మీలో ఎవరు కోటీశ్వరుడు??
ఈ లోకంలో డబ్బు కావాలని ఎవరికుండదు చెప్పండి . ఎవరైనా డబ్బుదేముందిలెండి అని మాటవరసకు అంటారు కానీ ధనమూలం ఇదం జగత్ అనేది తెలిసిన విషయమే కదా.అందుకే సామాన్యుల కల నిజం చేసి, వాళ్ళను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా హీరో నాగార్జున చేస్తున్న ప్రయత్నమే "మీలో ఎవరు కోటేశ్వరుడు" సోమవారం నుండి గురువారం వరకు మా టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే క్విజ్ షో..
కాబట్టి ఇప్పుడు కోటీశ్వరుడు ఎవరైనా కావచ్చు పురాణాలు,జనరల్ నాలెడ్జ్, చరిత్ర,సైన్స్ ,గతం,వర్తమానం ఇలా ఏదైనా ఏ విషయంలోనైనా సరే పట్టు ఉండి నిర్ణీత సమయంలో సమాధానం చెప్పగల నేర్పు మీకుంటే మీరే కోటీశ్వరుడు కావచ్చు. హిందీలో అమితాబచ్చన్ యాంకర్‌గా చేసిన "కౌన్ బనేగా కరోడ్‌పతి" చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉండరేమో .. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు .. హిందీ అయినా సరే అందులో ఒక్కసారన్నా పాల్గొనాలని అప్పట్లో మన వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నించే వాళ్ళు .
మా కనకశ్రీ టీచర్ ,వాళ్ళాయన తో కలిసి చాలా సార్లు ఫోన్ చేస్తూ వుండేవాళ్ళు KBC కి ..వాళ్ళింటికి ట్యూషన్ కి వెళ్లి వాళ్ళని చూస్తూ మేము కూడా కోరుకునే వాళ్లము టీచర్ గారికి అవకాశం వస్తే బాగుండు అని. పాపం ఆ కోరిక తీరలేదు కానీ రాధిక బంగారం ఇచ్చే ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యి ఫ్యామిలీతో సహా వెళ్లి బంగారం గెలుచుకుని వచ్చారు మా టీచర్ .. అలా అప్పటి నుండే ఈ గేమ్ షోలంటే చాలా ఆసక్తి ఉంది జనంలో. ఆ మధ్య వచ్చిన 'కో అంటే కోటి' కూడా ఇలాగే ఆదరణ పొంది మధ్యలోనే ఆగిపోయింది
ఇక ఈ మధ్య ఈ టీవీ లో సుమ చేస్తున్న "కాష్ దొరికినంత దోచుకో" ప్రోగ్రాం లో మామూలు మనుషులకు ప్రవేశం లేదు. కేవలం టీవీ,మూవీ సెలెబ్రిటీలకు మాత్రమే ఇందులో ప్రవేశం .. ఈ విషయం మాత్రం నాకు నచ్చలేదు. సుమ ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళని స్టూడియోకి పిలిపించి డాన్సులు వేయిస్తుంది కానీ లక్షలు మాత్రం సెలెబ్రిటీలకు మాత్రమె అంటే ఎలా?? ఇక ఈ కాష్ లో వస్తువులు కిందికి దొర్లుతుంటే అవి నిజంవా ఏంటి కొంప తీసి అని చూసేవాళ్ళు టెన్షన్ పడుతుంటారు.
ఇప్పుడు మా టీవీలో వస్తున్న "మీలో ఎవరు కోటీశ్వరుడు" గత సోమవారం మొదలుపెట్టి గురువారం దాకా ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేసిందని చెప్పొచ్చు .. కార్యక్రమం అంతా KBC లాగానే వున్నా తెలుగులో రావటం, హీరో నాగార్జున కార్యక్రమాన్ని నడిపించటం ఆసక్తిని కలిగిస్తుంది. 10 లక్షల మంది SMS లు పంపినా 1500 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయటం వాళ్ళలో నుండి కేవలం పదిమంది మాత్రమే హాట్ సీట్ కోసం పోటీ పడటం ఒక ఎత్తైతే హాట్ సీట్ దాకా వచ్చినా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో , ఎంత గెలుచుకుంటారో ఎవరూ ముందే చెప్పలేరేమో.
పోయినవారం వచ్చిన కంటెస్టెంట్స్ లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ,ఇంటర్మీడియేట్ అమ్మాయి, కాంపిటీటివ్ ఎక్జామ్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఒకరు,తండ్రి కోరిక మేరకు pg చదువుతున్న బామ్మగారు ఇలా విభిన్న రంగాల వ్యక్తులు ఉన్నారు. రోజూ చదువుతూనే వుంటారు కదా వీళ్ళు ఈజీగానే గెలుస్తారులే అనుకున్నవాళ్ళు కూడా తక్కువ డబ్బుతోనే వెళ్ళాల్సి వచ్చింది . ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది కోరిక డబ్బు గెలిస్తే సొంతిల్లు కట్టుకోవాలని.. నిజంగా సొంతిల్లు కావాలనే కల సామాన్యుల ఆశ మాత్రమే కాదు అవసరం కూడా ..
ఇంక ఇందులో అడిగే ప్రశ్నలు మనకి తెలియనివి వుంటే తెలుసుకోవచ్చు .ఇలా చూసి గుర్తుపెట్టుకున్నవి చాలా రోజులు గుర్తుంటాయి కాబట్టి ఏదైనా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు,ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకి ఉపయోగంగా ఉంటాయి ..కొన్ని ప్రశ్నలు చూస్తున్న మనకి ఈజీ అనిపిస్తాయి, అక్కడ కూర్చున్న వాళ్లు సమాధానం చెప్పలేరు. ఇది కూడా చెప్పలేరా అనుకుంటాం కానీ మనం ఆ ప్లేస్ లో ఉంటె అప్పుడు మనం కూడా అంతేనేమో అనిపిస్తుంది మళ్ళీ ..
కంటెస్టెంట్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారా, తప్పా అనేది నాగార్జున గారి ఫీలింగ్స్ ని బట్టి చెప్పొచ్చేమో అనిపిస్తుంది . ఎవరైనా తప్పు చెప్పగానే ముందు ఆయనే ఎక్కువ బాధగా ఫీల్ అవుతున్నారు .. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ టెన్షన్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు .. ఇప్పటిదాకా అమితాబ్ KBC షో చూడటం వలన కొన్ని చోట్ల ఆయనలా నాగార్జున చేస్తున్నట్లు అనిపించినా, తనదైన స్టయిల్ లో నాగార్జున హుందాగా, సరదాగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు .. ఇక క్విజ్ షో పూర్తిగా అయిపోయేలోపు నాగార్జున గారికి అభిమానంతో ఎన్ని కానుకలు వస్తాయో మరి :) వచ్చిన వాళ్ళు కొందరు నాగార్జున గారిని తెగ పొగిడి ఇబ్బంది పెట్టేస్తున్నారు .. నేను జీవితంలో చూసిన మొదటి సినిమా మీదే అన్నారు ఒకరు .. నిజమేనంటారా ??
మొత్తానికి డబ్బింగ్ సీరియల్స్ చూసి బుర్ర చెడగొట్టుకునే బదులు వారంలో నాలుగు రోజులు "మీలో ఎవరు కోటీశ్వరుడు" చూసి బుర్ర పెంచుకోవచ్చు .. డబ్బు గెలుస్తున్న వాళ్ళను చూసి ఉడుక్కోకుండా మనం కూడా అక్కడికి ఎలా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ, అలాగే నాగార్జున గారికి మంచి గిఫ్ట్ కూడా ఆలోచించి ఉంచుకోవచ్చు. అందరూ ఇస్తున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా మరి :). ఈ షోలో అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా రేమో .. అలా కోరుకోవటం తప్పు కూడా కాదు అని నా అభిప్రాయం..
ఈ కార్యక్రమం హోస్ట్ చేస్తున్న నాగార్జున గారికి,సోమవారం ఆడబోతున్న విజయవాడ బామ్మగారికి, ఈ షో లో పాల్గొనటానికి ప్రయత్నిస్తున్న అందరికి అభినందనలు ...