పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, జులై 2012, శనివారం

ఆషాఢం --- గోరింటాకు


హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ??? సుమారు 2 నె తర్వాత ఈ రోజే నా చిన్నిప్రపంచం లోకి వచ్చాను. చాలా రోజులైనట్లుగా వుంది బ్లాగ్ లో పోస్ట్ లు పెట్టి.ఈ మధ్య కొన్ని కారణాల వలన బ్లాగ్ రాయటం కుదరలేదు. కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మీ అందరితో మాట్లాడాలనిపించింది అందుకే ఈ పోస్ట్.. కొన్ని సార్లు ఎంత బిజీగా వున్నా,ఎన్ని చికాకులు వున్నా ఇష్టమైన పని చేయటం ఎప్పుడూ కష్టంగా అనిపించదేమో అలాంటిదే ఈ "నా చిన్ని ప్రపంచం" కూడా...


ఆషాఢం.........
కొత్త
జంటల్ని విడదీసి , ఎడబాటు కలిగించి,ఒకరి తలపుల వానలో మరొకరు తడిచి పోయేలా చేసి,విరహము కూడా మధురమే కదా అనుకునేలా చేసేది ఆషాఢం.
ఆషాఢం శూన్యమాసమని శుభకార్యాలు కూడా వాయిదా వేస్తారు కానీ ఈ నెలలో వచ్చే తొలి ఏకాదశి,జగన్నాధ రధయాత్ర, గురు పౌర్ణమి,బోనాలు ఇలా అందరూ భక్తిగాఆచరించే పర్వదినాలు,ఉత్సవాలు ఈ మాసంలో వున్నాయి.
వర్షాకాలం మొదలయ్యి నల్ల మబ్బులు కమ్ముకునే మాసం
ఆషాఢం.. ఐతే ఈ నెలలో కనిపించే మేఘాలు అంతగా కురవ వట .. దట్టంగా కమ్ముకుని వర్షం పడుతున్నట్లే అనిపించి చెదిరిపోతాయట . అందుకే నమ్మించి మోసం చేసే వాళ్ళను ఆషాఢభూతులు అంటారట.

ఆషాఢం గురించి అందరూ ఇప్పటికే చెప్పేసి ఉండొచ్చు, అందుకే ఆషాఢంలో నాకు ఇష్టమైన గోరింటాకు గురించి చెప్పాలనిపించింది. ఆషాఢంలోముఖ్యమైన ఆచారం గోరింటాకు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం నాకు.
ఈ గోరింటాకు వెనకటి రోజుల్లో ఇంట్లో పెరటిలో, తోటల్లో వున్న చెట్లకి గోరింటాకు కోసుకు వచ్చి , రోటిలో వేసి మజ్జిగ,చింతపండు ,రేగి కాసు వేసి, మెత్తగా అయ్యేదాకా కష్టపడి రుబ్బి,ఇంట్లో ఆడపిల్లలందరూ పోటీ పడి గోరింటాకు పెట్టుకునే వారట మా అమ్మ చెప్తుంటారు.మళ్ళీ ఆ గోరింటాకు పండటానికి తీసుకునే జాగ్రత్తలు కూడా వుండేవట.

ఇప్పుడు అంత కష్టం ఏమీ లేకపోయినా పచ్చి గోరింటాకు దొరకటం మాత్రం చాలా కష్టం.. కోన్ మేహేంది ఎంత అందంగా పెట్టినా గోరింటాకు పెట్టుకున్నంత అందం,కళ వుండదు. అందుకే ఈ ఆషాఢంలో ప్రత్యేకమైన గోరింటాకును కొనుక్కుని
గోరింటాకు సరదా తీర్చేసుకున్నాము.ఎర్రగా పండిన ఆ గోరింటాకు అందం,సువాసన ఇష్టపడని వాళ్ళు వుండరేమో..Related Posts Plugin for WordPress, Blogger...