పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, సెప్టెంబర్ 2014, సోమవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 5
ఎందుకో మొదటినుండి ఆడపిల్లల్ని కనీసం పలకరించటాని కూడా సంకోచిస్తాను . 6 నుండి 10 వ క్లాస్ దాకా ఆడపిల్లల్తోతే ఎప్పుడూ నాకు చదువులో  పోటీ.. ఒకసారి నేను క్లాస్ ఫస్ట్ వస్తే పంతం పట్టి మరీ అమ్మాయిలు నెక్స్ట్ ఎక్జామ్స్ లో ఫస్ట్ వచ్చేవాళ్ళు . ఇంక ఇంటర్లో  బాయ్స్ కాలేజ్ కావటం తో  అమ్మాయిలు,పరిచయాలు ఉండవు.ఆ అలవాటే మెడికల్ కాలేజ్ లో కూడా వచ్చింది . అందుకే 1 st year అంతా  అయిపోయినా మా క్లాస్ లో అమ్మాయిలెవరో తెలియలేదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా అనిపించలేదు .

పైగా అప్పటికే నా కన్నా పెద్ద వాళ్లైన అన్న,అక్క వాళ్ళ కాలేజ్ లో ఆడపిల్లలు,మగపిల్లల పరిచయాల గురించి తప్పుగా కామెంట్స్ చేయటం, ఇంట్లో ఆ విషయాలు చెప్పగానే మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ  పుట్టు పూర్వోత్తరాలు ఎత్తి మరీ వాళ్ళ పెంపకాలు అలాంటివి మీరు అలాంటి పనులు చేయకండి అంటూ ఇచ్చే వార్నింగులు అమ్మాయిలతో అబ్బాయిలు,అబ్బాయిలతో అమ్మాయిలూ మాట్లాడకూడదు,అది తప్పు అన్న భావాన్ని నాలో పెంచాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి ..

కావ్యతో నా పరిచయం అనుకోకుండా జరిగినా ..  ఒక మంచి వ్యక్తిని కలిసిన భావం కలిగింది . కావ్య ఫ్రెండ్స్ నలుగురు, అందర్లో కావ్య ఎందుకో ప్రత్యేకంగా అనిపించేది.ఎక్కువగా మాట్లాడదు,ఎవరినీ అనవసరంగా కామెంట్స్ చేయదు, క్రిటిసైజ్ చేయదు , చక్కగా చదువుతుంది ..  పిడియాట్రిషియన్ అవ్వాలని తన కోరిక...  తనకి తన కుటుంబం అంటే చాలా ఇష్టం, ఎవరన్నా తప్పుగా మాట్లాడినా తప్పుని ఖండించటానికి వెనుకాడదు .అది వాళ్ళ కజిన్  సంపత్ అయినా సరే.. ! మా రూమ్ లో కావ్యని హేమంత్  పరిచయం చేసినప్పటి నుండి కాలేజ్ లో కూడా అప్పుడప్పుడు లంచ్ బ్రేక్ లో , లైబ్రరీలో,  ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కావ్య కనిపిస్తూనే వుండేది .

మాకు  అనాటమీ డిసెక్షన్  రోజున ఒక పక్క డిసెక్షన్ జరుగుతుండగానే లంచ్ టైమ్ అయ్యేది. డిసెక్షన్ చేసిన రోజున వెంటనే అన్నం తినాలంటే మాకు ప్రాణం పోయినట్లయ్యేది .. కాలేజ్ లో హాండ్స్ వాష్ చేసుకోవటానికి ఇచ్చే సబ్బులతో ఎంత శుభ్రం చేసుకున్నా చేతులు శుభ్రం చేసుకున్నట్లు అనిపించేవి కాదు..కానీ తప్పదు లంచ్ తర్వాత వెంటనే మళ్ళీ క్లాస్ లు ఉండటంతో వెంటనే లంచ్ చెసేయాలి.. ఒక్కోసారి డిసెక్షన్ లోవి ఏవేవో గుర్తొచ్చి అన్నం తినాలనిపించేది కాదు ..

ఒకసారి ఇలాగే అనాటమీ అయ్యాక నాకెందుకో చాలా చిరాకుగా అనిపించి లంచ్ చెయ్యకుండానే వెళ్లి లాన్ లో కూర్చున్నాను.. ఫ్రెండ్ తో అటు వెళ్తున్న కావ్య నన్ను చూసి వెనక్కి వచ్చింది . లంచ్ చెయ్యలేదా అని అడిగి,నేను చెప్పకముందే ఓహో నాకు అర్ధం అయ్యింది మాధవ్ నీ పరిస్థితి అంటూ తన బాగ్ లో వున్న చిన్ని హాండ్ వాష్ పేపర్ సోప్ తీసి ఇప్పటి నుంచి ఇవి ట్రై చేసి చూడు అంటూ ఇచ్చింది . అక్కడే ఉన్న పంపు  కింద చేతులు కడుక్కుని రాగానే నిజంగా చాలా మంచి వాసనతో , ఫ్రెష్ గా అనిపించింది...మనం చెప్పకుండానే మన అవసరాలు,ఇబ్బందులు తెలుసుకునే వాళ్ళుండటం నిజంగా అదృష్టం కదా అనిపిస్తుంది అవి ఎంత చిన్న అవసరమైనా సరే ..

 కావ్య  అచ్చ తెలుగు అమ్మాయిలాగా అనిపించేది. "అచ్చ తెలుగు అమ్మాయి"  అంటే మరీ లంగా వోణీ  వేసుకుని, నడుము దాకా వచ్చే జడలో ముద్దబంతి పూలు పెట్టుకుని, ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మ పాటలు పాడేంత తెలుగు అమ్మాయిలాగా కాకపోయినా చక్కగా మంచి లేత రంగు కాటన్ పంజాబీ డ్రెస్ లలో , మెడ దాకా వచ్చే జట్టుని కొన్నిసార్లు అలా వదిలేసి, కొన్ని సార్లు పోనీ వేసుకుని, నడిస్తే తన కాళ్ళ కింద చీమలు ఎక్కడ చస్తాయో అన్నంత నిదానంగా,పద్దతిగా నడుస్తూ ... " ఏ కవులు రాయని కావ్యం..  ఏ శిల్పి చెక్కని శిల్పం "  ఇదే ఎప్పుడు కావ్యని చూసినా నాకు కలిగే భావం .

కొత్త వాళ్ళతో మాట్లాడటానికే ఆలోచించే నేను కావ్య తో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూసేవాడ్ని .. నా మనసు తెలుసుకున్నట్లు కావ్య కూడా రోజులో ఒక్కసారన్నా నాతో  తప్పకుండా మాట్లాడేది.. జీవితంలో చాలా విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి.. అలా కావ్యతో నా పరిచయం స్నేహంగా ఎప్పుడు మారిందో కూడా నాకు గుర్తు లేదు .. ఏంటి మాధవ్  సంగతి కొత్త ఫ్రెండ్స్ అయినట్లున్నారు అంటూ రఫీ ఒకరోజు ప్రత్యేకంగా నన్ను అడిగేదాకా ..  కొన్ని సంగతులు మన గురించి మనకి తెలియక ముందే పక్క వాళ్ళకే బాగా తెలుస్తాయనుకుంటాను ..

25, సెప్టెంబర్ 2014, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 4
మొదటి సంవత్సరం అయిపోయింది అందరం మంచి మార్క్స్ తో పాసయ్యాము .. నేను రఫీ హాస్టల్ లో ఒకే రూం లోకి మారాము. కొన్నిసార్లు  నన్ను పిలవకుండానే రఫీ,సాహిల్ ఎక్కడికో వెళ్ళేవాళ్ళు ..వీకెండ్స్ లో, ఎప్పుడన్నా హాఫ్ డే ఖాళీ దొరికినప్పుడు సినిమాలకి, చుట్టుపక్కల ప్రాంతాలు చూడటానికి వెళ్ళేవాళ్ళం . నేను మాత్రం మా నానమ్మ తరుపు బంధువులు ఉండేది కూడా ఆ ఊళ్లోనే కావటంతో ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళే వాడిని.. ఒకసారి రఫీ,సోహిల్  బయటికి వెళ్తూ నన్ను కూడా తనతో రమ్మని పిలిచారు ..

ఫ్రెండ్ రూం కి తీసుకెళ్ళారు .అక్కడ పరిచయమయ్యాడు హేమంత్...  హేమంత్ అమ్మ,నాన్న ఇద్దరు డాక్టర్లే .. హాస్టల్ ఫుడ్,వాతావరణం నచ్చలేదని హేమంత్,  మరో ముగ్గురు మా క్లాస్మేట్స్ కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నారు.  కొన్నాళ్ళుగా రూమ్మేట్స్ కి తనకి పడటం లేదని, ప్రస్తుతం ఆ  రూమ్ లో వుండే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి, రఫీని,సోహిల్ ని మీరు రావచ్చు కదా మా రూమ్ కి..   అని అడిగాడు .. దానికి రఫీ సరే మరి అంటూ నన్ను అడిగాడు నీ సంగతేంటి వస్తావా? అంటూనే  "వస్తావా కాదు రా"  అంటున్నాను .. సంవత్సరం నుండి ఇద్దరం కలిసి ఉంటున్నాము .. ఇప్పుడు ఇక్కడికి కూడా కలిసే మారదాం. ఇక్కడైతే హాస్టల్ లాగా  ఫుడ్ సమస్య, వాటర్ సమస్య , ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు ఉండవు కదా అని, నా అభిప్రాయం అడిగాడు.నేను నాన్నని అడిగి చెప్తానని చెప్పాను ..

నాలో ఆలోచన మొదలయ్యింది ఇప్పుడేమి చెయ్యాలి .. రూం అంటే నాన్న ఏమంటారో ? ఇటు రూమ్ కి మారను అంటే ఫ్రెండ్ దూరమవుతారు .. అసలే ఒంటరిగా ఉండే అలవాటు లేదు, అలాగని కొత్తవాళ్ళతో తొందరగా పరిచయాలు పెంచుకోలేను.. ఇటు చూస్తే రఫీ, సోహిల్ ఇద్దరూ హాస్టల్ ఖాళీ చేయటానికి డిసైడ్ అయినట్లే ఉన్నారు . సరేనని టెలిఫోన్ బూత్  కి వెళ్లి ఇంటికి ఫోన్ చేశాను.. అమ్మ ఫోన్ తీసింది . మాధవ్ ఎలా ఉన్నావు , వేళకి తింటున్నావా.. ఈ ఆదివారం రాకపోయావా ఇంటికి అంటూ తనదైన శైలిలో పక్కన వాళ్లకి కూడా వినపడనంత నిదానంగా మాట్లాడి , నాన్న గురించి అడగ్గానే నాన్న హెల్త్ సెంటర్ కే  వెళ్ళారు మరి.. ఏమన్నా చెప్పాలా అని అడిగింది .

ఏమీ లేదమ్మా సరే నేను ఇంటికి వచ్చి మాట్లాడతానులే నాన్నతో అంటుండగానే ఎవరూ .. అంటూ నాన్నమ్మ వచ్చి అమ్మ దగ్గర ఫోన్ లాక్కుని నువ్వెందుకు నాయనా రావటం. మీ నాయనే రేపు నీ దగ్గరికి వస్తాడంట . ఉదయం చెప్పాడు నాతో.. మీ నాయన రాంగానే నేను చెప్తాలే నువ్వు పోన్ చేశావని.. సరే ఉంటా అంటూ ఫోన్ కట్ చేసింది . నాన్న నా దగ్గరికి వస్తానన్న విషయం అమ్మకి తెలియదనమాట పాపం అందుకే నన్ను రమ్మంది . ఇదే కాదు అమ్మకి చాలా విషయాలు తెలియవు ఇంట్లో అన్ని విషయాలు చర్చించి, నిర్ణయాలు చేసేది నాన్నమ్మ,నాన్నలే .. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ ఫీల్ అవుతుంటుంది. కానీ ఎప్పుడు బయటపడదు. సరే ఇంకేం చేస్తాం నాన్న ఎలాగు రేపు వస్తాడు కదా. అప్పుడు డైరెక్ట్ గానే అడగొచ్చులే అనుకున్నాను .

రెండో  రోజు ఉదయాన్నే నాన్న వచ్చారు.. నాన ఎప్పుడూ ఒక డాక్టర్ లాగా మెయింటెన్ చెయ్యరు. నాన్నతో పాటూ అందరు కార్లు కొంటే నాన్న మాత్రం ఇప్పటికి మోపెడ్ మీదే హాస్పిటల్ కి వెళ్తాడు .ఊర్ల ప్రయాణం బస్సులు, రైళ్ల లోనే  చేస్తాడు..కనీసం బయట ఏమీ తినడు ,తాగడు మేము పిల్లలం ఎప్పుడన్నా ఎందుకు నానా  అందరిలాగా మనం ఉండొచ్చుగా అంటే సమాధానం మా నానమ్మ చెప్తుంది .. ""ఇప్పడు ఇలా  కూడబెట్టి బ్రతికితేనే మేము ముసలితనంలో రాజాల్లాగా ప్రశాంతంగా  బతకొచ్చు మీ మీద ఎవరిమీదా ఆధారపడకుండా"". ఎంత ముందుచూపు, నమ్మకమో మా నాన్నకి,నాయనమ్మకి  "ఇప్పుడు వాళ్ళు తినీ తినకుండా దాచినదంతా భవిష్యత్తులో వాళ్ళే తింటారని"..!

ఉదయాన్నే నాన్న వచ్చాడు.  నేను చెప్పిన రూమ్ విషయం విని , హాస్టల్ కి, రూమ్ కి డబ్బు ఖర్చు విషయం లెక్కలు వేసి, రూమ్ చూసి నా  ఫ్రెండ్స్ తో మాట్లాడి సరే మరి నీ ఇష్టం, ఎక్కడున్నా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. నీకు ఇక్కడ బాగానే ఉంటుందనుకుంటే హాస్టల్ మారు  అని చెప్పి అవసరమైన డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఒక పెద్ద భారం దిగింది . అప్పటికే సిద్ధంగా ఉన్న రఫీ,సోహిల్ తో కలిసి హాస్టల్  నుండి రూమ్ కి మారింది జీవితం .నిజంగా హాస్టల్ కంటే ఇక్కడే బాగుంది నీట్  గా ఉన్న గదులు,వంటమనిషి. చేసే వంట. 
మొత్తానికి హాస్టల్  హింస తప్పింది .. రఫీ మాట విని మంచిపని చేశాలే అనిపించింది.

 ఒక రోజు కాలేజ్ నుండి రూం కి వచ్చేసరికి అంతా సందడిగా ఉంది . లోపల ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. వాకిట్లో ఆడవాళ్ళ చెప్పులు కనపడ్డాయి .. అసలే కొత్తవాళ్లని చూస్తె నాకు మొహమాటం. గబా గబా లోపలికి  వెళ్లి నా రూమ్ వైపు వెళ్తున్న నన్ను మాధవ్  ఇలా రా అని పిలిచాడు హేమంత్. తప్పక వెళ్ళిన నాకు వచ్చిన వాళ్ళు అతని పిన్ని,పిన్ని పిల్లలు ( చెల్లెళ్ళు) అని  పరిచయం చేశాడు..  వాళ్ళలో ఒకమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపించింది .. నేనలాగే చూస్తుంటే నా ప్రశ్నార్ధకం మొహం అర్ధం అయిందేమో మాధవ్  She Is My Cousin
"కావ్య " మన క్లాస్ మేట్ కూడా అని హేమంత్ అనగానే చిన్నగా నవ్వుతూ హాయ్ అంది కావ్య ..

నీ క్లాస్ మేట్  నీకు తెలియదా అని వాళ్ళ పిన్ని ఆశ్చర్యంగా అడిగింది .మాధవ్ మా నలుగురితో తప్ప క్లాస్ లో అబ్బాయిల్తోనే ఎక్కువగా కలవడు ఇంకా అమ్మాయిలతో పరిచయం ఎలా ఉంటుంది అంటూ అందరూ నవ్వేశారు .. కొత్తవాళ్ళతో మాట్లాడటానికి అంతగా ఇష్టపడని నాకు వాళ్ళతో మాట్లాడటం, రోజంతా వాళ్ళు అక్కడుండటం ఎందుకో ఇబ్బందిగా అనిపించలేదు ....  "అలా మొదలయ్యింది"  నా రెండో సంవత్సరం కాలేజ్ లైఫ్..
 

18, సెప్టెంబర్ 2014, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 3
ఆ రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ అంటే ఇప్పటిలా హోటల్స్ లో పెళ్ళిళ్ళకి  వేసినట్లు  సెట్టింగులు, భోజనాలు,డాన్సులు  ఉండేవి కాదు . సింపుల్ గా స్నాక్స్ , కూల్ డ్రింక్ ఇచ్చి అందరినీ  వాళ్ళ గురించి పరిచయాలు చేసుకొమ్మని చెప్పి , సీనియర్లు కూడా వాళ్ళ గురించి పరిచయాలు చేసుకున్నారు . చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళు,  ప్రిన్సిపాల్ , ఇంకా కొందరు  ప్రొఫెసర్లకి మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. మా కాలేజ్ లో చేరిన కొందరు  టాప్ రాంకర్స్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కాలేజ్ పేరుతో  పాటూ వైద్య వృత్తి యొక్క పవిత్రతని కాపాడాలని కోరారు..

ఇంక పరిచయాల కార్యక్రమం .. ఒక్కొక్కరు  స్టేజ్ మీదికి వచ్చి వాళ్ళ గురించి పరిచయాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో ఆకాంక్ష, ఆశయం, ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడి దాకా రావటానికి ఎలా ప్రయత్నించారు, ఇక  నుండి వాళ్ళ లక్ష్యం అందుకోవటానికి ఏమి చేయాలనుకుంటున్నారో నిర్దిష్టమైన ఆలోచనలను వ్యక్తం చేస్తూ కొందరు మాట్లాడితే మరికొంత మందికి  ఎన్నో చెప్పాలనున్నా కంగారు,కొంచెం Shyness , ఏమి మాట్లాడితే ఏమనుకుంటారో అన్న బెరుకుతో చెప్పలేక పోతున్నారు .. దానికి తోడు  సీనియర్స్ జోక్స్, కామెంట్స్ కూడా తోడయ్యాయి .

నా వరస వచ్చింది .. ఇప్పటివరకు కనీసం స్కూల్ టైం లో కూడా మా అక్కలు నా కంటే ధైర్యంగా అన్ని పోటీల్లో పాల్గొనే వాళ్ళు ,బహుమతులు కూడా తెచ్చుకునే వాళ్ళు కానీ నేను మాత్రం  ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో డ్రామా వేశాను కానీ అది కూడా అమ్మ స్వాతంత్ర్య వీరుల కధ చెప్తుంటే పడుకునే వింటూ   ఉండే మొద్దబ్బాయి పాత్ర ..నాకు మాట్లాడే అవకాశం,అవసరం  లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో  చిన్నక్క  టీచర్ కి ఇచ్చిన మాట కోసం ఏదో అప్పటికి అలా అయిందనిపించాను.  కానీ ఇప్పడు మాత్రం తప్పదు మాట్లాడటం ..

స్టేజ్ ఎక్కగానే నా గురించి,నా ఫ్యామిలీ గురించి క్లుప్తంగా చెప్పి నాకు ఇష్టమైన వివేకానంద భోధనలు గురించి, ఆయన నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి  అని, ఆయన చెప్పిన "బలమే జీవనము బలహీనతే మరణం" నాకు ఇష్టమైన సూక్తి , ప్రపంచమంతా సోదరభావంతో ఉండాలన్న ఆయన ఆకాంక్ష నన్ను ప్రభావితం చేసిందని, వివేకానందుడు చెప్పినట్లు తలచుకుంటే ఏదైనా సాధించగలవు అన్న నమ్మకమే ఈ రోజు నన్ను  MBBS స్టూడెంట్ ని చేసిందని, కాబట్టి నేను దేవుడి కంటే ఎక్కువగా ఇలాంటి మహానుభావుల్నే నమ్ముతానని చెప్పి వచ్చేశాను.. 

రఫీ నన్ను మెచ్చుకుని, భయపడుతూనే బాగా చెప్పావ్ ( నిజమే నాకు కూడా అనిపించింది పర్లేదు బాగానే మాట్లాడానే  అని )   పద మన క్లాస్ మేట్స్ లో కొందరిని  పరిచయం చేస్తాను అంటూ పక్కకి తీసుకెళ్ళాడు ... రఫీ ఎమ్ సెట్ కోచింగ్ ఫ్రెండ్ సోహిల్  , తమిళ్ నాడు నుండి వచ్చి నాతో పాటూ APRJC  లో ఇంటర్ క్లాస్మేట్  సుధాకర్ కలిశారు... ముగ్గురం ఒక బ్యాచ్ అయ్యాము .. ప్రస్తుతానికి అందరికి హాస్టల్ రూమ్స్ ఇచ్చేశారు  కాబట్టి ఇప్పుడు ముగ్గురం ఒకే రూమ్ లో ఉండటానికి వీలు లేదు . కొన్నాళ్ళ తర్వాత  ఎవరైనా ఒప్పుకుంటే  ఒక్క రూమ్ కే మారొచ్చులే అనుకున్నాము... ఈ లోకంలో స్నేహమే జీవితం,స్నేహమే శాశ్వతం కదా మరి ..  

అలా మా 5 సంవత్సరాల MBBS కాలేజ్ జీవితం మొదలయ్యింది.కొత్త సబ్జెక్ట్స్, విషయాలు,మనుషులు, మనస్తత్వాలు,హాస్టల్ పంచాయితీలు,రాగింగ్ చిరాకులు, అంతా  కొత్త కొత్తగా ఉంది. క్లాస్ రూమ్ లో పాఠాలతో పాటు, ప్రయోగాలు ఏదేదో నేర్చుకోవాలి చేసెయ్యాలి అన్న ఆత్రం , కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సార్లు విరక్తిని  కలిగించే కొన్ని ప్రయోగాలు ఇలా సాగిపోతుంది నా మొదటి సంవత్సరం ..

మన ముందు మంచిగా మాట్లాడి, మెచ్చుకునే వాళ్ళందరూ నిజంగా మంచి వాళ్ళు కాదని,, మనుషుల మాటల్లో, చేతల్లో కనపడని వెటకారం అడుగడుగునా దాగి ఉంటుందని తెలుసుకోలేక పోయాను. ప్రపంచమంతా సోదరభావంతో మెలగాలన్న వివేకానంద భావనలను నేను బాగానే ఒంట బట్టించుకున్నాను కానీ,ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు మనుషులు, పరిస్థితులు ఎలా ఉన్నాయి , ఇప్పుడు పరిస్థితులకి, మనుషులకి ఆ సూక్తులు సరిపడతాయా లేదా అన్న విషయం మాత్రం ఎక్కువ ఆలోచించలేకపోయాను.  ఆలోచించకుండా ఏ పని చేసినా దాని పర్యావసానాన్ని  అనుభవించక తప్పదు అని ఆలస్యంగా తెలుసుకున్నాను.
16, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 2
ఎక్కడికొచ్చానా అన్నదే అర్ధం కాక చస్తుంటే వెనక ఏముందో , ఏమి జరుగుతుందో తెలియలేదు.. ఇప్పుడేమి చేయాలో తెలియదు. సరే చూద్దాం అనుకుని,బలంగా మూసుకున్న కళ్ళు తెరిచి చూసిన నాకు అస్పష్టంగా కనపడ్డ ఆకారాలు మరింత భయాన్ని పెంచాయి. రకరకాల మానవ శరీరాలు బల్లల మీద, కొన్ని వేలాడుతూ, కొన్ని సవ్యంగా,పూర్తిగా శరీరభాగాలు లేని వింత వింత ఆకారాల్లో  భయం గొలిపేలా నన్నే చూస్తున్నట్లు అనిపించేలా ఉన్నాయి. అప్పుడర్ధమయ్యింది నాకు ఎక్కడికి వచ్చానో ..

అది డిసెక్షన్ లాబ్ ... వివిధ రకాల ప్రయోగాల  ( ఎనాటమీ డిసెక్షన్ కోసం ఉపయోగించే బాడీలున్న ప్రదేశం.నాకు దారి చెప్పిన వ్యక్తి   కావాలనే నన్ను ఇక్కడికి పంపాడని  అర్ధం అయ్యింది . ఇంతలో  అరేయ్ మాధవ్ నేనురా రఫీని నన్ను గుర్తుపట్టలేదా అంటూ వెనకనుండి నన్ను పట్టుకున్న ఆకారం ముందుకు వస్తూ కనపడింది . సరిగ్గా చూసిన నాకు అప్పుడు అర్ధం అయ్యింది ఆ ఆకారం రఫీ అని నాకు APRJC  ఇంటర్ లో సీనియర్ ...   

ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది .. నా బొంద నువ్వేమన్నా సవ్యంగా తగలడ్డావా  నేను గుర్తు పట్టటానికి అని మనసులో అనుకుని బయటికి మాత్రం  ఏమీ అనలేక రఫీ నువ్వా . Happy To  See You Here .. ( నిజంగానే ఇలాంటి పరిస్థితిలో నాకు తెలిసిన మనిషి  కనపడటం సంతోషంగానే ఉంది ) ఇంటర్ అయ్యాక నీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఇప్పుడు MBBS సెకండ్ ఇయరా,ఇక్కడే జాయినయ్యావా  ప్రశ్నల వర్షం కురిపించాను.

నన్ను ఆపుతూ ఏరా మాధవ్ ఇవన్నీ ఇక్కడే మాట్లాడాలా .. అయినా అప్పుడే ఇక్కడికి వచ్చావేంట్రా మొదటిరోజే అన్నీ నేర్చుకోవాలని అంత  తొందరా?  అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు .. నేను కూడా పరుగులాంటి నడకతో రఫీని అనుసరించి ఇద్దరం బయటికి వచ్చేశాం.. నువ్వు ఇటు రావటం చూసి వెనకే వచ్చాను ఇప్పుడు చెప్పు ఇక్కడున్నావేంటి  అనగానే జరిగింది చెప్పిన నన్ను చూసి పగలబడి నవ్వి, అయితే సీనియర్ చేతిలో రాగింగ్ కాబడ్డ  మొదటి స్టూడెంట్ అన్నమాట మన బ్యాచ్ లో అన్నాడు.. 

మన బ్యాచా   ..! అదేంటి రఫీ నువ్వు ఇప్పుడు 1 st ఇయరా అన్నాను . అవున్రా నువ్వు ఒక  లాంగ్  టర్మ్  అయితే నేను రెండు లాంగ్ టర్ముల్లే  మొత్తానికి మళ్ళీ కలిశాం .. పద క్లాస్ కి వెళదాం అంటూ ఇద్దరం క్లాస్ కి వెళ్ళే సరికి అమ్మాయిలంతా ఒకవైపు,అబ్బాయిలు ఒక వైపు క్లాస్ లో నిండుగా కూర్చుని వున్నారు.అప్పటికే ప్రిన్సిపాల్ welcome speech మొదలుపెట్టారు ..

డియర్ స్టూడెంట్స్  ఫ్రెషర్స్ గా ఇప్పుడు మీ మనసుల్లో రకరకాల భావాలుంటాయి. సంతోషం,ఆశ్చర్యం,ఉద్వేగం, ఏవో గొప్ప ఆశలు,మరో వైపు ఏవో అనుమానాలు, భయాలు,సందేహాలు,అనిశ్చితి ఇలా అటు ఇటు కాని డోలాయమాన పరిస్థితిలో ఉంటారు.ఇవన్నీ నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఇలాంటి పరిస్థితి దాటే  వచ్చాను కదా..ఇప్పుడు మీరందరూ  నాకు కొత్త మొహాలు .. మీలో మీరు కూడా  ఒకరికొకరు  కొత్త మొహాలే కానీ కొన్నాళ్ళ తర్వాత అందరం పరిచయస్తులం, ఫ్రెండ్స్ కూడా అవుతాం .. ఇప్పుడున్న భయాలు అప్పుడుండవు.మీరే మరొకరికి
మార్గదర్శకులవుతారు..(నిజమే ఇక్కడ మంచి మార్గదర్శకులే ఉన్నారు అనుకున్నాను మనసులో )

ఈ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకుని మంచి పని చేశారు  ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి డాక్టర్లుగా సర్వీస్ చేస్తున్నారు ( ఈ మాట మాత్రం నిజమే మా నాన్న ఇందుకు ఉదాహరణ ) సో స్టూడెంట్స్ అందరూ మంచి ఫ్రెండ్స్ గా , ప్రొఫెసర్లని గౌరవిస్తూ .. నేడు  ఇక్కడ విద్యార్ధులుగా నేర్చుకోవటానికి వచ్చిన మీరు భవిష్యత్తులో మంచి డాక్టర్స్ గా సేవ చేయటానికి ప్రజల్లోకి వెళ్తారని, మన కాలేజ్ పేరు ప్రతిష్టలు నిలబెడతారని ఆశిస్తున్నాను .. All  The Best అంటూ స్పీచ్ ముగించారు.. "ఒక నోటీస్" .. రేపు సీనియర్స్ మీకు వెల్కమ్ చెప్తామంటున్నారు (ఫ్రెషర్స్ డే పార్టీ)  అందరు అక్కడ తప్పకుండా కలుసుకోండి  Have A Good Day అని చెప్పి ప్రిన్సిపాల్ వెళ్ళిపోయారు..

అందరం బయటికి వచ్చాం నాకు ఇందాకటి సంఘటన గుర్తొచ్చింది. మొదటిరోజే ఇలా జరగటం ఎందుకో మనసుకు బాధగా,  కొంచెం చిరాకుగా  అనిపించింది ...


13, సెప్టెంబర్ 2014, శనివారం

నాలో నేనేనా ?? -- ఒక(రి) కధ - 1

సంతోషం,భయం,కంగారు,ఆత్రుత ఇలా అన్నీ కలిసి మనసు ఏదో ఏదో గందరగోళంగా ఉంది ... ఈ రోజు కాలేజ్ లో మొదటిరోజు .. సంవత్సర కాలంగా నేను ఎదురుచూసిన రోజు. ఎమ్ సెట్ మొదటి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదని నాన్న డొనేషన్ తో  చదివిస్తానన్నా..  ఇప్పటికే ఇద్దరు అక్కల్ని,అన్నని డొనేషన్ కట్టి  కర్ణాటకలో చదివించిన నానకి మళ్ళీ నా వల్ల  కష్టం కాకూడదని లాంగ్ టర్మ్  కోచింగ్ తీసుకుని మరీ ఎమ్ సెట్ లో 500 ర్యాంకు తెచ్చుకుని డాక్టర్ అవ్వాలన్న నా కోరిక తీర్చుకునే అవకాశం తెచ్చుకున్నాను. 

ఇక్కడ నేను గర్వంగా ఫీలయ్యే ఇంకొక విషయం ఇదే కాలేజ్ లో మా నాన్న గారు మెడిసిన్ చదివారు .. అందుకే నాన్నని డాక్టర్ని చేసిన ఈ కాలేజ్ నే నేను కౌన్సిలింగ్ లో సెలెక్ట్ చేసుకున్నాను .నానమ్మకి,నానకి నమస్కారం చేసి,అమ్మకి బాయ్ చెప్పి కాలేజ్ కి బయల్దేరాను . కాలేజ్ దగ్గరవుతున్న కొద్దీ ఏవో  తెలియని ఫీలింగ్స్ .."ఎన్నాళ్ళొ వేచిన ఉదయం పాట" కూడా గుర్తొచ్చింది విశాలమైన ఆవరణ, సమున్నతమైన కట్టడాలతో  స్వాగతం పలికింది మా కాలేజ్ . అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన  నాన నన్ను  లోపలికి  వెళ్ళమన్నాడు..

నాతో  పాటూ కొత్తగా చేరిన  స్టూడెంట్స్ అందరూ ఎవరి కంగారులో వాళ్ళున్నారు . వాళ్ళలో ఇంతకుముందు ఇంటర్లో,   స్కూల్ టైం లో ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ కనపడగానే  పోగొట్టుకున్న వస్తువేదో  దొరికినంత సంబరపడిపోతూ ఉద్వేగంగా, సంతోషంగా పలకరించుకుంటున్నారు .. అంతే  కదా  ఎంతైనా కొత్త ప్లేస్ లో మనకి తెలిసిన వాళ్ళు కనపడితే ఆ సంతోషమే వేరు .. 

నాకు ఎవరు ఫ్రెండ్స్ అవుతారో,నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేరా అని  నేను ఆలోచిస్తూ ఉండగానే అందరూ  క్లాస్ రూం కి వెళ్లాలని కబురొచ్చింది . క్లాస్ రూం కి వెళ్లేముందు నానకి చెప్పి వెళ్లాలని బయటికి వచ్చి నాన కోసం చూస్తే  కనపడలేదు . సరేననుకుని క్లాస్ కి వెళ్దామని లోపలి వచ్చేసరికి అందరూ వెళ్లి పోయారు .. ఎటువైపు వెళ్ళాలో తెలియక అక్కడే ఉన్న ఒకతన్ని  అడిగాను క్లాస్ రూం ఎక్కడ అని..  అతను చాలా హడావుడిలో ఉండి  కూడా పాపం నాతో  పాటూ వచ్చి కొంచెం ముందుకు వెళితే 1st  ఇయర్ క్లాస్ రూం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు .

నేను తనకి థాంక్స్ చెప్పి అతను చూపించిన వైపు వెళ్లాను .చుట్టూ పచ్చని చెట్లు,వాటి మధ్యలో శుభ్రమైన దారులతో క్యాంపస్ వాతావరణం మనసుకు హాయి కలిగించేలా ఉంది. కాస్త దూరం వెళ్ళగానే రూమ్ కనిపించింది. కొంచెం బెరుకు బెరుకు గానే లోపలి అడుగు పెట్టాను.. అంతా  నిశబ్దంగా ఉంది అసలు నేను ఎక్కడికి వచ్చానో తెలియలేదు. లోపల  ఇంకా ఏదో రూం వున్నట్లు, మాటలు వినిపించినట్లు అనిపించి అటువైపు వెళ్లాను ..

అంతే  అక్కడ దృశ్యం చూసి అలా నిలబడిపోయాను.హార్ట్ బీట్ పెరిగింది .. గుండాగినంత పనయ్యింది. అప్పటిదాకా పై ప్రాణాలు పైనే పోవటం అంటే వినటమే కానీ తొలిసారిగా ఆ ఫీలింగ్ ఎలా వుంటుందో అనుభవంలోకి వచ్చింది ... ఇంతలో వెనకనుండి ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నారు ... అంతే "లావొక్కింతయు లేదు" అని చిన్నప్పుడు నానమ్మ నేర్పిన పద్యం ఠక్కున గుర్తొచ్చింది....   హమ్మో ... !


Related Posts Plugin for WordPress, Blogger...