పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జనవరి 2016, ఆదివారం

పండరీపురం, తుల్జాపూర్ @ మహారాష్ట్రఎప్పుడో చిన్నప్పుడు భక్తతుకారం సినిమాలో చూసిన పాండురంగడి దర్శనభాగ్యం మాకు ఇన్నాళ్ళకి కలిగింది.మహారాష్టలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ‘పండరీపురం’ అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.శ్రీహరి తనని నిండు మనసుతో వేడుకున్న భక్తులను కాపాడటానికి,దర్శనమివ్వటానికి అప్పటికప్పుడు ప్రత్యక్షమైన సంఘటనలెన్నో పురాణాల్లో ఉన్నాయి.అలా తన భక్తితో శ్రీ మహావిష్ణువునే ఎదురుచూసేలా చేసిన మహాభక్తుడు భక్త పుండరీకుడు. ఆ భక్తుడి పేరుమీదే పాండురంగడిగా వెలిశాడు.శ్రీమహావిష్ణువు  పాండురంగడిగా శిలారూపుడైపోయిన పుణ్యప్రదేశమే పండరీపురం.ఇక్కడ ప్రవహించే భీమా నదిని చంద్రభాగా నది అని పిలుస్తారు.ప్రధానాలయానికి దగ్గరలోనే భీమా నది ప్రవహిస్తూ ఉంటుంది.అక్కడే పుండరీకుని ఆలయం ఉంది.

పురాణాల ప్రకారం దుర్వ్యసనాపరుడైన పుండరీకుడనేవాడు తల్లిదండ్రులను వేధించి,బాధించి చివరికి తప్పు తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రులకు సేవ చేశాడు. తన భక్తుడైన పుండరీకుడ్ని పాండురంగడు పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. ఆ సమయంలో మాతాపితల సేవలో నిమగ్నమయిన పుండరీకుడు మాధవసేవకు మించినది మాతాపితల సేవ అని తలచి,తాను మాతాపితల సేవలో ఉన్నానని, ఒక ఇటుక విసిరి, ఆ ఇటుక పడిన చోట నిరీక్షించమని పాండురంగడికి చెప్పాడట. అప్పుడా శ్రీహరి తన భక్తుడి కోసం వేచి చూస్తూ ఆ ఇటుక పడిన చోటే శిలారూపుడై పోయాడట.


ఇక్కడ పాండురంగడి దర్శనం ముఖ దర్శనం,పాద స్పర్శా దర్శనం అని రెండువిధాలుగా  ఉంది.ముఖ దర్సనం అంటే గర్భగుడికి ముందు నుండి వెళ్ళి దూరం నుండే స్వామిని చూసి వచ్చేయాలి.పాద స్పర్శాదర్సనం మాత్రం క్యూ లైన్లలో రావాలి.అంత దూరం వెళ్లి స్వామిని దూరం నుండి చూస్తే  ఎలా అని పాద స్పర్శా దర్శనం కోసం క్యూలోనే వెళ్ళాము.ఇక్కడ రేటు కొద్దీ టికెట్ సదుపాయం లేదు అందరూ ఒకే క్యూలో వెళ్ళాలి.మేము వెళ్ళినరోజు ఆదివారం కావటంతో విపరీతంగా జనం ఉన్నారు.అందరూ మహారాష్ట్ర వాళ్ళే. తెలుగు భక్తులు వచ్చారేమో కానీ మాకైతే కనపడలేదు.అప్పటిదాకా ఎక్కడాలేని క్యూ మాకు తిరుమలని గుర్తుచేసింది.ప్రధానాలయంలోకి రాగానే చాలా దూరం నుండే సరిగా కనపడీ కనపడకుండా స్వామి  ముఖ దర్శనం చేసుకుంటున్న భక్తులను చూశాక ఇంతసేపు క్యూ లైన్లలో ఉన్నా స్వామిని దగ్గర నుండి చూడొచ్చులే అని అలసట అంతా మాయమయ్యింది. 


ఘనాఘన సుందరా కరుణా రసమందిరా అంటూ పాండురంగడిని కీర్తిస్తూ తరించిన భక్తతుకారాం విగ్రహం గర్భగుడికి పక్కనే ఉంటుంది.ముందు భక్తతుకారం దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తాము.గర్భగుడిలో పాండురంగడు నడుముమీద చేతులు పెట్టుకుని,ధగధగలాడే అలంకరణలో జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు నీవు అన్నట్లు దర్శనమిస్తాడు.స్వామిని పాదాలు తాకి,తలను పాదాలమీద ఉంచి నమస్కరించుకోవచ్చు.గర్భాలయం నుండి బయటికి రాగానే పక్కన చిన్న ఆలయాల్లో రుక్మిణీమాత,సత్యభామ,రాధాదేవి అందరూ నడుము మీద చేతులు పెట్టుకుని నిలబడి దర్శనమిస్తారు.ఇక్కడ ప్రసాదం రాజ్ గిరా లడ్డూ.. మహారాష్ట్రలో ప్రతిచోటా కనపడే ఈ లడ్డూ కొనాలా,వద్దా? ఎప్పుడూ తినలేదు కదా ఎందుకులే అని డౌట్ తో చాలాసార్లు కొనాలని కూడా ఆగిపోయాను. కానీ ఇక్కడ  స్వామివారి ప్రసాదంగా దేవస్థానం వాళ్ళు ఆ లడ్డూ అమ్మటం ఆశ్చర్యంగా అనిపించింది. 


పండరీపూర్ లో మరొక చూడదగిన ప్రదేశం శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్.ఇక్కడ accommodation చాలా బాగుంది. యాత్రీనివాస్ పేరుతో యాత్రికులకి ఇచ్చే కాటేజెస్ ఒక పెద్ద ఫామిలీ అందరికీ సరిపోయేలా నీట్ గా ఉన్నాయి.ముందుగానే ఆన్ లైన్ లో కూడా రూమ్స్ తీసుకోవచ్చు.విశాలమైన ఆవరణలో ఉన్న గజానన్ మహారాజ్ పాలరాతి మందిరం ,ధ్యానమందిరం అన్నీ చాలా అందంగా,పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి.

 శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్
గజానన్ మహారాజ్ మందిరం

తుల్జాపూర్ భవానీమాత మహారాష్ట్రలోని  షోలాపూర్ పట్టణానికి 45  కి.మీ దూరంలోని తుల్జాపూర్ లో కొలువై ఉంది.ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చిన  భవానీమాతగా  అమ్మ ఇక్కడ ప్రసిద్ధి.ఈ క్షేత్రం రాష్ట్రకూటులు,యాదవరాజుల కాలం నుండే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.ఇక్కడి నుండే అమ్మవారు శ్రీరాముడు లంకకి వెళ్ళటానికి దారి చూపించిందని పురాణ కధనం.గుడికి వెళ్ళే దారంతా ఎప్పటిలాగే కొండలు అడవులు.ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు కాలినడకన వస్తూ కనిపిస్తారు. 

 అమ్మవారి  భక్తుల మొక్కుబడి 

ఆలయం దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి అంతటిలో ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపిస్తుంది.అమ్మకి సమర్పించే గాజులు,చీరలు అన్నీ ఆకుపచ్చవే కనిపిస్తాయి.
  
అమ్మవారి పూజా సామాగ్రి

ప్రధాన ఆలయానికి ముందుగా రాజా షాహాజి మహారాజ్ ద్వారం కనపడుతుంది.అతిపురాతనమైన ఈ సమున్నత మహా ద్వారం అప్పటి అపూర్వమైన కట్టడాలకి నిదర్సనంగా అనిపిస్తుంది.

రాజా షాహాజీ మహాద్వార్


ఇక్కడినుండి మెట్లు దిగి లోపలి వెళ్తే విశాలమైన ప్రాంగణంలో అన్నీ పురాతన కట్టడాలే చాలా అందంగా కనిపిస్తాయి.ముందుగా సిద్ధివినాయకుడిని దర్శించుకుని తర్వాత అమ్మని దర్శించుకున్నాము.ఇక్కడ యాత్రికులు చాలా ఎక్కువగా ఉండటంతో అమ్మదర్శనం హడావుడిగా జరిగింది.మహారాష్ట్ర భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకుని వచ్చారు.గిన్నెల్లో,చిన్నచిన్న గంపల్లో రకరకాల ఆహార పదార్ధాలను తెచ్చి అమ్మకి సమర్పిస్తున్నారు.ఆలయ ప్రాంగణంలో మరో విశేషం చింతామణి ఆలయం.ఇక్కడ చింతామణి శిల భక్తుల మనసులో కోరిక తీరుతుందా లేదా అని కదలటం ద్వారా తెలియచేస్తుందని  భక్తుల నమ్మకం.ఆలయ ప్రాంగణంలో ఉన్న యజ్ఞ మండపంలో నవరాత్రులప్పుడు ప్రత్యేకమైన యజ్ఞాలు చేస్తారట.ఇక్కడ షాపింగ్ కూడా వెరైటీగా చాలా బాగుంది.


అమ్మ దయ ఉంటే  అన్నీ ఉన్నట్లే  అమ్మ కరుణా కటాక్షాలు 
ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ .. జై తుల్జాభవానీ దేవ్యై నమః

Related Posts Plugin for WordPress, Blogger...