పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, అక్టోబర్ 2015, శుక్రవారం

కౌశికుడు -- కొంగ శాపం
కొంతమందికి తమ శక్తుల మీద,తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉంటుంది.ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అది మితిమీరి అహంకారం కాకూడదు.నేనే ఈ లోకంలో మంచివాడిని,లేదా గొప్పవాడిని అనుకుని,తమ శక్తి సామర్ధ్యాలతో  ఎదుటివాళ్ళని నాశనం చేయగలం అనుకునే మనుషులకి పరాభవం తప్పదు.. చిన్నప్పుడు మా అమ్మమ్మ ప్రతి విషయానికి తనకి తెలిసిన పురాణాలు,అప్పటిరోజుల్లో సామెతలు ఉదాహరణలుగా కలిపి చెప్తూ ఉండేది.అహంకారుల గురించి,తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకునే వాళ్ళ గురించి మా అమ్మమ్మ చెప్పిన ఒక కధ..  ఎవరైనా కోపంగా తిట్టటమో,శాపనార్ధాలు పెట్టటమో చేస్తే నేనేమీ అడవిలో కొంగని కాదు నీ శాపాలకి మాడిపోవటానికి అంటుంటారు.అలా కొంగ జపం లాగానే ఈ కొంగ శాపం కధ కూడా ఫేమస్ అన్నమాట. 

పూర్వం ఒక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు అడవిలో చెట్టునీడన కూర్చుని తపస్సు చేస్తున్నాడు.ఇంతలో చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుకున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” - వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అన్న సూక్తిని మరచి, ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు.అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ అక్కడికక్కడే క్రిందపడి చనిపోయింది.

తన తపశ్శక్తి కి తానే  ఆశర్యపోయిన కౌశికుడు మితిమీరిన గర్వంతో ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు.ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి కౌశికుడిని చూసి భిక్ష తెస్తాను వేచి ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి రాలేదు.ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చి,తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పి “స్వామీ!మిమ్మల్ని చాలా సేపు ఎదురుచూసేలా చేశాను నన్ను క్షమించండి”  అన్నది. 

కౌశికుడు మండిపడ్డాడు.“ఇది క్షమించరాని నేరం” నాలాంటి తపశ్శక్తి సంపన్నుడిని ఇలా అవమానిస్తావా?నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా?నా శక్తి ఏమిటో నీకు తెలియదు అంటూ ఆమె వైపు కోపంగా చూశాడు.ఆమె కొంగలా మాడిపోలేదు.నేను కోపంగా చూసినా ఎంతకీ ఆమె కొంగలా మలమల మాడిపోలేదే అనుకుంటున్న కౌశికుడిని చూస్తూ ... ఆ ఇల్లాలు అన్నది “స్వామీ! అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. అయినా నేను అడవిలో కొంగను కాను మీ తీక్షణ  దృష్టికి మాడిపోవటానికి”. ఆమె అలా అనగానే కౌశికుడు దిగ్భ్రాంతి చెందాడు. ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయి,ఆమె పతివ్రతా శక్తిని చూచి నివ్వెర పోయాడు. 

అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు.మీరు తపశ్శక్తి సంపన్నులే కానీ మీ తపశ్శక్తిని నిష్కామ హృదయంతో ధర్మం కోసం కాకుండా  క్షణికమైన ఆవేశంలో మీ స్వార్ధానికి ఉపయోగించి,అల్పజీవిమీద మీ ప్రతాపం చూపారు.మీరెక్కడో అడవిలో కొంగని శపించటం నాకెలా తెలిసిందంటే ఎవరైతే స్వధర్మాన్ని పాటిస్తూ,ఎవరు చేయాల్సిన పనులను వారు సక్రమంగా,సద్భుద్ధితో నిర్వర్తిస్తారో వారు వేదాంత తత్త్వజ్ఞానంతో,అధ్యయనంతో, తపస్సుతో, పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని పొందగలరు అలాగే నేను కూడా.. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః - ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు కదా. అని చెప్పింది.

ఇదీ కౌశికుడి కధ.. దేవుడికి ఒకరోజు ఉపవాసం ఉండి పూజ చేసి,ఏదైనా మనం అనుకున్న పని కాగానే ఆహా నేను ఏది అడిగితే అది దేవుడు చేసేస్తాడు,నా శక్తికి నా శత్రువులు భయపడిపోవాలి,నాకే దేవుడున్నాడు అనుకుని భస్మాసురుడిలాగా భగవంతుడు ఇచ్చిన వరాన్ని ఇతరుల నాశనం కోసం ఉపయోగించే వాళ్ళు ఆరోజుల్లోనే కాదు ఇప్పడూ ఉన్నారు.ఎప్పటికీ ఉంటారు కూడా.ఎంత జ్ఞానం ఉన్నా,తపశ్శక్తి సంపన్నులైనా ధర్మో రక్షతి రక్షితః అని చాటిచెప్పి,తమ శక్తిని,జ్ఞానాన్ని సమాజాన్ని ఉద్ధరించటానికి నిస్వార్ధంగా ఉపయోగించిన ఎందరో మహానుభావులను గుర్తుచేసుకుంటే అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత గుర్తొస్తుంది.  27, అక్టోబర్ 2015, మంగళవారం

  అమరావతి నగర శంకుస్థాపన - వింతలూ .. విశేషాలు  మా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన 22 - 10 - 2015 దసరా పండగ రోజున అంగరంగ వైభవంగా  అతిర‌థ మ‌హార‌థుల మ‌ద్య సందడిగా జ‌రిగింది.. శంకుస్థాపన విశేషాలు,విషయాలు అన్నిటి గురించి ఎప్పటికప్పుడు మీడియా అందరికీ తెలియచేస్తూనే ఉంది కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీలేదు.ఈ కార్యక్రమం గురించి ఎప్పటి లాగానే కొందరు వ్యతిరేకంగా మాట్లాడితే కొందరు సానుకూలంగా స్పందించటం,అందరికీ మంచి జరగాలని కోరుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈవెంట్ మేనేజర్ గా ok అనిపించుకున్నారు కానీ పాలకుడిగా ఇంత ఘనకార్యాన్ని (రాజధాని నిర్మాణం) ఎలా సాధిస్తారో చూద్దామని కొందరంటే .. తెలివి ఉండాలే కానీ ఇటుకలు అమ్మి కూడా (My Brick My Amaravati) కోట్లు సంపాదించగలం అని ముఖ్యమంత్రి నిరూపిస్తున్నారు అని కొందరు,మోడీగారు ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే మట్టి,యమునా నది నీళ్ళతో సరిపెట్టారని మరికొందరంటున్నారు.ఏదేమైనా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని త్వరగా నిర్మాణం కావాలని,అంతా మంచి జరగాలని కోరుకుందాము.

   

   

  ప్రముఖ శిల్పి రాజీవ్ సేథీ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మించే చారిత్రక స్థూపం వద్ద నిక్షిప్తంచేసి ప్రజల ఆశలను,ఆకాంక్షలను,భావోద్వేగాలనుసజీవం చేయాలన్న ఆలోచనతో ప్రతిగ్రామంలోని పవిత్ర ప్రదేశాలనుండి సేకరించిన మట్టి,నీరుతో నిర్మించిన స్థూపం.

   

  అమరావతి సంకల్పజ్యోతి 

   

  శంకుస్థాపన సభలో ప్రధాన ఆకర్షణ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.స్వ‌యంగా అమరావ‌తికి ర‌మ్మంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేసీఆర్ ను ఆహ్వానించారు.ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలతో ద్వేషాన్ని మాటల్లోనే  వెళ్ళగక్కే ఈ నాయకులు ఇలా కలిసిపోవటం ?? రాజకీయాల్లో మామూలే కానీ శంకుస్థాపన సభకు వచ్చిన సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా చేతులు ఊపుతూ అభివాదం చేయటం మాత్రం అందరికీ కొంచెం ప్రత్యేకంగానే అనిపించింది.చిన్నప్పుడు మా స్కూల్ లో ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు మా టీచర్స్  ముందుగానే "వచ్చిన అతిధి మాట్లాడటం అయిపోగానే వాళ్ళేమి మాట్లాడారో మీకు అర్ధం అయినా కాకపోయినా గట్టిగా చప్పట్లు కొట్టండి అప్పుడే వచ్చిన అతిధుల్ని మనం గౌరవించినట్లు అని " చెప్పేవాళ్ళు. ఇక్కడ కూడా అలాగే ఏమైనా జరిగిందా లేక ఆంధ్రాప్రజలే స్వచ్చందంగా, సంతోషిస్తూ కేసీఆర్ కోసం హర్షధ్వానాలు చేశారా?? అని ఒక చిన్న డౌటు కూడా వచ్చింది.

  అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి కోసం అవసరమై అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ అనటం సంతోషించదగిన పరిణామం.కానీ తెలంగాణా ముఖ్యమంత్రి గారూ..  మీరు సహాయం చేసినా, చెయ్యకపోయినా పర్లేదు కానీ "బతుకమ్మ,, బోనాలు పండగలు ఘనంగా చేసుకుంటూ ఆ అమ్మవారి ముందు బాగా నిష్టగా పూజలు చేసి,మమ్మల్ని ఇప్పటిదాకా ఆంద్రోళ్ళు నీపూజల్ని చెయ్యనియ్యలేదమ్మా ,మమ్మల్ని మా భక్తిని ఎగతాళి చేశారమ్మా, ఇప్పుడు మేమొచ్చాకే నీ పూజలు జరిపిస్తున్నాం..వాళ్ళని నువ్వే చూసుకో తల్లీ అని ఆంధ్రా వాళ్ళమీద అమ్మవారికి కంప్లైంట్లు చేయొద్దని కొంచెం మీ రాష్ట్ర మహిళలకు చెప్పండి ప్లీజ్ ..తెలంగాణా మగవారి కంటే ఆడవారికే ఆంధ్రామీద,ఆంధ్ర రాష్ట్ర ప్రజలమీద ఆగ్రహావేశాలు,ఆంధ్రోళ్ళు  తెలంగాణా ప్రజల్ని దోచుకున్నారనే వేదన చాలా ఎక్కువని అనుభవంలో మేము తెలుసుకున్న సత్యం. అయినా లోకాలనేలే ఆ జగన్మాత మనం ఎవరి మీద ఏది చెప్తే అది నమ్మేసి,ఎవర్ని శిక్షించమంటే వాళ్ళని శిక్షిస్తుందా?? అలా చేయటానికి అమ్మవారేమన్నా రిటర్న్ గిఫ్ట్ కోసం మనింటికి పేరంటం వచ్చే పక్కింటావిడ కాదు కదా.. దుష్టశిక్షణ,శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ తల్లికి సర్వం తెలుసు. 

  ఈ శంకుస్థాపన లో మాకు మరో విశేషం ,మా మరిదిగారు(మా చెల్లి వాళ్ళాయన) తెలంగాణ నుండి ఆంధ్రాకి రాజధాని డ్యూటీ ఆఫీసర్ గా  రావటం.తెలంగాణా పోలీస్ అంటే ఎప్పుడూ అటువైపే డ్యూటీలు ఉంటాయి,ఆంధ్రాకి రారు కదా అనుకునే వాళ్లము. కానీ ఈసారి తెలంగాణా పోలీస్ లు కూడా ఇక్కడికి  రావటం వలన మా సొంత జిల్లా గుంటూరులో డ్యూటీకి రావటం మాకు ఆశ్చర్యంగా,ఆనందంగా అనిపించింది.ఆవిధంగా మాకుటుంబసభ్యులు కూడా మా ఆంధ్రారాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నట్లయింది.


  శంకుస్థాపన కార్యక్రమంలో నటుడు సాయికుమార్,గాయని సునీత ఉపద్రష్ట వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన, శంకరంబాడి.సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో కార్యక్రమం మొదలయ్యింది.సునీత పాడిన మా తెలుగు తల్లికి పాటని వింటుంటే ఈమధ్య టీవీల్లో చిన్నపిల్లలు కూడా ఇలా పాడట్లేదే..! కనీసం ఒకసారి ఆ పాట రిహార్సల్స్ అయినా చేసుకుందా అనిపించింది.సునీత పాట పాడేటప్పుడు ఊపిరితీస్తూ,ఆయాస పడుతున్నట్లు పాడుతుందని నా అభిప్రాయం.నేనేదో సునీతని తప్పు పట్టటం లేదు.ఎవర్నైనా వంక పెట్టటం చాలా సులభం,అది తప్పు కూడా.. కానీ ఆంధ్రరాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటని రాజధాని ఆరంభ శుభసమయంలో పాడమని బాధ్యత అప్పగిస్తే గాయని సునీత ఆయాసపడుతూ,దాదాపు ఏడుస్తున్నట్లు,నీరసంగా ఆ పాట పాడటం చాలా ఘోరంగా అనిపించింది.పాపం గుంటూరు ఎండ ప్రభావం కూడా కావచ్చేమో .. 

  ఈ పాట మిగతా వాళ్ళు ఎలా పాడారా అని యూట్యూబ్ లో వెతికితే  టంగుటూరి సూర్యకుమారి గంభీరమైన గానం ,చక్కని సంగీతంతో దేశభక్తి పాటంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంది.ఇక బుల్లెట్ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా ఆయన అన్ని పాటల్లాగే చాలా బాగుంది.బాలు గారి పాట విన్నాక అందుకే అప్పట్లో పాడుతాతీయగాలో పాడటానికి వచ్చిన వాళ్ళని చిన్నతప్పు పాడినా మందలిస్తూ సరిగా పాడమని,వాళ్ళు బాధపడినా సరే తప్పులు,లోపాల్ని ఎత్తిచూపేవారు .కానీ ఇప్పుడు రకరకాల ఛానళ్ళల్లో వస్తున్న సింగింగ్ కాంపిటీషన్స్ లో జడ్జ్ లు పాడేవాళ్ళు ఎలా పాడినా పట్టించుకోకుండా వాళ్ళని మెచ్చుకోవటం,ఆహా వోహో అనటం చూస్తుంటే కింగ్ సినిమాలో బ్రహ్మానందం సీన్స్ గుర్తొస్తున్నాయి.అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా గొప్ప సింగర్స్ అనిపించుకునే వాళ్ళకంటే కూడా బాగా పాడుతున్నారు.

  ముగ్గురు గాయకులు పాడిన ఈ మాతెలుగుతల్లి  పాటలు వింటే  ఎవరెలా పాడారో తెలుస్తుంది.

  మా తెలుగు తల్లికి మల్లెపూదండ - టంగుటూరి సూర్యకుమారి 


  మా తెలుగుతల్లికి మల్లెపూదండ - S.P. బాలసుబ్రహ్మణ్యం 


  మా తెలుగుతల్లికి మల్లెపూదండ - సునీత 
   

  అమరావతి శంకుస్థాపన చిత్రాలు

  ఏదేమైనా అన్ని ప్రతికూల ఆలోచనలను ప్రస్తుతానికి వదిలేసి,సానుకూల ధోరణితో కొనసాగుతూ
  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని,అందమైన భవిష్యత్తును వేగంగా నిర్మించుకోవాలని కోరుకుంటూ


  All The Best - "Amaravati
  The dream capital of  Andhra Pradesh"

  14, అక్టోబర్ 2015, బుధవారం

  మనుషులు .. మనస్తత్వాలు
   "అత్తా మామలతో మూత్రం తాగిస్తున్న కోడలు"

  ఇంతకీ విషయం ఏమిటి అంటే ఇండోర్ కు చెందిన రేఖ నాగవంశి అనే మహిళ 8 ఏళ్ళ క్రితం దీపక్ అనే యువకుడిని పెళ్ళాడి, ఇంట్లో అత్తా మామలతో గొడవల కారణంగా అలిగి భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. దీపక్ బతిమాలడంతో కొన్ని షరతుల మీద భర్త లో కలిసి ఉంటుంది. అయినా వారానికి ఒక్కసారి వచ్చి పోయే అత్తమామలను చూసి విసుగు చెందిన రేఖ వారిపై కక్షగట్టి, వారు ఉన్నన్ని రోజులు టీలో మూత్రం కలిపి ఇవ్వడం మొదలెట్టింది.

  ఇది ఏడాదిగా జరుగుతూనే ఉంది.ఈ విషయం తెలియని అత్తమామలు నవ్వుతూ టీ ఇస్తున్న కోడల్ని చూసి,ఆహా మా కోడలు మారిపోయిన మనిషి...మాకు ఎంత మర్యాద ఇస్తుంది అని మురిసిపోయారట.ఒకరోజు కోడలు టీపాట్ లో మూత్రం పోస్తూ ఉండటం గమనించిన అత్త, ఇన్ని రోజులు తాము తాగింది కోడలు మూత్రం కలిపిన టీ అని గ్రహించి పోలీసులకు పిర్యాదు చేయడానికి వెళ్ళగా సాక్ష్యాలు లేవని పోలీసులు పిర్యాదును స్వీకరించబోమని చెప్పడంతో కోర్టును ఆశ్రయించే పనిలో పడ్డారు.

  దేవుడా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా?? నచ్చకపోతే ఎదురెదురుగా తేల్చుకోవాలి లేదా వదిలేసిపోవాలి అంతే కానీ ఇలాంటి నీఛానికి పాల్పడే వాళ్ళు మనుషులేనా అనిపించే  జుగుప్సాకరమైన సంఘటనలు తెలిసినప్పుడు అమ్మో ఇంకెప్పుడైనా ఒకప్పుడు శత్రువులైనా మళ్ళీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారులే అని ఎవరినీ నమ్మకూడదు బాబోయ్ అనిపిస్తుంది.చెప్పుకోవటానికే ఇంత  అసహ్యకరంగా అనిపిస్తున్న ఈ విషయం అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏమిటో పాపం.

  పెద్దలు చెప్పినట్లు ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడు, బయటి శత్రువులు ఎదురుగా కనపడతారు కానీ మనతో పాటూ ఉంటూ మనకి కీడు చేసే అంతర్గత శత్రువుల్ని ఎవరు మాత్రం ఏమి చేయగలరు వాళ్ళ పాపం పండటానికి ఎదురుచూడటం తప్ప..


  12, అక్టోబర్ 2015, సోమవారం

  కాకతీయ సామ్రాజ్ఞి - రాణీ రుద్రమదేవి
  రుద్రమ్మ భుజ శక్తి
  మల్లమ్మ పతిభక్తి
  తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
  మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
  నీ పాటలే పాడుతాం .. నీ ఆటలే ఆడుతాం
  జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

  చిన్నప్పుడు అసెంబ్లీలో చాలా శ్రద్ధగా పాడుతూ ప్రతిరోజూ గుర్తు చేసుకునే వీరులలో రుద్రమదేవి ఒకరు.చరిత్ర, రాజుల పాలన అంటేనే యుద్ధాలు,పోరాటాలు,కుట్రలు కుతంత్రాలు.కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమదేవి ధీరవనిత, ధైర్యసాహసాలకి మారుపేరు, శత్రువులకి  సింహస్వప్నం,భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన రాణుల్లో రుద్రమదేవి ఒకరు. 800 వందల ఏళ్ళ క్రితమే ఇప్పుడు సర్వసామాన్యమైన మహిళా సాధికారతను సాధించటమే కాదు శత్రువు ఎంతగొప్ప వీరుడైనా తన పేరు చెప్తేనే వణికిపోయేలా రాజకీయ, యుద్ధవిద్యల్లో ఆరితేరిన యోధురాలు.తన శౌర్య పరాక్రమాలతో శత్రురాజులను గడగడలాడించటమే కాదు,ప్రజారంజకంగా ,ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా చూసి, శత్రుదుర్భేధ్యమైన కోటలు,ప్రజల జీవనాధారమైన నీటి కోసం సముద్రాలను తలపించే చెరువులు కట్టించి సుపరిపాలన అందించిన కాకతీయ సామ్రాజ్ఞి. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటూ కర్ణాటక, తమిళనాడు,మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లలో రాజ్యం వీరభోజ్యం అనే మాట నిజం చేస్తూ దక్షిణాపధంలో సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పింది.

  కాకతీయుల రాజధాని ఓరుగల్లు. కాకతీయ పాలకుల్లో ప్రముఖుడైన గణపతి దేవుడి చిన్న కుమార్తె రుద్రమ. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి పరిస్థితుల ప్రకారం రుద్రమదేవిని కుమారుడిగా పెంచి, అన్ని విద్యలు నేర్పించి, తన ప్రతినిధిగా ప్రకటించాడు గణపతిదేవుడు.ఆడపిల్ల అని భయపడకుండా కూతురిని కొడుకులాగా పెంచి రాజ్యార్హతను కల్పించిన గణపతిదేవుడు నిజంగా గొప్పతండ్రి. రుద్రమదేవి చక్రవర్తిగా క్రీస్తు శకం 1262 - 1289 అంటే 27 సంవత్సరాల పాటు పాలన సాగించింది. రుద్రమదేవి పాలనా కాలమంతా యుద్దాలతోనే గడిచింది.ముందుగా స్త్రీ  అధికారాన్ని, పాలనని  సహించలేని సామంతులు, దాయాదులే అంతర్గత శత్రువులుగా  చేసిన తిరుగుబాట్లన్నిటినీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది రుద్రమ. ఓరుగల్లు కోటను ముట్టడించిన దేవగిరి యాదవ మహారాజు మహాదేవుడిని యుద్ధంలో ఓడించి బంగారు వరహాలను పరిహారంగా పొంది అతన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టింది.రుద్రమదేవి జరిపిన పోరాటాలన్నిటిలో ఆమెకు అండగా నిలిచిన సేనా నాయకులు ప్రసాదాదిత్య,గోనగన్నారెడ్డి, మల్లికార్జున నాయకుడు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.

  ఇటలీ దేశ రాయబారి మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించి రుద్రమను అత్యంత సమర్దురాలైన పాలనా దక్షత గల చక్రవర్తిగా అభివర్ణించాడు.కాకతీయుల వంశ చరిత్ర,పాలన,సాధించిన విజయాలు చాలావరకు వారు వివిధప్రదేశాల్లో వేయించిన శిలాశాసనాల్లో తెలుస్తుంది.ఓరుగల్లుకోట,రామప్పగుడి,వేయి స్తంభాలగుడి, కాకతీయుల శిల్పకళాపోషణకు,నైపుణ్యానికి నిదర్శనాలు.రుద్రమకాలంలోని కాకతీయుల సేనాని జాయప్ప పేరిణీ శివతాండవం సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం,సాహిత్యం,నృత్యం,శిల్పకళ ఎంతో  గొప్పగా విలసిల్లాయి.

  14 ఏళ్లకే రాజ్యాధికారం చేపట్టిన రుద్రమకు 25 వ ఏట నిడదవోలు రాజు చాళుక్య వీరభధ్రుడితో వివాహం జరిగింది. వీరికి ముమ్ముడమ్మ,రుద్రమ్మ  ఇద్దరూ ఆడపిల్లలే.. తనకు పుత్ర సంతానం లేకపోవటంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడిని దత్త పుత్రుడిగా యువరాజుగా పట్టాభిషేకం చేసింది.ఎన్నోసార్లు ఓటమి పాలైన వల్లూరు రాజు అంబదేవుడు రుద్రమదేవి మీద కక్ష కట్టి,రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించి,1289 లో పాండ్యులు,చోళులు,ఇతర సామంత రాజుల దాడిలో యుద్ధంలో ఎదురుగా రుద్రమను గెలవలేక, యుద్ధవిరామ సమయంలో శివపూజ చేసుకుంటున్న రుద్రమను దొంగచాటుగా చంపించాడని నల్గొండ చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది.ఆ తర్వాత రాజ్యం చేపట్టిన ప్రతాపరుద్రుడి పరిపాలనా కాలం అంటా కూడా యుద్దాలతోనే గడించింది.కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాల కారణంగా ముస్లింరాజుల  దండయాత్రల్లో ఓటమి పాలయ్యాడు.యుద్ధంలో బందీగా చిక్కిన ప్రతాపరుద్రుడిని ఢిల్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలోని నర్మదా నదిలో దూకి చనిపోయాడని 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో తెలుస్తుంది. 

  చిన్నప్పుడెప్పుడో చదివిన వీరనారి రాణీ రుద్రమదేవి చరిత్ర మళ్ళీ ఇప్పుడు గుణశేఖర్  రుద్రమదేవి - The warrion Queen సినిమా వలన గుర్తుకొచ్చింది. మనం ఎప్పుడో  చదివిన ఇలాంటి గొప్ప చరిత్రని ఇప్పటి వాళ్లకి  సినిమా ద్వారా  తెలియచేసిన దర్శకుడు,నిర్మాత గుణశేఖర్ ప్రయత్నం అభినందనీయం. మహేష్ బాబు " అర్జున్" సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ లాగానే ఈ సినిమాలో కాకతీయసామ్రాజ్యం అప్పటి కోటలు,ఆలయాల్లో శిల్పకళ, కాకతీయుల కీర్తి తోరణాలు అన్నిటినీ ఆర్ట్  డైరెక్టర్ తోటతరణి డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.

  రుద్రమదేవి పాత్రకి తగినట్లుగా అనుష్క బాగుంది.ఒక్క సినిమాలోనే రుద్రమదేవి వీరత్వం చూపించటం అంటే సినిమా అంతా యుద్ధాలే ఉంటాయి కాబట్టి అలాంటి సీన్స్ కొన్నే ఉన్నాయి. అనుష్క,నిత్యామీనన్ చాలా అందంగా  కనిపించారు. రాణా  మామూలు సినిమాల్లో హీరో గా కంటే మొన్న బాహుబలిలో ఇప్పుడు ఈ సినిమాలో రాజుల పాత్రలకే చక్కగా సరిపోయాడు అనిపించింది. మహామంత్రి శివదేవయ్య గా ప్రకాష్ రాజ్ యుక్తిగా రాజుకి సలహాలిస్తూ  రాజ్యాన్ని కాపాడటం అప్పటి రోజుల్లో ఇలాంటి మంత్రులు ఉండబట్టే రాజులు అంత చక్కగా పరిపాలించేవారు అనిపిస్తుంది.కృష్ణంరాజు  "తాండ్రపారాయుడు" ముసలివయసులో  ఇలా ఉండేవాడన్న మాట అనిపిస్తుంది :) ఇక సినిమాలో అందరికీ నచ్చిన, మెచ్చిన అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్ర బాగుంది. బయటికి బందిపోటుగా ఉంటూ రుద్రమదేవికి సహకరించి, శత్రువుల్ని మట్టుబెట్టే   గోనగన్నారెడ్డి గురించి  ఈ సినిమా ద్వారా ఎక్కువగా తెలిసిందని చెప్పొచ్చు.తెలంగాణా యాస సరిగ్గా అలాగే మాట్లాడుతూ అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఒకప్పటి "ద్యావుడా..." లాగా ఇప్పటి "గమ్మునుండవో" లాంటి మాటల్ని కొన్ని వర్గాల అభిమానులు కొన్నాళ్ళపాటు మర్చిపోకుండా తలుచుకుంటారేమో.బందిపోటుకి తెలంగాణా భాష పెట్టి ,రాజులకి పెట్టకపోవటం కొంతమందికి నచ్చలేదట, 

  సినిమాలో అందరికీ నచ్చిన కొన్ని అల్లు అర్జున్ డైలాగ్స్ :

  నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా,ఈడా ఉంటా..

  పద్మవ్యూహంలో ఇరుక్కోనికి నేను అభిమన్యుడ్ని  కాదు వ్యూహకర్తల
  అమ్మామొగుడు శ్రీ కృష్ణుడసంటోడ్ని.

  ఉంటే  వైకుంఠo లేకపోతే ఊకుంటం

  పులిపాలు పిండేటోనికి బర్రెపాలు పిండుడు పందెమేందిరా

  నా చర్యలకి ఆశ్చర్యపోవుడు తప్ప నన్ను చెరసాలలో వేసేటోడు పుట్టలే

  మంచికి మంచి తోడు  అన్నట్లు చాళుక్యవీరభద్రుడు,గోనగన్నారెడ్డి,మంత్రి శివదేవయ్య లాంటి వాళ్లతోడు ఎంతటి వీరులకైనా అవసరం అనిపిస్తుంది.ఏడు కోటల నిర్మాణం,వాటి ఉపయోగంలో యుద్ధతంత్రం బాగుంది.వేలమంది సైనికులు రుద్రమని పాములాగా చుట్టుముట్టినప్పుడు గద్ద రూపంలో సైనికులతో గోనగన్నారెడ్డి ఎంట్రీ, అక్కడి యుద్ధవ్యూహం బాగున్నాయి.మనం చిన్నచిన్న సమస్యలకే భయపడిపోతుంటాం అలాంటిది అప్పటి మన రాజులు ఎదురుగా కత్తులు పట్టుకుని వచ్చే శత్రువులని ఎంత ధైర్యగా ఎదుర్కున్నారో కదా,అందుకే చరిత్రలో వీరులుగా నిలిచిపోయారు అనిపిస్తుంది.ప్రస్తుతం మనకి అప్పటి రాజుల్లాగా ధైర్య సాహసాలు,దాతృత్వం లాంటి గొప్ప లక్షణాలు లేకపోయినా,వారి దాయాదుల్లాగా కుట్రలు,కుతంత్రాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి..ఎంతైనా మంచికి వారసులున్నట్లే చెడుకి కూడా ఉంటారు కదా..!

  రుద్రమదేవికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఒక ప్రత్యేకత.తెలుగు చరిత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ చెప్పిన ఈ చరిత్ర  India’s first historical stereoscopic 3D film గా చరిత్రలో నిలిచిపోతుంది.మన చరిత్ర,సంస్కృతిని ఇప్పటి తరాలకు తెలియచేసే ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే బాగుంటుంది.మొత్తానికి మొన్న బాహుబలి, ఇప్పుడు రుద్రమదేవి చిన్నప్పుడు NTR  కాలంలో వరసగా వచ్చే రాజుల సినిమాల జ్ఞాపకాలను గుర్తుచేశాయి.

  చరిత్ర ఎప్పటికీ గొప్పదే ఆ చరిత్రను సృష్టించిన వీరులు,వారి సాహసాలు ఇంకా గొప్పవి. చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన,  స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నతమైన రూపం రుద్రమదేవి. ఓరుగల్లు భద్ర కాళికి వీరభధ్రుడు తోడై సృష్టించిన వీరనారి రుద్రమదేవి చరిత్ర సినిమాగా బాగుంది. 

  రుద్రమదేవి -  The warrion Queen  10, అక్టోబర్ 2015, శనివారం

  ఆగమనం

  జీవితమనే పూలతోటలో కొందరి ఆగమనం వసంతమైతే మరికొందరి ఆగమనం గ్రీష్మం ..

  ఎవరి ఆగమనం వసంతంలా జీవితాన్ని పచ్చని తోటగా,వికసించిన పుష్పాలతో రమణీయంగా మారుస్తుందో,ఎవరి ఆగమనం జీవితాన్ని గ్రీష్మ తాపంతో ఎండిన మోడులా చేస్తుందో తెలపాల్సింది కాలమే అయినా ఇలాంటి విషయాలన్నీ ముందుగానే తెలుసుకునే శక్తి మనిషికి ఉంటే బాగుంటుంది కదా ..!!

  ఒక గ్రీష్మ ఆగమనానికి ముందు మా ఇంటి పూలతోట
  5, అక్టోబర్ 2015, సోమవారం

  డైలీ సీరియల్సు - లైఫు లెసన్సు
  సాయంత్రం పని కాగానే బాల్కనీలో నాతో పాటూ కూర్చుని టీ తాగుతూ ఒక పావుగంటన్నా నాతో  కబుర్లు చెప్పటం మా పనిమనిషి రత్నానికి ఒక అలవాటు. అదేదో టీవీ యాడ్ లో పనివాళ్ళకి కూడా మనతో పాటూ మంచి కప్పుల్లో టీ లేదా కాఫీ ఇస్తేనే సంస్కారం ఉన్నట్లు అని చెప్పారు కదా అని మా పనమ్మాయికి  కూడా ఏదో ఒక పాత గ్లాసులో కాకుండా ఒక మంచి కప్పులోనే టీ ఇచ్చి దానితో కలిసి ఆ ముచ్చట్లు,ఈ ముచ్చట్లు,వాళ్ళ ముచ్చట్లు వీళ్ళముచ్చట్లు చెప్పుకోవటం నాకు కూడా మంచి టైమ్ పాస్. 

  టీ తాగుతూ బాల్కనీలో నుండి కనపడే వచ్చిపోయే అమ్మాయిల్ని చూస్తూ ఆడపిల్లలు,వాళ్ళ చదువులు, సంస్కారాలు, వేషధారణలు,వాళ్ళ మీద జరుగుతున్న విపరీతాల గురించి మాట్లాడుతున్న మా రత్నాన్ని చూస్తుంటే నాకంటే నువ్వే నయం కదే ఎన్ని విషయాలు తెలుసు నీకు!! అనిపించింది.ఎంతైనా వందిళ్ళ టీవీ ఛానల్ కదా దానికి ఆ విషయాలన్నీ తెలియటం న్యాయమేలే అనుకుని, ఊర్లో  ఆడపిల్లల సంగతి సరే కానీ మీ అమ్మాయిల సంగతేంటి పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తున్నానన్నావు కదా ఆమధ్య, మరి మిగతా ఇద్దరు అమ్మాయిలూ ఏమి చేస్తున్నారు అని అడిగి అంతలోనే అబ్బా అనవసరంగా అడిగానే.. ఎప్పటిలాగే ఇప్పుడిక ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అంటూ ఏడుపు సీన్ క్రియేట్ చేస్తుందా? అని అనుకుంటుండగానే నేనే ఆశ్చర్యపోయే ఝలక్ ఇచ్చింది మా రత్నం.

  లేదమ్మా ఇంతకు  మునుపు తెలియక పెళ్ళికొడుకుల కోసం ఆ పెళ్ళిళ్ళ పేరయ్యలు,మ్యాట్రిమోనీలు (అబ్బో) అంటూ తెగ తిరిగినం, కానీ ఇప్పుడింక ఆ అగత్యం లేదనిపిస్తుందమ్మా అంది.ఆశ్చర్యపోవటం నా వంతయ్యింది, తను పాచిపని చేసినా కూతుళ్ళకి మంచి స్థాయిలో పెళ్ళిచేయాలని కలలు కంటూ, తీవ్రంగా సంబంధాలు వెతుకుతూ, ఎప్పుడైనా ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కుదరలేదా అనగానే చేతిలో ఉన్న వస్తువుల్ని ఉన్నపళాన వదిలి పడేసి మరీ ముక్కు చీదే  రత్నంలో  ఇంత ధీమా ఎలా వచ్చిందబ్బా కొంపతీసి మన ముఖ్యమంత్రులు,ప్రధానమంత్రి గారు ఆడపిల్లలకి డబ్బుతో పాటు వరుడ్ని కూడా వెతికి పెట్టే పధకాలేమన్నా పెట్టారా ఏంటి అని (మనసులో) ఆశ్చర్యపోతూ..ఏంటి రత్నం విశేషం? మొత్తానికి సంబంధాలు కుదిరినట్లున్నాయే నాకు చెప్పలేదా ఏంటి అనగానే.. మీకు చెప్పకుండా ఉంటానామ్మా అని  కొనసాగించింది.  

  మా పెద్దపిల్లని మన వీధి చివర ఉంటారే గతంలో రాజవంశానికి చెందిన అరుణ్ బాబు అనగానే నాకెక్కడలేని ఆత్రం వచ్చింది.సంతోషంతో అతను మీ అమ్మాయి అందం చూసి (ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ రత్నం కూతుళ్ళు రత్నంలా కాకుండా అందంగానే ఉంటారు )పెళ్ళి చేసుకుంటానన్నాడా ఏంటి కొంపతీసి అనగానే అబ్బ మీరూర్కొండమ్మా చెప్పేది పూర్తిగా వినకుండా ఓ ఓ ఓ ఆత్రపడతారు వాళ్ళింట్లో ఆళ్ళ బామ్మగారికి ఒళ్ళు బాలేదంటే కొన్నాళ్ళు సూస్కోడానికి మా పెద్దదాన్ని అక్కడ పెట్టానమ్మా అంది.ఏంటి పెద్దామెకి ఒళ్లుబాలేదంటే చూస్కోవటం అంటే.. ఆయాగా పెట్టావా? అయినా ఇంటర్ చదివిన పిల్లని అలా ఆయాగా పెట్టటానికి నీకు మనసెలా ఒప్పింది, నువ్వు తల్లివేనా అంటూ ఆగ్రహావేశాలతో, సంఘసంస్కర్తలందరినీ గుర్తు చేసుకుని మరీ నీకంత గతిలేకపోతే ఎంతో కొంత సాయం చేసి డిగ్రీ చదవించే వాళ్ళం కదా అప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆపిల్లకి తగ్గ సంబంధాలు కూడా వచ్చేవి అంటూ లెక్చర్ ఇస్తున్న నన్ను చిద్విలాసంగా చూస్తున్న రత్నాన్ని చూస్తే నాకింకా ఒళ్ళు మండిపోయింది.

  అమ్మా అది డిగ్రీ చదివినా,మేము సంబంధాలు ఎతికినా ,మహా అయితే ఏ  క్లర్కో, టీచర్నో తేగలం అంతే కానీ  మాకు రాజవంశంలో సంబంధం ఎలా వస్తుందమ్మా? అందుకే ఈ ఏర్పాటు అంది. ఆ ఇంటికి ఆయాగా వెళ్తే రాజవంశం సంబంధం ఎలా వస్తుందే నాకేమీ అర్ధం అయ్యి చావట్లేదు నీ గోల అనగానే అందుకేనమ్మా ఎప్పుడూ ఆ ఫేస్ బుక్,బ్లాగులు,పుస్తకాలు అనకుండా అప్పుడప్పుడు టీవీలో సీరియళ్ళు కూడా చూడమనేది.జీ తెలుగు లో "మూగమనసులు" అనే సీరియల్ వచ్చిద్దమ్మా అందులో వీరోయిన్ ధరణి అచ్చం మా పెద్దమ్మాయిలాగానే పెద్ద పెద్ద కళ్ళు,వాలుజడ అందంగా ఉంటాది. ఈరో ఇంట్లో  ఆయాగా చేరి తన అందంతో మాత్రమే కాకండా తన మంచి, గొప్ప, కడిగినముత్యం లాంటి మనసుతో ఈరో గారి మనసు దోచేసి పెళ్లి సేసుకోడమే కాదు వాళ్ళ రాజ్యానికి ? రాణి కూడా అయిపోయింది.. వింటున్న నాకు నోరూర్కోదు కదా "ఆ .. ఆ ఇప్పుడలాగే చేసుకున్నా తర్వాత తక్కువ చూపు చూస్తారు" అంటున్న నన్ను ఓసి పిచ్చిదానా!! అన్నట్లు చూస్తూ అందుకేనమ్మా సీరియల్ చూడమని చెప్పింది.

  అప్పుడు ఆయాగా వచ్చిన ఈరోయిన్ ధరణీ పెళ్ళి కాగానే ఇప్పుడు తన పెద్ద పెద్ద కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి చూస్తే చాలు ఈరో ఆదిత్య చలిజొరం వచ్చినోడ్లా గడ గడ వణుకుతూ అక్కడే ఒకటికి కూడా పోయేలా,ఆమె నాతో మాట్లాడితేనే మహాభాగ్యం అనుకుని పని పాటా మానేసి తన కొంగు పట్టుకుని తిరిగేలా చేసింది.చివరికి ధరణి వాళ్ళమ్మ (అత్తగారు) కూడా కుక్కలాగా చీదరించుకున్నా ఈరో ఆదిత్య ఏమీ అనడు తెలుసామ్మా??

  అందుకేనమ్మా నేను డిసైడ్ అయినాను

  మా పెద్దదాన్ని "మూగమనసుల్లో" ధరణి లాగా రాజా గారింట్లో ఆయాగా పెడతా..రాజాగారు మా అమ్మాయిని పెళ్ళిచేసుకుని,మా అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళ చూపులకి భయపడుతూ ,పదునైన మాటలకి బదులు చెప్పలేక నీళ్ళు నములుతూ, అందులో ధరణి అమ్మ అల్లుడ్ని తిట్టినట్లు నా చీత్కారాలకి కూడా వణికిపోతూ, మా చుట్టూ తిరిగేలా చేస్తా.. 

  రెండోదాన్ని "వరూధినీ పరిణయం" నాటికలో వరూధిని లాగా ఒక సెకండ్ హాండ్ లూనా కొనిచ్చి,కాసిన్ని జంతికలు, అరిసెలు, అప్పడాలు సంచీలో పోసి, అయ్యి అమ్మటానికి ఎల్లినప్పుడు ఎవరో ఒక గొప్పింటి బిజినెస్ మాగ్నెట్ అబ్బాయి కారు కింద కావాలనే పడి, పరిచయాలు పెంచుకుని రమ్మని చెప్పా. తర్వాత నేను,నా మొగుడు ఎంటర్ అయ్యి మాకిష్టం లేకపోయినా ఏదో వాళ్ళే బలవంతపెట్టినట్లుగా ఒప్పుకుని,వాళ్ళింటికి కోడల్ని చేస్తా.. పెళ్ళయ్యాక మా అమ్మాయి అచ్చం ఆ ఈరోయిన్ వరూధిని లాగానే కొయ్యముక్కకి చీర కట్టినట్లు ఒకచోట నిలవకుండా ఎగురుకుంటా, మొగుడ్ని,వాడి తరపు బంధువుల్ని నానా కూతలూ కూస్తూ ,వెటకారాలు చేస్తూ తిరిగినా ఏమీ అనలేని ఈరో పార్దూలాగా తయారుచేస్తా..

  ఇంక మూడో పిల్ల కాస్త చిన్నది కాబట్టి "మంగమ్మగారి మనవరాలు" సీరియల్ లోగా ఏ ఇండస్ట్రియలిస్ట్ మంగమ్మో, పుల్లమ్మో తమకన్నా తక్కువ స్థాయి వాళ్ళైతే మాటవింటారని,పెత్తనం చేద్దామని సంబంధం కోసం వస్తారు కదా! అప్పటిదాకా ఎయిట్ చేసి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ముందు అమ్మా మీ కాళ్ళు నొక్కుతాం అంటూ పెళ్లి చేసి,ఒక పిల్లో, పీచో కాగానే ఈరోయిన్ స్వర్ణ లాగా ఆ ముసల్దాన్ని ఏంటే ముసల్దానా నీ పెత్తనం అని విదిలించి కొట్టినా,నువ్వే కావాలి స్వర్ణా ,నువ్వే  దేవతవి అంటూ దేబిరించే ఈరో సాకేత్ లాంటి మొగుడ్ని నా చిన్నపిల్లకి తెస్తా ..

  ఇంత  విన్నాక కూడా పాపం ఏదో దానికి తెలియని విషయాలేవో నాకు తెలుసన్న అజ్ఞానంతో .. అవన్నీ సీరియల్స్ రత్నం!! నిజంగా జరుగుతాయా?ఒకవేళ జరిగినా అంత  పెద్దస్థాయిలో ఉన్నవాళ్ళు కోడలు అలా చేస్తుంటే నోర్మూసుకుని ఊరకుంటారా? అలాంటి హీరోలు నిజజీవితంలో ఉండరు ఆ ధరణి,వరూధిని,స్వర్ణ లాగా కళ్ళు అమ్మోరిలా ఇంతింత పెద్దవి చేసి, జెండాకర్రలా పైకి, కిందికి ఎగురుతూ,ఇంట్లో అందరినీ మాటలు అంటూ ఉంటె ఎవరు పడతారు చెప్పు?లక్షలు,కోట్లు కట్నాలు ఇస్తేనే సరైన పెళ్ళిళ్ళు కావట్లేదు,అయినా సరిగా ఉండట్లేదు. ఇలాంటి ఆలోచనలు మంచివి కాదు.నీ మేలు కోరి చెప్తున్నా ..

  అనేంతలోనే రత్నం అందుకుని,అమ్మా మధ్యానం 12 కి "బతుకు జట్కాబండి" వస్తది చూశారా? ఇలాంటి వాళ్ళని "జీయిత" చెర్నాకోలతో కొట్టి మరీ లాక్కొచ్చి,మొగుడ్ని వదిలి పెట్టిన పెళ్ళాల్ని,పెళ్ళాన్ని వదిలిపెట్టిన మొగుళ్ళని కలుపుద్ది.ఎవడైనా ఆమె మాట వినకపోతే మీద మీదకి పొయ్యి, కొట్టటానికి కూడా ఎనకాడదు. ఆ ప్రోగ్రాం కి అప్పటిదాకా కత్తులతో పొడుచుకుని,,సుత్తులతో బాదుకున్న జంటలు వచ్చినా సరే చిలకా ,గోరింకల్ల్లాగా నవ్వుతా కలిసి కొంపకి పోయేటట్లు చేస్తది ఆయమ్మ "జీయిత". అవసరమైతే మొగుడు,వాడి తల్లిదండ్రులు అడుక్కు తిన్నా సరే ఆడి ఆస్తంతా భార్య పేరు మీదే ఎట్టిస్తది. ఎవడైనా ఎక్కువ చేశాడా డొమెస్టిక్కు వయలిన్స్,ఇంకా ఎయ్యెయ్యొ చట్టాల కింద లోపల తోపిస్తా అంటది.దెబ్బకి ఎంతటి వాడైనా దారికి రావాల్సిందే .. అందుకేనమ్మా ఇయ్యన్నీ చూసినాక నాకు చాలా ధైర్యం వచ్చింది. నా పిల్లల గురించి నాకింకేమీ బెంగలేదు. .

  అదమ్మా నా ఆలోచన నీక్కాబట్టి చెప్పా ..ఎవరితో అనకమ్మోయ్ అంటూ ఇంక ఎల్లొస్తానమ్మా సీరియల్స్ వచ్చే టైమైంది, నువ్వు కూడా కుదిర్తే చూడమ్మా ఇయ్యే కాదు ఇంకా చానా మంచి సీరియల్స్ వస్తాయ్ అంటూ వెళ్తున్న దాన్ని చూస్తే వింటున్న నేను వెర్రిదాన్నా అది వెర్రిదా  అర్ధం కాలేదు."తీవ్రవాదులకన్నా తీవ్రంగా ఉన్నాయే దీని ఆలోచనలు" టీవీ ఇప్పుడిలా ఉపయోగ పడుతుందా అనుకుంటూ,సరే వెళ్లిరా అంటూ దాని వెనకే వెళ్లాను,దానితో పాటూ దాని ఆలోచనల్ని కూడా గుమ్మం బయట వదలటానికి.

  జనానికి కొత్త కొత్త తెలివితేటలూ,ఆలోచనలు నేర్పుతున్న డైలీ సీరియల్స్ గురించి 
  ఈమధ్య స్వాతిలో వచ్చిన కార్టూన్  Related Posts Plugin for WordPress, Blogger...