పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

12, జూన్ 2014, గురువారం

మాటే మంత్రము --- వాగ్భూషణం .. భూషణం..!
*వాగ్భూషణం*
కేయూరాని న భూషయంతి పురుషం ..! హారా న, చంద్రోజ్వాలా..!
న స్నానం.. న విలేపనం... న కుసుమం .. నా లంకృతా మూర్ధజా..
వాణ్యే కా సమలం కరోతి పురుషం ..యా సంశ్రుతా ధార్యతే..!
క్షీయంతే..ఖలు, భూషనాని సతతం ..
వాగ్భూషణం .. భూషణం..!

చేతులకు వేసుకునే గండపెండేరాలు, అలంకార ఆభరణాలు, హారాలు , మంచిగంధ స్నానాలు,పైన పూసుకునే విలేపననాలు, పూలు ఇవన్నీ  కాల క్రమేణా నశించేవే..! కేవలము ..మంచి భాషణం, మంచి మాట ఒక్కటే శరీరానికి శోభనిచ్చేది

వాక్కు లేక మాట  మనిషికి దేవుడిచ్చిన వరం .. ఈ భూమి మీద ప్రాణుల్లో దేనికీ లేని ఇలాంటి అదృష్టం మానవుడి సొంతం.. అందుకే అన్ని ప్రాణుల కంటే "విలక్షణులం" మనం.. వూరికే అనవసరంగా ఏదీ మాట్లాడకూడదు.మనం మాట్లాడే  ప్రతి మాటకు ప్రయోజనం ఉండాలి,పరమార్ధం ఉండాలి , విన్న వాళ్లకు కూడా సమంజసంగా అనిపించాలి .. అతిగా మాట్లాడే వాళ్ళని వసపిట్ట,చిన్నప్పుడు వస ఎక్కువగా పోశారా  అంటుంటారు .. నోట్లో నాలుక వుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే వుండకూడదు.. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి.

ఎదుటి వాళ్ళను పరుషంగా మాట్లాడటం, నిందలు మోపటం, నిష్టూరాలాడి ఎదుటివారి మనసు నొప్పించటం సరైనది కాదు.. ఎంత శాంత స్వభావులైనా మనం అదే పనిగా మాటలు అంటూ వుంటే పడి  ఉండరన్న విషయం అందరికీ అనుభవమైన విషయమే .. అద్దంలో మనము ఎలా వుంటే అలాగే కనపడినట్లే  మన మాట కూడా... ఎదుటివాళ్ళతో మనం ఎలాగ మాట్లాడతామో అలాంటి మాటలే మనమూ వారి నుండి వినాల్సి వస్తుంది ..   అందుకే ఒకరిని మనం  అనటం ఎందుకు,వారితో తిరిగి మాటలు పడటం ఎందుకు??
  
మన స్వభావానికి,ప్రవర్తనకి మనం తినే ఆహారం కూడా కారణం  అవుతుందట, ఎవరైనా కోపంగా మాట్లాడితే మిరపకాయ తిన్నావా అంటారు .. పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తూ అరిచే  వాళ్ళని కల్లు తాగిన కోతి అంటారు .
మంచిగా మాట్లాడే వాళ్ళని ఎంత తియ్యని మాట చెప్పావు అంటారు... అలాగని సాత్వికాహారం తినే వాళ్ళందరూ మర్యాదగా,మంచిగా మాట్లాడతారు,అలా తినని వాళ్ళు పరుషంగా మాట్లాడతారు అనే రుజువులు ఎక్కడా లేవనుకుంటాను..


నేను నిజాలే మాట్లాడతాను దాని వల్ల ఎవరికి నష్టం, కష్టం కలిగితే  నాకేంటి అంటుంటారు కొందరు .. నిజం మాట్లాడటం మంచి పద్ధతే కాని ఆ నిజం చెప్పటానికి కూడా ఒక పద్దతి వుంటుంది .. మీరనుకున్న ఆ నిజం కొందరికి నిష్టూరంగా అనిపించొచ్చు .. ఆ నిజం  వలన కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కావచ్చు .. కాబట్టి ఒక మనిషి గురించి ఎవరు ఏమి చెప్పినా విని నమ్మేసి ఆ మనిషి మీద ఒక అభిప్రాయం  ఏర్పరచుకోవటం,ఆ విషయాన్ని సంబధిత వ్యక్తితోనే మాట్లాడి మన సందేహం  తీర్చుకోకుండా ఆ  వ్యక్తి  గురించి మరొక వ్యక్తి దగ్గర మాట్లాడటం చాలా పెద్ద తప్పు ..ఇలా చేయటం వలన లేనిపోని కొత్త సమస్యలు తలెత్తుతాయి .. 

ఇంకా కొందరుంటారు వాళ్ళు చెప్పాలనుకున్నదే చెప్తూ పోతారు కాని ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా,తిరిగి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని పట్టించుకోకుండా నేను మాట్లాడాలి,నువ్వు వినాలి అనే ధోరణిలో మాట్లాడుతూనే వుంటారు .. 

మరికొందరు మనసులో వుండే ఆలోచనలు బయటపడకుండా,మనసులో ఒకటి పెట్టుకుని,బయటకు మరొకటి మాట్లాడుతుంటారు.. నిజంగా ఇలా మనసులో ఏముందో బయటపడకుండా మాట్లాడటం కూడా ఒక గొప్ప "కళ" అనొచ్చేమో ... ఇలాంటి వాళ్ళనే  "నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే రకం" అంటారు .. 

ఇంకొందరు మాట్లాడితే మాటల్లో వెటకారం కొట్టొచ్చినట్లు
కనపడుతుంది .. అలా మాట్లాడటం ఒక గొప్పగా తమకంటే గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఇంకెవరికీ లేనట్లు ఫీల్ అవుతుంటారు .. వెటకారం మరీ ఎక్కువైతే వికటించే ప్రమాదం కూడా వుందని గుర్తిస్తే మంచిది .. 

మాటలు మనిషి ఆలోచనలకు ప్రతిరూపాలు .. కొందరి మాటలు వారిలో అహంకారాన్ని,గర్వాన్ని,అసూయని ప్రదర్శిస్తే,కొన్ని మాటలు మంచితనం, ఆత్మీయతకి మారుపేరుగా అనిపిస్తాయి .. ఒక్కోసారి బెదిరించి ఒప్పించలేని విషయాలు కూడా మంచి మాటలతో ఒప్పించి మెప్పించగలము  ..అలాగని కోపంగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు,మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోలేము .. కోపంగా మాట్లాడినా  మనకి  మేలు చేసేవాళ్ళు కొందరైతే, తియ తీయని తేనెల మాటలతో గోతులు తీసేవారు మరికొందరు .. కాబట్టి మాటల గారడీకి  మోసపోకుండా జాగ్రత్తపడాలి .. 

కత్తితో  చేసిన గాయం అయినా కొంత కాలానికి మానిపోతుంది కానీ మాటతో చేసిన గాయం ఎప్పటికీ మానకుండా  బాధిస్తూనే ఉంటుందట . అందుకే " జారవలదు  నోరు జాగ్రత్త " అన్నారు పెద్దలు .. వాక్కు భూషణమే కాదు రెండువైపులా పదునున్న ఆయుధం కూడా .. అందుకే మాట్లాడటం నా జన్మ హక్కు కాబట్టి  నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతా అనకుండా ఈ హక్కును ఎంత  జాగ్రత్తగా ఉపయోగించుకుంటే  అంత మంచిది .. 

"ఇతరులు ఏమి చేస్తే, మన మనసు బాధపడుతుందో అలాంటి పనులు మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమ ధర్మం" మాటల విషయంలో కూడా ఈ ధర్మాన్ని పాటిస్తే   డబ్బులు  ఖర్చు పెట్టి మరీ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్  క్లాసులు తీసుకోవాల్సిన అవసరం రాదేమో ..  "పలుకే బంగారమాయెనా" అని భక్త రామదాసు రాముడిని అన్నట్లు మాటలను బంగారమంత విలువగా, జాగ్రత్తగా, పొదుపుగా కాపాడుకోవటం మనిషికి అన్ని వేళలా మంచిది .. 

ఇప్పటికే మాటల గురించి చాలా ఎక్కువగా మాట్లాడినట్లున్నాను .. 
ఇక ఉంటాను ఇప్పటికి  .../\...Related Posts Plugin for WordPress, Blogger...