పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, జనవరి 2017, బుధవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - మధురై


మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా

మధురై మీనాక్షి అమ్మవారిని చూడాలన్నది మాకు ఎప్పటినుండో  ఉన్న కోరిక.చిన్నప్పుడు విజయ్ కాంత్,రాధల  మధుర మీనాక్షి సినిమాలో, తర్వాత మహేష్ బాబు అర్జున్ సినిమాలో సెట్టింగ్ అయినా ఆలయాన్ని చాలా అందంగా చూపించారు.అలా ఎప్పటినుండో అనుకున్న మధుర మీనాక్షి అమ్మన్, సుందరేశ్వరుని ఆలయ దర్శనం ప్రశాంతంగా జరిగింది,అమ్మవారి సుప్రభాతసేవ, అలంకారణ సమయం కావటంతో అలంకరణ,హారతి జరిగినంతసేపు అక్కడే ఉండి అమ్మని చాలాసేపు చూస్తూ ఉండే అవకాశం కలగటం  చాలా సంతోషంగా అనిపించింది.

 ఆలయం లోపల 

తమిళనాడులో ఉన్న అతిపెద్ద నగరాల్లో మధురై ఒకటి.దక్షిణ తమిళనాడులోని వైగై నదీ తీరాన మధురై జిల్లా మధురైలో కొలువైన శ్రీ మీనాక్షీ సుందరేశ్వరుని దేవాలయం  ప్రపంచ ప్రసిద్ధి చెందింది.వేగైనది ఒడ్డున 6 వ శతాబ్దంలో పాండ్యరాజు కులశేఖరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మధుర అంటే 'తీపి' అని అర్థం. ఈ నగరం మీద శివుడు  తేనె వర్షం కురిపించాడని అందుకే మధురైగా పిలుస్తారని చెప్తారు.

పురాణ కధనం /స్థలపురాణం
పూర్వం మధుర ప్రాంతాన్ని పాలించే మలయధ్వజ పాండ్య మహారాజు శివపార్వతుల అనుగ్రహం కోసం తపస్సు చేయగా,అతని తపస్సుకు మెచ్చుకుని పార్వతీదేవి ఆ రాజుకి కూతురుగా జన్మించిది.పెరిగి,పెద్దయిన తరువాత ఆమె రాణిగా ఆ నగరాన్ని పాలించసాగింది.అమ్మవారి పరాక్రమానికి తగిన వరుడు శివుడే కనుక భూమ్మీద మానవరూపంలో పార్వతీదేవిని వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి,సుందరేశ్వరునిగా పెళ్లాడుతాడు.శివపార్వతుల వివాహం జరిపించడం కోసం మీనాక్షీ సోదరుడు అయిన విష్ణువు వైకుంఠం నుంచి వస్తుండగా కొన్ని కారణాల వలన  విష్ణువు రావడం కాస్త ఆలస్యం కావడంతో విష్ణువు రాకుండానే వివాహం జరిగిపోతుంది.

అలఘర్ పెరుమాళ్ళు అందాల చెల్లెలా 
మిలమిలలాడే మీనాక్షి

చరిత్ర -
మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని.మదుర నాయక మహారాజుల  చేత నిర్మించబడినదే ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబించే  మదురై మీనాక్షీ కోవెల.మధురై కూడలి నగరం, మల్లెల నగరం,ఆలయనగరం,నిద్రించని నగరం మరియు నాలుగు కూడలుల నగరంగా ప్రసిద్ధి.మదురై నగరానికి దీర్ఘకాల చరిత్ర ఉంది.ఈ నగరం క్రీ.శ 3వ శతాబ్దంలో వ్రాయబడిన గ్రీకుదూత మెగస్తనీసు వ్రాతలలో మెథొరగా ప్రస్తావించబడింది. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఈ నగర ప్రస్తావన ఉంది. సంగకాల సాహిత్యంలో ప్రత్యేకంగా మదురైకాంచి గ్రంథంలో పాండ్యసామ్రాజ్యంలో ఒక భాగంగా ఈ నగరం ప్రస్తావించబడింది. 2వ శతాబ్దంలో రచించబడిన సిలప్పదికారం కావ్యంలో ఈ నగరవర్ణన ఉంది. క్రీ. పూ 300- క్రీ. పూ 200 కాలంలో తమిళ సంగానికి మదురై నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రాచీన రోమ్ వ్రాతలలో మదురై మధ్యధరా సముద్రతీర వాణిజ్యకేంద్రంగావర్ణించబడింది. గ్రీకుల మ్యాపులలో మదురై ఉన్న ఆధారాలు ఉన్నాయి.
  
రాజగోపురాలు

మధురై నగరం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం నలుదిక్కులా నాలుగు ఎత్తైన రాజగోపురాలు అపురూపమైన, విభిన్నమైన ఎన్నో రకాల శిల్పాలతో వాటికి అందమైన రంగుల పెయింటింగ్స్ తో గంభీరంగా కనిపిస్తాయి.ఆలయం లోపల అంతా అద్భుతమైన శిల్ప,చిత్రకళతో నిండి ఉంటుంది.ఆలయం పైకప్పులు మీద కూడా అందమైన చిత్రాలు/పెయింటింగ్స్ కనులవిందు చేస్తాయి.అమ్మవారి ఆలయం నాలుగు రాజగోపురాల మధ్యలో విశాలమైన ఆవరణలో ఎంత తిరిగి చూసినా ఇంకా సమయం సరిపోనంత పెద్ద ఆలయం.ఇక్కడ ఉన్నంత శిల్పకళ ఎక్కడా  లేదని,ఇక్కడి నాలుగు రాజ గోపురాల్లో 160  అడుగుల ఎత్తుతో  దక్షిణ దిక్కు రాజగోపురం అన్నిటిలో పెద్దదని చెప్తారు

గోపురాలమీద కొన్ని అందమైన శిల్పాలు

అమ్మవారి ఆలయంలో కోనేరు నాలుగు వైపులా మెట్లతో విశాలంగా,అందంగా కనిపిస్తూ,ఇందులో బంగారు  తామరపువ్వు మెరిసిపోతూ చాలా అందంగా ఉంటుంది.ఈ పుష్కరిణిలోని  నీరు చాలా మహిమ కలదని చెప్తారు.పూర్వం రాజుల ఆస్థానంలో కవులు రాసిన కావ్యాలు తెచ్చి,సరోవరంలో వేసేవారట,మునిగితే మంచివి కాదని,తేలితే మంచి కావ్యాలనినిర్ణయించి రాజులు బహుమతులు ఇచ్చేవారట. 

Golden Lotus Temple tank 

ప్రతిసంవత్సరం చైత్ర మాసంలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరుగుతుంది.దసరా నవరాత్రుల పూజలు చాలా బాగా చేస్తారట.ప్రతి సోమవారం ప్రత్యేక అలంకరణతో పాటూ ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి.జనవరి ఫిబ్రవరి నెలల్లో ప్రత్యేక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

 

మేము ముందుగా  అమ్మవారిని దర్శించుకుని, పొంగల్ ప్రసాదం తీసుకుని,పక్కనే పెద్ద వినాయకుడిని,తర్వాత సుందరేశ్వరుని దర్శనం అయ్యాక అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహాల మ్యూజియం చూసి,సరోవరం దగ్గరికి వెళ్ళాము.ఈ సరోవరం దగ్గర ఎంతసేపైనా కూర్చోవచ్చు అనిపించేలా ఉంది అక్కడి వాతావరణం.కోనేరు మధ్యలో చాలా అందంగా వరసగా  అమరి ఉన్న రేకులతో  బంగారు తామర పువ్వు నిజంగా అద్భుతం.ఆలయంలోపలికి ఫోన్ తీసుకెళ్లొచ్చు,టికెట్ తీసుకుంటే ఫోటోలు  కూడా తీసుకోవచ్చు.

ఆలయంలోపల శిల్పకళ

ఆలయంలో పైకప్పులమీద అందమైన పెయింటింగ్స్

అమ్మ సన్నిధిలో మా అమ్మ,నేను

కోనేరు దగ్గర గోడలమీద Mural Paintings

ఆలయంలో ఆలయ చరిత్రకు సంబంధిన పుస్తకాల షాప్ లో  మేము కూడా ఈ బుక్ కొన్నాము.
అందమైన చిత్రాలతో, ఆలయ విశేషాలతో పుస్తకం చాలా బాగుంది.
The Great Temple 

ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంది.అమ్మవారి ఆలయం చుట్టూ ఇత్తడి వస్తువుల షాప్స్ చాలా ఉన్నాయి.అన్నిట్లో అందమైన దీపం కుందులు,విగ్రహాలు,ఇత్తడి పాత్రలు చాలా మంచి డిజైన్స్ లో ఉన్నాయి.మదురై మొత్తం తిరిగి చూడాలంటే కనీసం రెండురోజులు అక్కడే ఉండాల్సి వస్తుందేమో,కానీ మాకు టైమ్ కుదరకపోవడంతో మీనాక్షీ సుందరేశ్వరుల దర్శనం ప్రశాంతంగా జరిగిందన్న సంతోషంతో,అమ్మ దర్శనభాగ్యం మళ్ళీ కలగాలని కోరుకుంటూ మధురై నుండి శ్రీరంగం బయల్దేరాము.


మధురై అమ్మవారి ఆలయానికి చాలా దగ్గరలోనే  పెరుమాళ్ళు కోవెల ఉంటుంది.
చుట్టూ కొండలు మధ్యలో ఆలయం చాలా బాగుంది.
 పెరుమాళ్ కోవిల్ - మధురై 

మధురై నుండి శ్రీరంగం వెళ్లే దారిలో మాకు నచ్చిన భోజనం

ॐ  చల్లని తల్లీ మీనాక్షీ సకల ప్రపంచమూ నీ సృష్టి  ॐ


4 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రఖ్యాత తమిళ నగరాలలో మదురై ఒకటి. మీరన్నట్లు సిలప్పదిగారం కథలో పేర్కొన్న ఊరు, కన్నగి కోపానికి గురై తగలబడిన నగరం.

మదురై లోని TTDC (Tamil Nadu Tourism Dev Corprn) వారి హోటల్ సౌకర్యవంతంగా బాగుంటుంది. ఫొటోలు చక్కగా వచ్చాయండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారు పోస్ట్,ఫోటోలు నచ్చి , మీ స్పందన తెలిపినందుకు చాలా థ్యాంక్సండీ.
మధురై గురించి చదువుతున్నప్పుడు సిలప్పదిగారం కథ కూడా చదివానండీ.. కణ్ణగి గురించి చదువుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది.మంచి కథ.ఇలాంటి చరిత్రలు ఎంత చదివామనిపించినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనిపిస్తుంది.

Thank you ..

Lalitha చెప్పారు...

మంచి travelogue మీ బ్లాగ్ - చాలా బావున్నాయి విశేషాలు & ఫోటోలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

లలిత గారు..పోస్ట్ నచ్చినందుకు మీ వ్యాఖ్యకు చాలా థ్యాంక్సండి :)

Related Posts Plugin for WordPress, Blogger...