల మోడల్స్ పిక్చర్స్ సేకరించటం ఇష్టం .. ఒకప్పుడు నగల మోడల్స్ ఫొటోస్ ఒక పెద్ద ఆల్బం నిండా కలెక్ట్ చేసేదాన్ని .. ఇప్పుడు నెట్ లో కలెక్ట్ చేస్తున్నాను.
అలా నెట్ లో ఈ అందమైన అపరంజి బొమ్మలని చూడగానే ఈ పోస్ట్ పెట్టాలనిపించింది ...


శ్రేయా
ఘోషల్ పిక్చర్ By:వనజవనమాలి గారు..
థాంక్యూ "వనజవనమాలి" గారూ!!


Gold As Pure As Music





27, మార్చి 2012, మంగళవారం

వివాహ చట్టాల సవరణ బిల్లు,2010 - వివాదాలు ...!


THE MARRIAGE LAWS (AMENDMENT) BILL, 2010
A BILL further to amend the Hindu Marriage Act,
1955 and the Special Marriage Act, 1954.

గత కొంత కాలంగా టీవీల్లో, పేపర్లలో,అలాగే మన బ్లాగుల్లో కూడా తీవ్రమైన చర్చ
జరుగుతూన్న అంశం ఈ వివాహ చట్టానికి జరిగిన సవరణలు.
ఈ సవరణల ద్వారా ఇకనుండి విడాకులు పొందటం సులభం అవుతుంది.

సవరణలోని ముఖ్యాంశాలు:

1.భర్త తో వైవాహిక సంబంధాలు సరిదిద్దలేనంతగా పాడయ్యాయి
"on the ground that the marriage has broken down irretrievably.
"
అనే కారణంతో భార్య విడాకుల కోసం కోర్టును కోరవచ్చు..
కానీ ఇదే కారణంతో భర్త విడాకులు కోరలేడు.
అంతే కాకుండా వేచి ఉండే కాలం పేరుతో విడాకుల కోసం ఏళ్లతరబడి
కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కానీ ఈ వేచి ఉండే కాలం ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

2.విడిపోయాక భర్త నుండి కేవలం భరణం తో సరిపెట్టుకుంటున్న స్త్రీలు ఇక నుండి
"వివాహానంతరం" భర్త సంపాదించిన ఆస్తిలో వాటా కోరవచ్చు..
కానీ ఆ వాటా ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

3.దంపతులు విడిపోతే వాళ్ళ దత్త సంతానానికి కూడా కన్న బిడ్డలతో
సమానంగా
అన్ని హక్కులూ లభిస్తాయి.

ఇవీ వివాహ చట్టానికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఆమోదించిన సవరణలు.

ఇంక చట్టం అమలులోకి వచ్చి అది ఎలా మన వివాహవ్యవస్థ మీద ప్రభావం చూపుతుందో
తెలియక ముందే దీని మీద చాలా చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఈ చట్టాన్ని పురుషులు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఎక్కడ భార్యలకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అని చాలా బాధపడుతున్నారు.

కొంతమంది మగవారు పెళ్ళిళ్ళు చేసుకోవటం కూడా మానుకుంటారట కూడా..
ఎందుకంటే ఇక ఇప్పటి నుండి ఆడవాళ్ళుభర్త ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటారు,
విడాకుల తర్వాత రాబోయే ఆస్తి కోసం అని.

కొంతమంది భర్తలు,భర్త తరపు వారు ఆడపిల్లల్ని అనే మాట మా ఆస్తికి ఆశపడి
నువ్వు మా వాడిని పెళ్లి చేసుకున్నావు అని..
మరి అలాంటప్పుడు అబ్బాయిలు కూడా సంబంధాలు చూసేటప్పుడు మామగారు
ఇచ్చేకట్నంతో పాటూ,అమ్మాయి ఎంత చదువుకుంది,ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తుంది??
ఇలాంటివన్నీ చూసే కదా పెళ్లి చేసుకుంటారు.
అంటే అప్పుడు మగవారు భార్య నుండి వచ్చే డబ్బుకి ఆశపడినట్లు కాదా??

ఆడపిల్ల కట్నం తేవాలి,మనకి అనుగుణంగా,అనుకూలంగా ఉండాలి అని మగవారు
కోరుకున్నట్లే ... అల్లుడు మంచి ఆస్తిపరులై ఉండాలి,భర్త మంచి హోదాలో ఉండాలి
అని అమ్మాయిలూ కోరుకుంటారు.అందుకే అడిగినంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు.

ఈ రోజుల్లో డబ్బుకి,ఆస్తులకి ఆశ పడని మనుషులే లేరు.. ఒక భార్యే కాదు..
తల్లిదండ్రులు,అక్క చెల్లెళ్ళు,అన్నాదమ్ములు,కొడుకులు,కూతుర్లు కూడా
ఆస్తుల్లో వాటా కోసం కోర్టుని ఆశ్రయిస్తూనే ఉన్నారు.
మన రక్తం పంచుకుని పుట్టి,మనతో కలిసి పెరిగిన తోబుట్టువులు,తల్లి దండ్రులే ఆస్తుల కోసం
కోర్టుకి వెళ్లి, బెదిరించి, వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుతున్నప్పుడు భర్త నిరాదరణకు గురైన భార్య
విడాకులు తీసుకునే సమయం లోఆ హక్కును కోరుకుంటే తప్పేంటి ??
కాబట్టి విడాకులు తీసుకునే సమయం లో భార్య భర్త ఆస్తిలో వాటా అడగవచ్చు
అంతమాత్రాన అది డబ్బుకి ఆశ పడినట్లు కాదు.

ఇంతకీ భార్య విడాకులు కోరగానే విడాకులు ఇవ్వటం,ఆస్తిలో వాటా కోరగానే ఇవ్వటం
ఇవన్నీ ప్రస్తుతానికి కాగితం మీద రాతలు మాత్రమే!
నిజంగా ఇలాంటి రిలీఫ్ కోరి ఎవరైనా స్త్రీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఉంటుంది అసలు కధ
"విడాకుల కోసం వేచి ఉండే సమయం", అలాగే భర్త ఆస్తిలో వాటా ఎంత ఇవ్వాలి అనేది జడ్జ్
యొక్క "Court's discretionary powers" "విచక్షణా అధికారానికే" ప్రస్తుతం వదిలేశారు.
కాబట్టి మన లాయర్లు కొందరికి ఈ అవకాశం చాలు జడ్జ్ ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి
అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.,

అలాగే భర్తలు కూడా భార్య అడగ్గానే వాటా ఇచ్చేంత అమాయకులేమీ కాదు ..
సంపాదించిన ఆస్తిని ఎవరో ఒకరి పేరున బినామీగా అయినా పెడతారు కానీ భార్యాపిల్లలకు
ఇవ్వటానికి ఇష్టపడరు కొందరు..

ఇంకా తెలివి మీరిన లాయర్లు ఉంటే నాకు పిచ్చి,నేనేమీ పని చేయను అని చెప్పెయ్యండి..
మీ వాళ్ళు అప్పుడు మీకోసం ఒక మెంటల్ సర్టిఫికేట్ తెస్తారు..
ఇంక మీరు,మీ వాళ్ళు సేఫ్ అప్పుడు..మిమ్మల్నేమీ చేయలేక మీ భార్య నోరు మూసుకుని
వెళ్ళిపోతుంది అని ఇలాంటి చావు తెలివితేటలు ఉపయోగించి సలహాలు కూడా ఇస్తున్నారు.

కాబట్టి మగవాళ్ళూ ... మీరేమీ భయపడకండి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్లాగా
మీరేమీ నష్టపోకుండా బయటపడే సూచనలు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉంటారు.

ఇంక కొందరి బాధ విడాకులు తీసుకోవటం వలన మన భారత దేశ సంస్కృతికి మాయని మచ్చ
పడుతుంది అని.
మన భారత సంస్కృతిలో ఇంతకుముందు లేని విపరీతాలు ఎన్నో ఇప్పుడు జరుగుతున్నాయి.
ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ హోమ్స్! ఒకప్పుడు తల్లిదండ్రులను దైవంలాగా పూజించే వాళ్ళు ..
వాళ్ళు చనిపోయే దాకా కొడుకుల దగ్గరే ఉండటం ఒకప్పటి మన సాంప్రదాయం..
మరి ఇప్పడు వీధి వీధికి ఒక ఓల్డ్ ఏజ్ హూమ్ ఎందుకు వస్తున్నాయి.ఇది కూడా భార్య కారణంగానే
అనే వాళ్ళు లేకపోలేదు..కానీ ఎంత మంది కొడుకులు పెళ్ళికి ముందే తల్లిదండ్రులను ఒంటరిగా
వదిలేసి
ఇతర దేశాలకి వెళ్ళటం లేదు??

కాబట్టి విడాకులు ఒక్కటే మన సంస్కృతికి మాయని మచ్చ కాదు..దీన్ని మించిన ఘోరాలు
ఎన్నో ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఎన్నో చట్టాలు మన దేశంలో దుర్వినియోగం అవుతుండగా దీన్ని గురించే ఇంత చర్చ ఎందుకంటే
ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమస్య కాబట్టి.సొంత ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి.

అలాగని విడాకులు ప్రోత్సహించమని నా ఉద్దేశ్యం కాదు ..
ఏ ఆడవాళ్ళైనా విడాకులు తీసుకోవాలని,పెళ్ళికి ముందే విడాకులు తర్వాత రాబోయే
భర్త ఆస్తి కోసం ఆశపడి,ప్లాన్స్ వేసుకుని పెళ్లి చేసుకునే స్థాయికి దిగజారతారని నేను అనుకోను.

అలాగే చిన్న చిన్న కారణాలకే విడాకులకి వెళ్ళే ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఉండరు
అని నా అభిప్రాయం.. విడాకులు కోరగానే ఇచ్చేస్తున్నారు కదా అని ఆడవాళ్ళందరూ
వాటి కోసం పరిగెత్తి వెళ్లి తెచ్చుకోవటానికి అవేమీ డిస్కౌంట్ లో ఇచ్చే చీరలు కాదు కదా!
చట్టాలని దుర్వినియోగం చేసే వాళ్ళు లేరని కాదు..అలాగని అందరూ చట్టాన్ని
దుర్వినియోగం చేస్తున్నారని అపోహ పడటం తప్పు.

ప్రతి ఒక్క మనిషికీ తెలుసు సమాజం నిర్ణయించిన కొన్ని హద్దుల్ని దాటితే ఎలాంటి పరిస్థితులను
ఎదుర్కోవాల్సి వస్తుందో అని! కాబట్టి .. ఏ మనిషీ కూడా చూస్తూ చూస్తూ బాగున్న పరిస్థితులను
చెడ గొట్టుకోలేరు. అలాగే విరిగిన మనసులు ఎప్పటికీ కలవవు... సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు
కాదు ఒక్కసారి విభేదాలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత, ఎంత ప్రయత్నించినా,
ఎన్నాళ్ళు వేచి ఉన్నా ఫలితం ఉండకపోవచ్చు.

ఏది ఏమైనా ఎవరి అభిప్రాయాలు వారివి...అలాగే ఎవరి నిర్ణయాలు వారివి..
నా మనసుకు అనిపించింది నేను చెప్పాను.ఎవరినో ఒక్కరినే నేను సపోర్ట్ చేయటం లేదు.
తప్పు అందరిలోనూ ఉంటుంది. కాకపొతే దాన్ని సరిదిద్దుకునే విధానమే మనిషి మనిషికీ మారుతుంది.


8, మార్చి 2012, గురువారం

Happy Women's Day ...!



శ్రీకారం చుడుతున్నట్లు..కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చుస్తున్నాయే..మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్లు
రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టుదాకుందే బంగరు బొమ్మ

నక్షత్రాలెన్నంటూ..లెక్కెడితే ఏమయినట్లు
నీ మనసుకు రెక్కలు కట్టు.. చుక్కల్లో విహరించేట్లు
ఎక్కడ నా వెలుగంటూ.. ఎప్పుడు
ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ.. నిద్దురనే వెలి వేయొద్దు

వేకువనే
లాక్కొచ్చేట్లు .. వెన్నెలనే దారం కట్టు
ఇదిగో
వచ్చానంటూ.. తక్షణమే హాజరయేట్టు
నళినివో ... హరిణివో ... తరుణీవో... మురిపించే ముద్దుల గుమ్మ..











http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html


1, ఆగస్టు 2011, సోమవారం

క్షమయా ధరిత్రి ???

ఈరోజు సాక్షి ఫ్యామిలీ పేపర్ గొప్ప వ్యక్తితాలు కలిగిన మహిళలను పరిచయం చేసింది..
తనను ప్రేమించలేదన్న కారణంతో యాసిడ్ దాడి చేసిన ఒక మృగాన్ని క్షమించిన "అమీనా బెహ్రామి"
సమాజ సేవకోసం తననగలను తాకట్టు పెట్టి మెగసెసే అవార్డు గ్రహీత అయిన "నీలిమా మిశ్రా "
చిరకాల శత్రుత్వం వున్న రెండు దేశాల మధ్య స్నేహసంబంధాల కోసం తన బాధ్యతను నెరవేర్చటానికి
వచ్చిన పాక్ విదేశాంగ మంత్రి "హీనా రబ్బానీ ఖర్ "

మహిళల సహజ గుణాలైన క్షమ,త్యాగం,ప్రతిభా పాటవాలకు నిజమైన ఉదాహరణలు మహిళలు..





3, జూన్ 2011, శుక్రవారం

జీవితం -- సప్తవర్ణ శోభితం


ఇంద్రధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలూ
నింగీ నేలా అద్భుతం..నీరు గాలి అద్భుతం
స్వరాలూ ఏడు సముద్రాలేడు
వెంకన్నవుండే కొండలు ఏడు
పెళ్ళిలో వేసే అడుగులు డు

మనిషి
జీవితంలో ఏడు సంఖ్యకి చాలా ప్రాధాన్యం వుంది..
ప్రకృతిలోని అందాలు...మనసుని ఆహ్లాదపరిచే సంగీతం..
కలియుగ దైవం నెలవైన ఏడు కొండలు...జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళిలో వేసే ఏడు అడుగులు
ఇవన్నీ ఏడు నెంబర్ ని మన జీవితంతో విడదీయలేని అనుబంధాన్ని గురించి తెలియచేస్తుంది..

అలాగే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నగలు..జాతక ప్రభావాన్ని నిర్ణయించే గ్రహాలకి
సంబంధించిన ఏడువారాల నగలకి కూడా ఎంతో ప్రాధాన్యత వుంది..
అప్పట్లో ధనవంతులకి తప్పకుండా ఈ నగలు ఉండేవట.
ఇప్పుడు అందరు జాతకాలు చూపించుకుని అవసరానికి తగినట్లుగా ఈ నగలను చేయించుకుంటున్నారు..
పెద్ద పెద్ద నగలు రోజు పెట్టుకోకపోయినా చిన్న చెవిదిద్దులుగా గా కూడా రోజుకో రత్నం పెట్టుకుంటే మంచిదట...

"ఏడువారాల నగలు"

కెంపు





ముత్యము



పగడము



మరకతం



పుష్యరాగము



వజ్రము



నీలం




Related Posts Plugin for WordPress, Blogger...