పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, డిసెంబర్ 2015, సోమవారం

గోదావరి జన్మస్థానం - బ్రహ్మగిరి గంగాద్వార్ నాసిక్కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో 
ఎప్పుడైనా కరెంట్ పోతే లిఫ్ట్ లేక 2nd ఫ్లోర్ దాకా మెట్లు ఎక్కేసరికే ఆయాసం వస్తుంది.అలాంటిది త్రయంబకేశ్వరం లోని బ్రహ్మగిరి పర్వతాన్ని ఎక్కి, గోదావరి నది జన్మస్థానం గంగాద్వార్ చూడటం మాకు ఒక సాహసయాత్ర.,జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకం.

బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అనే  ఐదు శిఖరాలు ఉన్నాయి.బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు.

గౌతమ మహర్షి గోహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి శివుడిని తన తపస్సుతో మెప్పించి, గంగమ్మను ఈ కొండపైకి వచ్చేలా చేసి,ఆ గంగానదిలో స్నానం చేయటం ద్వారా తన పాపాన్ని  పోగొట్టుకున్న ప్రదేశమే బ్రహ్మగిరి.  తమిళనాడులోని అరుణాచలం లాగా ఇక్కడ బ్రహ్మగిరి కూడా శివస్వరూపంగా చెప్తారు.శ్రావణమాసంలో ప్రతి సోమవారం  బ్రహ్మగిరి ప్రదక్షిణ చేయటం ఇక్కడి విశిష్టత .

సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో,త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉన్న బ్రహ్మగిరికి అక్కడి ప్లేసెస్ లో డ్రైవింగ్ అలవాటు ఉన్నవాళ్ళు వెళ్తారట కానీ మా డ్రైవర్ రాజు నేనే తీసుకెళ్తానని ధైర్యంగా చెప్పటంతో మా కార్ లోనే వెళ్ళాము.కొండ చాలా ఏటవాలుగా సన్నటి దారితో ఉంది.ఇక్కడికి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా వస్తారట.


బ్రహ్మగిరి పర్వతం మధ్య దాకానే కార్లు,జీపులు  వెళ్తాయి అక్కడ  నుండి మట్టిరోడ్డు లో కాలినడకన సుమారు 750 మెట్లు ఎక్కి గంగాద్వార్  చేరుకుంటాము.ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం డోలీలు కూడా ఉన్నాయి.పర్వతం మధ్యలో చిన్న చిన్న రాళ్ళు తేలిన పూర్తి మట్టిరోడ్డు మీద నడక కొత్తప్రయోగం. కష్టమే అనిపించినా పట్టుదలగా వెళ్ళాము.

ఈ పర్వతం ఎక్కడానికి 1908 కాలంలో లో కరాచీకి చెందిన సేథ్ లాల్ చంద్ జశోదానంద్  బంభానీ ,సేథ్ గణేష్ దాస్  లు 40,000 ఖర్చుతో 500 రాతిమెట్లు నిర్మించారు. అప్పటినుండి ఈ కొండ ఎక్కడం సులువయ్యిందట.మట్టిరోడ్డు మీద కొంత  దూరం నడిచి వెళ్ళాక కొండ చివరిగా రాతి మెట్లు కనపడతాయి.

కొండపైకి ఎక్కే  రాతిమెట్లు
ఈ మెట్లు ఎక్కి పర్వతం మధ్య భాగానికి చేరుకోగానే గంగమ్మ  మొదటగా ప్రత్యక్షమైన చోటనే గంగామాత  ఆలయం - గంగాద్వార్ (గోదావరి పుట్టిన ప్రదేశం) ఉంది.ఇక్కడే ఉన్న  గోముఖం నుండి గంగాధార వస్తుంటుంది.ఆ జలాన్ని అక్కడి పూజారి మన మీద చల్లి,గంగామాతకి పూజ చేయిస్తాడు. 


గోహత్యాపాతకం పోగొట్టుకోవటం కోసం గౌతమ మహర్షి ప్రతిష్ఠించి అభిషేకాలు చేసిన 108 శివలింగాలను ప్రతిష్టించి పూజ చేసిన గుహ,గోరఖ్‌నాథుని గుహ ఈ పర్వతం పైనే ఉన్నాయి.గంగా ద్వార్ కి పక్కనే కోలాంబికా (పార్వతీ) దేవి ఆలయం కూడా ఉంది.


గౌతమ మహర్షి అహల్యా మాతతో కలిసి 108 శివలింగాలకు అభిషేకం చేస్తూ తపస్సు చేసిన గృహాలయం.చాలా చిన్నగా ఉండే ఈ గృహలోకి వంగి వెళ్తే లోపల 108 చిన్న శివలింగాలు, వాటి మధ్యలో గౌతమ మహర్షి వెండి విగ్రహం కనిపిస్తాయి.

గౌతమ మహర్షి గుహ
గౌతమ మహర్షి,అహల్యాదేవి తపస్సు చేసిన గుహ
గోరఖ్ నాధ్ గుహ 
బ్రహగిరి పర్వతం ట్రెక్కింగ్,ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్న వాళ్లకి చాలా నచ్చుతుంది. కొండ ఎక్కటం కొంచెం కష్టమే అయినా పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుండి కనపడే ప్రకృతి అందాలు,వాతావరణం కూడా చల్లటి గాలులతో హాయిగా ఉండటంతో అన్ని మెట్లు ఎక్కినా అలసట అనిపించలేదు.కొంచెం కష్టపడినా మంచిప్రదేశాన్ని చూశాము అనిపించింది. కొండపైన గంగాద్వార్,అక్కడే జన్మించిన గంగమ్మ నీళ్ళని చేతుల్లోకి తీసుకుంటే ఇది నిజమేనా అనేంత సంతోషం కలిగింది. అక్కడ ఎంతసేపున్నా విసుగనిపించలేదు,వర్షాకాలం అయితే అంతా పచ్చగా అక్కడక్కడా చిన్న చిన్న జలపాతాలతో ఇంకా బాగుంటుందట.ఇక్కడ కోతులు కూడా కొండల మీద హాయిగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.

 కొండ కింద నిలబడి చూస్తే గౌతమ మహర్షి గుహ, గోరఖ్ నాధ్ గుహ రెండూ ఇలా సున్నంతో మార్క్ చేసిన గుర్తులు మాత్రమే  కనిపిస్తాయి.
కొండ కింద నుండి చూస్తే గుహలు ఇలా కనిపిస్తాయి 

బ్రహగిరి మీద నుండి కనపడే అంజనేరి పర్వత సమూహం 
పర్వతాన్ని ఎక్కే మెట్ల దారి వెంట చిన్న చిన్న పాకలు వేసి ఇలా నిమ్మరసం,టీ, మంచినీళ్ళు ,కీరదోస ముక్కలు
అమ్ముతూ ఉంటారు. అలసట అనిపిస్తే  ఇలాంటివి ఉపయోగపడతాయి. 


మేమందరం మెట్లు ఎలాగోలా బాగానే ఎక్కాము కానీ, మా అమ్మ సగం వరకు అలాగే ఓపికగా ఎక్కినా ఆ తర్వాత ఆయాసంతో ఎక్కలేకపోవటంతో,మా అమ్మ సంగతి ముందే తెలిసినట్లు మేము కారు దిగి కొండ దాకా వచ్చేదాకా మా వెంట కాపలాగా వచ్చిన డోలీ వాళ్ళు ఎక్కించండి జాగ్రత్తగానే తీసుకెళ్ళి,కిందికి తీసుకొస్తాము అని చెప్పటంతో,  మనుషులతో మోపించుకోవటం నాకిష్టంలేదురా అన్న మా అమ్మని ఇక్కడిదాకా వచ్చి,పైకి రాకపోకపోతే అక్కడేముందో నేను చూడలేదే అని ఫీల్ అవ్వాల్సి వుంటుంది, అయినా వాళ్లకి కూడా ఇదే జీవనాధారం కదా..  అని మా తమ్ముడు డోలీ ఎక్కించాడు.వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి,మళ్ళీ తీసుకొచ్చి మా కారుదాకా వదిలారు. ఆ శివయ్యే వాళ్లకి ఆ శక్తి ఇస్తాడేమో జీవనం కోసం అనిపించింది.
Related Posts Plugin for WordPress, Blogger...