పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

భద్రం బీ కేర్ఫుల్ బ్లాగరూ .....

కొత్తగా బ్లాగ్ మొదలు పెట్టి ఏమి రాయొచ్చో,ఏమి రాయకూడదో ఆలోచిస్తూ,ఆచి తూచి బ్లాగ్ లో పోస్టింగ్స్ పెడుతున్న నాకు ఇవాళ ఒక మంచి మార్గదర్శి కనిపించింది.

గొప్ప నిజాల్ని సరదాగా తెలియ చేసిన ఒక కధ నవ్వు తెప్పించేదిగా అలాగే ఆలోచించేలా చేసేదిగా వుంది.
సాక్షి ఈ పేపర్ ఫన్ డే 18-04-2010 లో వచ్చిన 'రామనాధం గారి బ్లాగ్ కధ' చదివాను.

బ్లాగ్ రాయాలన్న ఆసక్తి ఉండొచ్చు కానీ బ్లాగ్ రాయటం శ్రుతి మించితే వచ్చే ఇబ్బందులను,తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరదాగా నవ్వుకునేలా తెలియచేసిన ఈ కధ చాలా బాగుంది.



రాజి

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

పుస్తకం హస్తభూషణం.


ప్రతి
మనిషి జీవితం లో పుస్తకంతో అనుబంధం వుంటుంది.
నా హాబీలలో మొదటి స్థానం సంగీతానిది ఐతే రెండోది పుస్తకపఠనం.

చిన్నప్పుడు స్కూల్ బుక్స్ తో పాటు చందమామ,బాలమిత్ర లాంటి ఎన్నో పిల్లల కధల పుస్తకాలు చదవటమంటే నాకు చాలా ఇష్టంగా అనిపించేది.
తర్వాత చదువు పెరిగే కొద్దీ వేరే పుస్తకాలు చదివే టైం,వోపిక వుండేది కాదు.

నాకు పుస్తకాలు చదివే ఆసక్తి కలగటానికి కారణం మా అమ్మ.
పుస్తక ప్రియులందరికీ సుపరిచితమైన ఎమెస్కో బుక్ క్లబ్ లో అమ్మ మెంబర్ కావటంతో మా ఇంటికి ప్రతి నెలా ఒక బుక్ వస్తుంది.కొత్త రచయితలను పరిచయం చేస్తూ వారి రచనలను మెంబర్స్ కి పంపటం ఎమెస్కో బుక్స్ వాళ్ళ పని.

ఆ నోవెల్స్ నచ్చనట్లయితే వేరే బుక్స్ తెప్పించుకొనే వీలుండటంతో అమ్మ ఎక్కువగా యండమూరి,యద్దనపూడి నోవెల్స్ తెప్పించేది.
వాటితో పాటు ఆంధ్రభూమి,స్వాతి,భక్తీ ఇలాంటి పుస్తకాలన్నీ మా ఇంట్లో ఇప్పటికీ కనిపిస్తాయి.
ఈ విధమైన పుస్తకాలన్నిటితో మా ఇల్లు ఒక చిన్న సైజు లైబ్రరీ లా వుంటుంది.

నేను చదివిన మొదటి నవల "వంశీ" "మహల్లో కోకిల"
ఈ నవల అప్పట్లో "సితార" సినిమాగా వచ్చింది అని,మనింట్లో ఈ నవల వుంది అని అమ్మ చెప్పింది.ఆ నవల ముఖచిత్రం ఒక అమ్మాయి పంజరం లోనుండి కిందకి దూకుతున్నట్లుగా వుంటుంది.
నేను చదివిన మొదటి నవల, నాకు ఇప్పటికీ నచ్చే నవల "మహల్లో కోకిల"

తర్వాత నేను లా లో జాయిన్ అవ్వటం తో కొన్నాళ్ళు నవలలకి బ్రేక్ పడింది.
మూడు సంవత్సరాలు లా పుస్తకాలతో కుస్తీ పట్టటమే సరిపోయింది .
లా అయిపోయి ఇంటికి వస్తూ...
మా అమ్మ నవల్స్ లైబ్రరీకి పోటీగా నా లా బుక్స్ లైబ్రరీ తెచ్చాను.

నేను తెచ్చాను అనటం కన్నా మా తమ్ముడు మోసుకొచ్చాడు అంటే సరిపోతుందేమో.
హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా నాకు అవసరమవుతాయి అనుకున్న లా బుక్స్ తెచ్చేవాడు తమ్ముడు.
ఆ విధంగా ఇప్పుడు మా ఇంట్లో ఒక గది మొత్తం లైబ్రరీ లాగా వుంటుంది.

ఇక ఆ పుస్తకాలని కాపాడుకోవటం ఒక కళ.
పుస్తకాలకి శత్రువులు
దుమ్ము,ధూళి,చెద పురుగులు వగైరా...
నా దృష్టిలో పుస్తకాలకి ఇంకో ప్రధాన శత్రువు మన పుస్తకం ఇవ్వమని అడిగేవాళ్ళు.
పుస్తకం చూడగానే ఇవ్వండి చదివి ఇస్తాం అని అడుగుతారు పోనీలే అని మనమూ ఇస్తాం.

ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కధ.
ఎన్నాళ్ళున్నా పుస్తకం ఇవ్వరు.మన అదృష్టం బాగుండి ఇచ్చినా..
అది చిరిగిపోయి,అట్టలు ఊడిపోయి శిధిలమై చేతికి వస్తుంది.
ఒక్కోసారి అసలు చేతికే రాదు.ఇవన్నీ మేము అనుభవించిన కష్టాలండీ మా పుస్తకాలతో.
అందుకే అసలు పుస్తకాలు ఎవరికీ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాము.

పుస్తకం,వనిత,విత్తం పరహస్తం గతం గతః ఇది పుస్తకం విషయంలో మాత్రం 100 % నిజమండీ.
అందుకే పుస్తక ప్రియులూ మీ పుస్తకాలు జాగ్రత్త.
ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.
రాజి

19, ఏప్రిల్ 2010, సోమవారం

ఇళయరాజా టాప్ 25 మెలోడీస్


ఇళయరాజా నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు.నిన్నటి సాక్షి పేపర్ లో ఇళయరాజా గారి గురించి వచ్చినఆర్టికల్ బాగుంది.
ఆయన పాటల్లో టాప్ 25 మెలోడీస్ నాకు చాలా ఇష్టం.అందుకే పాటలన్నీ ఒకే చోట నా సంగీత ప్రపంచం 


"సరిగమలు-గలగలలు"

బ్లాగ్ లో పోస్ట్ చేశాను.మీరూ ఆ పాటలు చూడాలి అనుకుంటే నా బ్లాగ్ చూడండి.



ఇళయరాజా టాప్ 25 సాంగ్స్ 

ఇళయరాజా All Time Hits 

ఇళయరాజా All Time Best Songs నాటి నుండి నేటి దాకా



17, ఏప్రిల్ 2010, శనివారం

టీవీ లో పాటలు.

కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే చూడాల్సిన
ఆ రోజుల్లో కొత్తగా వచ్చినకేబుల్ టి.వి. లో కొత్త కొత్త సినిమాలు,పాటలు చూడటం చాల సరదాగా వుండేది.
అప్పటిదాకా సినిమాలు చూడాలంటే వీడియో కాసెట్లు,పాటలు వినాలంటే ఆడియోకాసెట్స్ మాత్రమే ఉండేవి.
ఆ తర్వాత వచ్చిన ఈ టి.వి.,జెమిని ఛానెల్స్ ఇంకా కొన్ని ప్రైవేట్ చానల్స్ తో
టి.వి. ప్రపంచంలోఎన్నో మార్పులు వచ్చాయి.ఈ ఛానెల్స్ లో మొదట్లో వీక్లీ సీరియల్స్ వచ్చేవి.
తర్వాత డైలీ సీరియల్స్ ట్రెండ్ మొదలైంది.

డైలీ సీరియల్స్ లో మొదటిది ఏదో నాకు అంతగా గుర్తు లేదు కానీ
దూరదర్శన్ లో వచ్చిన రుతురాగాలు సీరియల్ అప్పట్లో చాలా ప్రజాదరణ పొందింది .
రుతురాగాలు సీరియల్ వస్తున్నప్పుడు నేను విజయవాడలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వుండి చదువుకునేదాన్ని.

సాయంత్రం టైం నాలుగు కావటం ఆలస్యం అన్ని ఫ్లాట్స్ లోనుండి రుతురాగాలు సీరియల్ టైటిల్ సాంగ్ వినపడేది.
అట్లా ఆ పాట వినడం చాలా బాగుండేది.ఇప్పటికీ ఆ పాట వింటే మా పెద్దమ్మ వాళ్ళ క్వార్టర్స్,అక్కడి వాతావరణం లోనే ఇంకా నేను వున్న అనుభూతి కలుగుతుంది.నాకు నచ్చిన మొదటి డైలీ సీరియల్ టైటిల్ సాంగ్ రుతురాగాలు.

రుతురాగాలు.



ఆ తర్వాత చాలా డైలీ సీరియల్స్ వచ్చాయి.వాటిలో కొన్ని డైలీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ మంచి సాహిత్యంతో,అర్ధవంతంగా,ఎప్పటికీ గుర్తుండేలా ఉండేవి.డైలీ సీరియల్స్ కధ,అవి ఎన్ని సంవత్సరాలు ప్రసారం అయ్యాయి,జనాల్ని ఎంత ఆనందపరిచాయి? అన్నసంగతి ఎలా వున్నా.. నాకు కొన్ని సీరియల్స్ టైటిల్ సాంగ్స్ మాత్రం చాలా ఇష్టం.రాధిక సీరియల్స్ టైటిల్ సాంగ్స్ అన్నీ నాకు నచ్చుతాయి.


రెండు విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల అంతరంగాన్ని అధ్బుతంగా ఆవిష్కరించిన పాట.
రాధా- మధు



అమ్మమ్మ.కాం



14, ఏప్రిల్ 2010, బుధవారం

మావూరి తిరునాళ్ళ


చెన్నకేశవస్వామి,లక్ష్మీదేవి అమ్మవారు.

గుంటూరుజిల్లాలోని మాచెర్ల .

చరిత్రప్రసిద్ధి చెందిన మాచెర్ల పట్టణం నాగార్జునసాగర్ కి 28 km దూరంలో వుంది.
మా వూరిలో చెన్నకేశవస్వామి గుడి ప్రసిద్ధి చెందిన ఆలయం.
ఈ ఆలయం చంద్రవంక నదీపరివాహక ప్రాంతంలో వుంది.

ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఘనంగా జరుగుతాయి.
చైత్ర పౌర్ణమినాడు స్వామివారి కల్యాణం జరుగుతుంది.
చెన్నకేశవస్వామి రధోత్సవం ఎంతో కన్నులపండుగగా వుంటుంది.
రధోత్సవం రోజు ఇక్కడికి చాలామంది భక్తులు,యాత్రికులు వస్తారు.

చిన్నప్పుడు మా అమ్మమ్మ పిల్లలందరినీ రధం చూడటానికి తీసుకు వెళ్ళేది.
రధోత్సవం టైములో ఇసుకవేస్తే రాలనంత జనం వుండేవాళ్ళు.
ఆడవాళ్ళు అందరు అక్కడదగ్గరలో వున్న డాబాలు,మిద్దెలు ఎక్కి, ఎండని కూడా లెక్క చేయకుండా రధం కోసం ఎదురు చూసే వాళ్ళు.

మా అమ్మమ్మ కూడా మమ్మల్ని తీసుకుని వెళ్లి తెలిసిన వాళ్ళ ఇంటి మీద ఎక్కించేది రధం చూడ్డానికి.
దేవుడి రధం మాట ఎలా వున్నా అక్కడ ఎండకి ,దాహానికి మాకు దేవుడు అక్కడే కనిపించేవాడు.
రధం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ తిరునాళ్ళ కొట్లు ఉండేవి.

చిన్నప్పుడు దేవుడిదర్శనం కంటే తిరునాళ్ళలో షాపింగ్ చేయటం మాకు చాలా సంతోషం కలిగించే విషయం.
నాన్న మమ్మల్ని రధోత్సవం అయిపోయిన రెండు రోజుల తర్వాత గుడికి (షాపింగ్ ) తీసుకుని వెళ్ళేవాడు.
దేవుడి దర్శనం కాగానే బయటకు వచ్చి అవసరం వున్నా లేకపోయినా తమ్ముడు,చెల్లి, నేను పోటి పడి ఏవేవో కొనుక్కునే వాళ్లము.

తిరునాళ్ళ స్పెషల్ పంచదారబెండ్లు,చిలకలు అంటే మా అమ్మకి చాలా ఇష్టం.నాన్న తిరునాళ్ళ జరిగినన్ని రోజులూ ఆ స్వీట్స్ తెచ్చేవాడు.
ఆ విధంగా మా చిన్ననాటి తిరునాళ్ళ ఒక మధుర జ్ఞాపకం.

ఇప్పుడు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఒక రోజు ఆనవాయితీగా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది మా తిరునాళ్ళ సరదా.
ఏది ఏమైనా కొన్ని సరదాలు,జ్ఞాపకాలు మాత్రం ఎన్నడూ మారవు,మర్చిపోలేము..


చెన్నకేశవస్వామి గుడి గాలిగోపురం.



ఆలయం లోపలి స్థంభాలపై శిల్పకళ.



చెన్నకేశవస్వామి గుడి,స్వామివారి రధం.

రాజి
Related Posts Plugin for WordPress, Blogger...