పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, జనవరి 2016, ఆదివారం

శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం @ ఎల్లోరా


 

శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దర్శనం తర్వాత మా ప్రయాణం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ పట్టణం నుండి 30 కి.మీ దూరంలో ఎల్లోరాలో ఉన్న శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి .భారతదేశంలో ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరి అంటే 12 వ జ్యోతిర్లింగమే ఈ  ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం.ఇది స్వయంభూ అయిన పూర్ణ జ్యోతిర్లింగం.పద్మపురాణం ప్రకారం ఎల్లోరా ను పూర్వం  ఏలాపురి అని పిలిచేవారు.ఈ నగరాన్ని ఏల్ రాజు పరిపాలించేవాడు  కాబట్టి ఆయన పేరుమీద ఏలాపురి ,వేరుల్ గా పిలువబడేది .. ఘృష్ణేశ్వర దేవాలయం  సమీపంలో ప్రవహించే నదిని కూడా ఏల్ గంగ అని అంటారు. ఈ జ్యోతిర్లింగ దర్శనంలో మరో ప్రత్యేకత ఇక్కడికి చాలా దగ్గరలో (2.కి.మీ దూరం) ఉన్న ఎల్లోరా గుహలు.

ఆలయంలోపలికి వెళ్ళే దారి

స్థలపురాణం 
శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.
శివపార్వతులు కామ్యకవనంలో నివసిస్తున్న కాలంలో ఒకరోజు పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి శివాలయ తీర్థం యొక్క తూర్పు  భాగాన నిలబడి తన అరచేతిలో కుంకుమ తీసుకుని శివాలయ తీర్ధంలోని నీటితో లేపం తయారుచేస్తున్నప్పుడు మంత్రోచ్చారణ ఫలితంగా ఆమె చేతిలోనే ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది.ఈవిధంగా పార్వతీ దేవి గావించిన ఘర్షణ ద్వారా వెలశాడు కాబట్టి ఘృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందింది. 



ఏలానది పశ్చిమం వైపున శివాలయ తీర్దానికి తూర్పున శ్రీ ఘృష్ణేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు.ఈ దేవాలయం  అందంగా చాలా విశాలమైన ఆవరణలో అరుదైన శిల్పకళతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది.బయటి ప్రవేశ ద్వారం నుండి లోపలి వెళ్ళగానే విశాలమైన ప్రశాంత వాతావరణంలో గులాబి రంగు రాళ్ళతో వైవిధ్యంగా చెక్కబడిన ప్రధానాలయ శిఖరం కనపడుతుంది. దశావతారాలు,శివపార్వతుల సుందరమైన విగ్రహాలు చెక్కి ఉంటాయి.శిఖరం ముందువైపు శివపరివారం ఉటుంది.గర్భగుడికి ఎదురుగా సభామండపం, నంది మండపం ఉంటాయి. నంది మండపంలో ఎర్రటి శిలతో పెద్ద నందీశ్వరుడు అక్కడ వచ్చి కూర్చున్నట్లే అనిపిస్తుంది.ఇక్కడ కూడా అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది.


ఇక్కడ గర్భగుడి కూడా చాలా విశాలంగా ఉంది.విశాలమైన గర్భగుడి మధ్యలో జ్యోతిర్లింగ స్వరూపంలో కొలువైన శివయ్యని తాకి నమస్కరించొచ్చు. తాకటం మాత్రమే  కాదు మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ కూర్చుని అభిషేకం చేసుకునే అవకాశం  మాకు కలిగింది. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ జనం చాలా తక్కువగా ఉన్నారు.అన్ని చోట్ల కంటే శివయ్యకి చాలా దగ్గరగా ఎక్కువ సేపు కూర్చుని హృదయం నిండుగా దర్శనం ఇక్కడే జరిగింది.మనంతట మనం ఇక వెళదాములే అనుకుని బయటికి రావటమే కానీ ఇక్కడి పూజారులు  కూడా ఎవరినీ వెళ్ళండి అనట్లేదు.అంతదూరం ఆ భోళాశంకరుడి దర్శనానికి వెళ్ళిన మమ్మల్ని శివయ్య  ప్రేమగా ఆహ్వానించి ఆప్యాయత కురిపించినట్లు అనిపించింది. స్వామికి వెనకవైపు పార్వతీమాత విగ్రహం ఉంటుంది.శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనే గానీ శివపూజ లభించదు అన్నట్లు ఒకటికి రెండుసార్లు దర్శనానికి వెళ్ళేంత తక్కువ రద్దీ ఆ రోజు ఉండటం మా జన్మజన్మల పుణ్యం.

ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్ల సంతంచ జగద్వరేణ్యం
వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే


ఇక్కడ ఆవుపాలు, శివయ్య కి ఇష్టమైన మారేడు,బిల్వపత్రి,రకరకాల అందమైన పూలు చాలా ఎక్కువగా దొరుకుతాయి. మనం వెళ్ళగానే పార్కింగ్ దగ్గరికే వచ్చి ఆవుపాలు,పూలు,పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారు.వాటితో మనమే శివుడికి అభిషేకం, పూజ స్వయంగా చేయొచ్చు.ఇక్కడ మాఘ, కార్తీక మాసాలలో ,శివరాత్రి రోజు పెద్ద యాత్ర జరుగుతుంది 


ఆలయానికి చాలా సమీపంలో ఉన్న మరొక చారిత్రక కట్టడం శివాజీ పూర్వీకుల సమాధి. ఘృష్ణేశ్వర దేవాలయం జీర్ణోద్ధారణలో (భోంస్లే )ఛత్రపతి శివాజీ వంశం వారి పాత్ర కూడా ఉంది. క్రీ.శ 1599 లో నిజాం రాజులైన లఖూజీ జాధవరావు , మాలోజి భోంస్లే కి మధ్య విభేదాలతో మాలోజి ని సర్దార్ పదవి నుండి తొలగించగా మలోజీ ఎల్లోరా వచ్చి అక్కడ కరణంగా  జీవనం గడుపుతూ అవమానంతో,దారిద్ర్యంతో బాధపడుతూ తన ఆరాధ్య దైవమైన శంకరుడ్ని ఆరాధించాడు.భగవంతుడు ఆయన స్వప్నంలో కనపడి,నీ కోరిక తీరుతుంది.నీ వంశంలో పరాక్రముడైన శకకర్త అయిన రాజు జన్మిస్తాడు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న పుట్టలో నీకు కావలసినంత ధనం లభిస్తుంది అని చెప్పగా నిజంగానే కలలో చెప్పిన ప్రదేశంలో నిధి దొరికింది. ఆ నిధితోనే  ఘృష్ణేశ్వర మందిరం జీర్ణోద్ధారం చేయించాడు. 
శ్రీధర్ విష్ణు పరాంజపే అనే ఆయన తన కీర్తన సుధాధార అనే పుస్తకంలో దీన్ని గురించి వివరించారు

శివాజీ పూర్వీకుల సమాధి
అక్కడే చెక్కి తయారు చేస్తున్నశివలింగాలు, దేవతామూర్తుల విగ్రహాలు.. ఇదంతా ఎల్లోరా రాయే కదా !!
అంతా శివమయం

దర్శనం అయిపోగానే అక్కడికి దగ్గరలోని జగత్ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలకి బయల్దేరాము.సహ్యాద్రి పర్వతాలను సుతారంగా చెక్కి,అందమైన శిల్పాలతో ఉన్న ఇక్కడి అద్భుతమైన గుహలు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. ఎల్లోరా అందాలు తర్వాత పోస్ట్ లో...


Related Posts Plugin for WordPress, Blogger...