పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
మావూరు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మావూరు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, నవంబర్ 2018, గురువారం

మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్


గుంటూరు గుంట గ్రౌండ్ గుంటూరు వాళ్లందరికీ బాగా తెలిసిన,పరిచయమున్న ప్రదేశం.ఇక్కడ మా చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా సమ్మర్ లో ఎగ్జిబిషన్ పెడతారు.అందుకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని, దీన్నే నాజ్ సెంటర్ అని కూడా పిలుస్తారు.ఈ  మధ్య సంవత్సరంలో రెండు మూడు సార్లు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. మేము కూడా వెళ్తుంటాము. ఎగ్జిబిషన్  విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు. 

 మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్ 





23, నవంబర్ 2018, శుక్రవారం

మా ఊరు - మా స్కూల్ - మా జ్ఞాపకాలు - My School Memories




Old School Memories 
A trip down memory lane..




17, నవంబర్ 2018, శనివారం

శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం (రామప్ప గుడి) - మాచర్ల - గుంటూరు జిల్లా



ఆలయంలో 2016 లో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు


మా మాచర్లలోని రామప్పగుడి - శ్రీ గంగా పర్వతవర్ధినీ సమేత, శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం చిన్నప్పటి  జ్ఞాపకం.చిన్నప్పుడు కార్తీకమాసం,శివరాత్రి ఇలా పండగరోజుల్లో మాత్రమే ఈ ఆలయం ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఆ గుడి ఊరికి చాలా దూరంగా ఉండేది.రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.అయినా కార్తీకమాసం వనభోజనాలకు,పూజలకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఇళ్ళు,మంచి రోడ్లు,ఆటోలు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి.

ఈ గుడి చాలా పురాతనమైనది.జమదగ్ని మహర్షి,రేణుకా మాతల కుమారుడు పరశురాముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం.హైహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి శాపవశాత్తూ చేతులు లేకుండా జన్మించి,దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు వరంగా పొందుతాడు.ఒకరోజు వేటకోసం అడవికి వచ్చిన కార్తవీర్యార్జునుడు  జమదగ్ని మహర్షి ఆశ్రమానికి సేదతీరటానికి రాగా జమదగ్ని మహర్షి రాజుకి,ఆయన పరివారానికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఓక సాధారణ మహర్షికి ఇదంతా ఎలా సాధ్యపడిందని అడగగా, తన దగ్గరున్న కామధేనువు జాతి గోమాత వలనే అని చెప్తాడు.

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని అడగగా మహర్షి నిరాకరిస్తాడు.అందుకో కోపించిన చక్రవరి బలవంతంగా ఆవును తీసుకెళ్ళిపోతాడు.విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని వేయిచేతులు ఖండించి,సంహరించి గోమాతను తీసుకువస్తాడు.జమదగ్ని మహర్షి పరశురాముడిని మందలించి తపస్సు చేసుకోమ్మని పంపిస్తాడు.పరశురాముడు తండ్రిని చంపినందుకు కక్ష పెంచుకున్న కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపివెళ్ళిపోతారు.తల్లి దుఃఖం చూసిన పరశురాముడు 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి, కార్తవీర్యార్జునుని కుమారులతో పాటు అధర్మపరులై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజుల్ని  సంహరిస్తాడు. యుద్ధాల్లో  గెలిచిన భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసి, పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు

ఆ తపస్సులో భాగంగా శివుడ్ని పూజించి 108 స్వయంభూ శివలింగాలను ప్రతిష్టించినట్లు, అందులో ఒకటి మాచర్ల లోని ఈ రామప్ప గుడి అనేది స్థలపురాణం.రామప్పగుడిని దక్షిణ కాశీగా పిలుస్తారు.ఇక్కడ స్వామిని దర్శిస్తే కాశీలో విశ్వనాధుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.ఇక్కడ స్వామికి స్వయంగా మనమే అభిషేకాలు చేయొచ్చు,స్పర్శదర్శనం చేసుకోవచ్చు.మేము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ గుడికి వెళ్ళాము.ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమపూజ,రుద్రహోమం, ప్రతిరోజూ భక్తులకు అన్నదానం,సహస్ర దీపాల సేవ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి.


మా రామప్పగుడిని ఈ వీడియోలో చూడొచ్చు 
 



27, అక్టోబర్ 2015, మంగళవారం

అమరావతి నగర శంకుస్థాపన - వింతలూ .. విశేషాలు



మా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన 22 - 10 - 2015 దసరా పండగ రోజున అంగరంగ వైభవంగా  అతిర‌థ మ‌హార‌థుల మ‌ద్య సందడిగా జ‌రిగింది.. శంకుస్థాపన విశేషాలు,విషయాలు అన్నిటి గురించి ఎప్పటికప్పుడు మీడియా అందరికీ తెలియచేస్తూనే ఉంది కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీలేదు.ఈ కార్యక్రమం గురించి ఎప్పటి లాగానే కొందరు వ్యతిరేకంగా మాట్లాడితే కొందరు సానుకూలంగా స్పందించటం,అందరికీ మంచి జరగాలని కోరుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈవెంట్ మేనేజర్ గా ok అనిపించుకున్నారు కానీ పాలకుడిగా ఇంత ఘనకార్యాన్ని (రాజధాని నిర్మాణం) ఎలా సాధిస్తారో చూద్దామని కొందరంటే .. తెలివి ఉండాలే కానీ ఇటుకలు అమ్మి కూడా (My Brick My Amaravati) కోట్లు సంపాదించగలం అని ముఖ్యమంత్రి నిరూపిస్తున్నారు అని కొందరు,మోడీగారు ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే మట్టి,యమునా నది నీళ్ళతో సరిపెట్టారని మరికొందరంటున్నారు.ఏదేమైనా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని త్వరగా నిర్మాణం కావాలని,అంతా మంచి జరగాలని కోరుకుందాము.

 

 

ప్రముఖ శిల్పి రాజీవ్ సేథీ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మించే చారిత్రక స్థూపం వద్ద నిక్షిప్తంచేసి ప్రజల ఆశలను,ఆకాంక్షలను,భావోద్వేగాలనుసజీవం చేయాలన్న ఆలోచనతో ప్రతిగ్రామంలోని పవిత్ర ప్రదేశాలనుండి సేకరించిన మట్టి,నీరుతో నిర్మించిన స్థూపం.

 

అమరావతి సంకల్పజ్యోతి 

 

శంకుస్థాపన సభలో ప్రధాన ఆకర్షణ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.స్వ‌యంగా అమరావ‌తికి ర‌మ్మంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేసీఆర్ ను ఆహ్వానించారు.ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలతో ద్వేషాన్ని మాటల్లోనే  వెళ్ళగక్కే ఈ నాయకులు ఇలా కలిసిపోవటం ?? రాజకీయాల్లో మామూలే కానీ శంకుస్థాపన సభకు వచ్చిన సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా చేతులు ఊపుతూ అభివాదం చేయటం మాత్రం అందరికీ కొంచెం ప్రత్యేకంగానే అనిపించింది.చిన్నప్పుడు మా స్కూల్ లో ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు మా టీచర్స్  ముందుగానే "వచ్చిన అతిధి మాట్లాడటం అయిపోగానే వాళ్ళేమి మాట్లాడారో మీకు అర్ధం అయినా కాకపోయినా గట్టిగా చప్పట్లు కొట్టండి అప్పుడే వచ్చిన అతిధుల్ని మనం గౌరవించినట్లు అని " చెప్పేవాళ్ళు. ఇక్కడ కూడా అలాగే ఏమైనా జరిగిందా లేక ఆంధ్రాప్రజలే స్వచ్చందంగా, సంతోషిస్తూ కేసీఆర్ కోసం హర్షధ్వానాలు చేశారా?? అని ఒక చిన్న డౌటు కూడా వచ్చింది.

అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి కోసం అవసరమై అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ అనటం సంతోషించదగిన పరిణామం.కానీ తెలంగాణా ముఖ్యమంత్రి గారూ..  మీరు సహాయం చేసినా, చెయ్యకపోయినా పర్లేదు కానీ "బతుకమ్మ,, బోనాలు పండగలు ఘనంగా చేసుకుంటూ ఆ అమ్మవారి ముందు బాగా నిష్టగా పూజలు చేసి,మమ్మల్ని ఇప్పటిదాకా ఆంద్రోళ్ళు నీపూజల్ని చెయ్యనియ్యలేదమ్మా ,మమ్మల్ని మా భక్తిని ఎగతాళి చేశారమ్మా, ఇప్పుడు మేమొచ్చాకే నీ పూజలు జరిపిస్తున్నాం..వాళ్ళని నువ్వే చూసుకో తల్లీ అని ఆంధ్రా వాళ్ళమీద అమ్మవారికి కంప్లైంట్లు చేయొద్దని కొంచెం మీ రాష్ట్ర మహిళలకు చెప్పండి ప్లీజ్ ..తెలంగాణా మగవారి కంటే ఆడవారికే ఆంధ్రామీద,ఆంధ్ర రాష్ట్ర ప్రజలమీద ఆగ్రహావేశాలు,ఆంధ్రోళ్ళు  తెలంగాణా ప్రజల్ని దోచుకున్నారనే వేదన చాలా ఎక్కువని అనుభవంలో మేము తెలుసుకున్న సత్యం. అయినా లోకాలనేలే ఆ జగన్మాత మనం ఎవరి మీద ఏది చెప్తే అది నమ్మేసి,ఎవర్ని శిక్షించమంటే వాళ్ళని శిక్షిస్తుందా?? అలా చేయటానికి అమ్మవారేమన్నా రిటర్న్ గిఫ్ట్ కోసం మనింటికి పేరంటం వచ్చే పక్కింటావిడ కాదు కదా.. దుష్టశిక్షణ,శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ తల్లికి సర్వం తెలుసు. 

ఈ శంకుస్థాపన లో మాకు మరో విశేషం ,మా మరిదిగారు(మా చెల్లి వాళ్ళాయన) తెలంగాణ నుండి ఆంధ్రాకి రాజధాని డ్యూటీ ఆఫీసర్ గా  రావటం.తెలంగాణా పోలీస్ అంటే ఎప్పుడూ అటువైపే డ్యూటీలు ఉంటాయి,ఆంధ్రాకి రారు కదా అనుకునే వాళ్లము. కానీ ఈసారి తెలంగాణా పోలీస్ లు కూడా ఇక్కడికి  రావటం వలన మా సొంత జిల్లా గుంటూరులో డ్యూటీకి రావటం మాకు ఆశ్చర్యంగా,ఆనందంగా అనిపించింది.ఆవిధంగా మాకుటుంబసభ్యులు కూడా మా ఆంధ్రారాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నట్లయింది.


శంకుస్థాపన కార్యక్రమంలో నటుడు సాయికుమార్,గాయని సునీత ఉపద్రష్ట వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన, శంకరంబాడి.సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో కార్యక్రమం మొదలయ్యింది.సునీత పాడిన మా తెలుగు తల్లికి పాటని వింటుంటే ఈమధ్య టీవీల్లో చిన్నపిల్లలు కూడా ఇలా పాడట్లేదే..! కనీసం ఒకసారి ఆ పాట రిహార్సల్స్ అయినా చేసుకుందా అనిపించింది.సునీత పాట పాడేటప్పుడు ఊపిరితీస్తూ,ఆయాస పడుతున్నట్లు పాడుతుందని నా అభిప్రాయం.నేనేదో సునీతని తప్పు పట్టటం లేదు.ఎవర్నైనా వంక పెట్టటం చాలా సులభం,అది తప్పు కూడా.. కానీ ఆంధ్రరాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటని రాజధాని ఆరంభ శుభసమయంలో పాడమని బాధ్యత అప్పగిస్తే గాయని సునీత ఆయాసపడుతూ,దాదాపు ఏడుస్తున్నట్లు,నీరసంగా ఆ పాట పాడటం చాలా ఘోరంగా అనిపించింది.పాపం గుంటూరు ఎండ ప్రభావం కూడా కావచ్చేమో .. 

ఈ పాట మిగతా వాళ్ళు ఎలా పాడారా అని యూట్యూబ్ లో వెతికితే  టంగుటూరి సూర్యకుమారి గంభీరమైన గానం ,చక్కని సంగీతంతో దేశభక్తి పాటంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంది.ఇక బుల్లెట్ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా ఆయన అన్ని పాటల్లాగే చాలా బాగుంది.బాలు గారి పాట విన్నాక అందుకే అప్పట్లో పాడుతాతీయగాలో పాడటానికి వచ్చిన వాళ్ళని చిన్నతప్పు పాడినా మందలిస్తూ సరిగా పాడమని,వాళ్ళు బాధపడినా సరే తప్పులు,లోపాల్ని ఎత్తిచూపేవారు .కానీ ఇప్పుడు రకరకాల ఛానళ్ళల్లో వస్తున్న సింగింగ్ కాంపిటీషన్స్ లో జడ్జ్ లు పాడేవాళ్ళు ఎలా పాడినా పట్టించుకోకుండా వాళ్ళని మెచ్చుకోవటం,ఆహా వోహో అనటం చూస్తుంటే కింగ్ సినిమాలో బ్రహ్మానందం సీన్స్ గుర్తొస్తున్నాయి.అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా గొప్ప సింగర్స్ అనిపించుకునే వాళ్ళకంటే కూడా బాగా పాడుతున్నారు.

ముగ్గురు గాయకులు పాడిన ఈ మాతెలుగుతల్లి  పాటలు వింటే  ఎవరెలా పాడారో తెలుస్తుంది.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ - టంగుటూరి సూర్యకుమారి 


మా తెలుగుతల్లికి మల్లెపూదండ - S.P. బాలసుబ్రహ్మణ్యం 


మా తెలుగుతల్లికి మల్లెపూదండ - సునీత 
 

అమరావతి శంకుస్థాపన చిత్రాలు





ఏదేమైనా అన్ని ప్రతికూల ఆలోచనలను ప్రస్తుతానికి వదిలేసి,సానుకూల ధోరణితో కొనసాగుతూ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని,అందమైన భవిష్యత్తును వేగంగా నిర్మించుకోవాలని కోరుకుంటూ


All The Best - "Amaravati, 
The dream capital of  Andhra Pradesh"

11, జనవరి 2013, శుక్రవారం

సంక్రాంతి సంబరాలు -- మా ఊరి ముగ్గుల పోటీలు





సంక్రాంతి రాకముందే మొదలైన సంక్రాంతి సంబరాలు అందరినీ బిజీ బిజీ చేసేసాయి.సంక్రాతి పండగ అంటేనే ముగ్గుల పండగ కదా అందుకే అందరూ ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు పెట్టటంలో పోటీ పడుతున్నారు. ఆడవాళ్ళు కొంతమంది నిజంగానే పోటీపడుతూ వాళ్ళ ముగ్గుకే మొదటి బహుమతి రావాలంటూ ముగ్గులు వేస్తే  మరికొందరు మాత్రం కనీసం పార్టిసిపేట్ చేసినందుకైనా ఇచ్చే   గిఫ్ట్ కోసం ముగ్గులు వేశారు.

అలాగే ఈ సంవత్సరం ముగ్గుల పోటీల్లో మహిళలు నిర్భయకు నివాళిగా, ఆమెకు న్యాయం జరగాలని, కరెంట్ సమస్యలు,తెలుగు భాషాభిమానం వంటి సంగతులను ముగ్గులో ప్రస్తావించారు...ఇవీ నిన్న జరిగిన ముగ్గుల పోటీలో కొన్ని విశేషాలు.. నాకు నచ్చిన కొన్ని ముగ్గులు..















12, ఏప్రిల్ 2012, గురువారం

మా మాచర్ల చెన్నకేశవుని రధోత్సవం..

మా పల్నాటి సీమకే మకుటాయమానంగా వెలుగొందే మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవుని రధోత్సవం నిన్న (11-04-2012 )
జరిగింది. ఊరంతా సందడిగా, సంతోషంగా రధోత్సవం లో పాల్గొన్నారు.చెన్నకేశవ స్వామి రధం లాగితే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అందుకే పోటీలు పడి మరీ మగవాళ్ళు రధం లాగుతారు.ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజున కల్యాణం,మూడవ రోజున రధోత్సవం జరుగుతాయి.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందింది. దేవాలయం వద్ద లభించిన శాసనాల ప్రకారం హైహయ వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది. శ్రీ లక్ష్మీ చేన్నకేశవ స్వామిని త్రేతాయుగం లో కార్త వీర్యార్జునుడు ప్రతిష్టించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి.ఈ ఆలయం కృతయుగం నాటిదన్న భావన కూడా ఉంది.బ్రహ్మనాయుడు కూడా ఈ ఆలయంలోనే పూజలు నిర్వహించేవాడు..
ఈ ప్రాంతం లో చంద్రవంక నది తన గమన దిశను మార్చుకుని,ఉత్తరవాహిని అయ్యింది.అందువల్లే ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా కీర్తి పొందింది.శ్రీనాధుడి పల్నాటి చరిత్ర ఇక్కడ ప్రాధాన్యతను తెలియ చేస్తుంది.శ్రీనాధుడు ఈ ఆలయం నుండే పల్నాటి వీర చరిత్రను రచించటం ప్రారంభించాడట.ఈ ఆలయంలో మండప స్తంభాలు చోళరాజుల కాలం నాటి శిల్ప కళా శోభకు ప్రత్యక్ష సాక్ష్యాలు.గర్భాలయం ముందున్న నాలుగు స్తంభాలపై భారత,భాగవత,రామాయణ గాధలు,దశావతారాలు అత్యంత మనోహరంగా చెక్కబడి ఉంటాయి.
స్వామి వారి బ్రహ్మొత్సవాల్లో మొదటి రోజున అంకురార్పణ,ధ్వజారోహణం, కల్యాణోత్సవం,హనుమద్వాహనం,
శేషవాహనం, గరుడ వాహనం,రవిపొన్న వాహనం,రధోత్సవం,అశ్వవాహనం,శుక వాహనం,పుష్పయాగం,
ద్వాదశ ప్రదక్షిణలు,ఏకాదశ కలశ స్థాపన,పవళింపు సేవ ఇలా 15 రోజుల పాటు రోజుకో సేవ తర్వాత 16 రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి..ఇవీ మా మాచర్ల చెన్న కేశవుని రధోత్సవ విశేషాలు..


మా తిరునాళ్ళ స్పెషల్ స్వీట్స్.

20, ఫిబ్రవరి 2012, సోమవారం

సత్రశాల - గుంటూరు జిల్లా


మొక్కులు
తీర్చే సత్రశాల మల్లన్న




గుంటూరు జిల్లా మాచెర్ల కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలంలో
వుంది సత్రశాల పుణ్య క్షేత్రం. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం...
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ సత్రశాల.
ఈ రోజు మహా శివరాత్రి కి ఆ స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది.
జనాలు ఎక్కువగా,రద్దీగా వుండే రోజుల్లో ఆలయాలకు వెళ్ళటం నాకు ఇష్టం లేకపోయినా
ఈ రోజు అమ్మ వెళ్దామని అడగటంతో మా వదిన,అక్క వాళ్ళతో వెళ్ళాము.

సత్రశాల ఆలయ ఆవరణ


ఆలయం ఆవరణలో భక్తులు స్వయంగా పూజించే
వినాయకుడు,శివలింగం.



క్యూ లైన్లలో దర్శనం సులభంగానే జరిగింది.వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని కొంచెం
భయం అనిపించినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మహా శివరాత్రి రోజున శివయ్య దర్శనం
చేసుకోవటం మనసుకు చాలా సంతోషంగా అనిపించింది .
కృష్ణా నదిని దాటి అవతలి ఒడ్డుకి వెళితే అక్కడ కూడా ఆలయాలు వుంటాయి.
ఈ ఫోటో ఇవతలి ఒడ్దు నుంచి తీసింది.

సత్రశాల
అవతలి ఒడ్దు.



చల్లగా,ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానది..


ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ వుంటుంది.ఈ నదిలో స్నానం చేసి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
నది దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి అది మాత్రం చాలా కష్టం.
పండుగల రోజుల్లో కాకుండా విడి రోజుల్లో వెళ్తే గుడి ఆవరణ,పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి.
కానీ ఈరోజు మాత్రం అక్కడంతా భక్తుల సందడి. ఆర్టీసీ వాళ్ళ స్పెషల్ బస్సులు,ఆటోలు,ట్రాక్టర్ లు
ఇలా ఒక్కటి కాదు ఎక్కడ చూసినా జనప్రవహమే.

సత్రశాల లో ఈ రోజు తిరణాల జరుగుతుంది.దీన్ని తిరణాల లేదా జాతర అని కూడా అంటారు.
మొత్తానికి ఈ రోజు అనుకోకుండా "మొక్కులు తీర్చే సత్రశాల మల్లన్న" దర్శనం తో పాటూ
తిరణాల సందడిని కూడా చూసే అవకాశం కలిగింది.

తిరణాల సందడి




ఇవీ మా గుంటూరు జిల్లా సత్రశాల మహాశివరాత్రి తిరణాల విశేషాలు.
కోరిన కోరికలు తీర్చే సత్రశాల మల్లన్న అందరినీ తన
కరుణా కటాక్ష వీక్షణాలతో కాపాడాలని కోరుకుంటూ
"మహాశివరాత్రి శుభాకాంక్షలు."


24, ఏప్రిల్ 2011, ఆదివారం

చెన్నకేశవుని రధోత్సవం...


నిన్న (23-04-2011) మా వూరి చెన్నకేశవుని రధోత్సవం
స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజున కల్యాణం, నిన్న రధోత్సవం జరిగాయి.
శ్రీదేవి భూదేవి సమేతుడైన చేన్నకేశవ స్వామిరధోత్సవం వేలమంది భక్తుల మధ్య కోలాహలంగా జరిగింది.

కళ్యాణ వైభోగమే శ్రీ చెన్నకేశవుని కళ్యాణమే..


పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు
కొంత పెడమరలి నవ్వేనీ పెండ్లికూతురు...


కల్యాణం చూతము రారండి...
శ్రీ చెన్నకేశవుని కల్యాణంచూతము రారండి..



బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం


Related Posts Plugin for WordPress, Blogger...