పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

పటాస్ -- టెంపర్ -- పోలీస్




ఈ మధ్య చూడాలనుకోకుండా చూసిన రెండు సినిమాలు పటాస్, టెంపర్. నందమూరి సోదరులు కళ్యాణ్ రామ్, JR  ఎన్టీఆర్ లు నటించిన ఈ సినిమాలు  రెండూ ఎలాగోలాగా పోలీసులు అయిపోయిన పోలీస్ అధికారుల స్టోరీనే ,ఇద్దరూ ముందు అవినీతి అధికారులు,కానీ కొన్ని పరిస్థితుల వల్ల సినిమా ఇంటర్వెల్ నుండి మంచిగా మారిన పోలీసులు.రొటీన్గా నీతి, నిజాయితీ లకు ప్రతిరూపమైన మంచి పోలీస్ లా  అవినీతి నాయకులు, అధికారుల మీద,రౌడీల మీద యుద్ధం ప్రకటించే హీరోల కధల్లా కాకుండా ఆడవాళ్ళ మీద ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలను  ఎదిరించే మంచి పోలీస్ అధికారులుగా,మంచి అన్నయ్యలుగా నటించారు.

ఆరోజుల్లో నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రా ఆడపడుచులు అభిమానంతో  అన్నగా పిలుచుకునేవాళ్ళు కదా అలాగే తాత గారి బాటలో నడుస్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా  చెల్లెమ్మలకి జరిగిన అన్యాయం కోసం పోరాడి అన్నలుగా పిలిపించుకున్నారు.పటాస్ లో హీరోని అన్నగా పిలుచుకునే  ఒక చెవిటి,మూగ అమ్మాయి కొందరి రౌడీయిజానికి బలయిన తర్వాత,సాక్ష్యాలు లేవని బయటికి వచ్చిన నిందితులని సాక్ష్యం లేకుండా ప్రమాదాల్లో చంపేసి,వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు కళ్యాణ్ రామ్.ఇది కొంచెం పాతకధే కానీ..

JR NTR 'టెంపర్' మాత్రం క్లైమాక్స్ లో కధ కొంచెం మలుపు తిరుగుతుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన వాళ్లకి  శిక్షపడాలని కోరుకున్న ఒక చెల్లెమ్మ కోసం,తను డబ్బు కోసం జైలు నుండి తప్పించిన వాళ్ళే ఈ ఘోరం చేశారని తెలుసుకుని బాధపడి,తప్పు దిద్దుకోవటానికి నిందితులని కోర్టుదాకా తీసుకెళ్ళినా సాక్ష్యాలు లేకపోవటంతో వాళ్ళతో కలిసి తనుకూడా తప్పు చేశానని సాక్ష్యం చెప్పి తనతో సహా నిందితులందరికీ  ఉరిశిక్ష పడేలా చేయటం కొంచెం కొత్తగా, అనిపిస్తుంది.

పోలీస్ స్టేషన్ కి అమ్మాయి కనపడట్లేదని తల్లిదండ్రులు రాగానే ఎవరితోటో లేచిపోయుంటుంది అని సింపుల్ గా తీసిపడేసినట్లు మాట్లాడే పోలీసులు  అందరు అమ్మాయిలూ అలాగే చేస్తున్నారా లేకపోతె నిజంగానే ఏదైనా ప్రమాదంలో ఉన్నారా అని ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నో ప్రమాదాల నుండి ఆడవాళ్ళని కాపాడొచ్చు కదా అనిపిస్తుంది .ఈ ఒక్క విషయమే కాదు ఏ సమస్యనైనా Shall Presume అని కేవలం వాళ్ళ దృష్టితోనే కాకుండా అన్ని విధాలా ఆలోచిస్తే బాధితులకి సరైన న్యాయం జరుగుతుంది. 

అందుకే ఈమధ్య  పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి లేకుండా ఎదుటివారి బాధలు,సమస్యలు ఓపికగా విని వెంటనే తగిన రీతిలో స్పందించేలాగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం అని చెప్పొచ్చు."One Way or Other Police Will Always Protect" ఈ మాట నిజమైతే సమాజానికి మంచిదే కదా.. 

ఇంక టెంపర్ సినిమాలో మన దేశంలో జరుగుతున్న అవినీతికి అసలైన సాక్ష్యం మన గాంధీ తాత అంటాడు Jr.NTR.నిజమే గాంధీ బొమ్మ ఉన్న నోట్లే  కదా అవినీతికి ప్రధాన వనరు అనిపించింది.కోర్టులో ప్రాసిక్యూషన్‌ లాయర్ కీలకమైన సాక్ష్యాన్ని అవతలి వాళ్లకి ఇచ్చెయ్యటం కోర్టుల్లో  ప్రస్తుత పరిస్థితులని తెలియచేస్తుంది. ఈ క్షణాన మేము తప్పు చేసినా మనదేశంలో న్యాయవ్యవస్థ ఈ క్షణంలో ఇప్పటికప్పుడు మమ్మల్ని శిక్షించలేదు అందుకే మేము ధైర్యంగా ఇలాంటి తప్పులు చేస్తున్నాం అనే డైలాగ్ నిజమే కదా అనిపిస్తుంది. 

ఈ రెండు సినిమాల్లో హీరోల వ్యక్తిత్వాలు ఎంతటి కఠిన మనస్కుల్లో కూడా కొంచెమైనా మానవత్వం దాగి ఉంటుందేమో అనిపించేలా ఉన్నాయి. కేసులో ముఖ్య సాక్ష్యంగా ఉన్న సీడీ మరో కాపీ లేదనుకుని, ఉరికి కూడా సిద్దపడ్డ హీరోని చివరి క్షణంలో మరో సీడీ కాపీ దొరికి ఉరి ఆపేసి కాపాడటం చిరంజీవి 'అభిలాష' సినిమాని గుర్తు చేసింది.ఇవీ టెంపర్,పటాస్ సినిమాల విశేషాలు...

నాకు నచ్చిన ఒక పాట

ఓ మై ఓ మై బేబీ 





Related Posts Plugin for WordPress, Blogger...