పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, మార్చి 2015, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 19
అన్నయ్య  నిశ్చితార్దానికి వెళ్ళటానికి రెడీ అవుతున్న నన్ను హేమంత్ వచ్చి మాధవ్ రేపు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది కదా రేపు మధ్యానం నుండి వెళ్ళినా రాత్రికల్లా హైదరాబాద్ వెళ్ళిపోతావు.ఎల్లుండి ఉదయం కదా నిశ్చితార్ధం పైగా అక్కడ నువ్వు లేందే పూర్తి కాని పనులేమీ లేవు కదా అన్నాడు. అంటే ఏంటి వీడి ఎగతాళి నాతో? మా వాళ్లకి నా అవసరమేమీ లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు ..అందుకే ఇంటి విషయాలు ఎవరి దగ్గరా మాట్లాడకూడదు. సరేలే ఎలాగు రేపు క్లాస్ ముఖ్యమైనదే కాబట్టి క్లాస్ కి వెళ్లి,అలాగే కావ్యకి కూడా ఒక మాట చెప్పి, మధ్యానం నుండి వెళ్దాం అనుకున్నాను నేను కూడా ..రెండో రోజు ఉదయమే కాలేజ్ కి వెళ్లి,కావ్యకి విషయం చెప్పగానే చాలా హ్యాపీగా, అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది.ఇంక మధ్యానం రూమ్ కి వచ్చీ రాగానే అన్నం కూడా సరిగా తినాలనిపించని ఆనందంలో నా లగేజ్ తీసుకుని,హేమంత్ బైక్  మీద బస్టాండ్ కి వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కేసాను. 

అన్నయ్య ఎంగేజ్ మెంట్ గురించి ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో మొదటి పెళ్ళి,అందరూ చాలా సంతోషంగా ఉండుంటారు.ఇంతకీ ఆ అమ్మాయి ( కాబోయే వదిన ) ఎవరో? మా వాళ్ళు నాకే విషయాలు ముందే చెప్పరు కదా.. అయినా మా పెద్దలు ఏ  పని చేసినా ఆచి,తూచి జాగ్రత్తగా చేస్తారు.. అలాగే ఈ సంబంధం కూడా అన్ని విధాలుగా సరిపోయిందే అయ్యుంటుంది.మా అన్నయ్య ఆరోజుల్లోనే ఇంజినీరింగ్ చదివి ఇంజినీర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం  చేయటమంటే మాటలా?ఈ మాటే నేనోసారి సోహైల్ తో అంటే  అరేయ్ మాధవ్ నువ్వేంట్రా నీ అన్నయ్య ఒక్కడే ఇంజినీర్ అన్నట్లు మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో ఇంటికో ఇంజినీర్ ఉంటున్నాడు అని ఎగతాళిగా మాట్లాడాడు.వాడు వాడి కుళ్ళు చేష్టలు!అయినా ఎవరి గొప్ప వాళ్ళది.వాడికెందుకో అంత కడుపుమంట?ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపట్టేసిన  నాకు హైదరాబాద్ వచ్చింది అని కండక్టర్ కేకలకి మెలకువొచ్చింది. 

అప్పటికి రాత్రి పదకొండయ్యింది.ఇప్పుడు ఫోన్ చేసి అన్నయ్యని రమ్మన్నా రాడు,ఎందుకులే అదేదో నేనే వెళ్దామని ఆటోని పిల్చి విజయనగర్ కాలనీకి అని చెప్పి కూర్చున్నాను.ఇందాక నయం హేమంత్ పాపం పని మానుకుని వచ్చి మరీ నన్ను బస్ దగ్గర దింపాడు అని మనసులో అనుకుని,అంతలోనే సరేలే.. అదంటే ఏదో చిన్న టౌన్ కాబట్టి హేమంత్ వచ్చాడు. పాపం అన్న ఇంత  పెద్ద సిటీలో  ట్రాఫిక్ లో రావటమంటే కష్టం కదా నా అన్న గురించి నేనిలా అలోచించొ చ్చా అని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను.ఛీ ఈ మనసు ఎప్పుడూ ఇంతే అనవసర విషయాల గురించి ఎక్కువగా అలోచించి, మనకి మనమే బాధపడేలా చేస్తుంది.సిటీలోకి అరగంట పైనే ప్రయాణించిన తర్వాత VNC అని పిలవబడే విజయనగర్ కాలనీకి వచ్చింది ఆటో.. దిగి ఆటోకి డబ్బులిచ్చి లోపలి వెళ్లాను. 

అక్కలు,అమ్మ,అన్న అందరూ ఎవరి రూమ్స్ లో వాళ్ళున్నారు.అక్కడే హాల్లో ఉన్న నాన్నమ్మ ఏమి నాయనా ఎట్టా వచ్చావు? ఇప్పుడు బస్ లు ఉన్నాయా  అంది.లేవు నాన్నమ్మా ఆటోలో వచ్చా అనగానే ఆశ్చర్య పోయినట్లుగా అరుస్తూ ఆటోలోనా? ఎన్ని డబ్బులు వదిలించుకున్నావు? అయినా బస్సులో అయితే ఒక పది రూపాయల్తో వచ్చేవాడివి కదా అంటున్న నాన్నమ్మని చూస్తే పిచ్చి కోపం వచ్చింది.మనసులో.. నీకు అటో,బస్సుల రేట్ల తేడా గురించి కూడా తెలిసిందా? అయినా నీ సొమ్మేం పోయింది? ఏమైనా చెప్తావు,ఆ సిటీ బస్సుల్లో దారి తెలియక తప్పిపోతే నా చావుకొస్తుంది అనుకునేలోపే అక్కడికొచ్చిన నాన్న ఇప్పుడు బస్సులుండవులేమ్మా అంటూ నన్ను బతికించాడు. ఏంటి మాధవ్ ఎలా ఉంది చదువు? ఎక్జామ్స్ ఎప్పుడు అంటూ భోజనం చెయ్యి, అని నాన్న అనేలోపే బయటికి వచ్చిన అమ్మ మాధవ్ అన్నం తిందువుగాని రా.. అంటూ పిలిచింది.

ఇంతకీ నేను గమనించనేలేదు ఇంట్లో ఫంక్షన్ హడావుడే లేదు.అదే మాట అమ్మనడిగితే ఫంక్షన్ అమ్మాయి వాళ్ళింట్లో కదా ఇక్కడేముంది అంది.నిజమే కదా అనుకుని తిని,అన్నయ్యని కూడా పలకరించి, నిద్రపోయాను. ఉదయాన్నే అమ్మ పిలుపుకి లేచిన నాకు అసలే ఎప్పుడూ స్టైల్  గా ,నీట్ గా ఉండే అన్నయ్య మంచి  డ్రెస్ వేసుకుని తయారయ్యి, ఆరోజు పెళ్లికళ లో ఇంకా మెరిసిపోతూ ఎదురుగా కనిపించాడు.అన్నయ్యని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడు సరిగా గుర్తులేదు కానీ కళ్ళలో ఆనంద భాష్పాలు కూడా వచ్చినట్లున్నాయి.నేను కూడా ఫ్రెష్ అయ్యి,బయటికి వచ్చేసరికి మా పెద్దక్క,చిన్నక్క,అమ్మ,మా కజిన్,వదిన (కజిన్ భార్య) అందరూ అమ్మాయి వాళ్ళింటికి తీసుకెళ్ళాల్సిన వస్తువులను సర్దుతూ బిజీగా కనిపించారు.ఆ దృశ్యం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఇంతలో నాన్నమ్మ తన సహజ శైలిలో వీళ్ళంతా కలిసి ఆర్భాటాల కోసం డబ్బు వృధా చేస్తారో ఏమో అని కంగారు పడుతూ ఇదెందుకు,అదెందుకు అంటూ మధ్య మధ్య అందర్నీ అదిలిస్తూ ఉంది. 

ఇంతలో మా కజిన్ భార్య (వదిన) అబ్బా..మామ్మగారూ  చిన్న చిన్న విషయాల దగ్గర కక్కుర్తి పడితే మనల్ని వాళ్ళు లేకిగా అనుకుంటారు.వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా మనకంటే వాళ్ళ హోదానే ఎక్కువ.అందుకని మీరేమీ కంగారు పడకండి అన్నీ మేము  చూసుకుంటాము కదా అంది.వాళ్ళ మాటల్లో నాకు అర్ధమయిన విషయం  ఏంటంటే  అమ్మాయి వాళ్ళ నాన్న ఏదో పెద్ద బిజినెస్,అమ్మాయి కూడా B.tech చదివింది.మా కజిన్,వదిన వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కూడా.అన్నయ్య కజిన్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు జరిగిన పరిచయం పెళ్లిదాకా వచ్చింది.మా అన్నని చూసి నచ్చిన అమ్మాయి పెద్దలే  ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడారట మా వదిన ద్వారా.. అయినా మా అన్నయ్య నచ్చని అమ్మాయిలూ ఉంటారా?

ఇంతలో నాకు పోయినసారి మా కజిన్ భార్య గురించి మా అక్కల మాటలు గుర్తొచ్చి,అక్కడే ఉన్న పెద్దక్క దగ్గరికి వెళ్లి,అక్కా పోయినసారి అన్నయ్య గురించి ఏదేదో మాట్లాడారు.మీరు చెప్పిన శృతిలయలు సినిమా కూడా చూశాను. నిజంగా అలాంటి విషయం ఉంటే  ఇప్పుడు ఆవిడే అన్నయ్యకి సంబంధం ఎందుకు మాట్లాడుతుంది అన్నాను. మాధవ్ నీకేమీ తెలియదులే ఇదీ ఒక ప్లానే.. అయినా నీకెందుకు ఆ విషయాలన్నీ?తెలివితక్కువగా ఎక్కడపడితే అక్కడ మాట్లాడకు అంటూ అక్కసుగా మాట్లాడుతూ పెద్దక్క.నన్ను కసిరింది చిన్నక్క మాత్రం ఎందుకో చాలా అనీజీగా అక్కడుండటమే ఇష్టం లేనట్లు పక్కకెళ్ళిపోయింది.నిశ్చితార్ధమే కదా అని ఎక్కువ బంధువులెవర్నీ పిలవలేదు నాన్న.మా దగ్గరి బంధువులు కొందరు,మా ఫ్యామిలీ అంతా ఉదయం పదింటికల్లా పెళ్ళికూతురు ఇంటికి బయల్దేరాము.పెళ్ళికూతురు వాళ్ళు నిజంగానే బాగానే ఉన్నవాళ్ళు.వాళ్ళముందు మేము చాలా తక్కువగానే  అనిపించాము. 

ఎంత ఊళ్లలో పొలాలు,ఆస్తులున్నా మా వాళ్ళసలే ఆడంబరాలకి దూరంగా ఉంటారు కదా.. సిటీలో మెయింట్ నెన్స్ వేరేగా ఉంటుంది.మా వాళ్ళు కూడా అలా  ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన కానీ వాళ్ళు వింటేగా. మేము ఇప్పుడే ఆడంబరాలకి పొతే మీరు రేపు మాకేమి మిగిల్చారు అంటారు నాయనా అంటుంది మా నాన్నమ్మ. మమ్మల్ని సంతోషంగా రిసీవ్ చేసుకుని,అతిధి మర్యాదలయ్యాక, అప్పట్లో ఇప్పటిలాగా నిశ్చితార్దానికి ముహుర్తాలు ఉండేవి కాదు కాబట్టి పూజారి రాగానే కార్యక్రమం మొదలుపెట్టారు.ఇద్దరి తరపు  పెద్దలు తాంబూలాలు, అమ్మాయి, అబ్బాయి మంచి కాస్ట్లీ ఉంగరాలు మార్చుకుని,నిశ్చితార్ధ మహోత్సవం పూర్తి  చేశారు.మా అన్నని,పెళ్ళికూతుర్ని చూస్తుంటే ఎప్పటినుండో పరిచయం ఉన్నవాళ్ళలాగానే అనిపించారు.ఎంతైనా సిటీ కల్చర్ కదా.. భోజనాలయ్యాక పెళ్లి  ముహూర్తం పంతులుగారిని అడిగి మేమే చెప్తాము,ఎప్పుడంటే అప్పుడు లగ్నపత్రిక రాసుకుందాం అన్నారు అమ్మాయివాళ్ళు.సరేనని ఇంటికి బయల్దేరాము.ఈ వేడుక మొత్తం తానే అయ్యి సందడిగా తిరుగుతూ నిశ్చితార్ధం జరిపించిన మా కజిన్ భార్యని చూస్తుంటే మా అన్నకి,ఆవిడకి ఏదో తప్పుడు సంబంధం ఉందనుకుంటున్న మా అక్కల్ని చూస్తే నాకెందుకో  పిచ్చికోపం వచ్చింది.

ఇంటికి వచ్చేసరికి చీకటి పడిందని,అందరం ఉదయాన్నేవెళ్ళొచ్చులే అనుకుని నాన,నాన్నమ్మ,బంధువులు కూడా ఉండిపొయ్యారు.ఇంతలో ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసిందని వెనకనుండి నాన్నమ్మ ఎక్కడికమ్మీ చీకట్లో అని పిలుస్తున్నా వినిపించుకోకుండా చిన్నక్క వెళ్ళిపోయింది.మాధవ్ నువ్వు వెళ్ళు తోడు అనగానే బయటికి వచ్చిన నాకు చిన్నక్క ఎక్కడా కనపడలేదు.సరే తనే వస్తుందిలే అనుకుని అందరం భోజనాలు చేసి,టైం పన్నెండు అయినా చిన్నక్క ఇంటికి రాలేదు.కంగారుగా అక్క ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ,పెద్దక్క ఎవరో తన ఫ్రెండ్ ఇంటికి ఫోన్ చేయగానే తను అక్కడే ఉన్నానని,ఉదయాన్నే వస్తానని చెప్పిన చిన్నక్క తెల్లారి కాదు కదా రెండోరోజు రాత్రికి కూడా అక్కడే ఉండి,ఇంటికి రాలేదు. ఈ విషయం గురించి మా అన్న,పెద్దక్క,అమ్మ,అమ్మమ్మ ఏమంత టెన్షన్ పడినట్లు నాకనిపించలేదు అంటే ఇంతకుముందు కూడా ఇలాగే చేసేదేమో చిన్నక్క..అందుకే రోజూ అక్కడ ఉంది చూసే వాళ్ళు కాబట్టి పెద్ద కంగారేమీలేదు వాళ్ళలో.. కానీ ఇదంతా కొత్తగా చూస్తున్న మా నాన్న,నాన్నమ్మ పరిస్థితే వర్ణనాతీతం.

ఈ పరిస్థితి మావాళ్లకేమో కానీ నిశ్చితార్దానికి వచ్చిన మా బంధువుల్లో మాత్రం ఆసక్తిని రేపింది.బంధువులు రాబందులు అని ఎందుకు అంటారో నాకు అప్పుడే అర్ధం అయ్యింది .ఒక పక్క విషయం ఏమిటా అని మేము భయపడుతుంటే ఎదిగిన ఆడపిల్ల పరాయి ఇంట్లో రెండురోజులు ఉండటమా?? సిటీలో ఉండి,వీళ్ళువెలగబెట్టే పనులు ఇవన్నమాట అంటూ చాటుగా  బంధువులు వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కోవటం ఎక్కువయ్యింది.ఎప్పుడూ ఆ అమ్మాయి ఇట్టా,ఈ  అబ్బాయి అట్టా అని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి,వాళ్ళ పెద్దల పెంపకాన్ని, అటేడుతరాలు, ఇటేడుతరాల్ని కూడా దుమ్మెత్తిపోసే మా పెద్దలకి మా చిన్నక్క చేసిన పని బంధువుల ముందు ఘోర అవమానం జరిగినట్లయింది. "మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు" అన్నట్లున్న మా పెద్దల  పరిస్థితి నాకు చాలా బాధ కలిగించింది.ఒక సంతోషం వెంటనే మరో సమస్య  "ఇంతేరా  ఈ జీవితం తిరిగే రంగులరాట్నము" పాట  మళ్ళీ ఎక్కడినుండో వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది నిజమేనా నా భ్రమా ?? 
Related Posts Plugin for WordPress, Blogger...