23, ఏప్రిల్ 2010, శుక్రవారం
పుస్తకం హస్తభూషణం.
ప్రతి మనిషి జీవితం లో పుస్తకంతో అనుబంధం వుంటుంది.
నా హాబీలలో మొదటి స్థానం సంగీతానిది ఐతే రెండోది పుస్తకపఠనం.
చిన్నప్పుడు స్కూల్ బుక్స్ తో పాటు చందమామ,బాలమిత్ర లాంటి ఎన్నో పిల్లల కధల పుస్తకాలు చదవటమంటే నాకు చాలా ఇష్టంగా అనిపించేది.
తర్వాత చదువు పెరిగే కొద్దీ వేరే పుస్తకాలు చదివే టైం,వోపిక వుండేది కాదు.
నాకు పుస్తకాలు చదివే ఆసక్తి కలగటానికి కారణం మా అమ్మ.
పుస్తక ప్రియులందరికీ సుపరిచితమైన ఎమెస్కో బుక్ క్లబ్ లో అమ్మ మెంబర్ కావటంతో మా ఇంటికి ప్రతి నెలా ఒక బుక్ వస్తుంది.కొత్త రచయితలను పరిచయం చేస్తూ వారి రచనలను మెంబర్స్ కి పంపటం ఎమెస్కో బుక్స్ వాళ్ళ పని.
ఆ నోవెల్స్ నచ్చనట్లయితే వేరే బుక్స్ తెప్పించుకొనే వీలుండటంతో అమ్మ ఎక్కువగా యండమూరి,యద్దనపూడి నోవెల్స్ తెప్పించేది.
వాటితో పాటు ఆంధ్రభూమి,స్వాతి,భక్తీ ఇలాంటి పుస్తకాలన్నీ మా ఇంట్లో ఇప్పటికీ కనిపిస్తాయి.
ఈ విధమైన పుస్తకాలన్నిటితో మా ఇల్లు ఒక చిన్న సైజు లైబ్రరీ లా వుంటుంది.
నేను చదివిన మొదటి నవల "వంశీ" "మహల్లో కోకిల"
ఈ నవల అప్పట్లో "సితార" సినిమాగా వచ్చింది అని,మనింట్లో ఈ నవల వుంది అని అమ్మ చెప్పింది.ఆ నవల ముఖచిత్రం ఒక అమ్మాయి పంజరం లోనుండి కిందకి దూకుతున్నట్లుగా వుంటుంది.
నేను చదివిన మొదటి నవల, నాకు ఇప్పటికీ నచ్చే నవల "మహల్లో కోకిల"
తర్వాత నేను లా లో జాయిన్ అవ్వటం తో కొన్నాళ్ళు నవలలకి బ్రేక్ పడింది.
ఆ మూడు సంవత్సరాలు లా పుస్తకాలతో కుస్తీ పట్టటమే సరిపోయింది .
లా అయిపోయి ఇంటికి వస్తూ...
మా అమ్మ నవల్స్ లైబ్రరీకి పోటీగా నా లా బుక్స్ లైబ్రరీ తెచ్చాను.
నేను తెచ్చాను అనటం కన్నా మా తమ్ముడు మోసుకొచ్చాడు అంటే సరిపోతుందేమో.
హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా నాకు అవసరమవుతాయి అనుకున్న లా బుక్స్ తెచ్చేవాడు తమ్ముడు.
ఆ విధంగా ఇప్పుడు మా ఇంట్లో ఒక గది మొత్తం లైబ్రరీ లాగా వుంటుంది.
ఇక ఆ పుస్తకాలని కాపాడుకోవటం ఒక కళ.
పుస్తకాలకి శత్రువులు
దుమ్ము,ధూళి,చెద పురుగులు వగైరా...
నా దృష్టిలో పుస్తకాలకి ఇంకో ప్రధాన శత్రువు మన పుస్తకం ఇవ్వమని అడిగేవాళ్ళు.
పుస్తకం చూడగానే ఇవ్వండి చదివి ఇస్తాం అని అడుగుతారు పోనీలే అని మనమూ ఇస్తాం.
ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కధ.
ఎన్నాళ్ళున్నా పుస్తకం ఇవ్వరు.మన అదృష్టం బాగుండి ఇచ్చినా..
అది చిరిగిపోయి,అట్టలు ఊడిపోయి శిధిలమై చేతికి వస్తుంది.
ఒక్కోసారి అసలు చేతికే రాదు.ఇవన్నీ మేము అనుభవించిన కష్టాలండీ మా పుస్తకాలతో.
అందుకే అసలు పుస్తకాలు ఎవరికీ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాము.
పుస్తకం,వనిత,విత్తం పరహస్తం గతం గతః ఇది పుస్తకం విషయంలో మాత్రం 100 % నిజమండీ.
అందుకే పుస్తక ప్రియులూ మీ పుస్తకాలు జాగ్రత్త.
ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.
రాజి
లేబుళ్లు:
నాకు నచ్చిన పుస్తకం.,
Special Days And Events