పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, జులై 2015, గురువారం

మంచి - చెడు - ఆదర్శం - అవార్డులు


 


మంచివాడికి మరొక మంచివాడు ఆదర్శం
దేశానికి మంచి చేయాలనుకునే రాజకీయ నాయకుడికి ఒకప్పటి గొప్ప నాయకుడు ఆదర్శం
మంచిమనసుతో  పేదవాళ్ళకి సేవ చేయాలనుకునే ప్రజాసేవకులకు నిస్వార్ధ సేవకులు ఆదర్శం

 అలాగే ... 

దొంగలకి గజదొంగ ఆదర్శం
చెడ్డవాడికి మహా  చెడ్డవాడు ఆదర్శం
మోసగాడికి మరొక మోసగాడు ఆదర్శం
నీచుడికి అంతకంటే పెద్ద నీచుడు ఆదర్శం
స్వార్ధపరుడికి తనకంటే గొప్ప స్వార్ధపరుడు ఆదర్శం

మనుషులందరికీ  చాలా ఆదర్శాలు ,ఆశయాలు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం డబ్బు కోసం, సమాజంలో పేరు ప్రతిష్టలకోసం, తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవటం కోసం రాజకీయాలు, ప్రజాసేవలు చేయటం (చేస్తున్నట్లు నటించటం ) మహా ఇష్టం..

రాజకీయాల్లో అవినీతి అందరికీ తెలిసిందే దాని గురించి కొత్తగా మాట్లాడేదేమీ లేదు కానీ ఈ రాజకీయాన్ని మించిన రాజకీయం ఇప్పుడు స్వచ్చంద సంస్థల్లో జరుగుతుంది. ఒకప్పుడు చారిటీస్ అంటే నిస్వార్ధంగా తమకున్నదాన్లోనే పేదలకు సేవ చేస్తూ ఎవరైనా దాతలు ఇచ్చిన వాటిని పేదవారి  బాగోగులకే వినియోగిస్తూ బతికిన ఎందరో సమాజసేవకులని మనం చూశాము..కానీ ఇప్పుడు కొందరు నిరుద్యోగులకి పునరావాస కేంద్రాలుగా,ఈజీ మనీ కోసం, గొప్ప సేవకుడనే పేరు కోసం ఆరాటపడే కొందరు మోసగాళ్ళకి నిలయాలుగా  స్వచ్చంద సంస్థలు తయారయ్యాయి అన్నది వాస్తవం.

అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు , మహిళా సమాజాలు ఇలా ఇంకా ఎన్నో లెక్కలేనన్ని సేవాసంస్థలు ప్రస్తుతం ఉన్నాయి. కానీ వీటిలో ఎంతవరకు నిజమైన సేవజరుగుతుంది అన్నది ప్రశ్నార్ధకం. పసిపిల్లల్ని, ముసలివాళ్ళని అడ్డుపెట్టుకుని సొసైటీలో బాగా డబ్బున వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము అంతమందిని పోషిస్తున్నాము, ఇంతమందిని ఉద్ధరిస్తున్నాము  అని లెక్కలు  చెప్పి, డొనేషన్స్  తెచ్చుకోవటం, ఆ చందా డబ్బులతో ఆ ఆశ్రమ నిర్వాహకులు పండగ చేసుకోవటం ఇలాంటివన్నీ ఇప్పుడు సర్వ సామన్యమయ్యాయి. ఇలాంటి మోసపూరితమైన సంస్థలని నియంత్రించాల్సిన ప్రభుత్వం, అధికారులు చూసీ చూడనట్లుగా ఉండటం, అవసరమైతే ఈ సేవకులకి వారి అండదండలు అందించటం కూడా పరిపాటే ..

నిన్న మా వూళ్ళో  ఉత్తమసేవా  అవార్డు అనాధ పిల్లలకు "సేవ" చేసిన నిజమైన సేవకులకి కాకుండా ఆశ్రమంలోని అనాధపిల్లలతో ఆయనకీ "సేవ"  చేయించుకోవటం (తలకి హెన్నాలు పెట్టించుకోవటం, వంట చేయించుకుని తినటం, వగైరాలు ) మాత్రమే  కాకుండా, ఆ  పిల్లలతో వేరే వూర్లో ఉన్న అతని కుటుంబ సభ్యులందరికీ ఊడిగం చేయించిన ఒక అనాధ ప్రజా సేవకుడికి రావటం, ఇలాంటి గొప్ప సేవకులు,నాయకులు అందరూ ఒక చోటికి చేరి,  ఉత్తమ సేవా అవార్డులు ఇచ్చి పుచ్చుకోవటం చూస్తే

"నాకు నువ్వు ... నీకు నేను ఒకరికొకరం నువ్వు , నేను" అంటూ
"ఒకే జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్లు"
"దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు " 
"సినిమా వాళ్ళు ఉత్తమ నటన అవార్డుల్ని వాళ్ళలో వాళ్ళు పంచున్నట్లు" అనిపించింది.
అయినా ఇలాంటి నిజజీవిత నటుల ముందు పాపం ఆ సినిమా నటులు ఎంతమాత్రం పోటీపడగలరు !!!

కాబట్టి ప్రజాసేవకులూ ఇప్పటి నుండి మీకు మంచి ప్రజాసేవకులు ఆదర్శం కాకూడదు..ఇలాంటి దొంగ సేవకులే ఆదర్శంగా తీసుకుంటే మీకు కూడా వచ్చే సంవత్సరం అయినా ఆ గొప్ప అవకాశం వస్తుందేమో ప్రయత్నించండి.
Related Posts Plugin for WordPress, Blogger...