పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, నవంబర్ 2018, గురువారం

హంసలదీవి.. కృష్ణవేణి పవిత్ర సాగర సంగమం



హంసలదీవి, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామము.మహాబలేశ్వరంలోని  జన్మస్థానము నుండి మొదలైన కృష్ణానది సాగరుణ్ణి కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదీవి. పాలకాయతిప్ప అనే ప్రదేశం దగ్గర కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఒకవైపు గట్టుతో కృష్ణమ్మ,మరొకవైపు అనంతమైన బంగాళాఖాతం రెండిటినీ చూడొచ్చు.అందరి పాపాలను కడుగుతూ మలినమైన గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర కృష్ణవేణి సాగర సంగమంలో స్నానం చేయగానే హంసగా మారిపోయింది కాబట్టి ఈ ప్రదేశానికి హంసలదీవి అనే పేరు వచ్చిందనేది స్థలపురాణం.

మేము ముందుగా రేపల్లె,తెనాలి వైపునుండి మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి అక్కడినుండి హంసలదీవి వెళ్ళాము.అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యస్వామిని నాగరూపంలో గుర్తించి,ప్రతిష్టించిన సన్నిధానమే మోపిదేవి.సుబ్రహ్మణ్యస్వామి,ఈశ్వరుడు ఒకే రూపంగా కొలువై సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు దివిసీమ గ్రామాల నుండి వెళ్లొచ్చు అలాగే గుంటూరు నుండి తెనాలి,రేపల్లె వైపు పెనుమూడి వారధి మీదగా వెళ్లొచ్చు.లంక గ్రామాల్లో పచ్చని వాతావరణంలో ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తుంది.దారులు బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి మన  వెహికల్తో వెళ్తే ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు.

ముందుగా బీచ్ దగ్గరికి వెళ్తాము.బీచ్ దగ్గరనుండి కృష్ణమ్మ సముద్రంలో కలిసే చోటికి మన వెహికల్స్ వెళ్ళటం కష్టం ఎందుకంటే వేగంగా వస్తున్న సముద్రం అలల పక్కనే కారు వెళ్ళాలి.కారు టైర్స్ కూడా లాగేసేంత ఉధృతంగా అలలు వస్తుంటాయి.అందుకే అక్కడ ఆటోలో ఉంటాయి వాళ్ళు  మనిషికి కొంత అమౌంట్ తీసుకుని,సాగరసంగమ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు.అక్కడ కృష్ణమ్మ విగ్రహం, పాదాలు ఉంటాయి.ఈ సాగరసంగమ పెద్దలకి పుణ్యస్నానాలకే కాదు పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా సరదాపడతారు.వెంటనే అక్కడినుండి రావాలనిపించదు.ఇక్కడి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.దీనిపై నుండి చూస్తే సాగరసంగమ దృశ్యం  చాలా బాగా కనిపిస్తుంది.ఇక్కడికి చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది.ఎందుకంటే అక్కడినుండి వెంటనే రావాలనిపించదు మరి.అక్కడ షోడాలు,ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కానీ మనమే మంచి నీళ్ళు,తినటానికి కావాల్సినవి ఏమైనా తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడినుండి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. వూర్వం దేవతలు  ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. తెల్లవారి మనుషుల అలికిడి వినపడటంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు.తర్వాత చోళ రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగింది.ప్రస్తుతం ఈ ఆలయం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి దత్తత దేవాలయంగా గుర్తించబడింది.

ఇక్కడికి మేము రెండుసార్లు వెళ్ళాము.వెళ్ళినప్రతిసారి ప్రయాణం విసుగనిపించదు ,అక్కడ గడిపే సమయం కూడా విసుగనిపించదు.మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం హంసలదీవని ఈ వీడియోలో చూడొచ్చు

హంసలదీవి.. కృష్ణవేణీ సాగర సంగమం





Related Posts Plugin for WordPress, Blogger...