పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, ఆగస్టు 2012, బుధవారం

విశ్వదాభిరామ వినురవేమ...!


"విశ్వదాభిరామ వినురవేమ" అనే ఈ మాట తెలియని, అలాగే ఒక్క వేమన పద్యమైనా రాని తెలుగువాళ్ళు ఉండరేమో... చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఏమి గుర్తున్నా లేకపోయినా వేమన పద్యాలు మాత్రం గుర్తున్నాయి ఇప్పటికీ..

ఎలాంటి భావమైనా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పిన కవి వేమన .. పద్యం మొదటి రెండు పాదాల్లోను నీతిని చెప్పి, మూడో పాదంలో దానికి తగిన పోలికతో .. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటంతో వేమన పద్యాలుంటాయి..

వేమన పద్యం లోని ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.
వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.

ఎవరికైనా కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన ప్రజాకవి వేమన . ఆయన పద్యాలలోనే విలువ గల సలహాలు, సూచనలు, లోకనీతిని తెలిపిన మహానుభావుడు, సమాజంలోని అన్ని సమస్యలను గురించి తన పద్యాలలో వేమన ప్రస్తావించారు.

"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు" పద్యం మనుషులందరూ చూడటానికి ఒక్కలాగే వున్న వాళ్ళ గుణాల్లోని తేడాలను తెలియచేస్తే..
"అనువు కాని చోట అధికులమనరాదు" అన్న పద్యం ఎక్కడ ఎలాగా ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని బోధిస్తుంది.
అలాగే "అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను" అనే పద్యం మంచి వాడికి,చెడ్డవానికి గల తేడాలను తెలియచేస్తుంది..
ఇలా ఎన్నో పద్యాలు మన నిత్య జీవితంలో మనకు అనుభవం అయ్యేవి,ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయి..

నాకు కూడా వేమన పద్యాలలో కొన్ని బాగా గుర్తుండి పోయాయి కొన్ని సంఘటనలను,మనుషులను చూసినప్పుడు ఈ పద్యాలు వెంటనే వాటికి పోల్చుకునేలా గుర్తుకొచ్చేస్తాయి.. వాటిలో కొన్ని పద్యాలు..


ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినురవేమ
!యినుము విరగనేని ఇరుమారు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి ఆతుకగారాదయా
విశ్వదాభిరామ వినురవేమ!

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ!అల్పుడెపుడు
బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!
చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!
గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ!
ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ!మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
కస్తూరి నటుచూడ కాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళమ్ము
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !15, ఆగస్టు 2012, బుధవారం

తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా..!


తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
తేనెల
తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా

భావం
భాగ్యం కూర్చుకొని
ఇక జీవనయానం చేయుదమా
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక
జీవనయానం చేయుదమా

సాగర మేఖల చుట్టుకొని
సుర
గంగ చీరగా మలచుకొని
సాగర మేఖల చుట్టుకొని
సుర
గంగ చీరగా మలచుకొని

గీతా
గానం పాడుకొని ...గీతా గానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా

గాంగ
జటాధర భావనతో
హిమ
శైల శిఖరమే నిలబడగా
గాంగ జటాధర భావనతో
హిమ
శైల శిఖరమే నిలబడగా

గలగల పారే నదులన్నీ ...
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా

ఎందరో
వీరుల త్యాగబలం
మన
నేటి స్వేచ్ఛకే మూలబలం
ఎందరో వీరుల త్యాగబలం
మన
నేటి స్వేచ్ఛకే మూలబలం

వారందరిని తలచుకొని ... వారందరిని తలచుకొని
మన మానసవీధిని నిలుపుకొని

తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక
జీవనయానం చేయుదమా

తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక
జీవనయానం చేయుదమా

Des Rangeela Rangeela Des Mera Rangeelaa
Video By:
My Sister Ramya..


14, ఆగస్టు 2012, మంగళవారం

మానవసేవ ... మాధవసేవ .... మనసేవ


ఆదివారమైనా రోజూ లాగే ఉదయాన్నే పూజ చేసుకుని, తన పనులు తన ఇష్టమొచ్చినట్లు చేసుకుంటున్న మా భారతమ్మతో మాట్లాడుతూ, బ్రేక్ ఫాస్ట్ చేసే పనుల్లో ఉన్న నాకు మా శ్రీవారి ఫోన్ రింగ్ అవటం వినిపించింది.
సండే కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్న ఆయనకి 7 గంటలకే మోగిన ఈ ఫోన్ కొంచెం ఇబ్బందే అయినా తప్పక ఫోన్ లిఫ్ట్ చేసినట్లున్నారు.. ఒక చెవి అటేసి ఎవరా అని వింటున్న నాకు ఆ ఫోన్ చేసింది ఎవరో గానీ,ఆ మార్నింగ్ కాల్ మావారికి చాలా సంతోషాన్ని కలిగించిందని అర్ధమయింది.

ఫోన్ కట్ చేసిన వెంటనే నన్ను పిలిచి,ఈ రోజు మనింటికి గెస్ట్ లు వస్తున్నారు అన్నారు.. అనుకోకుండా ఇప్పుడు గెస్ట్ లా అని మనసులో అనుకుంటూనే అయినా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారంటే ఏ మధ్యాహ్నానికో వస్తారులే అనుకున్న నాకు మరొక బాంబ్ పేలింది.. ఆ గెస్ట్ లు వస్తుంది బ్రేక్ ఫాస్ట్ కోసం , మరొక 45 మినిట్స్ లో వచ్చేస్తారు అన్నారు..

అంత తక్కువ టైం లో ఎలా,ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న నాకు మా శ్రీవారు వచ్చే గెస్ట్ ల గురించి చెప్తున్నారు..
ఆయన మాటలు వింటూనే మా కోసం చేసిన ఇడ్లీ తో పాటూ పూరీ ఆలూ కర్రీ చేద్దామని కావాల్సినవన్నీ తయారు చేసుకున్నాను.

ఇంతకూ వచ్చే వాళ్లెవరంటే మా వారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్.. మావారి ఫ్రెండ్ ,ఆయన కొలీగ్ ఇద్దరూ ఒక ఆధ్యాత్మిక గురూజీ గారి శిష్యులు, అలాగే కొత్తగా ఆ గురూజీని అనుసరించాలనుకునే వాళ్లకి వీళ్ళు జూనియర్ గురూజీలు. ఇద్దరూ విద్యాధికులే ఒకరు M.Tech,ఒకరు MBA మంచి మంచి కార్పోరేట్ ఉద్యోగాలు వదిలేసుకుని, దేశం లో అవినీతి,అన్యాయాలను చూసి ఓర్చుకోలేక ఒక "కళా కాంతీ" లేకుండా బతుకుతున్న జనాలకు "కళాత్మకంగా" బతకటం ఎలాగో తెలియచేయాలన్న గొప్ప సదుద్దేశ్యంతో ,తపనతో చేస్తున్న పెద్ద పెద్ద ఉద్యోగాలను కూడా వదిలేసి, వీళ్ళిద్దరూ కలిసి ఒక మారు మూల ప్రాంతంలో ఒక అనాధాశ్రమాన్ని నడుపుతున్నారని అనాధ పిల్లలంటే వాళ్లకి చాలా అభిమానమనీ వీళ్ళిద్దరిలో ఆ మేడం కి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా అవార్డ్ కూడా వచ్చిందని వాళ్ళు వచ్చే లోపు,నేను బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసే లోపు మా వారు గుక్క తిప్పుకోకుండా నాకు చెప్పేశారు...

నేను సమాజసేవ చేయలేకపోయినా చేసే వాళ్ళన్ని అభిమానించే నాకు ఆ వచ్చే వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళను చూడాలన్న ఆసక్తి పెరిగిపోయింది.. అన్నీ రెడీ చేసుకుని వాళ్ళ కోసం ఎదురుచూస్తుండగానే వాళ్ళిద్దరూ వచ్చేశారు. వస్తూనే ఆవిడ హడావుడిగా, ఆయన నిదానంగా మాట్లాడుతూ పరిచయం చేసుకుని, మీ ప్లేస్ లో ఈ రోజు మా క్లాస్ (యోగా) వుంది అందుకే ఎలాగూ ఇక్కడిదాకా వచ్చాము మిమ్మల్ని కలిసినట్లు వుంటుంది అని వచ్చేసాము అని చెప్పారు..

అయ్యో అంతకన్నానా మీరు రావటం మాకు,ముఖ్యంగా నాకు చాలా ఆనందం ( వాళ్ళ గురించి విన్న తర్వాత వాళ్ళ మీద నిజంగానే అభిమానం తోనే ఈ మాట అన్నాను ఏదో మాట వరసకి కాదు ) అంటూ వాళ్లకి ముందు ఫ్రెష్ అవుతారా అని బాత్ రూమ్స్ చూపించి,వాళ్ళ కోసం చేసిన పూరీ ,ఖీర్ ఇడ్లీ అన్నీ సెట్ చేసి బ్రేక్ ఫాస్ట్ కోసం రమ్మని పిలిచాను..
మా వారి ఫ్రెండ్ ,వారి కొలీగ్ ఇద్దరూ నా వంట చాలా బాగుందని మెచ్చుకుని, కాఫీ తాగేసి హడావుడి తగ్గటంతో ఇంక అందరం అలా హాల్లో కూర్చున్నాము...

వాళ్ళ క్లాస్ ల గురించి చెప్పి మీరు కూడా ఆ కోర్సులు చేయండి జీవితంలో చాలా ఉపయోగ పడతాయి అని చెప్పారు.
నాకు ఆ క్లాస్ లంటే అంతగా ఆసక్తి లేకపోయినా,వింటూనే వాళ్ళ అనాధాశ్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను... నా ఆసక్తిని గమనించిన వాళ్ళు మా సేవామందిర్ కి రండి మీకు తప్పకుండా ఆ ప్లేస్,అక్కడి పిల్లలు అన్నీ నచ్చుతాయి అన్నారు... నాకు కూడా వెళ్ళాలనే వున్నా మావారి కి ఈ రోజు ప్లానింగ్ ఏమిటో తెలియదు కదా ఆయన్నే అడగండి అన్నాను.. ఇంకేమి ప్లానింగ్స్ ఉంటాయి లెండి మీ వారికి కూడా మా సేవా మందిర్ పిల్లలంటే చాలా అభిమానం.. పెళ్లి కాకముందు కూడా రెగ్యులర్ గా విజిట్ చేసి పిల్లలకు స్వీట్స్,చాక్లెట్స్ తెచ్చి,వాళ్ళతో టైం స్పెండ్ చేసే వాళ్ళు అని చెప్పారు..

నిజం చెప్పొద్దూ నాకు ఆ క్షణం లో మా వారి మీద గౌరవాభిమానాలు మాటల్లో చెప్పలేనంతగా పెరిగిపోయాయి.
ఇంక అందరూ కలిసి వాళ్ళ
అనాధాశ్రమంకి వెళ్ళేలా ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది. అలా వాళ్ళ కార్ లోనే నలుగురం బయల్దేరి వెళ్ళాము. ఆ ఆశ్రమం చాలా మారుమూల ప్రాంతంలో వుంది.. వెళ్ళే దారంతా చిన్న చిన్న పల్లెటూర్లు,మట్టి దారులు,కొన్ని చోట్ల కనీసం దారి కూడా లేకుండా గతుకుల్లో ఇలా వెళ్తుంటే పెద్ద చదువులు చదివి,ఉన్నత ఉద్యోగాలను వదులుకుని సేవా భావం తో అనాధల కోసం జీవితాలను త్యాగం చేసి,ఇలాంటి మారుమూల పల్లెటూర్లో ఉంటున్న అంత గొప్ప మనసున్న మనుషులతో కలిసి ఉన్నందుకు నాకు చాలా గర్వంగా,సంతోషంగా అనిపించింది.

అలా మా ప్రయాణం జరిగిన తర్వాత చుట్టూ ఎత్తైన కొండలు,పంట పొలాల మధ్యలో సేవామందిర్ కనిపించింది..
ఆ వాతావరణం నాకు చాలా నచ్చింది. పిల్లల కోసం జారుడు బల్ల,ఉయ్యాలలు,ఇంకా వాళ్ళే పెంచుతున్న కిచెన్ గార్డెన్ ఇవన్నీచూపించి..పిల్లలు సండే స్పెషల్ క్లాస్ లో వున్నారు డిస్టర్బ్ చేయటం ఎందుకు వాళ్ళు వచ్చిన తర్వాత పరిచయం చేస్తాము అన్నారు.. సరే అన్నాము.

అక్కడే ఒక పాప ఆడుకుంటుంది.3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ పాప పిలవగానే నా దగ్గరికి వచ్చింది. నీ పేరేంటి అని అడిగి తనతో మాట్లాడుతూ తన చెవి వంక చూసాను కొత్తగా చెవులు కుట్టించినట్లు కొంచెం పచ్చి గాయాలు వున్నాయి పాప చెవికి, బంగారు కాడలతో బుట్టలు కూడా వున్నాయి... అమ్మో ఇక్కడ పిల్లలకి బంగారంతో చెవులు కూడా కుట్టిస్తారా అని ఆశ్చర్యపోయి, పాపా మేడం నీకు చెవులు కుట్టించారా ??అని అడిగాను..
అప్పుడు ఆ పాప కాదు మా అమ్మ కుట్టించింది అని చెప్పింది.. నాకేమి అర్ధం కాలేదు .. అదేంటి వీళ్ళందరూ అనాధలని చెప్పారు కదా ఈ పాప అమ్మ అంటుందే అని అనుకున్నాను.. ఆ విషయం అప్పటితో మర్చిపోయి... అక్కడే కూర్చుని ఉన్న నాకు అక్కడ వంట చేసే వాళ్ళు,ఆయాలు ఇంకా కొంత మంది ఆడవాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి..

అక్కడ కూర్చున్న ఒకమ్మాయి వయసు 25 సంవత్సరాలు ఉండొచ్చు ఆమె చెప్తుంది అక్కడ వాళ్ళతో ... ఈ సార్
(మా వారి ఫ్రెండ్ )నాకు వరసకి అన్న అవుతాడు మా ఊరే .. భర్త చనిపొయ్యి,పిల్లల్ని చదివించటం కష్టంగా వుందని నా కొడుకుని ఇక్కడ చదివిస్తానని తీసుకు వచ్చాడు... నువ్వు ఫీజులేమీ కట్టాల్సిన పని లేదు అన్నాడు తీరా ఇప్పుడేమో
పిల్లలకి పుస్తకాలని,చాపలని,దుప్పట్లు చించారు డబ్బులు తెండి అని మాటి మాటికి పిలుస్తున్నారు..
అంతంత దూరం నుంచి మేమెలా రావాలమ్మా??
ఇక్కడ ఈ బీడు పొలంలో మొక్కలన్నీ పిల్లలతో పీకించి చదును చేయించారట,చేతులు బొబ్బలెక్కి ఒకటే ఏడుపు,మొన్నటికి మొన్న సార్ వాళ్ళ అమ్మకి చేత కాదని మా పిల్లోడ్ని,ఇంకో ముగ్గుర్ని కలిపి వాళ్ళింటికి తీసుకుపోయ్యి ఇల్లంతా శుభ్రం చేయించారంట .. ఏదో చిన్న చిన్న పనులైతే సరే కానీ మరీ ఇంతగానా అంటూ అక్కడి వాళ్లకి తన బాధ చెప్తుంది..

అప్పుడు నాకొక విషయం అర్ధమయ్యింది.. ఇక్కడ అనాధ పిల్లలతో పాటూ తల్లిదండ్రులు వున్న,ఫీజులు కట్టి చదువుకునే పిల్లలు కూడా వున్నారని..కానీ బయటికి చెప్పుకునేటప్పుడు మాత్రం ఆ విషయం చెప్పారు అందరూ అనాధలే అని చెప్తారనీ...కాసేపటికి లంచ్ బెల్ అయింది పిల్లలంతా బయటికి వచ్చారు.. మేము తీసుకు వచ్చిన స్వీట్స్ అవి పెట్టండి అన్నాను.. వాళ్ళు ఇప్పుడా స్వీట్స్ తింటే తిండి తినరు ఇప్పుడు వద్దు అన్నారు ఆ మేడం...
పిల్లలు లైన్ గా నిలబడి అన్నం, పప్పుతో భోజనం తెచ్చుకుని,అక్కడే చెట్ల కింద కూర్చుని తింటున్నారు..
కొంతమంది బయటి నుండి స్కూల్ కి వచ్చే పిల్లలు వాళ్ళు ఇళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్నవి తింటున్నారు..

మాకు కూడా లంచ్ వచ్చింది.కాప్సికం రైస్,కిచిడి,రోటీలు,స్వీట్స్,రైతా ఇంకా ఏవో కొన్ని వెరైటీలు అయ్యో మాకోసం ఇప్పుడివన్నీ చేయించారా ఎందుకండీ శ్రమ అన్నాను.. అప్పుడా మేడం లేదు మేము రోజూ ఇలాగే ఫుడ్ తింటాము..
నాకు కాప్సికం రైస్ అంటే చాలా ఇష్టం అన్నారు..పిల్లలకి కూడా నెలకోసారి ఇలా స్పెషల్ ఫుడ్ పెడతాము అన్నారు..
ఆ వెరైటీ వంటలన్నీ అక్కడ వున్న కొంచెం పెద్ద పిల్లలతో తెప్పించారు వాళ్ళే మాకు వడ్డిస్తున్నారు.. ఆ పిల్లలకి పెట్టకుండా వాళ్ళ ముందు అవన్నీ తినటం నాకెందుకో నచ్చలేదు..

వాళ్ళ రూం లో పెద్ద టీవీ అది ఎవరో పిల్లల కోసం డొనేషన్ ఇచ్చారట.. లంచ్ తర్వాత వాళ్ళ యోగా సీడీ లేవో చూడమని పెట్టారు... అవి మేము చూస్తుంటే పిల్లలు కూడా చూడాలని వచ్చారు.. కానీ అక్కడి ఆయా వచ్చి అందరినీ లాక్కుపోయింది.. ఇక్కడ ఎప్పుడూ ఇంతే టీవీ కూడా చూడనివ్వరు అని పిల్లలు ,క్రమ శిక్షణ అని పెద్దలు చెప్పారు.

మధ్యాహ్నమన్నా కాసేపు ఆ పిల్లలతో కలిసి కూర్చుని మాట్లాడాలి అనుకునే లోపు మనం సిటీ కి వెళ్దాము ఇక్కడ నుండి 40 మినిట్స్ లో వెళ్లిపోవచ్చు కదా ఈ లోపు సినిమా టైం కూడా అవుతుంది అన్నారు.. ఇప్పుడు మేము సినిమాకి వెళ్తున్నామన్నమాట అనుకున్నాను,
45 మినిట్స్ లో సిటీకి వచ్చాము.అక్కడ మా ఆఫీస్ ఇది అంటూ అన్ని సౌకర్యాలు వున్న ఇంటికి తీసుకెళ్లారు .. అక్కడ వాతావరణం చూడగానే అర్ధమయ్యింది ఇది వాళ్ళ అసలు ఇల్లన్నమాట అని..

ఇంక ఈ సార్,మేడం తో పాటూ మరికొంత మంది వాళ్ళ ఫ్రెండ్స్,వాళ్ళ దగ్గర పనిచేసే అసిస్టెంట్లు అందరు కలిసి ఒక పదిమందినీ సినిమాకి తీసుకువెళ్లి, అక్కడి నుండి ఒక రెస్టారెంట్ వెళ్లి డిన్నర్ , ఐ క్రీం పార్లర్ కి తీసుకెళ్ళి మేమెప్పుడూ ఇక్కడికే వస్తుంటాము అంటూ వారి దినచర్యను గర్వంగా చెప్పారు..

అప్పుడు నాకనిపించింది
ఇంతలా మా లైఫ్ స్టైల్ ఇది మేము ఏ సిటీలో వుండే వాళ్ళకీ తీసిపోము అన్నట్లు నాకు చెప్తున్నారేంటి కొంపతీసి నేను వీళ్ళని జాలి చూపులు చూడలేదు కదా అని ..!!
చివర్లో మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమటారా అని అడిగారు వద్దులెండి మీకెందుకు శ్రమ,మీకసలే బోలెడు పనులు అని మేము కాబ్ పిలుచుకుంటాము అని చెప్పి ఇంటికి బయల్దేరాము..

వచ్చే దారిలో నా సందేహాలన్నీ వరుసగా నివృత్తి చేసుకునే పనిలో పడ్డాను..

ఇక్కడ ఫీజులు కట్టి చదువుకునే పిల్లలు వున్నా డొనేషన్స్ కోసం అందరూ అనాధలే అని చెప్తారట కదా??

వాళ్ళ అమ్మమ్మకి బాగాలేకపోయినా, వాళ్ళ వూర్లో ఏదైనా పనులైనా ఈ పిల్లలతో వాళ్లకి చాకిరీలు చేయిస్తారట కదా??
డొనేషన్స్ వస్తున్నప్పుడు పిల్లల దగ్గర దుప్పట్లు,చాపల కోసం డబ్బు తీసుకోవటం ఎందుకు??

ఇక్కడ పల్లెటూరిలో ఆశ్రమం అన్న పేరే కానీ సిటీలో అంత ఇల్లు,మైన్టేనేన్స్,సినిమాలు,సరదాలు,టూర్స్ అన్నిటికీ డబ్బులెలా వస్తాయి?? వీళ్ళేమి ఉద్యోగం చేయరు కదా??

వీళ్ళు పెద్ద ఉద్యోగాలు వదులుకుని వచ్చినా వీళ్ళు ఏదో కోల్పోయారని నాకనిపించలేదు ఒక మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుడు,లేదా వ్యాపారస్తుడు ఎంత హాపీ గా లైఫ్ లీడ్ చేయగలదో అలాగే వుంది వీళ్ళ జీవితం కూడా...
కాకపొతే ఒక్కటే తేడా లక్షలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి,
వ్యాపారస్తునికి లేదా ఇంకే జాబ్ హోల్డర్ కైనా ఎక్కడలేని వర్క్ టెన్షన్స్ వుంటాయి,వీళ్ళకి అవేమీ లేవు ... వాళ్లకి ఉన్నదల్లా ఒకే టెన్షన్స్ "ఎక్కడ నుండి ఎలా విరాళాలు సేకరించాలి " అని మాత్రమే..

నా అనుమానాలకి మావారి సమాధానం ఏమి వాళ్ళు పిల్లల కోసం సేకరిస్తున్న డొనేషన్స్ తోనే ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళిద్దరూ ఇంతకుముందు ఉద్యోగాల్లో సంపాదించిన డబ్బేమి ఉండదా వాళ్ళ దగ్గర....
అయినా ఇక్కడ ఎవరికీ లేని సందేహాలన్నీ నీకే వస్తున్నాయా అని??

సరే వాళ్ళు ఉద్యోగాలతో సంపాదించిన డబ్బే అంత ఎక్కువగా వుంది అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర విరాళాలు సేకరించటం ఎందుకు??
మేము అనాధల కోసం జీవితం త్యాగం చేసాము,మారు మూల పల్లెటూర్లో ఉంటాము అని జనాలకి చెప్పుకోవటం ఎందుకు సానుభూతి కోసమా?..ఎవరిని మోసం చేయటానికి??

దానికి సమాధానం ఎవరైనా అవకాశం వుంటే ఇలాగే చేస్తారు అంతెందుకు నీకు వస్తే నువ్వు చేయవా ??
అయినా వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు వాళ్ళలో తప్పులు వెతుకుతున్నావు అని..

నా మనసులో అనుకున్నాను నాకు ఇలాంటి ఫ్రెండ్స్ వద్దు అలా పసిపిల్లల పేర్లు చెప్పి డబ్బులు తెచ్చుకుని వాటితో పండగ చేసుకునే బ్రతుకు వద్దు నేనిలాగే వుంటాను నాలాగే, నాకు చేతైతే నాకున్న దాంట్లోనే హెల్ప్ చేస్తాను లేకపోతే మానుకుంటాను అంతే కాని ఇలా పిల్లల పేర్లు చెప్పుకుని కొంచెం వాళ్లకి పెట్టి కొంచెం నేను తినను అని..

మొత్తానికి నేనేదో ఊహించుకుని వెళ్ళిన అనాధాశ్రమం విజిట్ ఒక సినిమా,స్టార్ హోటల్ లో డిన్నర్, కొంతమంది గొప్ప వాళ్ళ పరిచయం తో ఇలా ముగిసిందన్నమాట..

ఈ సమాజంలో పేదవారికి,అసహాయులకు మంచి మనసుతో దానం చేసే దాతలు ఎందరో వున్నారు కానీ ఆ డబ్బు నిజంగా వారికి చేరుతుందా లేకపోతే మధ్యలోనే ఇలాంటి సమాజోద్దారకుల చేతుల్లోనే కరిగిపోతుందా అన్నదే ఆలోచించాల్సిన విషయం..

Remember, You also will need Care . . .
sometime !!!
5, ఆగస్టు 2012, ఆదివారం

చిన్నారి స్నేహమా ...చిన్నారి స్నేహమా ... చిరునామా తీసుకో బ్లాగు మిత్రులందరికీ
హృదయపూర్వక స్నేహితులరోజు శుభాకాంక్షలు
2, ఆగస్టు 2012, గురువారం

☼ రక్షాబంధన్ శుభాకాంక్షలు ☼
మ్ముడూ అనురాగానికి,అనుబంధానికి మారుపేరైన మన బంధం
నిండు నూరేళ్ళు కొనసాగాలని కోరుకుంటూ
నిన్ను దీవిస్తున్నాను.
మమతానురాగాలనే జరీ దారాలను పెనవేసి,
జన్మ జన్మల అనుబంధమనే పసిడి పూలు ముడివేసిన
ఎర్రటి తోరణంతో రాఖీ కడుతున్నాను..
న్నటికీ తరగని,ఎప్పటికీ మరవని ప్రేమాభిమానాలు,
ఆత్మీయతానురాగాలు మన సొంతం కావాలని కోరుకుంటూ,
నీకు అన్నిటా శుభం కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
పసిడి పసితనంనుండీ మనం పంచుకున్న
మధురానుభూతులన్నీ మన జీవితాలను ఎప్పటికీ
మధురంగా కొనసాగించేలా చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
అమ్మలోని ఆప్యాయతను, నాన్నలోని ఆపేక్షను,
అనుక్షణం అభిమానాన్ని, ఎప్పటికీ నీడలా తోడుండే

నీ ప్రేమను రక్షణగా... కానుకగా స్వీకరిస్తున్నాను.మ్ముడూ భగవంతుడు నిన్ను ఎల్లప్పుడూ
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి ,కాపాడాలని
మన మధ్య ప్రేమానుబంధాలు,ఆప్యాయతానురాగాలు
ఎప్పటికీ నిలిచి వుండాలని కోరుకుంటూ

రక్షాబంధన్ శుభాకాంక్షలుఅన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అనుబంధంతో పాటూ..
సర్వ మానవ సౌభ్రాతృత్వానికీ, అభిమానానికి ప్రతీక రక్షాబంధన్ ,
అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
Related Posts Plugin for WordPress, Blogger...