పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, జులై 2014, మంగళవారం

భగీరధ ప్రయత్నం


 

భగీరధుడి కధ ఏమిటంటే కపిల మహాముని శాపానికి గురైన తాతలకు శాప విమోచనం చేయటానికి  తపస్సుతో గంగమ్మను మెప్పించి,శివుని సహాయం తో గంగను భూమి మీదకి రప్పించి ,పూర్వీకులకు  సద్గతులు ప్రసాదించిన మహా ముని ..

ఏదైనా అసాధ్యమైన పనిని చేయాల్సి వచ్చినప్పుడు , కష్టపడి ఆ పనిని సాధించినప్పుడు అబ్బ భగీరధ ప్రయత్నం చేయాల్సి వచ్చింది  అంటుంటాము..ఇంతకీ ఈ భగీరధుడి సంగతి అప్పుడప్పుడూ విన్నా పదవ తరగతి దాకా అర్ధం కాలేదు ఈయన సంగతి ..  పదవ తరగతి తెలుగు బుక్ లో ఈ కధ గురించి మా అన్నమ్మ టీచర్ వర్ణించి,వర్ణించి చెప్తుంటే పాఠం అలా మనసులో గుర్తుండిపోయింది .. ఈ పాఠం చెప్తూ మా టీచర్ విద్యార్ధి జీవితం లో ఈ పదవ తరగతి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నదనీ, అందుకే ఈ సంవత్సరం ఈ పాఠం మొదటి పాఠంగా ఉందనీ మీరు కూడా ఆయన లాగనే ప్రయత్నించి గట్టెక్కాలనీ చెప్పేవాళ్ళు.. ఇప్పట్లో ఇన్స్పిరేషన్ పాటలు,పుస్తకాలు చదివితే ఎంత ఉత్తేజం, ఉత్సాహం కలిగి ,వెంటనే ఫేస్ బుక్ లోనూ,బ్లాగుల్లోనూ మనం కూడా అందరినీ  మన శాయశక్తులా ఎలాగ  ప్రోత్సహిస్తామో  అప్పట్లో మా  టీచర్ మాటలు మాకలా అనిపించేవి .. మొత్తానికి ఎక్కువ భగీరధ ప్రయత్నం చేయకుండానే చదువు గట్టెక్కామనుకోండి...


ఇప్పుడింతకీ భగీరధుడు ఎందుకు గుర్తొచ్చాడంటే జూన్ నెలలోనే వస్తాయనుకున్న వర్షాలు ఇంతవరకు కనపడలేదు.  అప్పుడప్పుడు చిన్న జల్లులు పడినా అది వర్షం కింద లెక్క కాదు . ఇప్పటికే రైతులు వర్షం పడుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు . రైతుల సాగు నీరేమో కానీ మన కి తాగు నీరైనా దొరుకుతుందా లేదా అని భయం పట్టుకుంది..   ఒకప్పుడు మా వూర్లో నీళ్ళు ఎప్పుడన్నా ఇబ్బంది ఐతే ఛీ ఛీ ఈ వూర్లో నీళ్ళే రావు అదే సిటీ లో నీళ్ళకి ఇబ్బందే వుండదట  అనుకునే వాళ్లము .. కానీ ఇప్పుడు సిటీల్లో పరిస్థితి చూస్తుంటే మా ఊరిని మేము ఎంతగా అవమానించామో గుర్తొచ్చింది నాకు,మా చెల్లికి ...

మా వూర్లో  నయం నీళ్ళు రాకపోతే పనమ్మాయి పక్కన వుండే బోరింగ్ దగ్గరికి వెళ్లి నీళ్ళు  మోసుకొచ్చి మరీ ఇంట్లో పని చేసి వెళ్ళేది .. కానీ ఇప్పుడు నీళ్ళు  లేకపోతే నేనేమి చెయ్యనమ్మా అంటూ "అహా ఇవాళ పని తప్పింది" అనుకుంటూ హాపీగా వెళ్ళిపోతుంది పనమ్మాయి.. నాకు చూస్తే నీళ్ళు రాకూదదు దేవుడా నాకు హాయిగా వుందని అనుకుంటుందో ఏమో మనసులో అనిపిస్తుంది.. ఛా .. ఐనా అలా మాట్లాడకూడదులె పని వాళ్ళు కూడా మన లాంటి మనుషులే కదా పాపం  ..

వర్షాలు లేక బోర్ లో నీళ్ళు రావట్లేదమ్మా నేనేమి చేయను వచ్చినప్పుడే డబ్బాల్లో పట్టుకోండి అని ఒక వాచ్ మెన్ అంటే .. నీళ్ళు టాంక్ లతో తెప్పించి పోస్తున్నాం సార్ .. అందుకే మైంటెనెన్స్ ఎక్కువ ఇవ్వండి ఈ నెలలో అంటూ మరొక వాచ్ మెన్ ... ఇంక కరెంట్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు .. ఇన్ని సమస్యలు ఎలా తీరాలిరా దేవుడా అనుకుంటుంటే ఇవాళ ఈనాడు పేపర్ లో అనుకుంటాను ఒక స్వామీజీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లో వర్షాలు పడవు అని మరొక బాంబు పేల్చారు ..

అప్పుడు ఎందుకో నాకు భగీరధుడు గుర్తొచ్చాడు..  ఏమిటో అప్పుడు ఆయన తన పూర్వీకుల కోసం పట్టుదల, కఠోర శ్రమలతో తపస్సు చేసి గంగను భూమి మీదకి తెచ్చాడు.. ఇప్పుడు మనకోసం ఎవరు అలా చేస్తారబ్బా అనిపించింది.. ఐతే ఆశ్చర్యం అనిపించేలా సాయంత్రం కల్లా  గుంటూరు ,హైదరాబాద్ రెండు చోట్లా సుమారు రెండు గంటలు పెద్ద వర్షమే పడింది .. మొత్తానికి ఎండలకి  మండిపోతున్న వాతావరణం కొంచెం చల్లబడింది.  
 
ఇవాళ నాకనిపించింది వర్షాల కోసం ఘటాభిషేకాలు ఇంకా ఏవో పూజలతో పాటూ అందరం ఆ భగీరధుడిని కూడా తలచుకుంటే బాగుంటుంది కదా అని 

Related Posts Plugin for WordPress, Blogger...