పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 2
ఎక్కడికొచ్చానా అన్నదే అర్ధం కాక చస్తుంటే వెనక ఏముందో , ఏమి జరుగుతుందో తెలియలేదు.. ఇప్పుడేమి చేయాలో తెలియదు. సరే చూద్దాం అనుకుని,బలంగా మూసుకున్న కళ్ళు తెరిచి చూసిన నాకు అస్పష్టంగా కనపడ్డ ఆకారాలు మరింత భయాన్ని పెంచాయి. రకరకాల మానవ శరీరాలు బల్లల మీద, కొన్ని వేలాడుతూ, కొన్ని సవ్యంగా,పూర్తిగా శరీరభాగాలు లేని వింత వింత ఆకారాల్లో  భయం గొలిపేలా నన్నే చూస్తున్నట్లు అనిపించేలా ఉన్నాయి. అప్పుడర్ధమయ్యింది నాకు ఎక్కడికి వచ్చానో ..

అది డిసెక్షన్ లాబ్ ... వివిధ రకాల ప్రయోగాల  ( ఎనాటమీ డిసెక్షన్ కోసం ఉపయోగించే బాడీలున్న ప్రదేశం.నాకు దారి చెప్పిన వ్యక్తి   కావాలనే నన్ను ఇక్కడికి పంపాడని  అర్ధం అయ్యింది . ఇంతలో  అరేయ్ మాధవ్ నేనురా రఫీని నన్ను గుర్తుపట్టలేదా అంటూ వెనకనుండి నన్ను పట్టుకున్న ఆకారం ముందుకు వస్తూ కనపడింది . సరిగ్గా చూసిన నాకు అప్పుడు అర్ధం అయ్యింది ఆ ఆకారం రఫీ అని నాకు APRJC  ఇంటర్ లో సీనియర్ ...   

ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది .. నా బొంద నువ్వేమన్నా సవ్యంగా తగలడ్డావా  నేను గుర్తు పట్టటానికి అని మనసులో అనుకుని బయటికి మాత్రం  ఏమీ అనలేక రఫీ నువ్వా . Happy To  See You Here .. ( నిజంగానే ఇలాంటి పరిస్థితిలో నాకు తెలిసిన మనిషి  కనపడటం సంతోషంగానే ఉంది ) ఇంటర్ అయ్యాక నీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఇప్పుడు MBBS సెకండ్ ఇయరా,ఇక్కడే జాయినయ్యావా  ప్రశ్నల వర్షం కురిపించాను.

నన్ను ఆపుతూ ఏరా మాధవ్ ఇవన్నీ ఇక్కడే మాట్లాడాలా .. అయినా అప్పుడే ఇక్కడికి వచ్చావేంట్రా మొదటిరోజే అన్నీ నేర్చుకోవాలని అంత  తొందరా?  అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు .. నేను కూడా పరుగులాంటి నడకతో రఫీని అనుసరించి ఇద్దరం బయటికి వచ్చేశాం.. నువ్వు ఇటు రావటం చూసి వెనకే వచ్చాను ఇప్పుడు చెప్పు ఇక్కడున్నావేంటి  అనగానే జరిగింది చెప్పిన నన్ను చూసి పగలబడి నవ్వి, అయితే సీనియర్ చేతిలో రాగింగ్ కాబడ్డ  మొదటి స్టూడెంట్ అన్నమాట మన బ్యాచ్ లో అన్నాడు.. 

మన బ్యాచా   ..! అదేంటి రఫీ నువ్వు ఇప్పుడు 1 st ఇయరా అన్నాను . అవున్రా నువ్వు ఒక  లాంగ్  టర్మ్  అయితే నేను రెండు లాంగ్ టర్ముల్లే  మొత్తానికి మళ్ళీ కలిశాం .. పద క్లాస్ కి వెళదాం అంటూ ఇద్దరం క్లాస్ కి వెళ్ళే సరికి అమ్మాయిలంతా ఒకవైపు,అబ్బాయిలు ఒక వైపు క్లాస్ లో నిండుగా కూర్చుని వున్నారు.అప్పటికే ప్రిన్సిపాల్ welcome speech మొదలుపెట్టారు ..

డియర్ స్టూడెంట్స్  ఫ్రెషర్స్ గా ఇప్పుడు మీ మనసుల్లో రకరకాల భావాలుంటాయి. సంతోషం,ఆశ్చర్యం,ఉద్వేగం, ఏవో గొప్ప ఆశలు,మరో వైపు ఏవో అనుమానాలు, భయాలు,సందేహాలు,అనిశ్చితి ఇలా అటు ఇటు కాని డోలాయమాన పరిస్థితిలో ఉంటారు.ఇవన్నీ నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఇలాంటి పరిస్థితి దాటే  వచ్చాను కదా..ఇప్పుడు మీరందరూ  నాకు కొత్త మొహాలు .. మీలో మీరు కూడా  ఒకరికొకరు  కొత్త మొహాలే కానీ కొన్నాళ్ళ తర్వాత అందరం పరిచయస్తులం, ఫ్రెండ్స్ కూడా అవుతాం .. ఇప్పుడున్న భయాలు అప్పుడుండవు.మీరే మరొకరికి
మార్గదర్శకులవుతారు..(నిజమే ఇక్కడ మంచి మార్గదర్శకులే ఉన్నారు అనుకున్నాను మనసులో )

ఈ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకుని మంచి పని చేశారు  ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి డాక్టర్లుగా సర్వీస్ చేస్తున్నారు ( ఈ మాట మాత్రం నిజమే మా నాన్న ఇందుకు ఉదాహరణ ) సో స్టూడెంట్స్ అందరూ మంచి ఫ్రెండ్స్ గా , ప్రొఫెసర్లని గౌరవిస్తూ .. నేడు  ఇక్కడ విద్యార్ధులుగా నేర్చుకోవటానికి వచ్చిన మీరు భవిష్యత్తులో మంచి డాక్టర్స్ గా సేవ చేయటానికి ప్రజల్లోకి వెళ్తారని, మన కాలేజ్ పేరు ప్రతిష్టలు నిలబెడతారని ఆశిస్తున్నాను .. All  The Best అంటూ స్పీచ్ ముగించారు.. "ఒక నోటీస్" .. రేపు సీనియర్స్ మీకు వెల్కమ్ చెప్తామంటున్నారు (ఫ్రెషర్స్ డే పార్టీ)  అందరు అక్కడ తప్పకుండా కలుసుకోండి  Have A Good Day అని చెప్పి ప్రిన్సిపాల్ వెళ్ళిపోయారు..

అందరం బయటికి వచ్చాం నాకు ఇందాకటి సంఘటన గుర్తొచ్చింది. మొదటిరోజే ఇలా జరగటం ఎందుకో మనసుకు బాధగా,  కొంచెం చిరాకుగా  అనిపించింది ...


Related Posts Plugin for WordPress, Blogger...