నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుండీ ఇష్టమే..చిన్నప్పుడు అంటే నాకు సినిమా చూసే జ్ఞానం వచ్చినప్పటి నుండి అన్నమాట.అలా నేను చూసిన సినిమాలు రెండు విభాగాలు.కొన్ని సినిమాలు మా ఫ్యామిలీ అందరం అంటే అమ్మ,నాన్న,తమ్ముడూ,చెల్లి అందరం కలిసి చూసినవి..కొన్ని సినిమాలు మా అమ్మ,అమ్మ స్నేహితులు, పిన్ని, అత్తయ్యలు,మా చిన్నపిన్ని స్నేహితులు నన్నుతోడుగా తీసుకెళ్ళిన సినిమాలు.(ఏంటో ఆ రోజుల్లో కాలేజ్ కి వెళ్ళే ఆడపిల్లలకి మాలాంటి చిన్న పిల్లలే తోడు సినిమాలకి వెళ్ళాలంటే.)
ఇంక అప్పట్లో కొన్ని ఆడవాళ్ళు మాత్రమే చూసే సినిమాలు ఉండేవి వాటికి మగవాళ్ళు అంతగా వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకి ఘర్షణ,సింధూరపువ్వు,నీరాజనం,స్వాతి చినుకులు,జీవనజ్యోతి , ఇంకా కొన్ని రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు ఇలాంటివన్నీ ఆడవాళ్లకే ప్రత్యేకమైన మ్యాట్నీ సినిమాలు...
ఇంక రెండో విభాగం లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు ఉండేవి.మా చిన్నప్పుడు మా వూరిలో పోకిరి మగపిల్లలు ( మా పెద్దల దృష్టి లో )ఇలాంటి సినిమాలకి వచ్చేవాళ్ళు..అందుకని ఇలాంటి సినిమాలకి వెళ్ళాలంటే నాన్న తప్పనిసరి మాతో పాటూ ... ఇదీ మా సినిమాల విభజన.
ఇంకో సినిమా విభాగం నా ఫ్రెండ్ రాజేశ్వరితో చూసిన సినిమాలు.. వాళ్లకి ఒక సొంత సినిమా హాల్ ఉండేది.ప్రతి ఆదివారం వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్ళకుండా వూర్కునేది కాదు.ఒక్కో సినిమా నెలరోజులు,ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆడే ఆరోజుల్లో కొన్ని సినిమాలు కనీసం ఐదారుసార్లన్నా చూసి ఉంటాను దాని గొడవ వల్ల.అలా ఐదారుసార్లన్నాచూసిన వాటిలో చెట్టుకింద ప్లీడర్ ఒకటి..అందుకే ఆ సినిమా నిద్రలో లేపి అడిగినా స్టోరీ అంతా గుర్తుంటుంది.ఎంతైనా అప్పటి సినిమాలు బాగుండేవి.ఇప్పటికీ టీవీలో వస్తున్నా వాటిని చూడాలి అనిపిస్తుంది.
అప్పటి సినిమాల్లో కొన్ని కామన్ విషయాలు చాలా ఉండేవి. అలాంటి వాటిల్లో తప్పిపోయి,కలుసుకునే పాటలు ఒకటి.ఉదాహరణకు ఒక కుటుంబం ఆనందంగా పుట్టినరోజో,పండుగో చేసుకుంటూ పాట పాడుకుంటూ ఉంటారు. సడన్‌గా రౌడీ వచ్చి అక్కడ విధ్వంసం చేస్తాడు.పాపం కుటుంబం అంతా చెల్లా చెదురై పోతారు.కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దయ్యి వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు చిన్నప్పుడు పాడుకునే పాట పాడుతూ ఉంటారు..ఇంతలో పక్కనుండి ఇంకెవరో వచ్చి అదే పాట పాడగానే అన్నయ్యా,తమ్ముడూ,అమ్మా,నాన్నా అంటూ అంటూ హ్యాపీగా కలుసుకుంటారు.ఇప్పుడంటే ఎదో కామెడీగా అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూస్తుంటే మళ్ళీ వీళ్లెలా కలుస్తారబ్బా అని ఆలోచిస్తూ చాలా బాధగా ఉండేది :)
నాకొక సందేహం నిజంగా అంత చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలకి ఆ పాట ఎలా గుర్తుంటుంది??
వీళ్ళు పాడుతున్నప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు విని వాళ్ళు కూడా వచ్చి పాడే ప్రమాదం లేదా??
ఏది ఏమైనా ఆ పాటలు పాడుకున్న వాళ్ళందరూ కలిసి, కధలు సుఖాంతం అయ్యాయి కాబట్టి
ఇప్పుడు ఈ సందేహాలతో నా బుర్ర పాడు చేసుకుని, పక్కన వాళ్ళ బుర్ర కూడా పాడు చేయటం ఎందుకు.
ఇలాంటి తప్పిపోయినప్పుడు పాడుకునే పాటల్లో నాకు గుర్తున్న కొన్ని పాటలు
ఆనాటి హృదయాల ఆనందగీతం - అన్నదమ్ముల అనుబంధం
సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం - ముగ్గురు కొడుకులు
అమ్మంటే మెరిసే మేఘం .. కురిసే వానా - ముగ్గురు మొనగాళ్ళు
ఇంకెవరికైనా ఏవైనా కుటుంబ గీతాలు గుర్తుంటే గుర్తు చేయగలరు :)
18 కామెంట్లు:
బాగుంది. ఆ మధ్యనెవరో ఇలాంటి టాపిక్కే రాశారు ..
"నిజంగానే తప్పిపోయిన ఆ పిల్లలకి ఆ పాట ఎలా గుర్తుంటుంది?"
లాంటి సందెహాలు మీకు రావడం తగునా? మీకు తెలుసు కదా? మన logical sense ని turn off చెసి తెలుగు మూవీస్ చూడాలన్నది?ఒప్పుకుంటారా?
Narayanaswamy S గారూ..
పోస్ట్ నచ్చినందుకు,
మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ..
"మన logical sense ని turn off చెసి తెలుగు మూవీస్ చూడాలన్నది?ఒప్పుకుంటారా?"
జలతారు వెన్నెల గారూ..
తప్పకుండా ఒప్పుకుంటానండీ..
అందుకే కదా ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు :)
మీ స్పందనకు థాంక్సండీ..
రాజీ గారు..విద్యాసాగర్ గారు స్వరపరచిన.. అమ్మంటే మెరిసే మేఘం పాట నాకు చాలా ..ఇష్టం. ఆ చిత్రంలో.. పృద్వీ..కి అమ్మతో ఉన్న అనుబంధం చాలా గొప్పది కదా! గుర్తు ఉండకుండా ఎలా ఉంటుంది!?
బాగుంది..మీ పరిచయం.
వనజవనమాలి గారూ..
అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేరని మంచి సవరణ చేశారండీ నా ఆలోచనకు..
అలాగే నా సందేహాన్ని కూడా తీర్చేశారు..
పోస్ట్ నచ్చినందుకు,
మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ..
రాజేంద్రప్రసాద్ సినిమాలు ఆడవాళ్లకు ప్రత్యేకమని ఎవరు చెప్పారు .. ( mem oppukom ) ? పివి నరసింహ రావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే మనసు బాగా లేనప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తాను బాగుంటాయి అని చెప్పారు ..
ఇక ఆనాటి ...... పాట విడిపోయిన కుటుంబాలకు జాతీయ గీతం లాంటిది
buddha murali గారూ..
ఆరోజుల్లో అలాగే అనుకునే వాళ్ళండీ మా అమ్మా వాళ్ళు .
అందుకే మమ్మల్ని మ్యాట్నీకి తీసుకుని వెళ్ళేవాళ్ళు..
రాజేంద్రప్రసాద్ నాకు కూడా నచ్చే ఆర్టిస్ట్.
ముత్యమంతముద్దు లో అనుదీప్ కారెక్టర్,
అలాగే చెట్టు కింద ప్లీడర్ లో,ఇంకా చాలా సినిమాల్లో రాజేంద్రప్రాసాద్ నా ఫెవరెట్ హీరో..
"విడిపోయిన కుటుంబాలకు జాతీయ గీతం"
భలే చెప్పారు..
మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ..
ఇలా విడిపోయిన కుటుంబాలకు ఓ పాట తప్పని సరిగా వుండాలేమో నని నేను అనుకునేదానిని . మాకు ఓ పాటైనా లేదే , ఓవేళ తప్పిపోతే ఎలా అని ఎంత దిగులు పడేదానినో :)
పాటలు చాలా వున్నయికాని గుర్తు రావటం లేదు :)
మాలా కుమార్ గారూ..
చాలా రోజుల తర్వాత వచ్చారు నా చిన్నిప్రపంచానికి..
"మాకు ఓ పాటైనా లేదే , ఓవేళ తప్పిపోతే ఎలా అని ఎంత దిగులు పడేదానినో"
అమ్మ బాబోయ్ ఎంత నవ్వించారండీ :):)
నిజమే కదా ప్రతి ఒక్కరికీ ఒక ఫామిలీ సాంగ్ ఉంటే మంచిదేమో :)
అదేనండీ ఇలాంటి పాటలు చాలా వున్నట్లున్నాయి కానీ నాకు కూడా గుర్తుకు రావటం లేదు :)
మీ స్పందన తెలియచెసినందుకు థాంక్సండీ..
బాగుందండీ! కుటుంబం తప్పిపోవడం కాదు కానీ భార్యా భర్తలు ఒకరినొకరు చూసుకోకుండా పాట పాడుకుని మళ్ళీ ఆ పాటతోనే కలుసుకునే పాట ఒక చిన్నమాటలో ఓ మనసా తొందరపడకే పది మందిలో అల్లరి తగదే!
రాజి గారూ మనం కూడా కొంతకాలానికి బ్లాగులు రాయడం మానేస్తాం. తరువతెక్కడైనా కలిసినా ఒకర్నొకరం గుర్తుపట్టలే౦, ఎప్పుడూ చూసుకోలేదుగా..అందువల్ల మనం కూడా ఒక పాట అనేసుకుందాం. ఎప్పటికైనా ఏ బ్లాగారైనా ఎక్కడైనా కలిస్తే గుర్తుపట్టడానికి వీలుగా..ఏమంటారు..
రాజీ ,
నా సంగతి సరే . యాదోంకీ బారాద్ చూసాక మా అబ్బాయి చాలా టెన్షన్ పడ్డాడు . నేనూ అక్కా మేలా లో తప్పిపోతే నువెట్లా కనుక్కుంటావూ అని .వాడి కి నాపోలికే వచ్చినట్లుంది :) ఏ పాట నేర్చుకోవాలా అని చాలా రోజులు ఆలోచించాము . అప్పుడే వాడి స్కూల్లో మ్యూజిక్ క్లాస్ లో " ఎంగె పొరియాదు పాపా , నీవెంగె పొరియాదు పాపా " పాట నేర్పించారు . ఆ పాట బాగుందని నేనూ , మా అమ్మాయీ , అబ్బాయీ , మా జయా అందరమూ కష్టపడి నేర్చుకున్నాము . మా వాడికి వాళ్ళ డాడీ కూడా నేర్చుకోవాలని వుండేది కాని ఆయనకు చెప్పాలంటే మా కందరికీ భయం :)పైగా మేము ఆయన వుండగా పొరపాటున పాడుకుంటూ వున్నా ఏమిటి బండ గొంతేసుకొని అందరూ ఈ పిచ్చి పాట పాడుతున్నారు అని తిట్టేవారు .
మీ పోస్ట్ చదవగానే ఇవన్నీగుర్తొచ్చి మా పిల్లలకు చెప్పాను . అందరమూ తెగ నవ్వుకుంటున్నాము . మా మనవడు , మనవరాలు ఇదా మీ ఫామిలీ సాంగ్ అని పడీ పడీ నవ్వుతున్నారు . నాలుగు రోజుల నుంచీ మా పాత జ్ఞాపకాలను బయటకు తీసి మమ్మలిని నవ్విస్తున్నందుకు థాంక్ యూ :)
రసజ్ఞ గారూ.. నిజమేనండీ "ఒక చిన్న మాట" సినిమాలో ఆ పాట కూడా బాగుంటుంది..
నా సరిగమలు గలగలలు బ్లాగ్ లో పోస్ట్ చేశాను
ఆ పాటని..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ!
జ్యోతిర్మయి గారూ..
నిజంగా చాలా మంచి ఐడియా అండీ :)
చాలా బాగుంది!
మరి త్వరగా ఆ పాటేదో అందరం కలిసి ఒక నిర్ణయం తీసేసుకుందాము :) :)
"మాలా కుమార్" గారూ..
తప్పిపోయినప్పుడు పాటలతో మీ అనుభవం,పాట నేర్చుకునే మీ ప్రయత్నం అన్నీ బాగున్నాయండీ:):)
నా పోస్ట్ మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసి మీ కుటుంబ సభ్యులందరినీ నవ్వించినందుకు నాకు చాలా సంతోషంగా
వుంది.
మీ స్పందనను తెలియచేసినందుకు థాంక్సండీ :)
రాజి గారు! మీ తప్పిపోయిన పాటల పోస్ట్, వ్యాఖ్యల వల్ల - "నా బెంగ - ఇంకా కొందరి బెంగ కూడా" అని తెలిసింది :)
Thank you లలిత గారు.. మీ వ్యాఖ్య వలన ఎప్పుడో మర్చిపోయిన పోస్ట్,అప్పటి బ్లాగ్మిత్రుల కామెంట్స్ అన్నీ చూడటం నాకు చాలా సంతోషమండీ..చూశారా మీలాగే అందరూ ఎంతగా ఆలోచించారో తప్పిపోయిన పాటల గురించి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి