పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2015, గురువారం

Happy New Year - 2016కాలం  డైరీలోని కాగితాలు మాత్రమే  కాదు 
హృదయంలో నిలిచిపోయే ఎన్నో భావాల నిధి కూడా 

అలా నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే సంవత్సరాల్లో 
2015 కూడా ఒకటి.
వేగంగా వచ్చేసి అంతకంటే వేగంగా వెళ్ళిపోతున్న 2015
ఎన్నో సంతోషాలను,ఎప్పటికీ మధురమైన జ్ఞాపకాలను అందించింది. 

2015 కి  వీడ్కోలు చెప్తూ  
కొత్తసంవత్సరం 2016 - Sweet Sixteen కి  
హృదయపూర్వక ఆహ్వానం

Happy new Year .. Happy New Year
30, డిసెంబర్ 2015, బుధవారం

పంచవటి , ముక్తిధామ్ @ నాసిక్

పంచవటి - నాసిక్
నాసిక్ -- గంగమ్మని గోదావరి అని పిలిచి,జ్యోతిర్లింగ రూపంలో త్రయంబకేశ్వరుడు కొలువై,12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళాకి ఆరంభ స్థలం మాత్రమే  కాదు. రాముడు సీతాదేవి,లక్ష్మణుడితో పాటూ 14 సంవత్సరాల వనవాసంలో కొని సంవత్సరాలు నివసించిన పవిత్ర ప్రదేశం కూడా .రాముడి వనవాస కాలంలో శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం కాబట్టి నాసిక్ అనే పేరు వచ్చిందనేది  పురాణ కధనం.నాసిక్ లోని పంచవటి తప్పకుండా చూడాల్సిన ప్రదేశం 

 "అంతా  రామమయం"  అనిపించే ఎన్నో ప్రదేశాలు నాసిక్ లో ఉన్నాయి 

రామ్ కుండ్ 

ఇక్కడ గోదావరిని  రామ్ కుండ్ అంటారు. ఈ నదిలో వనవాస సమయంలో రాముడు స్నానం చేసేవాడు కాబట్టి రామ్ కుండ్ అనే పేరు వచ్చిందట.ఇక్కడ గట్టుమీద గోదావరి ఆలయం కూడా ఉంటుంది.పంచవటి 
 
దండకారణ్యంగా పిలిచే ఈ ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుని సీతారామ లక్ష్మణులు నివసించిన పంచవటి. ఇక్కడ ఐదు వటవృక్షాలు ఉన్నాయి కాబట్టి పంచవటి అని పేరు వచ్చింది.ఇక్కడే సీతాగుహ,కాలారామ్ మందిర్,మారీచవధ మ్యూజియం ఉంటాయి. ఎంతో పెద్దగా పెరిగి ఊడలతో విస్తరించి ఉన్న ఐదు వట వృక్షాలను చూడొచ్చు. ప్రతి వట వృక్షానికి పంచవటి 1,2,3,4,5 ఇలా బోర్డులు పెట్టి ఉన్నాయి కాబట్టి వట వృక్షాలను తేలికగానే గుర్తించొచ్చు.కాలారాం మందిర్ 

వనవాస సమయంలో రాముడు నివసించిన పంచవటికి సమీపంలో నీలమేఘ శ్యాముడిగా రాముడు కొలువైన పురాతన మందిరమే కాలారామ్ మందిర్. Sardar Odhekar of Peshwa ఆధ్వర్యంలో క్రీ.శ. 1788 నుండి క్రీ.శ. 1790 వరకు 12 సంవత్సరాల కాలం పాటూ ,ఆ రోజుల్లోనే 23 లక్షల రూపాయలు ఖర్చుతో .రామ్ సేజ్ నుండి తెచ్చిన నల్లటి రాళ్ళతో ఈ ఆలయాన్ని నిర్మించారు.గర్భాలయంలో సీతారామ,లక్ష్మణుల నల్లటి విగ్రహాలుంటాయి.


సీతాగుహ 

ఐదు వట వృక్షాల మధ్యలో ఒక ఇల్లులాంటి ప్రదేశం లోపలి వెళ్తే సీతాగుహ ఉంటుంది.వనవాస సమయంలో సీతమ్మ ఈ గుహలోనే ఉండేదట.చాలా సన్నటి మెట్లదారి ద్వారా లోపలికి  వంగి, దిగుతూ, కొన్నిచోట్ల నేలమీద పాకుతూ కూడా వెళ్ళాలి.లావుగా ఉండేవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గుహ లోపలికి వెళ్ళొద్దని బయట బోర్డ్ పెట్టారు. కానీ లోపలికి వెళ్ళాక ఎంతలావుగా ఉన్నవాళ్ళకైనా వాళ్లకి తగినట్లుగానే గుహలో దారి ఉన్నట్లుగా అనిపించటం అక్కడి మహిమేమో అనిపించింది.లోపల సీతారామ లక్ష్మణుల అందమైన నిలువెత్తు విగ్రహాలు,సీతమ్మ పూజ చేసినట్లుగా చెప్పే శివలింగం,సీతాదేవి అలంకరణకి ఉపయోగించేదని చెప్పే ఒక చిన్న గది ఉన్నాయి.గుహకి ఒకవైపు నుండి లోపలి వెళ్లి మరో వైపు నుండి బయటికి వస్తాము.అప్పటి గుహకి ఇప్పుడు కొన్ని మార్పులు చేసినట్లుగా అనిపిస్తుంది.పాపం సీతమ్మ బయటి ప్రపంచానికి తెలియకుండా ఇలా ఈ చిన్నగుహలో ఉందన్నమాట అనిపించింది. ఇక్కడి నుండే రావణుడు సీతాదేవిని అపహరించాడట.


సీతాగుహలోకి వెళ్ళే దారి
 సీతాహరణ్ ,మారీచ వధ మ్యూజియం 
సీతాగుహ ఎదురుగానే సీతమ్మని రావణుడు అపహరించటం,బంగారులేడి, మారీచవధకి సంబంధించిన కొన్ని చిత్రాలు,విగ్రహాలతో మ్యూజియం ఉంది.1 రూపాయి టికెట్ తీసుకుని లోపలి వెళ్లి చూడొచ్చు. కెమెరాలను లోపలికి అనుమతిస్తారు.

సీతాహరణ్ ,మారీచ వధ మ్యూజియం


 

సర్వదేవతా ముక్తిధామ్  -నాసిక్ 

నాసిక్ లో మరో ముఖ్యమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం"ముక్తిధామ్" సకలదేవతా నిలయం. రాజస్థాన్ మకరానా మార్బుల్ తో కట్టిన ఈ ముక్తిధామ్ 165 అడుగుల ఎత్తులో,విశాలమైన ఆవరణలో ప్రశాంతంగా ఎంతో అందమైన దేవాలయం. పారిశ్రామిక వేత్త J.D చౌహాన్ ఈ అపురూప కట్టడాన్ని నిర్మించారట.ముక్తిధామ్ ని బిర్లా  టెంపుల్ అని కూడా అంటారట. మందిరం ముందు భాగంలో ఓంకారం,దాని కిందే సప్తాశ్వరధంపై ప్రత్యక్షదైవం,సూర్యభగవానుడు కనిపిస్తాడు.ఆలయం ప్రధాన దైవం శ్రీరాముడు.ఆలయ ముఖమండపం లోపలి వెళ్ళగానే ఎదురుగా సీతారామ లక్ష్మణులు,ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహాలు అందమైన అలంకరణలో మెరిసిపోతూ ఎంత చూసినా తనివితీరనంత చూడచక్కగా  ఉన్నాయి.పక్కనే మరో మందిరంలో చతుర్భుజాలతో,సర్వాలంకార భూషితుడైన లక్ష్మీ ,నారాయణుల పాలరాతివిగ్రహాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు వేణువూదుతూ తన ఇష్టసఖి రాధతో కలిసి ఉన్న పాలరాతివిగ్రహం ఆ కృష్ణయ్య లాగానే జగన్మోహనంగా ఉంది.

ఆలయంలోని  చిన్న చిన్న దేవాలయాల్లో బద్రీనాధ్ ధామ్,శ్రీ మహావిష్ణు రూపాలు,వెంకటేశ్వరస్వామి తిరుపతి బాలాజీగా, సత్యనారాయణ స్వామి,పూరీ జగన్నాధుడు,పాండురంగడు సూర్యభగవానుడు చిన్న విగ్రహాలుగా కొలువై ఉన్నారు. పాలరాతి కైలాసగిరి పైన ఆదిదంపతుల దర్శనం,ద్వాదశ జ్యోతిర్లింగాలు,ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వారణాసిలోని ఆలయ నమూనాలో జలాభిషేకం అందుకుంటున్న కాశీవిశ్వేశ్వరుడ్ని శివరూపాలుగా దర్శించుకోవచ్చు. నవగ్రహాలు   కూడా వాహన సహితంగా ఇంతకుముందు ఎక్కడా చూడనంత అందంగా పాలరాతితో కొలువైఉన్నారు.గాయత్రీ మాత ,సరస్వతీమాత, కార్తికేయుడు, వినాయకుడు, హనుమంతుడు, దత్తాత్రేయస్వామి, ఎందరో యోగులు,సిక్కుగురువు గురునానక్ ఇలా సర్వదేవతలను ఒకే చోట దర్శించే ముక్తిధామ్ సంపూర్ణ తీర్ధయాత్ర.  
 


మేము ముక్తిధామ్ దర్సనం చేసుకునేటప్పటికి డిన్నర్ టైమ్ కావటంతో ముక్తిధామ్ వెనకవైపు  ఉన్న పురోహిత్ హోటల్ కి వెళ్ళాము.హోటల్ పురోహిత్ మహారాష్ట్ర ట్రిప్ మొత్తంలో మాకు నచ్చిన ఫుడ్, ప్లేస్ కూడా.. హోటల్ చాలా నీట్ గా,చక్కని ఇంటీరియర్ డెకరేషన్,భోజనం సర్వ్  చేసే వాళ్ళ పధ్ధతి కూడా బాగుంది.ఇక్కడ గుజరాతీ థాలీ చాలా బాగుంది. ఇంట్లో అతిధులని చూసుకున్నట్లుగా జాగ్రత్తగా గమనిస్తూ అడిగి మరీ ,మనం వద్దు తినలేము అనేదాకా పదార్ధాలను వడ్డించటం ఇక్కడ ప్రత్యేకత అనొచ్చేమో.


ఆత్మీయ స్వాగతం పలుకుతున్న గ్రామీణులు

28, డిసెంబర్ 2015, సోమవారం

గోదావరి జన్మస్థానం - బ్రహ్మగిరి గంగాద్వార్ నాసిక్కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో 
ఎప్పుడైనా కరెంట్ పోతే లిఫ్ట్ లేక 2nd ఫ్లోర్ దాకా మెట్లు ఎక్కేసరికే ఆయాసం వస్తుంది.అలాంటిది త్రయంబకేశ్వరం లోని బ్రహ్మగిరి పర్వతాన్ని ఎక్కి, గోదావరి నది జన్మస్థానం గంగాద్వార్ చూడటం మాకు ఒక సాహసయాత్ర.,జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకం.

బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అనే  ఐదు శిఖరాలు ఉన్నాయి.బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు.

గౌతమ మహర్షి గోహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి శివుడిని తన తపస్సుతో మెప్పించి, గంగమ్మను ఈ కొండపైకి వచ్చేలా చేసి,ఆ గంగానదిలో స్నానం చేయటం ద్వారా తన పాపాన్ని  పోగొట్టుకున్న ప్రదేశమే బ్రహ్మగిరి.  తమిళనాడులోని అరుణాచలం లాగా ఇక్కడ బ్రహ్మగిరి కూడా శివస్వరూపంగా చెప్తారు.శ్రావణమాసంలో ప్రతి సోమవారం  బ్రహ్మగిరి ప్రదక్షిణ చేయటం ఇక్కడి విశిష్టత .

సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో,త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉన్న బ్రహ్మగిరికి అక్కడి ప్లేసెస్ లో డ్రైవింగ్ అలవాటు ఉన్నవాళ్ళు వెళ్తారట కానీ మా డ్రైవర్ రాజు నేనే తీసుకెళ్తానని ధైర్యంగా చెప్పటంతో మా కార్ లోనే వెళ్ళాము.కొండ చాలా ఏటవాలుగా సన్నటి దారితో ఉంది.ఇక్కడికి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా వస్తారట.


బ్రహ్మగిరి పర్వతం మధ్య దాకానే కార్లు,జీపులు  వెళ్తాయి అక్కడ  నుండి మట్టిరోడ్డు లో కాలినడకన సుమారు 750 మెట్లు ఎక్కి గంగాద్వార్  చేరుకుంటాము.ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం డోలీలు కూడా ఉన్నాయి.పర్వతం మధ్యలో చిన్న చిన్న రాళ్ళు తేలిన పూర్తి మట్టిరోడ్డు మీద నడక కొత్తప్రయోగం. కష్టమే అనిపించినా పట్టుదలగా వెళ్ళాము.

ఈ పర్వతం ఎక్కడానికి 1908 కాలంలో లో కరాచీకి చెందిన సేథ్ లాల్ చంద్ జశోదానంద్  బంభానీ ,సేథ్ గణేష్ దాస్  లు 40,000 ఖర్చుతో 500 రాతిమెట్లు నిర్మించారు. అప్పటినుండి ఈ కొండ ఎక్కడం సులువయ్యిందట.మట్టిరోడ్డు మీద కొంత  దూరం నడిచి వెళ్ళాక కొండ చివరిగా రాతి మెట్లు కనపడతాయి.

కొండపైకి ఎక్కే  రాతిమెట్లు
ఈ మెట్లు ఎక్కి పర్వతం మధ్య భాగానికి చేరుకోగానే గంగమ్మ  మొదటగా ప్రత్యక్షమైన చోటనే గంగామాత  ఆలయం - గంగాద్వార్ (గోదావరి పుట్టిన ప్రదేశం) ఉంది.ఇక్కడే ఉన్న  గోముఖం నుండి గంగాధార వస్తుంటుంది.ఆ జలాన్ని అక్కడి పూజారి మన మీద చల్లి,గంగామాతకి పూజ చేయిస్తాడు. 


గోహత్యాపాతకం పోగొట్టుకోవటం కోసం గౌతమ మహర్షి ప్రతిష్ఠించి అభిషేకాలు చేసిన 108 శివలింగాలను ప్రతిష్టించి పూజ చేసిన గుహ,గోరఖ్‌నాథుని గుహ ఈ పర్వతం పైనే ఉన్నాయి.గంగా ద్వార్ కి పక్కనే కోలాంబికా (పార్వతీ) దేవి ఆలయం కూడా ఉంది.


గౌతమ మహర్షి అహల్యా మాతతో కలిసి 108 శివలింగాలకు అభిషేకం చేస్తూ తపస్సు చేసిన గృహాలయం.చాలా చిన్నగా ఉండే ఈ గృహలోకి వంగి వెళ్తే లోపల 108 చిన్న శివలింగాలు, వాటి మధ్యలో గౌతమ మహర్షి వెండి విగ్రహం కనిపిస్తాయి.

గౌతమ మహర్షి గుహ
గౌతమ మహర్షి,అహల్యాదేవి తపస్సు చేసిన గుహ
గోరఖ్ నాధ్ గుహ 
బ్రహగిరి పర్వతం ట్రెక్కింగ్,ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్న వాళ్లకి చాలా నచ్చుతుంది. కొండ ఎక్కటం కొంచెం కష్టమే అయినా పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుండి కనపడే ప్రకృతి అందాలు,వాతావరణం కూడా చల్లటి గాలులతో హాయిగా ఉండటంతో అన్ని మెట్లు ఎక్కినా అలసట అనిపించలేదు.కొంచెం కష్టపడినా మంచిప్రదేశాన్ని చూశాము అనిపించింది. కొండపైన గంగాద్వార్,అక్కడే జన్మించిన గంగమ్మ నీళ్ళని చేతుల్లోకి తీసుకుంటే ఇది నిజమేనా అనేంత సంతోషం కలిగింది. అక్కడ ఎంతసేపున్నా విసుగనిపించలేదు,వర్షాకాలం అయితే అంతా పచ్చగా అక్కడక్కడా చిన్న చిన్న జలపాతాలతో ఇంకా బాగుంటుందట.ఇక్కడ కోతులు కూడా కొండల మీద హాయిగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.

 కొండ కింద నిలబడి చూస్తే గౌతమ మహర్షి గుహ, గోరఖ్ నాధ్ గుహ రెండూ ఇలా సున్నంతో మార్క్ చేసిన గుర్తులు మాత్రమే  కనిపిస్తాయి.
కొండ కింద నుండి చూస్తే గుహలు ఇలా కనిపిస్తాయి 

బ్రహగిరి మీద నుండి కనపడే అంజనేరి పర్వత సమూహం 
పర్వతాన్ని ఎక్కే మెట్ల దారి వెంట చిన్న చిన్న పాకలు వేసి ఇలా నిమ్మరసం,టీ, మంచినీళ్ళు ,కీరదోస ముక్కలు
అమ్ముతూ ఉంటారు. అలసట అనిపిస్తే  ఇలాంటివి ఉపయోగపడతాయి. 


మేమందరం మెట్లు ఎలాగోలా బాగానే ఎక్కాము కానీ, మా అమ్మ సగం వరకు అలాగే ఓపికగా ఎక్కినా ఆ తర్వాత ఆయాసంతో ఎక్కలేకపోవటంతో,మా అమ్మ సంగతి ముందే తెలిసినట్లు మేము కారు దిగి కొండ దాకా వచ్చేదాకా మా వెంట కాపలాగా వచ్చిన డోలీ వాళ్ళు ఎక్కించండి జాగ్రత్తగానే తీసుకెళ్ళి,కిందికి తీసుకొస్తాము అని చెప్పటంతో,  మనుషులతో మోపించుకోవటం నాకిష్టంలేదురా అన్న మా అమ్మని ఇక్కడిదాకా వచ్చి,పైకి రాకపోకపోతే అక్కడేముందో నేను చూడలేదే అని ఫీల్ అవ్వాల్సి వుంటుంది, అయినా వాళ్లకి కూడా ఇదే జీవనాధారం కదా..  అని మా తమ్ముడు డోలీ ఎక్కించాడు.వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి,మళ్ళీ తీసుకొచ్చి మా కారుదాకా వదిలారు. ఆ శివయ్యే వాళ్లకి ఆ శక్తి ఇస్తాడేమో జీవనం కోసం అనిపించింది.
25, డిసెంబర్ 2015, శుక్రవారం

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం - నాసిక్ తీర్ధయాత్ర విశేషాలుచిన్నప్పటినుండి ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్ళటం మాకు ఇష్టమైన తీర్ధయాత్ర.అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఉండే శిలాఫలకం చదువుతూ అవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, మనం చూడగలమా అనుకునేదాన్ని.నా భక్తిప్రపంచం బ్లాగ్ లో శివుడి పాటలు స్తోత్రాలు పోస్ట్ చేస్తున్నప్పుడు  ఎప్పుడైనా నెట్ లో ద్వాదశ జ్యోతిర్లింగాలు చూస్తూ జ్యోతిర్లింగాలు చూడాలన్న కోరిక పెరిగిపోయింది... మా ఫ్యామిలీ అందరితో కలిసి సాయినాధుని షిరిడి తో పాటు,మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వర్ , భీమశంకర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు దర్శనం చేయించటం ఆ శివయ్య దయ.. జీవితంలో మరిచిపోలేని సంతోషకరమైన, అద్భుతమైన  తీర్ధయాత్ర. 

షిరిడీలో బాబా దర్శనం అయ్యాక  రాత్రికి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే త్రయంబకేశ్వర్  వెళ్ళాలనుకున్నాము..షిరిడీ నుండి నాసిక్ 83 km...అక్కడినుండి త్రయంబకేశ్వర్ 30 km...మొత్తం 2 గంటల ప్రయాణం.కార్తీకమాసం చివరి రెండు రోజుల్లో జ్యోతిర్లింగాలు చూడబోతున్నామన్న ఆనందం ముందు నిద్ర,చలి ఏమీ గుర్తురాలేదు.ఉదయాన్నే నాసిక్ బయల్దేరాము.ఆరోజు గురువారం దారంతా షిరిడీ చుట్టుపక్కల గ్రామాల నుండి బాబా పల్లకీలు మోసుకుంటూ కాలినడకన వస్తున్న భక్తులు చాలా చోట్ల కనిపించారు.దీన్ని "సాయిచరణ్ పాదయాత్ర" అంటారట.

షిరిడీ - నాసిక్ దారిలో బాబా సాయిచరణ్ పాదయాత్ర
దాదాపు గంటన్నరలో నాసిక్ చేరుకున్నాము.నాసిక్ జిల్లా కేంద్రం.మహారాష్ట్రలో 3వ పెద్దజిల్లా,కుంభమేళా సమయంలో ఎక్కువగా వినపడే పేరు కూడా..ఇక్కడ వనవాస కాలంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు కాబట్టి నాసిక అన్న పేరు వచ్చిందని పురాణాల్లో చెప్తారు. పంచవటి,ముక్తిధామ్,పాండవుల గుహలు అన్నీ తిరిగి వచ్చేటప్పుడు చూడాలనుకుని త్రయంబకేశ్వర్ బయల్దేరాము.


నాసిక్  నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో మాకు తెలియని కాయిన్ మ్యూజియం GPS లో కనపడింది.
ఈ మ్యూజియం గురించి పూర్తి  వివరాలు,ఫోటోలుఈ పోస్ట్స్ లో చూడొచ్చు. 
మనీ మ్యూజియం - నాసిక్
K. G. Maheshwari Photo Art Gallery - Nasik

త్రయంబకేశ్వరం వైపు వెళ్తున్న దారంతా కొండలు కనిపిస్తూ ఉన్నాయి.ఆ కొండని అంజనేరి పర్వత్  అంటారు. ఈ  కొండమీదే అంజనాదేవి తపస్సు చేయగా ఆంజనేయ స్వామి జన్మించాడని చెప్తారు.ఇక్కడ ఆంజనేయ స్వామి,అంజనా దేవి దేవాలయాలు ఉన్నాయట.
అంజనేరి పర్వత్ - నాసిక్ 
సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న త్రయంబకేశ్వర్ చేరుకున్నాక గైడ్స్ వచ్చి ఆ చుట్టుపక్కల ప్లేసెస్ చూపిస్తామని అడుగుతుంటారు.మాకెలాగూ ఆ ప్రదేశం కొత్త కాబట్టి ఒక గైడ్ ని మాట్లాడుకొని ముందుగా కుశావర్త కుండంలో స్నానం చేయటానికి వెళ్ళాము.

కుశావర్త తీర్ధం
ప్రధానాలయానికి దగ్గరలోనే ఉన్న కుశావర్త కుండం వోల్‌వోకర్ శ్రీరావ్‌జీ సాహెబ్ పాఠ్‌నేకర్ క్రీ.శ. 1690-91లో నిర్మించాడట. ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ నాగసాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు.గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త కుండంలో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన తపశ్శక్తి ద్వారా వరుణుడిని మెప్పించి అక్షయమైన ఒక సరస్సును నిర్మించాడు.ఆ నీటి ఫలితంగా పరిసర ప్రాంతాలు చిగురించి,నివాసయోగ్యం కాగానే ఎక్కడెక్కడి ఋషులు అక్కడికి చేరి నివాసం ఉంటూ..గౌతముని మీద అకారణంగా అసూయ పెంచుకున్నారట.

ఓసారి గౌతమమహర్షి తన పొలంలో మేస్తున్న ఆవుని వెళ్ళగొట్టటానికి ఓ దర్భను విసిరాడట. సూదిమొన గుచ్చుకుని అది ప్రాణం విడిచింది .సమయం కోసం చూస్తున్న తోటి ఋషులు నీకు గోహత్యాపాతకం అంటుకుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు తగిన ప్రాయశ్చిత్తం చేసుకొమ్మన్నారు. గోహత్యా పాతకం చుట్టుకున్న గౌతముడు, దాన్ని తొలగించుకోవటానికి  అహల్యాదేవితో కలిసి బ్రహ్మగిరిమీద 108 శివలింగాలను ప్రతిష్టించి తపస్సు చేశాడట. తపస్సు మెచ్చిన శివుడు గంగను ప్రసాదించి,ఈ గంగ గౌతమి అనే పేరుతో ప్రవహిస్తుంది,నేను త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఈ గౌతమీ తీరంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు.

గంగమ్మ ప్రవాహ వేగాన్నిఆపలేని గౌతమ మహర్షి ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ కుశ అనే గడ్డి వేసి ఎటూ వెళ్లకుండా చేసి స్నానం చేశాడట అదే తీర్ధరాజం కుశావర్త కుండంగా  వాడుకలోకి వచ్చింది. చల్లటి నీటితో ఆహ్లాదకరంగా ఉన్న ఈ కుశావర్త కుండంలో మేము  కూడా స్నానాలు చేశాము.ఇక్కడి గుడులు,పరిసరాలు అన్నీ నల్లటి రాతి కట్టడాలు. ప్రాంగణంలోనే  ఉన్న కేదారేశ్వర స్వామిని ,కుశావర్తంలోకి నీరు వచ్చే ప్రదేశంగా చెప్పే చోట శేషశయనుడుగా లక్ష్మీదేవితో కలిసి ఉన్న విష్ణుమూర్తికి నమస్కరించుకుని,జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన త్ర్యంబకేశ్వర ఆలయానికి బయల్దేరాము.

కుశావర్త కుండం దగ్గరలోని శివాలయం
త్రయంబకేశ్వర ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాడట.గుడిచుట్టూ ఎత్తైన నల్లటి గట్టిరాతి ప్రహరీ గోడలున్నాయి.లోపలి వెళ్ళగానే పైన 2 బంగారు కలశాలతో నల్లని రాతితో చెక్కిన , సమున్నతమైన గోపురం శిల్పకళ చాలా కొత్తగా అందంగా కనిపిస్తుంది.లోపలి వెళ్లగానే అక్కడి ఆలయ ప్రాంగణంలో గర్భాలయంలో ఉన్నలాంటి శివలింగమే ఉంటుంది.అక్కడ నమస్కరించుకుని గర్భగుడికి దగ్గరగా ఉన్న క్యూలైన్ నుండి వెళ్ళాము. ఆలయ ప్రాంగణం బయటే కాదు లోపల కూడా చాలా విశాలంగా,భక్తులు తక్కువగానే ఉండటం వలన ప్రశాంతంగా ఉంది.

 

గర్భగుడిలోని స్వయంభువైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం  అన్ని ఆలయాల్లో శివలింగంలాగా లేదు. శివలింగం ఉండాల్సిన ప్రదేశం గొయ్యిలాగా ఉండి అందులో బ్రహ్మ,విష్ణు శివ రూపాల్లా చెప్పబడే 3 చిన్న శివలింగాలు కనపడతాయి.శివలింగం గర్భగుడిలో కిందకి ఉంది.కనీసం మూడు మెట్లు దిగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది.బయటినుండే దర్శనం చేసుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా చూస్తూ దర్శనం చేసుకుంటేనే జ్యోతిర్లింగ స్వరూపం అర్ధమవుతుంది.ఈ మూడు లింగాల్లో శివరూపం అని చెప్పేచోట ఎప్పుడూ నీరు వస్తూ శివుడికి అభిషేకం జరుగుతుందట. ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు మేము గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో కూర్చుని అక్కడ పూజారితో అభిషేకం చేయించుకుని స్వామి దర్శనం చేసుకున్నాము.గర్భాలయానికి దగ్గరగా ఉన్న మండపంలో కూర్చుని త్రయంబకేశ్వరుణ్ణి ఎదురుగా ఉన్న అద్దంలో,గర్భగుడి వాకిలి మీద ఉన్న టీవీ స్క్రీన్ మీద ఎంతసేపైనా చూడొచ్చు. 


అభిషేకాలు చేయాలనుకుంటే ఉదయం ఆరుగంటలకి మాత్రమే గర్భగుడిలోకి అనుమతిస్తారట.ఇక్కడ గర్భగుడిలోకి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు.అభిషేకం చేయాలనుకుంటే మగవాళ్ళు మాత్రమే లోపలి వెళ్లి అభిషేకం చేసి  రావాలి. శివలింగంలో బ్రహ్మ రూపం కూడా ఉందని అందుకే ఆడవాళ్ళని గర్భగుడిలోకి రానివ్వరని తెలుస్తుంది.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం తర్వాత మేము చూసిన రెండవ  జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం... శివయ్య సన్నిధిలో ఉన్నంత సేపు చుట్టుపక్కల పరిసరాలతో సంబంధం లేకుండా, మనసు తేలికైనట్లు,ముఖ్యంగా అంతదూరాన ఉన్న శివయ్యని చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది..కార్తీకమాసం చివరి రోజున మహిమాన్వితమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కలగటం నిజంగా శివయ్య మా మీద చూపించిన కరుణ, మా అదృష్టం.గుడి నుండి బయటికి రాగానే బయటంతా రకరకాల రుద్రాక్షలు,పూసలు,శంఖాలు రోడ్లమీదే పెట్టి  అమ్ముతున్నారు. రుద్రాక్షమీద శివలింగం,నాగపడగలు ఉన్న రుద్రాక్షలు చెట్టుకొమ్మలకే ఉన్నట్లు చెక్కిన రుద్రాక్షలు వింతగా ఉన్నాయి.
వెరైటీ రుద్రాక్షలు

ఇక్కడినుండి మా ప్రయాణం మా గైడ్ చెప్పిన ప్రకారం గోదావరి జన్మస్థానం బ్రహ్మగిరికి.

నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ , మహాదేవాయ, త్రయంబకాయ
త్రిపురాంతకాయ, త్రికాలాగ్ని- కాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, 
మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః Related Posts Plugin for WordPress, Blogger...