పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, ఫిబ్రవరి 2015, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 18




ఛాలెంజ్ గెలిచిన ఆనందంలో కావ్య ఇంటికి వెళ్ళేముందు హేమంత్ కి చెప్పటం కూడా మర్చిపోయాను.నాకు కావ్య పరిచయం అయిందే హేమంత్ వల్ల కదా .. కానీ ఆ సమయంలో అవేమీ గుర్తు రాలేదు.నేను వెళ్లేసరికి ఆంటీ,కావ్య,వాళ్ళ చెల్లి,తమ్ముడు అందరూ ఇంట్లోనే ఉన్నారు.ఆంటీ ఎప్పటి లాగానే ఆప్యాయంగా పలకరిస్తూ లోపలి రమ్మని పిలిచింది.మాధవ్ నీ  చైన్ పోయిన తర్వాత నువ్వు మళ్ళీ మా ఇంటికి రానేలేదు.ఏమి చేస్తాం నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను.నువ్వేమో పోలీసులు, కేసులు ఇష్టం లేదని FIR చేయొద్దు అన్నావు అలా చేస్తే తనకి ఇబ్బంది అవుతుందని ఆ CI అంకుల్ భయపడ్డారు అంది. పర్లేదులే ఆంటీ దేనికైనా ప్రాప్తం ఉండాలి అంటారు కదా అన్నాన్నేను సింపుల్ గా . 

మాటల్లో రాత్రి జరిగిన విషయం అంతా కావ్యకి,ఆంటీకి చెప్పేశాను.కావ్య నన్ను తన కజిన్ హేమంత్ ని చెడు అలవాట్ల నుండి మార్చమని అడిగిన విషయం ఆంటీకి తెలియదు కదా అందుకే ఆ విషయం మాత్రం చెప్పకుండా ఏదో మామూలుగా వాళ్ళు నన్ను టీజ్ చేయటానికే అలా చేశారని చెప్పాను. అంతా విన్న ఆంటీ, కావ్య నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.అంతే మాధవ్ మనిషి సమస్యకి భయపడి పారిపోకూడదు, ఎప్పుడూ సమస్యని అధిగమించటానికే ప్రయత్నించాలి. నువ్వు భలే  తెలివిగా ఆలోచించావు మాధవ్..అంటూ అంటీ నన్ను అభినందించి,కానీ ఇలాంటి ప్రమాదాలతో కూడుకున్న ప్రయోగాలు చేయటం తప్పు కదా..!ఈసారి  నేను కోప్పడతాలే హేమంత్ ని ఇలాంటి పనులు చేయకుండా అన్నారు. 

ఇంక కావ్య ఐతే తన ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని అణుచుకోలేకపోతుంది. ఆంటీ స్నాక్స్ తేవటానికి లోనికి వెళ్ళగానే..మాధవ్ ఇదంతా నువ్వు చేశావా? ఎప్పుడూ సైలెంట్ గా,ఎవరేమన్నా పట్టించుకోనట్లు ఉండే నీలో ఇంత పట్టుదల,సమయస్ఫూర్తి ఉన్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పడు నాకు నమ్మకం కలుగుతుంది నేను అడిగిన పని కూడా తప్పకుండా సాధిస్తావని అంది.కావ్య అలా అనగానే ఇదంతా నీ వల్లనే సాధ్యం అయింది  కావ్యా..!అనాలని నోటిదాకా వచ్చిన నామాట ఎందుకో ఆగిపోయింది. మరీ నేనేదో తనని కావాలని పొగుడుతున్నాని ఫీల్ అవుతుందేమో ఎందుకులే అని ఆగిపోయాను.

కాసేపు కాలేజ్ సంగతులు మాట్లాడిన తర్వాత నా ఫ్రెండ్,రూమ్మేట్ పెద్ద మాధవ్,మా క్లాస్మేట్ రేణుక ప్రేమించుకుంటున్నారని,ఫైనల్ ఇయర్ తర్వాత,PG కి ముందు పెళ్లి అని అనుకుంటున్నారని చెప్పింది కావ్య.ఏంటో మా కాలేజ్ లో రోజుకొక ప్రేమకధ బయటపడుతుంది.వీళ్ళలో నిజమైన ప్రేమికులతో పాటూ ఏ డాక్టర్ కోర్స్ మంచిదో,రేపు ప్రాక్టీస్ పెడితే ఏ కోర్సు చేసిన వాళ్లకి సంపాదన బాగుంటుందో ప్లాన్ చేసుకుని ప్రేమించే ప్లానింగ్ ప్రేమికులు కూడా ఉంటారని.. మా సీనియర్ల ఉవాచ.ఇందులో నిజం, అబద్ధం గురించి నాకేమీ తెలియదని,నాకేమీ సంబంధంలేదని గమనించగలరు.

ఇంతకీ మళ్ళీ నాకు తెలియని కొత్త విషయం పెద్దమాధవ్ ప్రేమ,పెళ్లి గురించి కావ్య చెప్పేదాకా రూమ్ లోనే ఉన్న నాకు చెప్పలేదు, ఎందుకో మరి?వాళ్ళు నాకేమీ చెప్పరు.నాతో బాగానే మాట్లాడుతున్నట్లే ఉంటారు కానీ వాళ్ళలో వాళ్ళు అన్నీ షేర్ చేసుకున్నట్లు నాతో ఓపెన్ గా ఉండరు,ఏంటో వీళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళలాగా నాకు ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలియదని నాకేమీ తెలియనివ్వకూడదని అనుకుంటున్నారేమో? పోనీలే వాళ్ళు చెప్పకపోతే నాకేంటి నష్టం అనుకుని ఆ విషయం ఆలోచించటం ఆపేశాను.ఆంటీ పెట్టిన స్నాక్స్ తిని,టీతాగి సరే ఆంటీ నేనిక వెళ్తాను అనగానే హేమంత్ తోపాటు  మీ ఫ్రెండ్స్ అయిదుగురిలో ఎవరు వచ్చినా కావాల్సినవి అడిగి మరీ చేయించు కుని భోజనం చేసి కానీ వెళ్ళరు నువ్వేంటి మాధవ్ అలా మొహమాట పడతావు? వంట అవుతుంది తిని వెళ్దువుగాని అన్నారు ఆంటీ.

తింటారు వెధవలు ఎందుకు తినరు? ఏ ముద్దకి ఆ మద్దెల కొట్టే రకం అని ఒక సామెత చెప్పేది నాన్నమ్మ అలా ఉంది నా ఫ్రెండ్స్ పని అనుకుని, సరే ఆంటీ అని కూర్చున్నాను.ఇంతలో టీవీలో శృతిలయలు సినిమా వస్తుంది.అరె ఈ సినిమాలో రాజశేఖర్,జయలలిత గురించే కదా మా అక్కావాళ్ళు ఆరోజు మా అన్నని,వదిన(కజిన్ భార్య)తో పోల్చి మాట్లాడింది అని గుర్తొచ్చి,సినిమా  చూడబోతూ అక్కడే ఉన్న కావ్యని కావ్యా.. ఈ సినిమాలో జయలలిత హీరోయినా అని అడగ్గానే కావ్య నవ్వాపుకోలేక పడీ పడీ నవ్వుతూ మాధవ్ నీకు నిజంగా తెలియదా అంది.ఏమో కావ్యా మేమెప్పుడూ అంతగా సినిమాలు చూడము అనగానే  ఐతే సినిమా చూడాల్సిందే చూడు అంటూ అక్కడి నుండి ఆంటీ దగ్గరికి కిచెన్ లోకి వెళ్ళిపోయింది. 

నేనిక సినిమాలో మునిగిపొయ్యాను.కాసేపటికి కధ మొత్తం అర్ధమయ్యింది.పెళ్ళైన రాజశేఖర్ తో అక్రమ సంబంధం పెట్టుకునే కారెక్టరే జయలలిత.అంటే ..మా పెద్దక్క,చిన్నక్క మాటల ప్రకారం పెళ్ళైన మా వదినకి(కజిన్ భార్య),పెళ్లి కాని నా అన్నకి అలాంటి సంబంధం ఉందా?ఛా అక్కవాళ్ళు ఇంత హీనంగా ఆలోచిస్తున్నారా? ఈ విషయం మా పెద్దలైన నాన్నకి, నాన్నమ్మకి, అమ్మమ్మకి, తాతకి, తెలుసా?మరి మనసులో అంత కక్ష పెట్టుకుని ఆమెతో ఎలా మాట్లాడుతున్నారు? పైగా ఆ విషయం మా అన్నముందు  మాట్లాడకుండా ఏమీ తెలియనట్లు, అన్నమీద ఎంతో గౌరవం ఉన్నట్లు ఉంటున్నారు.నిజమైతే వెంటనే అడగొచ్చు కదా? అన్న వెనక అలా హీనంగా మాట్లాడటం తప్పు కాదా? అయినా బయటికి అంత డీసెంట్ గా కనపడే మా అన్న ఇలాంటి తప్పుడు పనులు చేస్తాడా?

ఇలా నా మనసు పరిపరి విధాలుగా ఆలోచనల్లో పడింది. ఏంటో వెధవ జీవితం ఒక సంతోషం పూర్తిగా అనుభవించకముందే మరో సమస్య వెంటాడుతుంది.బయట ఎక్కడి నుండో "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము" పాట వినిపించింది.ఎవరో సిట్యువేషనల్ సాంగ్ ప్లే చేసారు అనిపించింది. ఇంతలో మంచి వెరైటీ వంటల ఘుమఘుమలతో పాటూ మాధవ్  భోజనానికి రా.. అన్న ఆంటీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను.వంటలన్నీ ఎప్పటిలాగే ఎంతోరుచిగా ఉన్నా మనసు వికలం కావటంతో ఏదో అలా తిన్నాననిపించి, ఏంటి మాధవ్ అంతలోనే అలా మూడీగా అయిపోయావు అంటున్న కావ్య తో కూడా ఏమీ చెప్పకుండానే రూమ్ కి బయల్దేరాను.

రూమ్ కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ ని చూడగానే వెధవలు ఎంత ఏడ్చారో నా సంతోషం మీద అందుకే  సాయంత్రం కల్లా నా మనసు ఇలా అయిపోయిం ది  అనిపించింది.అక్కడే ఉన్న హేమంత్ ఏంటి మాధవ్ అలా డల్ గా ఉన్నావు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావురా ? అని అడిగేదాకా నేను వాడికి చెప్పకుండా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లానని నాకు గుర్తులేదు. అబద్ధం చెప్పినా వాడికి ఆంటీ చెప్తుంది కదా..అని ఒక బుక్ కావాల్సుంటే  కావ్యాని అడిగి తెచ్చుకున్నాను.వెళ్ళేటప్పుడు  అనుకోలేదు అక్కడికి వెళ్తానని అందుకే నీకు ముందే చెప్పలేదు అని గబగబా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వాడికి నా టెన్షన్ కనపడకుండా.. 

ఇంతలో హాల్లో ఫోన్ మోగింది మాధవ్ నీకే ఫోన్ అంటూ పిలిచాడు సోహిల్.నాన్నేమో అనుకుని వెళ్తూ మా అన్న విషయం నాకే ఇలా ఉంది పాపం నాన్నకి తెలిస్తే ఏమనుకుంటాడో అనుకుంటూ వెళ్ళిన నాకు సర్ప్రైజింగ్ గా అవతల నుండి అన్నయ్య మాట్లాడుతున్నాడు.మాధవ్ ఎల్లుండి నా ఎంగేజ్ మెంట్ నువ్వు తప్పకుండా రా..  నాన్న నీకు ఫోన్ చేస్తాను అన్నాడు కానీ నేనే చెప్తాలే అని కాల్ చేశాను. ఓకేనా రేపు బయల్దేరి  హైదరాబాద్ వచ్చేయ్. నాన్న,నాన్నమ్మ కూడా ఇక్కడే ఉన్నారు సరేనా? అని ఫోన్ పెట్టేశాడు. అన్నయ్య  ఎంగేజ్ మెంట్,అది కూడా అన్నయ్యే కాల్ చేసి చెప్పటం నాకు చాలా సంతోషంగా అనిపించింది.అప్పటిదాకా మనసులో వున్న బాధంతా ఎగిరిపోయింది.

ఫోన్ పెట్టేయ్యగానే అక్కడే వున్న పెద్దమాధవ్ ఏంటో విషయం చిన్న మాధవ్ మొహం వెలిగిపోతుంది అన్నాడు.నాకు వాడ్ని చూస్తే వొళ్ళు మండిపోయింది వాడి ప్రేమ,పెళ్లి విషయం నాకు చెప్పడు కానీ నా సంగతులు మాత్రం అన్నీ కావాలి.నీలాగే మా అన్నకి కూడా పెళ్ళంట అందామనుకుని కూడా ఏడ్చి చస్తాడని,నాతో ఈ విషయం కావ్య చెప్పిందని తెలుస్తుందని కోపం ఆపుకుని, మా అన్నకి ఎల్లుండి ఎంగేజ్ మెంట్ రమ్మని కాల్ చేశాడు అనగానే అందరూ కంగ్రాట్స్ మాధవ్ ఈ సందర్భంగా మాకు పార్టీ లేదా అనగానే ఇప్పుడు కాదు వూరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇస్తా మంచి పార్టీ అంటూ.. లగేజ్ సర్దుకోవటానికి సంతోషంగా నా రూమ్ కి వెళ్ళిపోయాను. 


Related Posts Plugin for WordPress, Blogger...