పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, నవంబర్ 2015, ఆదివారం

Digital India - అందరికీ సోషల్ మీడియా ( * ఫేస్ బుక్ )




సోషల్ మీడియా.. ఓ సంచలనం.ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసి,సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన మాధ్యమం.ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా రోజువారి జీవితంలో కీలక సాధనం.సమాచార మార్పిడితో  మొదలై భావ ప్రకటన స్వేచ్ఛకు ఆయుధంగా మారుతోంది.ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే చాలా ఖర్చుతో, జ్ఞానంతో కూడిన పని. జి మెయిల్ కానీ, అప్పట్లో కొత్తగా వచ్చిన ఆర్కుట్ లో అకౌంట్ కానీ ఉండాలంటే ఇంట్లో సొంత కంప్యూటర్, నెట్ కనెక్షన్ ఉండాలి లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు.. చేతిలో వెయ్యిరూపాయల చైనా ఫోన్,పది రూపాయల నెట్ కార్డ్ ఉంటే చాలు ఎవరైనా నెట్ వినియోగదారుడు కావచ్చు.అమెరికాలో కన్నా భారతదేశంలోనే ఇంటర్నెట్ ఉపయోగించే వారు ఎక్కువగా వుంటున్నారట..

అందరికీ అనుకూలంగా, సులభంగా అందుబాటులో ఉండే సోషల్ మీడియాల్లో  ముఖ్యంగా ఫేస్ బుక్ ఒకటని చెప్పొచ్చు.ఈ ఫేస్ బుక్ వాడటానికి పెద్దగా సొంత తెలివి తేటలు కూడా అవసరం లేదు.ఎవరో ఒక మహానుభావుడో, మహానుభావురాలో చెప్పిన  సూక్తులు,నీతులు కాపీ కొట్టి కొటేషన్స్ తయారుచేస్తారు.వాటిని తెచ్చి మన ఫేస్ బుక్ గోడమీద పిడకల్లా అతికిస్తే చాలు.ఆ సూక్తులు,నీతులు మనం పాటిస్తామా లేదా అని ఎవరు చూడొచ్చారు?మనకెలాగూ మన  అభిప్రాయాలను స్వేఛ్చగా ప్రకటించే హక్కు ఉంది కాబట్టి ఎవరి గురించైనా ఏమైనా మాట్లాడొచ్చు,మన ఇష్టమొచ్చినట్లుగా వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవచ్చు.

ఫేస్ బుక్ పరిచయాలు,ఫ్రెండ్ షిప్పుల కోసమేమో కానీ మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలని దెబ్బతీయటానికి కూడా కారణమవుతుంది.ఈ మధ్య సంసారంలో గొడవలతో కౌన్సిలింగ్ కి వస్తున్న జంటల్లో  గొడవలకి ఒక కారణం ఫేస్ బుక్ కూడానట.నా భర్తకి ఫేస్ బుక్ లో ఆడఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఈయన గారిని మెచ్చుకుంటూ కామెంట్లు ,లైకులు అవి చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది అని భార్య అంటే, నన్నంటున్నావు,నీ ఫేస్ బుక్ లో మాత్రం మగ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళు నిన్ను మెచ్చుకుంటూ కామెంట్స్ ఇవ్వట్లేదా.. నీ మగ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో నాకు కనపడకుండా హైడ్ కూడా చేశావు కదా .. ఏ తప్పు చేయకపోతే అంత  రహస్యం ఎందుకు? అని భర్త వాదన.లైకులు ,కామెంట్లు చేసిన భర్త ఆడఫ్రెండ్స్,భార్య మగ ఫ్రెండ్స్ తో అక్రమసంబంధాలు కూడా ఉన్నాయంటూ వీధులకి, కోర్టులకి ఎక్కుతున్న జంటలు కూడా ప్రస్తుతం కనపడుతున్నారు.ఇది కూడా సోషల్ మీడియా ప్రభావమేననీ,ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా సంసారం చేసుకుంటున్న జంటలు ఈ ఫేస్ బుక్,వాట్స్ యాప్ లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిదని,ఫేస్ బుక్ అకౌంట్ ఏమీ ఆధార కార్డు కాదు కదా అది లేకపోతె రోజెలా గడుస్తుంది అని భయపడటానికి అని మానసిక విశ్లేషకులు,ఫ్యామిలీ కౌన్సెలర్ల అభిప్రాయం.

ఫేస్ బుక్ మరొక ఉపయోగం శత్రువులని ఫాలో అవ్వటం.. ఇంతకుముందు రోజుల్లో మన శత్రువులు ఏమి చేస్తున్నారో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది.వాళ్ళ ఇంటిదగ్గరలోనే వాళ్ళంటే పడని వాళ్ళని  గూఢచారులుగా పెట్టుకుని రహస్యాలు తెలుసుకోవాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు ఒక్క ఫేస్ బుక్ అకౌంట్ ఉంటే చాలు ఈ మధ్య ఎలాగూ ప్రతి ఒక్కళ్ళు నిద్రలేచిన దగ్గరి నుండి పడుకునేదాకా ఎక్కడికి వెళ్తున్నారు,ఏమి తింటున్నారు లాంటి విషయాలు చెప్పకపోతే పాపం అన్నట్లు పోస్ట్ చేస్తారు కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు...విడిపోయిన భార్యాభర్తలు,స్నేహితులు ఒకరినొకరు సాధించుకోవటానికి కూడా ఫేస్ బుక్ ఉపయోగిస్తున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయట.నీ నుండి విడిపోయాక నేను ఏడుస్తున్నానుకున్నావా?? అప్పటికన్నా ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నానో..!  ఎంత ఉల్లాసంగా ఉన్నానో.. ! అంటూ లేనిపోని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఎదుటివాళ్ళని టీజ్ చేస్తున్నారట.అలాంటి మాజీలని బ్లాక్  చేసేస్తే ప్రశాంతంగా ఉండొచ్చని మానసిక వైద్యుల సలహా.. 

చిన్నప్పుడు వక్తృత్వ పోటీల్లో టీవీ వలన లాభాలు,నష్టాలు లాగా ఈ సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్ బుక్ వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయన్నది ఈమధ్య జరుగుతున్న కొన్నివిషయాలు చూస్తే అర్ధమవుతుంది.మనకి తెలిసేవి కొన్నే తెలియకుండా ఇంకా ఏమేమి ఘోరాలు,నేరాలు జరుగున్నాయో ఏమో?? ముక్కు మొహం తెలియని అపరిచితులతో పరిచయాలు,సంబంధాలు పెట్టుకోవటం,వాళ్ళ వలన మోసపోవటం,నష్టపోవటం లాంటి సైబర్ క్రైమ్ శాతం పెరిగిందనేది కూడా కాదనలేని నిజం.ప్రపంచంలో దేన్నైనా మంచికి చెడుకి రెండిటికీ ఉపయోగించొచ్చు.ఎవరు ఏమి చేయాలి,ఎంతవరకు అవసరం  అనేది వారి వారి విజ్ఞతకే తెలుసు కాబట్టి.. అతిసర్వత్ర వర్జయేత్‌ అనే అక్షరసత్యమైన సూక్తిని పాటిస్తే అందరికీ మంచిది.ఈమధ్య కొందరి ఫేస్ బుక్ లు చూస్తుంటే ఫేస్ బుక్ లో ఏమి పోస్ట్ చేయలన్నా,మనల్ని కూడా ఇలాగే అనుకుంటారేమో కదా అని విరక్తి కలుగుతుంది.











Related Posts Plugin for WordPress, Blogger...