పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, జనవరి 2016, సోమవారం

ఎల్లోరా శిల్పాలు - కైలాస్ నాధ్ టెంపుల్సృష్టి రహస్యం,సృష్టికి ప్రతిసృష్టి, ఎల్లోరా గుహలని సమీపించగానే గుర్తొచ్చే మాటలు.శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు అన్నట్లు, నిజంగా మనుషులే చెక్కారా అనిపించే మహాద్భుతం జగత్ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు.. సహ్యాద్రి పర్వతాలను సుతారంగా చెక్కి,అందమైన శిల్పాలతో ఉన్న ఇక్కడి అద్భుతమైన గుహలు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి.వరసగా పేర్చినట్లున్న పర్వతసానువుల్లో మలచిన అందమైన గుహలు.ఎల్లోరా గుహాలయాలు మూడు మత వ్యవస్థలు. హిందూ,బౌద్ధ,జైన మతాలకు సంబంధించిన శిల్పాలు చెక్కి ఉన్నాయి.గుహలంటే ఏదో లోపలి సొరంగాల్లా ఉంటాయనుకున్నాము కానీ శిల్పాలన్నీ విశాలమైన గదులలో అమర్చిన అందమైన అలంకరణలుగా అనిపిస్తాయి 

ఇవి మొత్తం 34 గుహలు. 1 నుండి 12 వరకు గుహలు బౌద్ధ మతానికి , తరవాతి 16 గుహలు హిందూ మతానికి, 30 నుండి 34 వరకు జైనమతానికి సంబంధించిన గుహలు ఉన్నాయి. వీటిని అపూర్వసంగమం అని చెప్పొచ్చు. క్రీ.శ 500 - 700 కాలంలోని బౌద్ధ గుహలు వీటన్నిటిలో ప్రాచీనమైనవి. ఈ గుహలన్నీ కూడా ఇప్పటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నరోజుల్లో కట్టిన కట్టడాల కంటే విభిన్నంగా అనిపిస్తున్నాయి.ఎన్ని వందల మంది శిల్పులు,నిపుణులు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించారో అనిపిస్తుంది.అద్భుతలోకంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. 

 కైలాసనాధ  దేవాలయం-  Cave 16
 నీలాకాశానికి ,పచ్చని భూమికి మధ్యలో కనిపించే ఈ కైలాస దేవాలయం ఒక మనోహర దృశ్యం.

కైలాస్ టెంపుల్

16 వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయంగా చెప్తారు.ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాధలను శిల్పాలుగా చెక్కారు. ఈ కైలాస దేవాలయాన్ని చెక్కటానికి కనీసం 100 సంవత్సరాలు పట్టి ఉంటుందని అంచనా.లోపలికి  వెళ్లగానే కనపడే ఒక్కో శిల్పం ఒక్కో అద్భుతం.మామూలుగా ఏ భవనాన్నైనా కిందనుండి పునాదులతో నిర్మిస్తారు కానీ ఈ కైలాస దేవాలయాన్ని మాత్రం కొండ శిఖరాగ్రం నుండి ప్రారంభించారట.Top to bottom carving technique లో నిర్మించిన పురాతన హిందూ ఆలయం  ప్రపంచవ్యాప్తంగా ఇదొక్కటే.ఆలయం అంతా  ఏనుగుల శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి.


ఈ ఆలయంలో శిల్పాలు,కట్టడాల ఫినిషింగ్ కూడా రాళ్ళను ఏదో చెక్కినట్లు లేకుండా ప్లానింగ్ తో ,ఆర్కిటెక్చర్ టెక్నిక్స్ తో కట్టినట్లు నీట్ గా ఉండటం,వాటిమీద చెక్కిన నగిషీలు,అందమైన డిజైన్లలో అప్పటి కళాకారుల నైపుణ్యం  కనిపిస్తుంది.కైలాస దేవాలయం మూడు భవంతులుగా ఉంటుంది.ఈ ఆలయం మొత్తం చూడాలంటే ఎంత సమయం అయినా సరిపోదేమో అనేన్ని ఆశ్చర్యం కలిగించే శిల్పాలు కట్టడాలు ఉన్నాయి.ఎటు చూసినా శిల్పాలే మనచుట్టూ ఉన్నట్లుంటాయి.ఎత్తైన కొండమధ్యలో చెక్కిన ఈ ఆలయం మధ్యలోకి వెళ్తే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లు,చూడటానికి రెండు కళ్ళు చాలనట్లుగా అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఖచ్చితంగా ఏవో అద్భుతశక్తులు వున్నాయేమో అనిపిస్తుంది.

కైలాస్ టెంపుల్ ధ్వజస్తంభం 

కైలాస్ టెంపుల్ లో భారీ ఏనుగు

మేము వెళ్ళినప్పుడు సందడి చేస్తున్న స్కూల్ పిల్లలు

ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి 
అప్పుడు  వేసిన రంగు ఇప్పటికి ఉంది.

ధారాతీర్ధం 
29 వ గుహ దగ్గర పై నుండి జలపాతం కురుస్తుంది. దీనినే ధారా తీర్ధం అంటారు. 
ఇక్కడ వనవాస సమయంలో సీతా దేవి స్నానం చేసిందని దీన్ని సీతాస్నాన గృహం అని పిలుస్తారు. 


21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిలో ఉందని చరిత్ర. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.అన్నిచోట్లా శివలింగాలు,శివతాండవ శిల్పాలు చాలా బాగున్నాయి.అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూస్తాం.
 Cave - 29

29 వ గుహలో శివాలయం  

శివపార్వతుల కల్యాణం

కైలాసపర్వతం ఎత్తబోతున్న రావణుడిని 
శివుడు తన కాలితో కిందికి తొక్కటం

 రుద్రతాండవం చేస్తున శివుడు 

Cave - 32 జైన గుహలు 

జైన గుహలు - ఈ చిన్ని వాకిలి లోనుండి లోపలి వెళ్తే 
కనపడుతుంది .. అద్భుతమైన శిల్పకళా ప్రపంచం

ఎంట్రన్స్ లో వుండే ఆలయం 

జైన గుహలో శిల్పాలు

బుద్ధ గుహలు Cave -10

ధ్యాన బుద్ధుడు

మా అందరికీ చాలా నచ్చిన ఎల్లోరా గుహలలో ఇవి కొన్ని మాత్రమే .. ఎంత చూసినా తరగని,ఇంకా ఏవో మిస్ అయ్యామే అనిపించే శిల్పకళా  సంపద ఎంతో  ఈ గుహల్లో ఉంది...మానవమాత్రులకి మాత్రమే సాధ్యం కాని విధంగా చెక్కిన ఈ శిల్పాల మీద కానీ, చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా దుమ్ముధూళీ లేకుండా శుభ్రంగా ఉన్నాయి.దేవాలయాలలో కన్నా ఎక్కువ యాత్రికులు ఇక్కడే కనిపించారు. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపించటం విశేషం.

ఎల్లోరాలో మా చెల్లి వాళ్ళాయన,మా అమ్మ,తమ్ముడు


Related Posts Plugin for WordPress, Blogger...