పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
నా ఇష్టదైవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా ఇష్టదైవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, డిసెంబర్ 2018, మంగళవారం

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ - పానగల్లు


శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ - పానగల్లు 
Ancient & Mysterious Sri Chaya Someswara Temple



శ్రీ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణా రాష్ట్రం నల్గొండ  జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉంది.నల్గొండ నుండి 5 K.M దూరంలో పానగల్లు గ్రామం చివరిలో,పచ్చని పంటపొలాల మధ్య ఆలయం ఉంటుంది.

తెలంగాణా ప్రాచీన నగరంలో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ. శ 11 - 12 శతాబ్దంలో కుందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది..కాకతీయులకు సామంతులైన ఈ కుందూరు చోళులు తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని,పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో లభించిన పురాతన శాసనాల ప్రకారం కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలుస్తుంది. 

ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు.తూర్పుముఖంగా వున్న గర్భగుడిలోని శివలింగంపైన రోజంతా ఒక స్తంభాకారలోని నీడ పడుతూ ఉంటుంది .ఇదే ఛాయా సోమేశ్వరాలయం లోని  ప్రత్యేకత.ఎప్పుడూ నీడతో (ఛాయ)కప్పబడి ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.సుమారు పది దశాబ్దాలు ఈ నీడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియని మిస్టరీ ఈ ఆలయంలో వుంది అంటారు.కానీ ఈ మధ్య తెలంగాణకే చెందిన ఎవరో టీచర్  ప్రయోగాలు చేసి నీడ ఎలా వస్తుందో కనిపెట్టారని చెప్తున్నారు. 

ఆలయంలో ప్రధాన మండపంలో స్తంభాలు,వాటిపైన శిల్పకళ చాలా బాగుంటుంది.ఆలయ ప్రాంగణంలో శిధిలమైన నంది విగ్రహాలు ,మండపాలు కనిపిస్తాయి.మేము 2016 పుష్కరాల తర్వాత వెళ్ళాము.పుష్కరాలకు గుడిని కొంచెం సరిచేశారని చెప్పారు అక్కడి పూజారి.సోమేశ్వరాలయం  హైదరాబాద్ నుండి 100 K.M దూరంలో ఉంటుంది.

పానగల్లు గ్రామంలో ఉన్న మరో శివాలయం పచ్చల సోమేశ్వరాలయం.దీన్ని కూడా కుందూరు చోళులు నిర్మించారు. ఆలయంలో 70 స్తంభాల మండపం,స్తంభాల మీద రామాయణ,మహాభారత ఘట్టాలు,పురాణ పాత్రలు చూస్తున్నట్లుగానే అనిపించే పెద్ద నంది ఈ ఆలయ ప్రత్యేకతలు.

ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం





26, అక్టోబర్ 2018, శుక్రవారం

చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం - గుంటూరు - దసరా నవరాత్రుల విశేషాలు

 

కొలిచిన వారికి కొంగు బంగారంగా ఆదరించి,దీవించి,కాపాడి రక్షించే ఆ అమ్మలగన్న అమ్మ,పోలేరమ్మ తల్లిగా కొలువైన గుంటూరు చుట్టుగుంటలోని పోలేరమ్మతల్లి దేవస్థానంలో జరిగిన దసరా వేడుకలు,విశేషాలు నా చిన్నిప్రపంచంలో వీడియోగా ...

చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం - గుంటూరు






19, సెప్టెంబర్ 2012, బుధవారం

వినాయకా నీకే మా మొదటి ప్రణామం ..!


వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా...


గజాననం భూత గణాధిసేవితం
కపిత్థ జంబు ఫలసార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం!



మూషిక వాహన మోదక హస్తా
చామర కర్ణ విలంబిత సూత్రా
వామనరూప మహేశ్వరపుత్రా
విఘ్నవినాయక పాద నమస్తే !



తొలి పూజలందుకుని,విఘ్నాలను తొలగించే గణపతి
అందరినీ తన కరుణాకటాక్ష వీక్షణములతో కాపాడి,
ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో దీవించాలని ప్రార్ధిస్తూ...


అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు




27, జులై 2012, శుక్రవారం

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...


సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా ... సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నుదుట కుంకుమ రవిబింబముగా ... కన్నుల కాటుక నిండుగ వెలుగ
కాంచనహారము గళమున మెరియగ ... పీతాంబరముల శోభలు నిండగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నిండుగ కరముల బంగారుగాజులు ... ముద్దులొలుకు నాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి చేయగ ... సౌభాగ్యవతుల సేవల నందగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నిత్య సుమంగళి నిత్య కల్యాణి ... భక్త జనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణ నిండగా ... కనకవృష్టి కురిపించే తల్లీ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా ... సౌభాగ్యలక్ష్మీ రావమ్మా



శ్రావణ వరలక్ష్మి అందరినీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సకల సౌభాగ్యాలతో దీవించి,
కోరిన కోరికలను వరాలుగా ప్రసాదించమని ప్రార్ధిస్తూ
"వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు"

కనకధారా స్తోత్రం




28, జనవరి 2012, శనివారం

శ్రీ పంచమి - సరస్వతీ స్తుతి


యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిహి
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా

శ్వేత వస్త్రాలతో అలంకృతమై,హంసవాహినిగా,
తెల్లని తామర పుష్పంపై కొలువుతీరిన వీణాపాణి జ్ఞానానంద పరాశక్తి.
శ్రద్ధ , ధారణా, మేధా, విధి, వల్లభా, భక్తజిహ్వాగ్రసదన, శమాది గుణదాయిని
అనే సప్త నామధేయాలతో విరాజిల్లే విద్యా స్వరూపిణి.
బుద్ధి, స్మృతి,వాక్కు,విద్య ఆ దివ్య జనని అనుగ్రహ ఫలాలు

అమ్మ చెంతనే వుండే అమ్మ వాహనం హంస - పాలను, నీటిని వేరు చేస్తుంది.
అలాగే మానవులు కూడా మంచి,చెడుల విచక్షణాజ్ఞానంతో మసలుకోవాలని సరస్వతిమాత
తన హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది .

అజ్ఞాన తీరాలనుండి విజ్ఞానపు వెలుగు వైపుకి నడిపించి,జీవితంలో అవసరమైన జ్ఞాన సంపదను,
కరుణాకటాక్షాలను అనుగ్రహించమని ఆ వాగ్దేవిని శ్రీ పంచమి సందర్భంగా ప్రార్ధిస్తూ
అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు.
సరస్వతీ స్తుతి



25, జనవరి 2012, బుధవారం

యాదగిరిగుట్ట ట్రిప్ విశేషాలు



మా చెల్లి వాళ్ళ ఫామిలీతో ఈ వీకెండ్ కి మేము వెళ్ళిన ట్రిప్ యాదగిరిగుట్ట.ఇంతవరకు మేము చూడని ప్లేస్ ఇది.మిర్యాలగూడెం నుండి భువనగిరి వెళ్లి,అక్కడి నుండి యాదగిరి గుట్ట వెళ్ళాము.

నల్గొండ జిల్లాలోని భువనగిరి లో ఎంటర్ అవ్వగానే కనపడే గుండ్రాయి లాంటినున్నటి కొండ మీద వున్న భువనగిరి కోట చాలా బాగుంది.భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినది.ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చేఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

అద్భుతమైన ఆనాటి కట్టడం చూడటం ఒక గొప్ప అనుభూతి.. ఆధునిక కట్టడాలకి ఉపయోగించేభారీ పరికరాలేమీ లేకుండా ఆ రోజుల్లో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కాలం తో పోటీ పడుతూ..
నిలిచి వున్న పూర్వ వైభవానికి,రాజసానికి ప్రతీక అనిపిస్తుంది.





























ఇక్కడి
నుండి యాదగిరిగుట్ట లోని "కుందా సత్యనారాయణ కళాధామం,సురేంద్రపురి" వెళ్ళాము.టీవీలో ఎప్పటి నుండో చూపిస్తున్న యాడ్ చూసి యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా చూడాలనుకున్నాము.






ప్రధాన ద్వారంలోనే ఇంద్రుడు తన ఐరావతం సమేతంగా ఆసీనుడై వచ్చిన వాళ్ళనుస్వాగతిస్తున్నట్లు వుంటుంది.లోపలి వెళ్ళగానే 60 అడుగుల పంచముఖ హనుమంతుడు ఒకవైపు,
పరమేశ్వరుడు మరొకవైపు ఒకే శిల్పంలో వున్న విగ్రహం కనపడుతుంది.
ఇక్కడి నుండి పెద్దలకు 250,పిల్లలకు 200 టికెట్ తీసుకుని గాయత్రి మాత విగ్రహం ముందు నుండి లోపలికి వెళ్ళాలి.ఇంక అప్పుడు మొదలవుతుంది పౌరాణిక పాత్రల పరిచయం..  భారతం, రామాయణం,కాళీయ మర్దనం,శక్తి పీఠాలు,దక్షిణ,ఉత్తర భారతదేశాల్లోని అనేక పుణ్యక్షేత్రాలు,  కైలాసం,వైకుంఠం,విశ్వరూపం,యమలోకం,పాతాళ లోకం,మయసభ చివరిగా పద్మవ్యూహంఇలా ఏదేదో వింత లోకాల్లో తిరిగి తిరిగి బయటికి వస్తాము.లోపల ఫోటోలు తీయకూడదు
ముందు ఇవన్నీ చూస్తూ నడవటం సరదాగానే అనిపించినా ఇంతదూరం నడిచి,మెట్లెక్కి అందరికీ నీరసం వచ్చేసింది .ఇక్కడ నడవటం కొంచెం కష్టమే అనిపించింది.



టీవీ యాడ్ లో నారదుల వారు హనుమంతుడు లడ్డూ ప్రసాదం ఇస్తారు అని చెప్తారు.నిజంగానే చివరిలో హనుమంతుడి చేతిలోనుండి లడ్డు ప్రసాదం ఇస్తారు కానీ ఉచితంగా కాదు
20 రూపాయలు తీసుకుని.మేము కూడా తీసుకున్నాము.
ఒక ప్లాస్టిక్ బంతి లో వున్న రవ్వలడ్డు ను ప్రసాదంగా ఇచ్చారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం - యాదగిరి గుట్ట
తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంచేసుకున్నాము.
సాయంత్రం కొండ మీద చల్లటి గాలులతో వాతావరణం కొంచెం చలిగానే వున్నాఇబ్బంది అనిపించలేదు.
గర్భగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ,ఆలయం లోపల వున్న చిత్రపటాలు,
అలంకరణ చాలా బాగుంది.
లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలసిన నరసింహ స్వామిని దర్శనం చేసుకుని,తీర్ధ,ప్రసాదాలు తీసుకుని,
వెరైటీగా అట్టపెట్టెల్లో పెట్టి అమ్ముతున్న లడ్డుప్రసాదం కొనుక్కుని,
బయటికి వచ్చాము.ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా వున్నాయి...
కానీ ఎవరినీ ఏమీ అనకుండా తిరుగుతున్నాయి.
ఇవీ మేము మొదటిసారి వెళ్ళిన మా యాదగిరిగుట్ట యాత్రా విశేషాలు..
మా చెల్లి,మరిది గారు సర్ప్రైజింగ్ గా అప్పటికప్పుడు చెప్పి మమ్మల్ని తీసుకు వెళ్ళిన ఈ ట్రిప్ ఒక మంచి జ్ఞాపకం..

22, జనవరి 2012, ఆదివారం

బిజినెస్ మేన్ Vs సద్గురు


బిజినెస్ మాన్ కి సద్గురుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా
హైదరాబాద్ లో బిజినెస్ మాన్ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్లకి
"ISHA
FOUNDATION"వాళ్ళు ఒక సి.డి ఇచ్చారు ఉచితంగా ..

ఆ సి.డి పేరు "Technologies for Wellbeing" "సద్గురు జగ్గి వాసుదేవ్"
అనే
ఒక spiritual Guru ఆధ్వర్యంలోని Isha Yoga Center గురించి, యోగా ప్రాధాన్యతను గురించి
సి.డి లో చెప్పారు.సి.డి చూసిన తర్వాత నెట్ లో "Isha Foundation" గురించి సెర్చ్ చేశాను.

ఈ సద్గురు కూడా ఈ మధ్య కాలంలోని కొంతమంది యోగా గురువుల్లాగానే యోగా తో పాటు,Health,Education,Environment లాంటి కొన్ని సమాజహిత కార్య క్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

యోగా,సోషల్ సర్వీస్ ఇలాంటివన్నీ అందరూ చేసేవే అయినా ఈ సద్గురు ఆశ్రమం లో
నాకు
చాలా నచ్చింది ఆశ్రమంలోని ధ్యాన లింగం,లింగభైరవి ఆలయాలు .
శివాలయం,అమ్మవారి ఆలయాలు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా,
తప్పకుండా
చూడాలి అనిపించేలా వున్నాయి.
Dhyanalinga Yogic Temple

లింగ భైరవి ఆలయం
“One who earns the Grace of Bhairavi neither has to live in
concern
or fear of life or death, of poverty, or of failure.
All that a human being considers as wellbeing will be his,
if only he earns the Grace of Bhairavi.”

Sadhguru

"ISHA
FOUNDATION"
Velliangiri Foothills Semmedu (P.O)
Coimbatore.
గురించి "సద్గురు" గురించి తెలుసుకోవాలంటే లింక్ లు చూడండి.
http://sadhguru.org/
http://www.ishafoundation.org/
http://lingabhairavi.org/

24, ఏప్రిల్ 2011, ఆదివారం

దైవం మానవరూపంలో....


స్వార్ధం,ద్వేషం,దురాశ,అహంకారమనే మనిషికి మాత్రమే సొంతమయిన కొన్ని గుణాలకి అతీతుడు సత్య సాయి..
అందుకే సత్యసాయి మనలాగా మనిషే కానీ మనలాంటి మనిషి కాదు.
ఎంతమంది ఎన్ని నిందలు మోపినా బాబా మాత్రం మనిషి రూపంలోని దేవుడు.
ఎందుకంటే నిస్వార్ధంగా సాటి మనిషిని ప్రేమించి, సేవ చేయగలిగే ప్రతి మనిషి దేవుడు కాబట్టి.
తన కోసం ఏమీ ఆశించకుండా...తన సేవల ద్వారా,ప్రభోదాల ద్వారా ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపారు బాబా
ప్రతి
మనిషికీ అవసరమైన శారీరక ఆరోగ్యం కోసం వైద్యం,మానసిక వికాసం కోసం విద్య పేదవారికి కూడా అందేలా చేశారు.
ప్రేమ అనే మార్గం ద్వారా సేవ అనే లక్ష్యాన్ని సాధించి,సత్యం,ధర్మం,అహింసలే పరమావధిగా సాగిన బాబా మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయం..
దైవం మానవరూపంలో అవతరించునీ లోకంలో..


10, నవంబర్ 2010, బుధవారం

కార్తీకమాసం....




సంవత్సరం అంతటిలో నాకు చాలా ఇష్టమైన నెల కార్తీక మాసం
దానికి చాలా కారణాలు వున్నాయి....

మొదటి కారణం నేను పుట్టిన నెల,
కార్తీకమాసం లో తెల్లవారుజామున చలిలో స్నానాలు,పూజలు,
మా పెద్దమ్మ,అత్తా వాళ్లాతో వెళ్ళే వనభోజనాలు,
మా అమ్మ,నాన్న చేసే కేదారీశ్వరవ్రతం ,
అన్నిటికంటే ముఖ్యంగా ఈ నెలలో కేదారీశ్వరవ్రతం ముందు మేము తప్పకుండా వెళ్ళే శ్రీశైలం టూర్,
పౌర్ణమి రోజున వెలిగించటానికి రోజంతా కూర్చుని తయారుచేసుకునే వత్తులు,
ఇవన్నీ ఈ నెలని చాలా హడావుడిగా,ఆనందంగా గడచిపోయేలా చేస్తాయి.

కార్తీకమాసం రాగానే నాకు నా చిన్నిప్రపంచంలోని నా వాళ్ళే కాదు మా బంధువులు కూడా గుర్తుకొస్తారు
మా ఇళ్ళల్లో కార్తీకమాసం సందడి అంతా మా అమ్మమ్మదే వుండేది.
తెల్లవారుజామున లేచి మా పెద్దమ్మ,పిన్ని,అత్త అందర్నీ లేపి చివరిగా మా ఇంటికి వచ్చేది.
అమ్మమ్మ పిలుపుతో విసుక్కుంటూనే లేచినా వెంటనే స్నానం విషయం గుర్తుకు వచ్చి సరదాగా వుండేది.
మా ఇంట్లో మోటర్ వేసుకుని స్నానం చేసి,అక్కడే గంగమ్మకి పూజ చేసి,ఏదో ఒక గుడికి వెళ్లి వచ్చేది.
మధ్యానానికి కార్తీక పురాణం పుస్తకం పట్టుకుని నా దగ్గర చేరేది.
మాఅమ్మ కదూ నువ్వైతే చదువుతావమ్మా ఇంకెవరూ నా మాట వినరు
చదివి వినిపించు అంటూ నా దగ్గర కూర్చుని నేను చదివితే వినేది.
ఎప్పుడైనా మిస్ అయితే అన్నీ కలిపి ఒకే రోజు చదివి వినిపించేదాన్ని.


నాకు వత్తులు చెయ్యటం నేర్పింది కూడా మా అమ్మమ్మే..
కార్తీకమాసం మొదలు కాకముందే పత్తిలో గింజలు తీసి వేసి,
ఆ పత్తిని సన్నని దారాలుగా లాగుతూ వత్తులు తయారు చేయటం చాలా సరదాగా వుండేది.
ఇక శ్రీశైలం టూర్ అంటే మేము, మా మామయ్య ఫ్యామిలీ ,
పెద్దమ్మల ఫామిలీ ,పిన్నీ వాళ్ళ ఫ్యామిలీ అంతా బయలుదేరేవాళ్ళము.
ఒక టూరిస్ట్ బస్సులో వెళ్ళే యాత్రికులంత వుండేది
మా బంధుగణం అంతా కలిసి...


ఇక కార్తీకమాసం వనభోజనాలు,నదిలో దీపాలు వదలటం ఇవన్నీ
మా అమ్మకి అంతగా ఇష్టం వుండదు.ఇంట్లోనే పూజ చేసుకుంటాను అంటుంది.
మా పెద్దమ్మ,అత్త,నన్ను పిలుచుకుని వెళ్ళేవాళ్ళు..
అందుకే వీటన్నిటికీ మా ఇంటి తరపున పెద్దమనిషిని నేనే అప్పట్లో...


ఇక కార్తీక పౌర్ణమిరోజు మా అమ్మమ్మ సంతానంలో మా అమ్మ,మామయ్య మాత్రమే కేదారీశ్వర వ్రతం చేసుకుంటారు.
ఒకే రోజు ఇద్దరి ఇళ్ళల్లో వ్రతం కావటంతో మా బంధువులందరూ పూజకి
ఎవరింటికి వెళ్ళాలనే విషయంలో ధర్మసంకటంలో పడేవాళ్ళు.
ఎలాగోలా ఇద్దరు ఇళ్ళకు వెళ్లి,తీర్ధప్రసాదాలు తీసుకుని,భోజనం మాత్రం అక్కడ కొందరు,ఇక్కడ కొందరు చేసే వాళ్ళు.
నేను డిగ్రీ చదివే రోజుల వరకు కార్తీక మాసం అంతా దాదాపు ఇలాగే గడచిపోయింది.
కానీ కాలానుగుణంగా కొన్ని మార్పులు తప్పవు కదా..
ప్రస్తుతం ఎవరి కుటుంబం వారిదే..ఎవరి పూజలు వాళ్ళవే...ఎవరి వ్రతాలూ వాళ్ళవే...
ఏది ఏమైనా మళ్ళీ కార్తీకమాసం వచ్చింది పూజల సందడి మొదలయింది...
పోయిన సంవత్సరం నాకు పెళ్లి కాగానే అమ్మ మాతో కూడా ఈవ్రతం చేయించింది.
అందుకే ఈ సంవత్సరం వత్తులు చేసుకోవాలి,
రోజూ దీపారాధన చేసుకోవాలి,మేము,అమ్మవాళ్ళు
వ్రతం చేసుకోవాలి.... ఎన్ని పనులో???


చిన్నప్పుడు అమ్మ నన్ను గాయనిని చేయాలని కలలు కనేది...
ఇప్పుడున్నన్ని టాలెంట్ షోలు అప్పట్లో వుండి వుంటే...
నేను ఖచ్చితంగా సింగర్ అయ్యి వుండేదాన్ని...[ఇది నా ఫీలింగ్]
అమ్మ నాతో పాటలు పాడించి టేప్ రికార్డర్లో రికార్డ్ చేసేది.
అందులో భాగంగా అమ్మ నాకు నేర్పిన ఒక పాట నేను ఇప్పటికీ మర్చిపోలేదు.
నా మనసులో చెరగని ముద్ర వేసిన ఈ పాట నాకు చాలా ఇష్టం...

శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా
భ్రమరాంబికా ధీశా భవనాశా ఓ మహేశా
మల్లికార్జునా మనవిని వినుమా
శిఖరానికి నన్ను చేర్చుకొనుమా
శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా

ఒక్క సూర్యుడు ఉదయించగనే
చిక్కటి చీకటి తొలగిపోవును
దినకోటి తేజ నిను దర్శించగ
అజ్ఞాన తిమిరమంతరించగా...
శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా

కరిగే చంద్రుని కాంచినంతనే
కడలులు ఎగయు కలువలు మురియు
కరగని సోముని ధరించు నినుగని
హృదయాబ్ది పొంగగా... మధురాత్మ విరియగా...

శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా
భ్రమరాంబికా దీసా భవనాశా ఓ మహేశా
మల్లికార్జునా మనవిని వినుమా
శిఖరానికి నన్ను చేర్చుకొనుమా...
శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా........

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

మాఇంటి గణపతి


ఓం
గం గణపతయే నమః


మా పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి వినాయకచవితి కావటంతో ఈ వినాయకచవితి మా అమ్మ వాళ్ళింట్లో జరుపుకున్నాము.
చిన్నప్పటినుండి మాకు చాలా ఇష్టమైన పండుగ వినాయకచవితి.
నాన్నతో బజారుకి వెళ్ళి వినాయకచవితి షాపింగ్ చేయటం చాలా సరదాగా వుండేది.
అప్పట్లో బంకమట్టితో అచ్చులు వేసి,దానిమీద రంగు కాగితం అద్ది వుండే వినాయకుడి ప్రతిమలు ఉండేవి.


తర్వాత కొంత కాలానికి pop వినాయకులు అదేనండీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులు వచ్చిన తర్వాత,
మట్టితో చేసిన వినాయకులకంటే ఆ వినాయకుడే మాకు ఎక్కువ నచ్చేవాడు.
మాకోసం నాన్న,ఈ వినాయకుడిని కొన్నా,మట్టివిగ్రహం మాత్రం తప్పకుండా తీసుకునేవాడు
ఎందుకంటే పూజ మట్టితో చేసిన వినాయకుడికే చేయాలని.

మా చెల్లి ఫ్రెండ్ గణేష..మా చెల్లి సేకరించిన చిన్ని గణపతులు...


ఈ సంవత్సరం పర్యావరణ రక్షణ కోసం మట్టితో చేసిన గణేష్ విగ్రహాలే వాడాలని టీవీల్లో,పేపర్లో వస్తున్న సలహాలు విని మేము కూడా మట్టి గణేషుడ్ని తేవాలని చాలా ప్రయత్నించాము..
కానీ మా వూరిలో ఎక్కడా ఆ మట్టివిగ్రహాలే కనపడలేదు.ఇంకోచోటికి వెళ్లి ప్రయత్నించే సమయం లేకపోవటంతో
ఈ సంవత్సరానికి మా ఇంటికి రావాలనుకున్న ఓ రంగురంగుల బొజ్జ గణపతిని మా ఇంటికి తీసుకువచ్చాము.


తమ్ముడు,చెల్లి,నేను మా గణేష్ మండపాన్ని అందంగా అలంకరించుకుని,
అమ్మ చేసిన నైవేద్యాలతో,మా కుటుంబంతో ఆనందంగా గణపతిని పూజించుకున్నాము.


మా పూజ నిర్విఘ్నంగా జరిపించిన ఆ గణపతిని మనసారా ధ్యానిస్తూ...ఆ గణనాధుడు
నా చిన్నిప్రపంచాన్ని ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలతో దీవించాలని,
సకల శుభాలు కలుగచేయాలని ,మా పనులన్నిటినీ నిర్విఘ్నంగా జరిగేలా దీవించమని ప్రార్ధిస్తూ ...

వినాయకచవితి శుభాకాంక్షలు.



రాజి
Related Posts Plugin for WordPress, Blogger...