పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
ఎందరో మహానుభావులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎందరో మహానుభావులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జనవరి 2016, శనివారం

తరాల పాఠకుల రచయిత్రి యద్దనపూడి


మా అమ్మ నవల్స్ సేకరణ
యద్దనపూడి సులోచనారాణి గారు మా అమ్మకి అభిమాన రచయిత్రి. చిన్నప్పుడు చందమామ ,బాలమిత్ర  లాంటి పుస్తకాలు నాన్న తెచ్చేవాడు.. ఆంధ్రభూమి,చతుర విపుల అమ్మ చదివే పుస్తకాలు.ఆంధ్రభూమిలో వచ్చే సీరియల్స్ చాలా వాటిని అమ్మ కట్ చేసి నవల్స్ లాగా బైండింగ్ చేయించేది.మా అమ్మకి మొదట నవల్స్ పరిచయం చేసింది మా విజయవాడ పెద్దమ్మ. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో విజయవాడ వెళ్తే ఆమ్మ ( మేము పెద్దమ్మని "ఆమ్మ" అంటాము ) ఇంటినిండా పుస్తకాలే.. ముఖ్యంగా యద్దనపూడి, యండమూరి, కోడూరి కౌసల్యాదేవి ,కొమ్మనాపల్లి గణపతిరావు లాంటి అప్పటితరం రచయితల పుస్తకాలెన్నో మా ఆమ్మ దగ్గర ఉండేవి.పుస్తకాలంటే ఆసక్తి ఉన్న అమ్మ ఈ పుస్తకాలన్నీ ఎక్కడ తెప్పించావని ఆమ్మని అడిగితే ఎమెస్కో గురించి చెప్పింది. మెంబర్ షిప్ తీసుకుంటే ప్రతినెలా ఇంటికి పుస్తకం VPP ద్వారా పంపించేవాళ్లు అలా అమ్మ చాలా పుస్తకాలు తెప్పించేది.ముఖ్యంగా యద్దనపూడి,యండమూరి నవల్స్ ఏ వున్నాయో ఎమెస్కో వాళ్ళిచ్చే కేటలాగ్ లో వెతికి అవే తెప్పించేది.

నేను మొదట చదివిన నవల యద్దనపూడి సులోచనారాణి గారి "ఈ దేశం మాకేమిచ్చింది" ఒక నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి తన నిజాయితీ వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా వాటి ఎదుర్కొని తన భార్యాపిల్లల్ని కాపాడుకోవాలని తాపత్రయపడే ఆ అధికారి కధ  చాలా బాగుండేది.అప్పట్లో మా పెదనాన్న విజయవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కావటంతో నాకు ఆ నవల చదువుతుంటే మా పెదనాన్న గురించి చదువుతున్నట్లే అనిపించేది.ఉద్యోగంలో, బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఇంటి దాకా తేకుండా ,ఆయన  ఉన్నన్ని రోజులు మా పెద్దమ్మని పసిపిల్లలాగా ప్రేమించి,అందరూ అసూయపడేలా భార్యని చూసుకున్న మా పెదనాన్న నిజంగా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి..ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా వారి గురించి చెడుగా చెప్పుకునే అవకాశం  రాకుండా బ్రతకగలిగే మనుషులు అరుదుగా ఉంటారేమో. ఇలాంటి  గొప్ప వ్యక్తిత్వాలను ఎన్నిటినో తన నవలల్లో పాత్రలుగా యద్దనపూడి పరిచయం చేశారు. 

తర్వాత నవల మీనా ఈ నవల 2 పార్టులుగా వచ్చింది.అప్పట్లో చాలా మంది తల్లులు ఈ నవల చదివి మా ఆడపిల్లలు కూడా ఎక్కడ ఇలా తయారవుతారో అని భయపడేవారట.ఈ నవల్లో కూతుర్ని తన కోరిక ప్రకారం ఉన్నతంగా చూడాలనే తల్లిమనసు, కూతురి పెంకితనం, అనుబంధాలు,ఆప్యాయతలు ఇలా ఎన్నో ఎమోషన్స్ ఈ నవలలోని  పాత్రల్లో చిత్రించారు.యద్దనపూడి.అప్పటి రోజుల్లో మనుషులకి ఆ నవల సరిపోతుందేమో కానీ.. ఊర్లో ఉన్న కాలేజ్ లో ఇంజినీరింగో,ఏదో డిగ్రీనో చదివేసి, సిటీకి వెళ్ళిపోయి,అక్కడి నుండి అమెరికాలు కూడా సొంతగా వెళ్ళిపోతున్న ఈరోజుల్లో  వాళ్లకి మీనా నవల నచ్చుతుందని నేననుకోను.ఈ నవల మీనా సినిమాగా వచ్చింది. 

మా చిన్నప్పటి మర్చిపోలేని మరో జ్ఞాపకం సెక్రటరీ సినిమా .. అప్పట్లో ఎప్పుడైనా స్కూల్ హాలిడేస్ వస్తే నాన్న తీసుకెళ్ళే సినిమాలే కాకుండా, అమ్మ, ఇంటి పక్కల వాళ్ళతో వెళ్ళే మాట్నీ సినిమాలు కూడా మాకో సరదా. అలా నన్ను,తమ్ముడ్ని అమ్మ తీసుకెళ్ళి మరీ హింసించిన సినిమా సెక్రటరీ . అప్పట్లో అలా అనిపించింది కానీ ఇప్పుడు చూస్తుంటే బాగానే ఉంటుంది. :).ఇప్పటికీ ఆ సినిమా వస్తుంటే నాకు,మా తమ్ముడికి చిన్నప్పుటి  విషయం గుర్తొస్తుంది.అప్పటి సెక్రటరీ,జీవనతరంగాలు  సినిమాల్లో యద్దనపూడి నవలానాయిక వాణిశ్రీ అనిపిస్తుంది ఆ సినిమాలు చూస్తుంటే.. ఆ సినిమాల్లో వాణిశ్రీ కట్టుకున్న ఎంబ్రాయిడరీ చీరలు ఇప్పుడు వర్క్ శారీస్ అని వస్తున్నాయి అంటుంది అమ్మ. 

యద్దనపూడి నవలల గురించి అప్పట్లో వచ్చిన ఒక కామెంట్ ప్రతి నవలలో నాయిక ఎక్కడినుండో కలల రాకుమారుడు వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంటుంది.అలాగే ఏదైనా సమస్య రాగానే హీరో వచ్చి కాపాడతాడని ఆశిస్తుంది. ఇలా తనకంటూ ఒక వ్యక్తిత్వం లేని స్త్రీ పాత్రల్ని ఆమె సృష్టించింది.ఇలాంటివి చదివి ఆడపిల్లలు కూడా అలాగే కలలప్రపంచంలో విహరిస్తారు అని విమర్శించే వాళ్ళు... కానీ నాకనిపిస్తుంది స్త్రీ తనకు తానుగా ఎంత స్థాయికి ఎదిగినా,ఎన్ని శక్తి యుక్తులు ఉన్నా తనకంటే అన్నిటిలో ఉన్నతస్థాయిలో ఉన్న తోడునే కోరుకుంటుంది.కానీ నిజంగా అలాంటి హీరో వస్తాడా రాదా అన్నది వాళ్ళ వాళ్ళ అదృష్టం.అమ్మాయిల విషయాల్లో ఇప్పటికీ అప్పటి యద్దనపూడి నవలల్లో  లాంటి పాత్రలు,స్వభావాలు లేకపోలేదన్నది మాత్రం వాస్తవం.
 

సెక్రటరీ నవల ప్రచురితమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాక్షి పేపర్,టీవీలో "తరాల పాఠకుల రచయిత్రి" యద్దనపూడి గారి ఇంటర్వ్యూ,  చూశాక నాకు గుర్తొచ్చిన జ్ఞాపకాలు ఇవి.



23, డిసెంబర్ 2015, బుధవారం

K. G. Maheshwari Photo Art Gallery - Nasik




నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో ఉన్న ఈ మనీ మ్యూజియంలోనే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ K.G. మహేశ్వరి గారి చిత్రప్రదర్శన  కూడా ఉంది. మనీ మ్యూజియం విశేషాలు ఈ పోస్ట్ లో చూడొచ్చు
- Money Museum - Nashik

ఇప్పటిదాకా  K.G. మహేశ్వరి ఎవరో కూడా తెలియని మాకు ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకునే అవకాశం  వచ్చింది అనిపించింది. నవంబర్ 2 1922 లో జన్మించిన K.G. Maheswari - కృష్ణగోపాల్. మహేశ్వరి గారికి  చిన్నతనంలో తండ్రి సంగీతం నేర్పించాలని అనుకున్నారట.కానీ ఆడిషన్స్లో  టీచర్ అతని గొంతు సంగీతానికి పనికిరాదని చెప్పటంతో ఆ నిరాశ నుండి  బయటపడటానికి ఫోటోగ్రఫీ హాబీగా చేసుకుని, చిన్నతనం నుండే ఫోటోలు తీయటం సొంతగా నేర్చుకున్నారు.1938 లో ఆయన ఫోటోకి మొదటిసారి Beginners Section లో ప్రైజ్ గెలుచుకున్న తర్వాత ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఎక్కువయ్యింది .ఆయన తన జీవితంలో 70 సంవత్సరాలు ఫోటోగ్రఫీ లోనే జీవితం గడిపారట. 

National and International Exhibitions లో ఎప్పుడూ పాల్గొంటూ ఉండేవారట.ఫోటో ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించేవారు. ఫొటోగ్రఫీలో K.G. మహేశ్వరిగారు గెలుపొందిన వందల సంఖ్యలో బంగారం, వెండి, కాంస్య  పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లు షీల్డ్స్ ఆయన తీసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల ప్రదర్శన బాగుంది. అందమైన చిత్రాలతో పాటూ వాటి కింద దానికి తగిన టైటిల్,ఆ ఫోటో తీసిన సంవత్సరం  అన్నీ వివరంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఫోటోలలో భావాలు (emotions) సజీవంగా మనకి కనపడతాయి.2014 డిసెంబర్ 5 వరకు జీవించిన ఫోటోగ్రఫీ గురు K.G. మహేశ్వరిగారు ఇప్పటికీ ఆయన చిత్రాల్లో సజీవంగా నిలిచే ఉన్నారు.








K.G . మహేశ్వరీ గారు  బహుమతి గెలుచుకున్న మొదటి ఫోటో 




8, జనవరి 2013, మంగళవారం

స్ఫూర్తి ప్రదాత ... స్వామీ వివేకానంద





స్వామీ వివేకానంద 
(జనవరి 12, 1863 - జూలై 4, 1902)

స్వామీ వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పరిచయము చేసి, హిందూ మతప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన ఆధ్యాత్మిక నాయకుడు,ప్రపంచాన్ని జాగృతం చేసే శక్తిసామర్థ్యాలు కలిగినవాడు.

" మన దేశానికిఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం 
కలిగిన యువకులు కావాలి ’’
‘‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. దాని కోసమే కృషి చెయ్యాలి"
 అంటూ యువతరాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన చనిపోయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన బోధనలు యువతరానికి స్ఫూర్తిదాయకాలు..  ఆయన చెప్పిన ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.. తన బోధనలు, రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత..

వివేకానందుని భోధనలేవీ వర్తమానానికి చెందనివి కాదు.ఆయన ఆధునాతన భావాల్ని ప్రజలకు అందించారు.వారి దూరదృష్టికి కేవలం తక్షణ భవిష్యత్తే ముఖ్యం కాదు.చాలా ముందు తరాల వారిపై కూడా దృష్టి సారించి అప్పటి ఘటనలకు కూడా ప్రాధాన్యం  ఇచ్చారు. ఒక్క మతమే కాక శాస్త్రవిజ్ఞానం, కళ, సారస్వతం, చరిత్ర, రాజకీయాలు, స్త్రీలు ఇలా మానవులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆయన భావనలు సమగ్రమైనవి ..

 నిజమైన మతం -

."ఒక వితంతువు కన్నీరు తుడవలేని,అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గానీ,మతం పట్లకానీ నాకు విశ్వాసం లేదు" 
భారతదేశంలో వర్గరహితమైన,కులరహితమైన సమాజం వర్ధిల్లాలని అభిలషించారు.స్వామీజీ అభిప్రాయం లో ఆదర్శ సమాజం కుల,వర్గ రహితమైనదే కాక,వేదాంత ప్రతిపాదిత పరమార్ధాన్ని,ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించగలదై ఉండాలి.మూర్ఖుని మానవునిగానూ,మానవుని దైవంగానూ మార్చగలిగిన సాధనమే మతం.ప్రపంచంలోని మతాలన్నీ నిజమైనవే,అనుసరణీయమైనవే.సర్వమత సహనంలో మనకు విశ్వాసం ఉండాలి.ఎవరినీ నిరసించవద్దు.తోటివారికి చేయూతనిస్తే మంచిదే అలా చేతకాకపోతే  వారి దారిన వారిని పోనీయటం మానవత్వం అనిపించుకుంటుంది

 దేశం - సమస్యలు

పేదరికం,నిరక్షరాస్యత,కులతత్వం, మొదలైనవి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు.. స్వామీజీ కాలంలో కూడా ఇవి ఉన్నాయి.ప్రస్తుతమున్న సమస్యలు తొలగినా కొత్త సమస్యలు తలెత్తవచ్చు.సమస్యలు లేని జీవితాన్ని  ఊహించలేము. స్వామీజీ దృష్టిలో  సమస్యలకు పరిష్కారం ప్రతిదేశం తమదైన ఆలోచనా సరళిని ఉపయోగించి, తమ సమస్యలకు పరిష్కారాలను ఆలోచించవలసిందే.. ప్రజల నడత,చిత్త శుద్ధి,సరియైన ప్రయత్నం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.."లక్ష్యంపై ఉన్న శ్రద్ధ లఖయ సాధన పై చూపిస్తే విజయ రహస్యం తెలిసినట్లే.."

 స్త్రీలు - సమస్యలు

భారతదేశం లో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత,త్యాగశీలత, సహనము, ఈ గుణవిశేషాలతో విలసిల్లే స్త్రీమూర్తే మాతృమూర్తి.మన స్త్రీలు ఎక్కువ విద్యావంతులు కాకపొయినా పవిత్రతలో వారికి వారే సాటి.మానవుల్లో స్త్రీలు వేరు,పురుషులు వేరు అనే భావనను పెంచిపోషించరాదు. స్త్రీ పురుష భేధాన్ని మర్చిపోయి,అందరు మానవులు సమానమే అనే భావన రానంతవరకు స్త్రీ జనోద్ధరణకు అవకాశం ఉండదు. 

ఏ దేశం కాని.జాతి కానీ స్త్రీలకు తగిన గౌరవం, సమున్నత స్థానం ఈయదో అది ఉన్నతస్థాయిని పొందలేదు.శక్తికి సజీవ స్వరూపాలైన స్త్రీలను సగౌరవంగా చూని కారణంగానే భారతజాతి హీన స్థితికి దిగజారింది."ఎక్కడైతే నారీలోకం గౌరవించబడుతుందో అక్కడే దేవతలు హర్షంతో ప్రజలను దీవిస్తారు".మొత్తం మానవ జాతి ఒక్కటే, అందరూ సర్వసమానతాభావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు కోరుకుంటూ పరస్పర సహకారంతో జీవిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.

మనిషి - ఆత్మవిశ్వాసం

వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు.తాను బలహీనుడిని అని భావిస్తే బలహీనుడవుతాడు. బలవంతుడిని అని భావిస్తే బలవంతుడౌతాడు .కార్యసాధనా యత్నంలో సంభవించే ఆటంకాలను,పొరబాట్లను లెక్కచేయకూడదు.ఓటములను లక్ష్యపెట్టకూడదు.తిరోగమనాలను కూడా సహించాలి.అనుకున్నదిసాధించటానికి వేల ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా వెనుకాడకూడదు.

బలహీనతను తొలగించుకోవాలంటేదాన్ని గురించే చింతిస్తూ కూర్చోకూడదు. బలాన్ని సమకూర్చుకునేప్రయత్నం చేయాలి..ఎవరేమన్నా పట్టించుకోకు నీ విశ్వాసాన్ని సడలనీయకు... ఎవరో ఒక వ్యక్తిని నమ్ముకోకుండా నీయందు నీవు పూర్తి విశ్వాసముంచుకో..అన్ని శక్తులు నీలోనే వున్నాయి.అది తెలుసుకుని వాటిని వినియోగించు."వ్యక్తికి బలమే జీవనం బలహీనతే మరణం.నిరాశకు తావివ్వకుండా గమ్యాన్ని చేరు"

  మానవసేవ - మాధవసేవ

"ప్రతి వ్యక్తిలోనూ పరబ్రహ్మ శక్తి ప్రజ్వరిల్లుతుంటుంది.పేదప్రజలకు సేవ చేయటం ద్వారా ప్రజలు తనకు సేవ చేయాలని పరమాత్మ ఆకాంక్షిస్తాడు".నరకప్రాయమైన ఈ ప్రపంచం లో ఒక వ్యక్తి  హృదయానికి కనీసం ఒక్క రోజైనా శాంతిని,సంతోషాన్ని అందించగలిగితే అదే నిజమైన సేవ అవుతుంది..  తన సహచరులకు మంచి చేసే ఆలోచన లేని సన్యాసి ఒక మూర్ఖుడే కానీ సన్యాసు కాబోడు..

ఆనందం అంటే??

జీవితంలో కొంతమందికి కొన్ని అవసరం కావచ్చు.కానీ అందరికీ అన్నీ అవసరం కాదు. మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నాయన్న దానిమీద మన సంతోషం ఆధారపడదు.సంతోషం అనేది ఒక మానసిక స్థితి. "ఆనందం అనేది మనసులో ఉండేదే" కదా!అభివృద్ది అవసరమే! పురోగతి కావలసినదే!కానీ అవి ఎంతవరకు అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయి? ఈ విషయాలను మనం తప్పక మనస్సులో ఉంచుకోవాలి...


1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో
ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు -
“One infinite pure and holy—
beyond thought beyond qualities I bow down to thee”






 


 







నేను చదివి,సేకరించే పుస్తకాల్లో, కొటేషన్స్ లో వివేకానంద పుస్తకాలు కూడా ఉంటాయి. ఎప్పుడు పుస్తకాలు కొన్నా వివేకానందుడివి కూడా సేకరించటం అలవాటయ్యింది.మంచి మాటలు ఎవరు చెప్పినా విని ఆచరించటం తప్పు కాదు .. ఇతరులకు సందేశాలను ఇచ్చేంత గొప్పవాళ్ళం కాకపొయినా ఇలాంటి మహనీయుల మాటలను అప్పుడప్పుడన్నా గుర్తుచేసుకుంటే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మహానుభావులకి,మూర్ఖులకు తేడా తెలుసుకుని,మనం కనీసం మంచి మనిషిగా ఐనా ఎలా బ్రతకాలో తెలుసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.

నాకు చాలా ఇష్టమైన వివేకానందుని మాటల్లో ఒకటి..
 "వ్యక్తులు ప్రపంచంలోని మొత్తం ధనసంపద కంటే విలువైనవారు" 


వివేకానందుడి 150 వ జయంతి సందర్భంగా ...


23, డిసెంబర్ 2012, ఆదివారం

పదకవితా పితామహుడు - అన్నమయ్య






అన్నమయ్య - తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు .వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం.అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణపధంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి.. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి.

అన్నమయ్య మనుమడు "తాళ్ళపాక చిన్నన్న"  "అన్నమాచార్య చరితము" అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు..అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు
ఈ రచనే ఆధారం.

"తెలుగు పదానికి జన్మదినం - అన్నమయ్య జననం"
సంతానం లేని అన్నమయ్య తల్లిదండ్రులు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని,తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని అన్నమయ్య జన్మగాధ..

తన 8వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోతున్న ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.
"వేడుకుందామా  వేంకటగిరి వేంకటేశ్వరుని
అని  కీర్తిస్తూ  యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య..తిరుమల కొండను  సందర్శించి పరవశం తో
"అదివో అల్లదివో శ్రీ హరివాసము" 
అంటూ  తిరుమల గిరులను  స్తుతించి,గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ,

"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల"
అని వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే  జీవితం గడపసాగాడు అన్నమయ్య.. అన్నమయ్య చెప్పిన కీర్తనలను ఆయన శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో భద్రపరచేవారట ..

అంటూ  లక్ష్మీదేవిని, 
"పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు" అని అలమేలుమంగను 
"పలుకు తేనెల తల్లి  పవళించెను" అంటూ పద్మావతీదేవిని
కీర్తించే అన్నమయ్య కీర్తనలను వినటం అమ్మవారికి కూడా చాలా ఇష్టమట. 

అంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామిని కీర్తించాడు అన్నమయ్య.ఇప్పటికీ బ్రహ్మోత్సవం అంటే అందరికీ గుర్తొచ్చే పాట ఇది.
అంటూ మనుషులందరూ పరబ్రహ్మ స్వరూపమే అని, కులమతాల వివక్షను తొలగించే ప్రయత్నం చేశాడు.

 విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు. అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో ప్రసిద్ధమయ్యింది. 

"ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను" 
అంటూ అన్నమయ్య స్వామివారి శృంగారాన్ని  గురించి పాడిన పాటను విన్న  నరసింగరాయలు తరువాతి కాలంలో  అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట..రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు.

"దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే"
"అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ"
అని స్వామివారిలో ఐక్యం అయ్యాడు అన్నమయ్య..

అన్నమయ్య శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీర్తనా చార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు
  
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అన్నమయ్య  కీర్తనలు ఆ దేవ దేవునికే కాదు ఆబాల గోపాలానికి అన్నమయ్య పాటలు ప్రియమైనవే ...అందుకే కదా ప్రతి తెలుగుతల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ,గోరుముద్దలు తినిపిస్తూ...
"చందమామ రావో జాబిల్లి రావో"
అంటూ  పాడుతూంది..
అంటూ జోలపాడి నిద్రపుచ్చుతుంది.

ఇప్పటికీ తిరుమల గిరివాసుడు అన్నమయ్య మేలుకొలుపు వింటూ నిదురలేచి,జోలపాట వింటూ నిద్రపోతాడట.అన్నమయ్య పాట స్వామి  దైనందిన చర్యలో ఒక భాగమై నిలిచింది.నిధి కాదు హరిపద సన్నిధి చాలా సుఖమని నమ్మి నడచిన పరమభాగవతుడు అన్నమయ్య...అన్నమయ్య పదములు వినగలిగిన మనమూ ధన్యులమే 

 

ఇందరికి అభయమ్ము లిచ్చు చేయి..



  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగంటే అన్నమయ్య పాట అనిపించుకున్నతెలుగు పదకవితా పితామహుడు 
శ్రీ తాళ్ళపాక  అన్నమాచార్యులకు వందనములతో.


 

22, ఆగస్టు 2012, బుధవారం

విశ్వదాభిరామ వినురవేమ...!


"విశ్వదాభిరామ వినురవేమ" అనే ఈ మాట తెలియని, అలాగే ఒక్క వేమన పద్యమైనా రాని తెలుగువాళ్ళు ఉండరేమో... చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఏమి గుర్తున్నా లేకపోయినా వేమన పద్యాలు మాత్రం గుర్తున్నాయి ఇప్పటికీ..

ఎలాంటి భావమైనా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పిన కవి వేమన .. పద్యం మొదటి రెండు పాదాల్లోను నీతిని చెప్పి, మూడో పాదంలో దానికి తగిన పోలికతో .. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటంతో వేమన పద్యాలుంటాయి..

వేమన పద్యం లోని ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.
వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.

ఎవరికైనా కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన ప్రజాకవి వేమన . ఆయన పద్యాలలోనే విలువ గల సలహాలు, సూచనలు, లోకనీతిని తెలిపిన మహానుభావుడు, సమాజంలోని అన్ని సమస్యలను గురించి తన పద్యాలలో వేమన ప్రస్తావించారు.

"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు" పద్యం మనుషులందరూ చూడటానికి ఒక్కలాగే వున్న వాళ్ళ గుణాల్లోని తేడాలను తెలియచేస్తే..
"అనువు కాని చోట అధికులమనరాదు" అన్న పద్యం ఎక్కడ ఎలాగా ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని బోధిస్తుంది.
అలాగే "అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను" అనే పద్యం మంచి వాడికి,చెడ్డవానికి గల తేడాలను తెలియచేస్తుంది..
ఇలా ఎన్నో పద్యాలు మన నిత్య జీవితంలో మనకు అనుభవం అయ్యేవి,ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయి..

నాకు కూడా వేమన పద్యాలలో కొన్ని బాగా గుర్తుండి పోయాయి కొన్ని సంఘటనలను,మనుషులను చూసినప్పుడు ఈ పద్యాలు వెంటనే వాటికి పోల్చుకునేలా గుర్తుకొచ్చేస్తాయి.. వాటిలో కొన్ని పద్యాలు..


ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినురవేమ
!



యినుము విరగనేని ఇరుమారు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి ఆతుకగారాదయా
విశ్వదాభిరామ వినురవేమ!





అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ!



అల్పుడెపుడు
బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!




అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!




అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!




భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!




చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!




గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ!




ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ!



మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!




కస్తూరి నటుచూడ కాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళమ్ము
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !







12, డిసెంబర్ 2011, సోమవారం

రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో...


రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని
కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు
ఏప్రిల్ 29, 1848న జన్మించారు.
రాజా
రవివర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను
చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు.
భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి
అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు.
చీరకట్టుకున్న
స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో
చిత్రించడంలో అతనికి అతనే సాటి.
1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు
ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.
భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ,
1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు.
ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి.
ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.(Wikipedia)

ఎంతో అందంగా వుండి,హుందాగా వుండే రాజా రవివర్మ చిత్రాలు నాకు చాలా నచ్చుతాయి..
వీటిలో శకుంతల అందమైన,అమాయకమైన మొహాన్ని రవివర్మ జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు..
ఇంకా పళ్ళు చేతిలో పట్టుకున్న మహిళ,దమయంతీ హంస సంవాదము,యశోదకృష్ణ చిత్రాలు
చాలా బాగుంటాయి.
రవివర్మ చిత్రాలతో చేసిన "రవి వర్మకే అందనీ" పాటని యూ ట్యూబ్ లో ఇంతకుముందు చూశాను
కానీ 2 రోజుల క్రితం "ఎందుకో? ఏమో !" గారి బ్లాగ్ లో ఈ పాట చూసినప్పుడు నాకు కూడా
ఈ పాటని రవివర్మ చిత్రాలతో చేయాలనిపించింది.

నాకు నచ్చిన రవివర్మ చిత్రాలతో వీడియో మిక్సింగ్ చేసిన పాట:

రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
By:Raaji..




రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
రవి చూడని పాడనీ నవ్య రాగానివో
రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో

ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....
నీ పాటనే ... పాడనీ
రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో

ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
కదలాడనీ ...పాడనీ

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఆ ఆ ఆ
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో

****************
సినిమా:రావణుడే రాముడైతే
మ్యూజిక్:G.K.వెంకటేష్
లిరిక్స్:వేటూరి సుందరరామ్మూర్తి
సింగర్స్:S.P.బాలు,S.జానకి
****************


23, నవంబర్ 2011, బుధవారం

'Who Serves jiva,Serves God indeed'.

ఎందరో మహనీయులు,జీవితంలో విజయం సాధించి ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచిన,
మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట
ఒక
గొప్ప సూక్తిగా,మార్గదర్శకంగా నిలిచిపోతుంది..
అలాంటి స్ఫూర్తి దాయకంగా వుండే కొటేషన్స్ సేకరించటం నాకు హాబీ..
ఇప్పటి దాకా నా బ్లాగ్ లో అలాంటి కొటేషన్స్ కొన్ని పోస్ట్ చేశానుకూడా.

నా బ్లాగ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళలో మా చెల్లి రమ్య,మరిదిగారు భద్ర కూడా ఒకరు.
చెల్లి తనకేదో పుస్తకం కావాలని షాప్ కి వెళితే అక్కడ వివేకానంద కొటేషన్స్ చూసి,
నేను బ్లాగ్ లో పెట్టే కొటేషన్స్ గుర్తుకు వచ్చి అక్కకి ఇవి ఇస్తే బాగుంటుంది కదా అనుకుని
ఇద్దరు నాకు ఈ వివేకానంద కొటేషన్స్ 'Voice Of Freedom' గిఫ్ట్ గా ఇచ్చారు.
నా అభిరుచిని తెలుసుకుని మా చెల్లి,మరిది గారు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు ఎంతో అమూల్యమైనది..
ThankYou భద్రరమ్య

Related Posts Plugin for WordPress, Blogger...