పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, మే 2014, సోమవారం

కనపడని ఆ నాలుగో సింహం??




"కనిపించే మూడు సింహాలు ధర్మం, చట్టం, న్యాయానికి ప్రతిరూపాలయితే కనపడని నాలుగో సింహమేరా ఈ పోలీస్" 

ఇదేదో  సినిమాలో డైలాగ్ ... చాలా సినిమాల్లో రాజశేఖర్, సాయికుమార్ లు నిజమైన పోలీస్ అంటే ఇలాగ వుండాలి అనే ఒక భావాన్ని కలిగించే వాళ్ళు. కానీ చెడు పట్ల అంత  ఆవేశంగా, నిజాయితీగా వుండే అధికారి నిజజీవితంలో వున్నారా,ఒక వేళ  వున్నా వాళ్ళు చేయాలనుకునే సేవ చేయగలరా అనేది  ఈ సమాజంలో అందరికీ బాగానే  తెలిసి ఉంటుంది.  ... 

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఏ  స్థాయి అయినా సరే నేను పోలీసుని అని సగర్వగా చెప్పుకునేది  పోలీస్ సర్వీస్ ... కఠిన శ్రమతో,శిక్షణతో  ఉద్యోగం సాధించి ,ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసం,శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటు పడతానని ప్రమాణం చేసి వృత్తిలోకి ప్రవేశించే  పోలీసుల్లో కొందరు ఉద్యోగంలో చేరి,అధికారం,డబ్బు చేతికి రాగానే చేసిన ప్రమాణాలను మర్చి పోయి అవినీతిపరులతో చేతులు కలుపుతున్నారు .. 

అధికారం,సంపాదనే ప్రధాన లక్ష్యంగా పోలీస్ సర్వీస్ ప్రతిష్టకే మాయని మచ్చగా మిగులుతున్నారు.. కొంతమంది ఇలాంటి వాళ్ళ కారణంగా మొత్తం పోలీసులంతా ఇంతే అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేస్తున్నారు .. 'కానిస్టేబుల్' నుండి  'ఐ.పి.ఎస్' వరకు ప్రతి ఒక్కళ్ళు అవినీతి, లంచాలు, నేరస్తులను ప్రోత్సహించటం,బినామీ ఆస్తులను పెంచుకోవటం ఇలాగ ఏదో ఒక వివాదంలో వున్నారంటే వ్యవస్థ పరిస్థితి అర్ధం అవుతుంది .. 

మొత్తం అందరు పోలీసులు  ఇలాగే వున్నారన్నది నా అభిప్రాయం కాదు .. 
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడపిల్లని మోసం చేసి,ఉద్యోగం పోగొట్టుకున్న  ఒక S .I , కష్టం తీర్చమని  స్టేషన్ కి వెళ్ళిన ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తించి టీవీలలో  దర్శనమిచ్చే కొందరు రక్షకభటులు, అలాంటి వారి గురించి మాత్రమే నా ఈ అభిప్రాయాలు ... 

మేము ఈ సమాజానికి సేవ చేయటానికే ఈ సర్వీస్ లోకి వచ్చాము కానీ మేము అనుకున్నట్లు చేయలేకపోవటానికి  మా కారణాలు మాకు ఉన్నాయి అని బాధపడే కొంతమంది నిజాయితీ కలిగిన పోలీసులు కూడా డిపార్ట్ మెంట్ లో లేకపోలేదు. 

ఈ మధ్య వచ్చిన రేసుగుర్రం సినిమాలో అవినీతిని ఎదుర్కున్న పోలీస్ పాత్రను చూస్తె నిజమైన పోలీస్ అంటే ఇలా వుండాలి అనిపించింది .. 

పోలీసులు,రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యం లో అల్లు అర్జున్ కథానాయకుడిగా లక్కీ ది రేసర్   కధ  విషయాని వస్తే .. 

రాము(శ్యామ్ ),లక్కీ( అల్లు అర్జున్) అన్నదమ్ములు..  రాము బుద్ధిమంతుడు,మంచివాడు, లక్కీ ఆకతాయి, అల్లరి పిడుగు .. రాము పద్ధతులు,విలువలు పాటిస్తే లక్కీ నా మనసు చెప్పిందే చేస్తా అంటాడు .. పెద్దయ్యాక రాము పోలీస్ శాఖలో అసిస్టంట్ కమిషనర్ అయితే లక్కీ అమెరికాకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు .. ఒకప్పుడు తన ప్రేమను చెడగొట్టాడని లక్కీ ప్రేమించిన స్పందన నాన్నకి లక్కీ గురించి తప్పుగా చెప్తాడు రాము . 

అన్న మీద కోపంతో  శివారెడ్డి అనే రాజకీయ నాయకుడి అవినీతిని బయట పెట్టాలన్న అన్న ప్రయత్నాన్ని చెడగొట్టి జరిగిన తప్పు తెలుసుకుని తన తప్పుని తనే సరి చేసి, ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడి రహస్యాలను బయటపెట్టి,  తెలివిగా మోసగాళ్ళ ఆట కట్టించిన లక్కీ కధే 
ఈ రేసుగుర్రం ... 

సినిమాలో ఎప్పటిలాగే అల్లు అర్జున్ అల్లరి బాగుంది ... నిజాయితీగా ఉండే   పోలీస్ ఆఫీసర్ గా శ్యామ్  నటన బాగుంది ,రాము,లక్కీ అన్నదమ్ములుగా చక్కగా సరిపోయారు .. 

ఉత్తమ అధికారి కిల్ బిల్ పాండే గా  బ్రహ్మానందం నటన బాగుంది :)


కధలో కొత్తదనం,  ట్విస్ట్ లు లేకపోయినా రెండుగంటల పాటు సరదాగా చూడదగిన  సినిమాగా  బాగానే ఉంది .. వాస్తవానికి  దూరంగా వుంది అనుకున్నా సినిమా అంటేనే ఊహా ప్రపంచం కదా... ఇలాంటి సాహసాలు మనం చేయలేకపోయినా హీరో చేస్తే చూసి సంతోషించటం, సినిమాలోనైనా  చివరకు మంచే గెలవాలని కోరుకోవటం సగటు ప్రేక్షకుడికి  అదో సంతోషం ... 

మొత్తానికి   రేసుగుర్రం సినిమా నిజాయితీ కలిగిన పోలీస్ అధికారులు, ప్రజా క్షేమం కోరుకునే ప్రభుత్వం ఈ సమాజానికి  ఎంత అవసరమో గుర్తుచేస్తుంది.    
మనసుంటే మార్గముంటుంది ... మంచి చేయటానికైనా చెడు చేయటానికైనా 




25, మే 2014, ఆదివారం

రాజకీయ చర్య - ప్రజా ప్రతిచర్య



గత సంవత్సర కాలమంతా రాష్ట్రమంతా ఏమవుతుందో,ఎటుపోతుందో తెలియని అయోమయ,అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది .. కొన్ని కోట్ల ప్రజల  చిరకాల స్వప్నంగా తెరమీదకు వచ్చిన తెలంగాణా ఉద్యమం ఒకరి కంట కన్నీరు,ఒకరి కంట పన్నీరు అన్నట్లు ముగిసింది ..

ప్రత్యేక తెలంగాణా ఇవ్వటం  తప్పని ఎవరూ అనరు ఎందుకంటే అది అక్కడి ప్రజల ఆకాంక్ష, వారి హక్కు .. కానీ అదే సమయం లో ఒక వర్గ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చేసిన  విభజన అనివార్యం అయినప్పటికీ మరొక వర్గ ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా వారి కనీస విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా మూసిన తలుపుల వెనక, ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేసి,ఏ సమస్యకూ తగిన పరిష్కారం లేకుండా విభజన జరగటం మాత్రం ఎవరూ హర్షించలేకపోయారు.. 

ఏది ఏమైనా జరిగిన దాన్ని గుండెల్లోనే దాచుకుని ఇప్పటికి మనం ఏమీ కోల్పోలేదు అనే ఆత్మస్థైర్యం తో  తెలంగాణా సోదరులకు శుభాకాంక్షలను అందించారు  సీమాంధ్రులు ... ఆంద్రా వాళ్ళు ఏమి చేస్తారులే ,ఉద్యమాలు చేస్తారా .. విధ్వంసాలు చేయగలరా ... ఏదో బడికి వెళ్ళే చిన్న పిల్లలతో ర్యాలీలు చేయిస్తారు ... మహా అయితే రోడ్ల మీద పిచ్చి వేషాలు వేస్తారు అంతే కదా .. వారికోసం పోరాడే సరైన నాయకుడు కూడా లేడు అని ఆంధ్రా వారిని చిన్న చూపు చూసిన నాయకులకు ప్రజలు చెప్పిన సమాధానం చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది. 

గొర్రె కసాయి వాడ్నినమ్మినట్లుగా  మేము వెళ్లి మళ్ళీ ఓట్లడిగి మీ ఆంధ్రాని  అభివృద్ధి చేస్తాము అంటే నమ్మేస్తారులే అనుకున్న నాయకుల అంచనాలు , ఏమో .. ఏమవుతుందో ఎప్పటి నుండో వున్న ప్రధాన  పార్టీ కదా గెలవకుండా ఉంటుందా అన్న కొందరి గట్టి నమ్మకాలను ఒమ్ము చేస్తూ .. సీమాంధ్ర ప్రజల నిర్ణయం విస్మయానికి గురి చేసింది... 

 చర్యకి ప్రతిచర్య లాగా మనం చేసే ప్రతిపనికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని మరిచిపోయిన నాయకులు  ప్రజల మనోభావాలను కించపరిస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాలను విస్మరించి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.. అటు తెలంగాణాలో మేము తెలంగాణా ఇచ్చాము కాబట్టి  మమ్మల్ని దేవతలుగా పూజిస్తారు అన్న కాంగ్రెస్ ఆశా నిరాశ అయింది .. 

ఎన్నికల ఫలితాల రోజు టీవీలో గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ ఎదురుగా "0" అంకెను చూసిన ప్రతి ఆంధ్రుడికి ఏమీ తినకుండానే కడుపు నిండినంత సంతోషం కలగటం లో ఆశ్చర్యం లేదు .. ఏది ఏమైనా తెల్లవారి అరాచక పాలన నుండి విముక్తులు కావటానికి భారతీయులు చేసిన పోరాటాన్ని ప్రతిబింబించేలా సీమాంధ్రులు  చేసిన ఈ తిరుగుబాటు చాలా గొప్పది.. అరవటాలు,కరవటాలు ఎందుకు "కీలెరిగి వాత పెట్టటం" అంటే ఇదే అంటూ నాయకుల నాటకాలకు తెర దించిన ప్రజల విచక్షణ  గొప్పది ... విభజన పాపం ఒక్క కాంగ్రెస్ పార్టీదే  అని అనుకున్నా ... తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అన్ని పార్టీల వాళ్ళు ఎవరికి  వాళ్ళు విభజనకు సహకరించారనేది కూడా బహిరంగ రహస్యం...  

ఏది ఏమైనా కోటి ఆశలతో , అన్ని శక్తులను కూడగట్టుకుని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా ఎవరినో ఒకరిని నమ్మక తప్పని పరిస్థితుల్లో,ఒక కొత్త నాయకత్వానికి  పట్టం కట్టారు సీమాంధ్రులు .. మనకి వున్న వనరులు,అవకాశాలను, అన్నిటినీ సమీకరించి, వినియోగించి  నమ్మిన వారిని వంచించకుండా, స్వార్ధచింతన లేకుండా పాలన సాగించి సీమాంధ్ర ప్రదేశ్ కోలుకుని, అభివృద్ధి  చెందేలా కొత్త నాయకత్వం అడుగేయాలని  ఆకాంక్షిస్తూ ... ప్రజా తీర్పుతో గెలిచిన విజేతలకు,తెలంగాణా,సీమాంధ్ర ప్రజలకు అభినందనలు ! 




24, మే 2014, శనివారం

జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు...


కొన్ని ప్రదేశాలు ,కొన్ని సంఘటనలు , కొందరు మనుషులు , కొన్ని సినిమాలు,కొన్ని పాటలు ఇలా కొన్నిటికి  జీవితంలో చాలా గొప్ప స్థానం వుంటుంది ..  ఎక్కడ ఎప్పుడు వాటిని చూసినా, విన్నా మనసు  గతంలోకి దూసుకు వెళ్ళిపోవటం ఖాయం .. వాటిలో కొన్ని సంతోషించే విషయాలైతేకొన్ని బాధ పెట్టేవి  కూడా ఉంటాయనుకోండి..

ఇంతకీ ఇప్పుడు నన్ను అలా వర్తమానం నుండి గతం లోకి లాక్కెళ్ళిన విషయం ఏంటంటే ..సమ్మర్ హాలిడేస్ ఎజాయ్ చేయటం ఒక ఎత్తైతే రాబోయే పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూడటం ఒక ఎత్తు ..మొన్న పదవ తరగతి నుండి  డిగ్రీ,ఇంకా రకరకాల పరీక్షా ఫలితాల వరకు పిల్లల ఆత్రుత, హైరానా ..
ఫలితాల కోసం ఎదురు చూసి చూసి కోరుకున్న ఫలితం రాగానే ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్న విద్యార్ధులు వాళ్ళ  తల్లిదండ్రులు...

ఇవన్నీ చూసి నా 10 th క్లాస్ రోజులు గుర్తొచ్చాయి.. నాకు అన్ని సబ్జెక్ట్స్ బాగానే వచ్చేవి కానీ లెక్కలు అంటే మాత్రం దేవుడా ఈ గండం ఎలా గట్టెక్కాలా అనేంత కష్టంగా ఉండేది.. లెక్కలు బాగా చేసే వాళ్ళని చూసి  అకారణంగా కోపం కూడా వచ్చేది .అలాగే 10 th క్లాస్ దాకా  వచ్చాక నేను  తీసుకున్న బలమైన నిర్ణయం  లెక్కలు లేని సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ తీసుకోవాలని కానీ ఆ  పని చేయాలంటే ముందు ఈ పది గట్టెక్కాలి కదా!
మరి అందుకు  నా  ప్రయత్నం నేను చేయాలి కదా ..

దేవుడి మీద భారం వేసి పరీక్షలకు సిద్ధమవుతుండగా నా ప్రయోజకత్వం తెలిసిన అమ్మా,నాన్న వూరి నుండి మా పెద్దనాన్న పిల్లలైన అన్నయ్యల్ని  రంగంలోకి దించారు నాకు లెక్కలు చెప్పటానికి...  వాళ్ళు అప్పటికే డిగ్రీలు,పాలిటెక్నిక్ లు  చదివేసి వుండటం తో వాళ్ళ మీద అపారమైన నమ్మకంతో ఈ బాధ్యతను వాళ్లకి అప్పగించాడు నాన్న... నాకు లెక్కలు రావని వాళ్లకు చెప్పి అవమానించారనే బాధ,వాళ్ళు చెప్పే లెక్కలు నేను చేయలేకపోతే వాళ్ళ ముందు చులకన అనే బాధ, ఇలా అన్ని రకాల బాధలతో అన్ని పరీక్షలతో పాటు లెక్కల పరీక్ష రోజు రావటం, పరీక్ష రాయటం అన్నీ అయిపోయాయి..

ఇంక సమ్మర్ హాలిడేస్ వూరి నుండి వచ్చిన పిన్ని వాళ్ళ పిల్లలు,మా బంధువుల్లో పిల్లలు,పెద్దల పంచాయితీలతో వేగంగా గడిచిపోయింది. రిజల్ట్స్ రోజు రానే వచ్చింది .. నాకు మాత్రం లెక్కలు పాసవుతాననే నమ్మకం ఎంత గట్టిగావుందో తప్పుతాననే నమ్మకం కూడా అంతే వుంది .. నా పరీక్షల టెన్షన్ నాకంటే అమ్మ,నాన్న,నా లెక్కల గురువులు (అన్నయ్యలకి) ఎక్కువై  పోయింది ,, అప్పట్లో రిజల్ట్స్ పేపర్ లోనే వచ్చేవి కదా .. పేపర్ కోసం మా తమ్ముడు ,అన్నయ్య ముందే వెళ్లి పడిగాపులు పడి  పేపర్  తెచ్చారు  ..

అందరూ ఎంత టెన్షన్ పడుతున్నా హాయిగా నిద్రపోతున్న నాకు మాత్రం ఇవేమీ పట్టలేదు ...  ముందుగా వాళ్ళే నా రిజల్ట్స్ చూసి నన్ను నిద్రలేపి చెప్పిన విషయం ఏమిటంటే నేను పాసయ్యానని .. నాకు ముందు నమ్మకం కలగలేదు పేపర్ లో నా నంబర్ చూసే దాకా ..ఒక్క లెక్కల్లోనే తక్కువ మార్కులు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్కులతో పాసయ్యాను .. 

తల్లీ నీ పరీక్షలాగా లేదమ్మా హాయిగా నిద్రపోయావు .. అసలు నిద్రెలా పట్టిందే నీకు .. అంటే నేను నిద్రపోకపోతే మాత్రం జరగాల్సిందే జరుగుతుంది కదా .. అనుకున్నాను మనసులో  :) ... ఇంక నేను పాస్ అయినందుకు మా అమ్మా,నాన్న స్వీట్స్ పంచటం, భోజనాలు పెట్టటం ... పదికే ఇంత హడావుడా అని కొందరు నవ్వుకోవటం .. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడు అనుభవించిన టెన్షన్ , సంతోషం,మన అనుకున్న వాళ్ళందరూ మన బాధలో, సంతోషం లో  తోడుండటం ఇవన్నీ నిజంగా మరిచిపోలేని గొప్ప జ్ఞాపకాలు కదా అనిపిస్తాయి .. 

ఎంతైనా  
జ్ఞాపకాలే మైమరపు... జ్ఞాపకాలేమేల్కొలుపు.. 
జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు.




22, మే 2014, గురువారం

కదిలే కాలమే జీవితం ...




ఆగదేనాడు కాలము ఆగినా గడియారమూ అంటూ కాలం ఎవ్వరి కోసం ఆగదు . అలసట, నీరసం మనకుంటాయేమో  కానీ కాలానికి  కాదు . అందుకే అది ఎప్పుడూ పరిగెత్తుతూనే వుంటుంది నిర్విరామంగా ..


సంతోషంలో  చిరునవ్వు... బాధలో దుఃఖం 
ప్రేమానురాగాలు ... అసూయ ద్వేషాలు 
హృదయంలో నిలిచిపోయే తీపి జ్ఞాపకాలు , 
గుర్తుకు తెచ్చుకోవటం కూడా ఇష్టం లేని కొన్ని గుర్తులు 
కొందరు మనుషులు... కొన్ని సంఘటనలు నేర్పిన గుణపాఠాలు 
సంతోషాన్నిచ్చే  కొత్త బంధాలు .. 
వదులుకోవాల్సి వచ్చే  కొన్ని బంధుత్వాలు   
కలిసే కొత్త స్నేహాలు  .. 
ఇష్టం లేకపోయినా సాగిపోవాల్సిన కొన్ని దారులు 
వదిలేసిన పాత ప్రదేశాలు ... చేరుకున్న కొత్త  మజిలీలు 
ఎప్పుడూ దోబూచులాడే గెలుపు ఓటములు 
పెరుగుతున్న వయసు ....  నేర్చుకుంటున్న అనుభవాలు   
వీటన్నిటినీ భరిస్తూ, తనలోనే దాచుకుంటూ ... 
నేను కూడా కాలం లాగా అలుపు లేని దాన్నే అంటుంది  మనసు ... 

 కేవలం డైరీ కాగితాల్లో నిలిచిపోయేది మాత్రమే  కాలం కాదు...  

"ఏమి రాసినా కాగితం తనలో దాచుకుంటుంది.. కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి"... 
అనుభవాలు కూడా అంతే .. చాలా అనుభవాలు తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతుంటాయి.కొన్ని మాత్రమే మనసు పొరల మధ్య మొగలిరేకుల్లాగా నిలిచి పోతుంటాయి ... 

ఏ జ్ఞాపకం తామరాకు మీద నీటి బొట్టు అవుతుందో,
ఏ అనుభవం మది పొరల్లో మొగలిరేకు అవుతుందో నిర్ణయించాల్సింది కాలమే..

కొంతమంది జీవితాన్ని తమ కోణం లో నుండే చూస్తారు.. 
వాళ్ళు చేసేదే సరైనదని,ఎదుటి వాళ్ళు చేసేదంతా తప్పనీ , 
తనలో తప్ప అందరిలో లోపాలుంటాయని గట్టిగా నమ్ముతారు.. 

కానీ జీవితంలో అనుభవం పెరిగే కొద్దీ , అభిప్రాయాలు మారే కొద్దీ 
ఒకప్పుడు ఎంతో గొప్పగా కనపడిన వారి ప్రవర్తన వారినే పునరాలోచించుకునేలా చేస్తుంది...ఏది తప్పు,ఏది ఒప్పు, ఎవరు ఎలాంటి వాళ్ళు, అనేది అనుభవపూర్వకంగా మాత్రమే మనకి తెలుస్తుంది .
ఆ అనుభవాన్ని నేర్పే గురువు కూడా కాలమే ... 

కాబట్టి కాలం ముందు ముందు మనకోసం ఏమి దాచించో అనే మంచి ఊహలతో ,కోరికలతో సంతోషంగా సాగిపోవటమే  మనిషి విధి అని కాలమనే గురువు గారి  ఉవాచ ..  

పరుగాపక పయనించవే తలపుల నావా 
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా 
ఎదిరించిన సుడిగాలిని జయించినావా 
మది కోరిన మధు సీమలు వరించి రావా 



20, మే 2014, మంగళవారం

హాయ్ "నా చిన్నిప్రపంచం"




"నా చిన్నిప్రపంచం" మిత్రులందరికీ హాయ్ మరియు నమస్తే అందరూ బాగున్నారా ??చాలా రోజులయింది బ్లాగ్ రాసి, రాయకుండా ఉండేంత 
గొప్ప కారణాలు ఏమీ లేకపోయినా రాయటానికి అంత గొప్ప విషయాలు ఏమున్నాయిలే అని రాయటం  మానేశాను.. 

దాదాపు సంవత్సరం నుండి బ్లాగ్ రాయలేదు..  నా బ్లాగ్ ఈ నెట్ ప్రపంచం లో ఎక్కడో ఒక  మూలన పడిపోయుంటుంది లే అనుకున్నాను కానీ ఏమీ రాయకపోయినా నా బ్లాగ్ రోజూ చూసే వాళ్ళు, అప్పుడప్పుడు కామెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా వుండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది .. 
కొన్ని కామెంట్స్ అయితే నా బ్లాగ్ ని ఇంతగా  ఫాలో అయ్యి,అభిమానించే వాళ్ళు కూడా వున్నారా ??అని  నాకే అనుమానం కలిగించేలా కూడా చేశాయి ... :) 

నా చిన్నిప్రపంచం ద్వారా నాకు పరిచయం అయిన ఫ్రెండ్స్ ... నేను ఈ సంవత్సరం రోజులుగా కనపడలేదని నా గురించి తెలుసుకోవాలని మెసేజ్ ఇచ్చి,నా క్షేమసమాచారాలు తెలుసుకున్న "మనస్వి జయ"  గారు,
నేను  ఫేస్ బుక్ లో కనపడగానే ఎప్పుడో విడిపోయిన ఆత్మీయుల్ని 
పలకరించినట్లుగా  పలకరించిన "సాహితి మాలాకుమార్ " గారు ...  
నన్ను ఎప్పడూ ఆత్మీయంగా పలకరించే "వనజవనమాలి" గారు, 
"శ్రీ" గారు , ఇంకా చాలా మంది బ్లాగర్స్ నా ఫేస్ బుక్ లో కూడా ఫ్రెండ్స్ .. 

ఇంతమంది మంచి స్నేహితుల్ని,నెట్ ప్రపంచం లో నాకంటూ ఒక గుర్తింపుని,స్థానాన్ని  ఇచ్చిన "నా చిన్ని ప్రపంచాన్ని"  ఇలా వదిలెయ్యటం నాకు నచ్చలేదు .. అందుకే మళ్ళీ వచ్చేశాను "నా చిన్నిప్రపంచం" లోకి... 

"నేను కవయిత్రిని కానన్న వాళ్ళని ఏదో చేస్తా " రేంజ్ లో కాకపోయినా  ఏదో నాకు నచ్చిన కబుర్లు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం .. :) 

మన మాటలు,చేతలు ఎదుటివాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ కీడు  చేయకపోతే చాలు .. మంచి మనస్సుతో సాటి మనుషుల్ని అభిమానించి,ప్రోత్సహించే మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదములు 







Related Posts Plugin for WordPress, Blogger...