పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, జనవరి 2015, ఆదివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 15




నా చైన్ ప్రహసనం అయిన తర్వాత ఇంక మనుషులెవరినీ నమ్మకూడదని నిర్ణయానికి వచ్చాను.మామూలుగా కాలేజికి వెళ్ళోస్తున్నాం .పెద్దమాధవ్, హేమంత్,సోహైల్,దివాకర్ మూడో సంవత్సరం సబ్జెక్ట్స్ కష్టంగా ఉంటాయి కదా ట్యూషన్స్ పెట్టించుకుందామా అని చర్చించుకుంటున్నారు. సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి రకరకాల సబ్జెక్ట్స్ చదివి మానవశరీర భాగాల నిర్మాణము, శరీర అవయవ వ్యవస్థ,వాటి విధులు,ఆరోగ్యపరిస్థితి,రోగాలు,సమస్యలు ఇలా మానవశరీరాల అంతు చూసే పనిలో నిమగ్నమయ్యాము.ఏంటో పై నుంచి చూసి,మైక్రోస్కోప్ తో చూసి మనిషి శరీరాన్ని శోధించినట్లు మనుసుని కూడా తెలుసుకునే విద్య (మానసిక (పిచ్చి) వైద్యుల్లా కాదు) ఎదుటివాళ్ళు మనసులో ఏమనుకుంటే అది మనకి వెంటనే తెలిసే విద్య వుంటే ఎంత బాగుంటుందో కదా.. 

లైబ్రరీలో కూర్చుని Textbook of Medical Microbiology - Arora and Arora చూస్తున్నాను.నాకు ఇష్టమైన సబ్జెక్ట్ లో ఇది ఒకటి.సాధారణంగా మనుషులకు సంక్రమించే అంటువ్యాధులు,సాంక్రమిక వ్యాధులు,రోగోత్పత్తి, ప్రయోగశాలలో రోగాలను పరీక్షించి,నిర్ధారించటం,చికిత్స,నియంత్రణ,నివారణ ఇలా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇదే అనిపిస్తుంది.సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇలాంటి వ్యాధులతో  సామాన్య రోగులు ఎక్కువగా వస్తుంటారు. ఒక్కోసారి ప్రాణాంతకంగా ఉన్నవాళ్లకి సరైన వైద్యం అందటం అత్యవసరం అవుతుంది.ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే తాహతు లేని కొంతమంది రోగులను చూసినప్పుడు నేను మాత్రం డబ్బు ఆశించకుండా ఇలాంటి రోగులకు వైద్యం చేయటానికే ప్రాధాన్యం ఇచ్చే డాక్టర్ అనిపించుకోవాలి అనుకునేవాడ్ని. 

ఏదో ఆలోచిస్తూ పుస్తకం చదువుతూ తలెత్తి చూసిన నాకు దూరంగా కావ్య వస్తూ కనిపించింది.ఇదేంటిరా నాయనా నా వెంట పడుతుంది.నా బొంద నిజంగా నా వెంట పడుతుందా లేక నాకలా అనిపిస్తుందా? సరే చూద్దాంలే అనుకుని సైలెంట్ గా  కూర్చున్న నా దగ్గరికి కావ్య రానే వచ్చింది.ఇంక తప్పదు తనతో మాట్లాడటం,ఎందుకంటే మొన్నేగా వాళ్ళింటికి వెళ్లి టీతాగి మరీ వాళ్ళ అమ్మతో హెల్ప్ అడిగి వచ్చాను. సరేలే ఇప్పటికి మాట్లాడదాం,అసలే ఇలాంటి వాళ్ళ తిట్లు తగిలేకదా నా చైన్ పోయింది అని గొప్ప మనసుతో ఆలోచించి నేనే ముందుగా హాయ్ కావ్యా అన్నాను. బోలెడు ఆశ్చర్యపోయిన కావ్య ఆనందంగా హాయ్ మాధవ్ అంటూ పక్కన చైర్లో కూర్చుంది. 

మాధవ్ ముందుగా సారీ..అలాగే నీతో ఒక విషయం చెప్పాలి.నిన్ను నా ఫ్రెండ్ పర్స్ తెమ్మన్నది సీరియస్ గా కాదు ఊరికే అన్నాను.కొందరు మగవాళ్ళు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి వాళ్ళు ఏమడిగితే అది చేస్తుంటారు. నువ్వు కూడా నేను హెల్ప్ అడిగాను కదా అని ఏది చెప్తే అది చేస్తావా లేక ఆలోచిస్తావా అని అలా అడిగాను.నిజానికి నేను నీతో చెప్పాలనుకున్నది వేరే విషయం .1st ఇయర్ నుండి గమనిస్తున్నాను.నువ్వు అందరిలాగాఉండవు. పార్టీలు,ఫ్రెండ్స్ అంటూ తిరగవు,కాలేజ్  ఫ్రెషర్స్ డే రోజు నుండీ నీ మాటలు, ఆచరణ రెండూ ఒకేలా ఉంటాయి.భావాలు ,ఆచరణ రెండూ కలిపితేనే వ్యక్తిత్వం అంటారు.నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది అందుకే అడుగుతున్నాను నువ్వు చెప్పావు కదా మనిషి తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని .. 

అంటూ ఒక్క క్షణం ఆగి మళ్ళీ చెప్పటం మొదలెట్టింది.మా కజిన్ హేమంత్ గురించి నీకు ఇప్పటికే బాగానే తెలుసనుకుంటాను.మా పెద్దమ్మ, పెదనాన్న ఇద్దరు పెద్ద సిటీలో డాక్టర్లే కదా హేమంత్ కి చిన్నప్పటి నుండి దేనికీ లోటు చేయలేదు.గారాబంగా,ఏది అడిగితే అది వెంటనే సమకూర్చే పేరెంట్స్, చుట్టూ అభిమానించే ఫ్రెండ్స్,ఇలా చిన్నప్పటి నుండి ఆడింది ఆట పాడింది పాటలా పెరిగాడు.ఎప్పుడూ క్లాస్ ఫస్టే.అనుకున్నట్లే మెడిసిన్ లో సీటు కూడా వచ్చింది .ఇప్పటిదాకా అంతా బాగానే జరిగింది .1 నెల క్రితం హేమంత్ ఎక్కడో బార్ లో తాగుతూ కనిపించాడని ఇక్కడ తెలిసినవాళ్ళు ఎవరో పెదనాన్నకి ఫోన్ చేశారట,అప్పటి నుండి పెద్దమ్మ,పెదనాన్నకి గొడవలు జరుగుతున్నాయని మా పెద్దమ్మ అమ్మకి చెప్పి చాలా బాధపడింది.

ఇదంతా వింటున్న నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది.అమ్మ బాబోయ్ ఇలాంటి విషయాలు ఇంట్లో తెలుస్తాయా?  మనం ఇక్కడ చేసే పనులు ఇంట్లో ఎలా తెలుస్తాయిలే అని వాళ్ళంతా ఎంత ధైర్యంగా ఉంటారు.. !నేను రోజూ వాళ్ళని గమనిస్తూనే ఉంటాను.బయటికి వెళ్ళటం,పార్టీలు చేసుకోవటం, ఒక్కోసారి అన్నీ రూమ్ కే తెచ్చి ఎంజాయ్ చేయటం,నన్ను కూడా వాళ్ళతో రమ్మంటారు కానీ నాకెందుకో అవన్నీ వయసుకి మించిన పనులు అనిపిస్తుంది.మా ఇంట్లో మా నాన్నకి ఆ మందు,సిగరెట్లు తాగే అలవాటు లేదు.మా బంధువుల్లో ఎవరన్నా అలాంటి పనులు చేసినా వాళ్ళతో మాట్లాడటమే పాపం అన్నట్లు చూస్తారు మావాళ్ళు.ఇంకా నయం నేను కూడా వాళ్ళతో కలిసి కక్కుర్తి పడుంటే మా వాళ్ళకి కూడా ఇలాగే ఎవరన్నా చెప్తే ఇంకేమన్నా ఉందా..అయినా ఇప్పుడివన్నీ నాకెందుకు చెప్తుంది? ఇలా ఆలోచనల్లోకి వెళ్ళిన నేను మాధవ్.. అనే  కావ్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. 

ఇప్పుడిదంతా నాకెందుకు చెప్తుంది అనుకుంటున్నావు కదా అనగానే .. అరె నా మనసులోది ఈ అమ్మయికెలా తెలిసిందబ్బా అనిపించింది.మాధవ్ నాకు బాగా తెలుసు మీ ఫ్రెండ్స్ అందరిలో చెడు అలవాట్లు లేనిది నీకొక్కడికే అందుకే నిన్ను అడుగుతున్నాను "నువ్వు హేమంత్ ని మార్చగలవా"???
ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు.మార్చాలా ఏమి మార్చాలి?నేనేమన్నా దేవుడినా,లేకపోతే సైకాలజిస్టునా? కనీసం హిప్నాటిస్ట్ ని కూడా కాదే హిప్నాటిజం చేసి మార్చటానికి! ఆ మధ్యన మా వూరికి ఒక హిప్నాటిస్ట్ వచ్చి అందరినీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి, నా ఫ్రెండ్ ఒకడితో ఐసుల పెట్టె చేతికిచ్చి, ఐస్ పుల్లైస్ అంటూ స్టేజ్ మీద అమ్మించిన సన్నివేశం గుర్తొచ్చి ఆపుకోలేనంత నవ్వొచ్చి,నవ్వుతున్న నన్ను సీరియస్ గా చూస్తూ ఇది జోక్ కాదు మాధవ్ నువ్వు చేస్తావా లేదా చెప్పు ,ఇప్పటికే నెల దాటిపోయింది నిన్ను ఈ విషయం అడగాలనుకుని అంది కావ్య .

అమ్మో నా మీద ఇంత పెద్ద బాధ్యతా నా సొంత విషయాలే నా పెద్దల్ని సంప్రదించి గానీ నిర్ణయించుకోని నేను ఈ విషయం ఎలా డీల్ చేయాలి. అయినా హేమంత్ నా మాట వింటాడా?అదే మాట కావ్యతో అనగానే "సాధనేన సాధ్యతే సర్వం" తలచుకుంటే ఏదైనా సాధ్యం అని వివేకానందుడు చెప్పాడని చెప్పావు కదా.. ఇప్పుడు సమస్య నీ ముందు ఉంది.దేశాన్నంతా మంచిగా మార్చాల్సిన పనిలేదుం ముందు ఒక్కరిని మార్చు.ఎలా సాధిస్తావో నీ ఇష్టం.ఇక నేను వెళ్తాను అలోచించి నిర్ణయం చెప్పు,నీతో ఈ విషయాలన్నీ మాట్లాడానని హేమంత్ తో,నీ రూమ్ మేట్స్ తో చెప్పకు.నువ్వే నాకు ఈ విషయాలన్నీ చెప్పావని వాళ్లకి నీ మీద అనుమానం వస్తుంది జాగ్రత్త అంది. 

ఆహా ఎన్ని తెలివితేటలూ..! నిజమే కదా నాకా ఆలోచనే రాలేదు.ఇప్పుడీ విషయం నేను ఎవరికీ చెప్పినా అసలు వాళ్ళ వ్యవహారం అంతా నా వల్లే బయటికి వచ్చిందని అనుకునే ప్రమాదం ఉంది.సరే జాగ్రత్తగా ఆలోచిద్దాం అనుకుని రూమ్ కి బయల్దేరాను,వెయ్యి మంది సహాయం అడిగితే ఒక్కరికి చేయటం,అదే ఒక్కళ్ళు సలహా అడిగితే వెయ్యి సలహాలు ఇవ్వటం,పొగడ్తలకి పడిపోవటం మనిషి నైజం.నేనూ మనిషినే కదా..పైగా కావ్య చేయమన్న పని కూడా దేశానికి మంచి యువకులను ఇవ్వమన్నవివేకానందుడు చెప్పిన మంచి పని కాబట్టి సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా చేయటానికే నిర్ణయించుకున్నాను. 


Related Posts Plugin for WordPress, Blogger...