పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, జనవరి 2013, బుధవారం

కొత్త సంవత్సరం లో కొత్త కొత్తగా ...కొత్త సంవత్సరం కొత్త కొత్తగా ...వచ్చేసింది  చిన్న చిన్నగా  పాతపడిపోతుంది కూడా.. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా ఎప్పుడూ ప్రత్యేకమే, ప్రతిసారీ పండగే. పాత సంవత్సరం వెళ్ళిపోతూ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ఎంతో ఉత్సాహం, ఎన్నో వేడుకలు ... కొత్త సంవత్సర సంబరాల్లో నాకు బాగా నచ్చేవిషయం రాబోయే సంవత్సరం మంచి చేయాలని  ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవటం, మనకు,మన వాళ్లకు  ఈ సంవత్సరం ఆనందంగా,శుభంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా బావుంటుంది. ఒక గతం గడిచిపోయింది, అది కలిగించిన బాధలను, ధుఃఖాలను ఇక్కడే మర్చిపోయి, కొత్త తలపులతో, సరికొత్త ఆశలతో అందమైన భవిష్యత్తు కోసం నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాం ... 

కొత్తసంవత్సరం లో నాకు ఎక్కువగా నచ్చేది కొత్త డైరీలు,గ్రీటింగులు మనం మన  వాళ్లకి ఇచ్చినా,మనవాళ్ళ నుండి మనం అందుకున్నా చాలా సంతోషంగా అనిపించే వాటిలో ఈ డైరీలు,గ్రీటింగులు ఫస్ట్ ప్లేస్ లో వుంటాయి.న్యూ ఇయర్ వస్తుందనగానే షాపింగ్ లిస్టులోకి ఈ డైరీలు కూడా చేరిపోతాయి. నాకు మాత్రం ప్రతి సంవత్సరం మా తమ్ముడు ఇచ్చే డైరీ,కొత్త పెన్ తోనే  సంవత్సరం మొదలవుతుంది.. ఆస్వాదించిన అనుభూతులను, బాధపెట్టిన చేదు జ్ఞాపకాలను, గడిచిపోయిన కాలాన్ని పదిలంగా దాస్తూ ,రాబోయే కాలానికి ఆహ్వానంగా మంచి డైరీని అందుకోవటం సంతోషంగా అనిపిస్తుంది.కొత్త డైరీ చూడగానే చిన్నప్పుడు స్కూల్ రీఓపెన్ కాగానే కొత్తపుస్తకాలు  కొనుక్కుని,జాగ్రత్తగా అట్టలు వేసుకుని, కొన్నాళ్ళ పాటు భద్రంగా దాచుకునే రోజులు గుర్తొస్తాయి. 

ఇంకా కొత్త సంవత్సరంలో కొత్తగా ఇంట్లో చేరేవాటిలో కేలండర్లు కూడా ముఖ్యమైనవే..ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళ షాప్ పేరుతో  ప్రింట్ చేయించి ఇచ్చే కాలెండర్లు,అలాగే ఈనాడు,సాక్షి,స్వాతి వాళ్ళు ఇచ్చే కాలెండర్లు ఇంట్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి.ఒకప్పుడైతే కేలండర్లను గోడలకు తగిలించే వాళ్ళు  కానీ  ఇప్పుడలా కాదు..అవసరమైనప్పుడు తిథిలు, ముహూర్తాలు, పంచాంగం చూడటం కోసం బుక్ రాక్ లో నుండి  వెతికి తెచ్చుకోవటమే..

ఇలా కొత్త సంవత్సరంతో పాటూ చాలా కొత్త కొత్త వస్తువులు,విషయాలు జీవితంలోకి చేరుతుంటాయి.. కాలంతో పాటూ పాతపడుతుంటాయి..ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త వస్తువులు,కొత్త పనులు,కొత్త బంధాలు,బాధ్యతలు కొత్త సంతోషాలు,కొత్త సమస్యలు,సవాళ్లు ఇలా జీవితం కొత్త కొత్తగా సాగిపోతుంది... 

ఈ సంవత్సరం నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చిన కొన్ని కొత్త విశేషాలు...


ఈ కొత్త సంవత్సరం లో సంక్రాంతి అయిపోగానే శ్రీశైలం వెళ్ళటం చాలా సంతోషంగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళగానే సాయంత్రం దర్శనం, ఉదయం పూజలు అన్నీ బాగా జరిగాయి.

 శ్రీశైలం లో స్వామివారికి,అమ్మవారికి చేయించిన 
అభిషేకం,కుంకుమ పూజ ప్రసాదాలు..


అక్షరాలై నిలవబోయే అనుభవాలు 
 కొత్త డైరీలు


కాలప్రవాహంలో రోజుల్ని దాటుకుంటూ 
ముందుకు సాగిపోయే కాలెండర్లు 


శ్రీశైలం శిఖరం దగ్గర ఉండే "రాజా షాపింగ్ సెంటర్" మాకు చాలా నచ్చే షాప్.ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. పెర్ఫ్యూమ్స్,సోప్స్ ,బ్యూటీ ప్రొడక్ట్స్,మంచి మ్యూజిక్ కలెక్షన్ సి డి లు,పిల్లల ఇంపోర్టెడ్ ఆట వస్తువులు ఇలా ఇక్కడ షాపింగ్ మాకు చాలా ఇష్టం, ఈసారి తీసుకున్న వాటిలో 
వెరైటీ సోప్ బాక్స్ ల్లో ఉన్న బాత్ సోప్స్, 
చామ్ రాజ్ టీ బాక్స్ కొత్తగా అనిపించాయి..


మా బృందావనం లో ఈ కొత్త సంవత్సరం కొత్తగా 
పూచిన పువ్వులు,కాయలు..

14, జనవరి 2013, సోమవారం

సంక్రాంతి శుభాకాంక్షలు..భోగి భోగ భాగ్యాలతో
సంక్రాంతి సిరి సంపదలతో
కనుము కలసిమెలసి కనువిందుగా
సంక్రాంతి  పండుగ  సంబరాన్ని
జరుపుకోవాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ...


ముద్దబంతులు, మువ్వమోతలు, నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు, పైడి కాంతులు,పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహదండిగా మది నిండగా తొలి పండగే సంక్రాంతి.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు13, జనవరి 2013, ఆదివారం

భోగి పండుగ శుభాకాంక్షలు...

ఆకాశంలోని చుక్కల్ని నేలకి దించి దిద్దే అందమైన రంగవల్లికలు
హరినామ సంకీర్తన చేస్తూ అలరించే హరిదాసులు 
ఇంటిల్లపాదికీ దీవెనలందిస్తూ విన్యాసాలు చేసే గంగిరెద్దులు 
ఇష్టమైన పిండివంటల  ఘుమఘుమలతో 

సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం  పలుకుతూ.. 
ప్రతి ఇంటా సిరులు పండాలని,
భోగభాగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..

అందరికీ భోగిపండుగ శుభాకాంక్షలు..


11, జనవరి 2013, శుక్రవారం

సంక్రాంతి సంబరాలు -- మా ఊరి ముగ్గుల పోటీలు

సంక్రాంతి రాకముందే మొదలైన సంక్రాంతి సంబరాలు అందరినీ బిజీ బిజీ చేసేసాయి.సంక్రాతి పండగ అంటేనే ముగ్గుల పండగ కదా అందుకే అందరూ ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు పెట్టటంలో పోటీ పడుతున్నారు. ఆడవాళ్ళు కొంతమంది నిజంగానే పోటీపడుతూ వాళ్ళ ముగ్గుకే మొదటి బహుమతి రావాలంటూ ముగ్గులు వేస్తే  మరికొందరు మాత్రం కనీసం పార్టిసిపేట్ చేసినందుకైనా ఇచ్చే   గిఫ్ట్ కోసం ముగ్గులు వేశారు.

అలాగే ఈ సంవత్సరం ముగ్గుల పోటీల్లో మహిళలు నిర్భయకు నివాళిగా, ఆమెకు న్యాయం జరగాలని, కరెంట్ సమస్యలు,తెలుగు భాషాభిమానం వంటి సంగతులను ముగ్గులో ప్రస్తావించారు...ఇవీ నిన్న జరిగిన ముగ్గుల పోటీలో కొన్ని విశేషాలు.. నాకు నచ్చిన కొన్ని ముగ్గులు..9, జనవరి 2013, బుధవారం

మా సంక్రాంతి ముగ్గులు...
 చిన్నప్పటి నుండి పండగలు చేసుకుంటూనే ఉన్నాము అప్పటికి ఇప్పటికి పండగలలో,ఆచారాల్లో ఎన్నో మార్పులు,చేర్పులు...అలాగే సంక్రాంతి పండగలో కూడా కొన్ని మార్పులు వచ్చినా ఇప్పటికీ మారనివి ముగ్గులు, హరిదాసులు,ఎంత కష్టమనిపించినా వండుకునే అరిసెలు, ఇంకా కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ కొంచెం కష్టమే అయినా కూడా ఇష్టంగానే అనిపిస్తాయి... సంక్రాంతి పండగలో నాకు ఎక్కువగా నచ్చేది ముగ్గులు.. జనాలు ముగ్గులు వేయటం మొదలుపెట్టినప్పటి నుండి ముగ్గులు వేయాలన్న సరదా కూడా మొదలవుతుంది... 

చిన్నప్పుడు అమ్మ మట్టినేల మీద మాకు పాలు తెచ్చే అమ్మాయితో పేడ  తెప్పించి, చల్లి శుభ్రం చేసి ముగ్గులు వేసేది...ఇప్పుడు పాలు తెచ్చే అమ్మాయి లేదు,మట్టినేలా లేదు.. అయినా ఇంటి ముందు ఉన్న సిమెంట్ గచ్చు మీదనే నీళ్ళు చల్లి,ముగ్గులు వేయటం అదొక ఆనందంగా,పోనీలే ఈ మాత్రమైనా నేల ఉంది ముగ్గు వేయటానికి అనిపిస్తుంది.. చిన్నప్పుడు ధనుర్మాసం నెలంతా ముగ్గులు వేసేవాళ్ళము ఇప్పుడు మాత్రం జనవరి 1 నుండి సంక్రాంతి వరకు వేస్తున్నాము.మా ఇంటి ముందు ఈ సంక్రాంతికి  నేను వేసిన ముగ్గులు..

సంక్రాంతి మొదలవగానే అమ్మటానికి వచ్చే రంగులు..ఈ రంగులు లేకపోతె ముగ్గుకి కళ రాదు కదా.. అలా అని రోజూ ముగ్గులో రంగులు వేసే ఓపిక,తీరిక లేకపోయినా పండగ రోజు మాత్రం రంగులు వేయాల్సిందే.. 


మా సంక్రాంతి ముగ్గులు... 

8, జనవరి 2013, మంగళవారం

స్ఫూర్తి ప్రదాత ... స్వామీ వివేకానంద

స్వామీ వివేకానంద 
(జనవరి 12, 1863 - జూలై 4, 1902)

స్వామీ వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పరిచయము చేసి, హిందూ మతప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన ఆధ్యాత్మిక నాయకుడు,ప్రపంచాన్ని జాగృతం చేసే శక్తిసామర్థ్యాలు కలిగినవాడు.

" మన దేశానికిఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం 
కలిగిన యువకులు కావాలి ’’
‘‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. దాని కోసమే కృషి చెయ్యాలి"
 అంటూ యువతరాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన చనిపోయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన బోధనలు యువతరానికి స్ఫూర్తిదాయకాలు..  ఆయన చెప్పిన ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.. తన బోధనలు, రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత..

వివేకానందుని భోధనలేవీ వర్తమానానికి చెందనివి కాదు.ఆయన ఆధునాతన భావాల్ని ప్రజలకు అందించారు.వారి దూరదృష్టికి కేవలం తక్షణ భవిష్యత్తే ముఖ్యం కాదు.చాలా ముందు తరాల వారిపై కూడా దృష్టి సారించి అప్పటి ఘటనలకు కూడా ప్రాధాన్యం  ఇచ్చారు. ఒక్క మతమే కాక శాస్త్రవిజ్ఞానం, కళ, సారస్వతం, చరిత్ర, రాజకీయాలు, స్త్రీలు ఇలా మానవులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆయన భావనలు సమగ్రమైనవి ..

 నిజమైన మతం -

."ఒక వితంతువు కన్నీరు తుడవలేని,అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గానీ,మతం పట్లకానీ నాకు విశ్వాసం లేదు" 
భారతదేశంలో వర్గరహితమైన,కులరహితమైన సమాజం వర్ధిల్లాలని అభిలషించారు.స్వామీజీ అభిప్రాయం లో ఆదర్శ సమాజం కుల,వర్గ రహితమైనదే కాక,వేదాంత ప్రతిపాదిత పరమార్ధాన్ని,ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించగలదై ఉండాలి.మూర్ఖుని మానవునిగానూ,మానవుని దైవంగానూ మార్చగలిగిన సాధనమే మతం.ప్రపంచంలోని మతాలన్నీ నిజమైనవే,అనుసరణీయమైనవే.సర్వమత సహనంలో మనకు విశ్వాసం ఉండాలి.ఎవరినీ నిరసించవద్దు.తోటివారికి చేయూతనిస్తే మంచిదే అలా చేతకాకపోతే  వారి దారిన వారిని పోనీయటం మానవత్వం అనిపించుకుంటుంది

 దేశం - సమస్యలు

పేదరికం,నిరక్షరాస్యత,కులతత్వం, మొదలైనవి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు.. స్వామీజీ కాలంలో కూడా ఇవి ఉన్నాయి.ప్రస్తుతమున్న సమస్యలు తొలగినా కొత్త సమస్యలు తలెత్తవచ్చు.సమస్యలు లేని జీవితాన్ని  ఊహించలేము. స్వామీజీ దృష్టిలో  సమస్యలకు పరిష్కారం ప్రతిదేశం తమదైన ఆలోచనా సరళిని ఉపయోగించి, తమ సమస్యలకు పరిష్కారాలను ఆలోచించవలసిందే.. ప్రజల నడత,చిత్త శుద్ధి,సరియైన ప్రయత్నం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.."లక్ష్యంపై ఉన్న శ్రద్ధ లఖయ సాధన పై చూపిస్తే విజయ రహస్యం తెలిసినట్లే.."

 స్త్రీలు - సమస్యలు

భారతదేశం లో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత,త్యాగశీలత, సహనము, ఈ గుణవిశేషాలతో విలసిల్లే స్త్రీమూర్తే మాతృమూర్తి.మన స్త్రీలు ఎక్కువ విద్యావంతులు కాకపొయినా పవిత్రతలో వారికి వారే సాటి.మానవుల్లో స్త్రీలు వేరు,పురుషులు వేరు అనే భావనను పెంచిపోషించరాదు. స్త్రీ పురుష భేధాన్ని మర్చిపోయి,అందరు మానవులు సమానమే అనే భావన రానంతవరకు స్త్రీ జనోద్ధరణకు అవకాశం ఉండదు. 

ఏ దేశం కాని.జాతి కానీ స్త్రీలకు తగిన గౌరవం, సమున్నత స్థానం ఈయదో అది ఉన్నతస్థాయిని పొందలేదు.శక్తికి సజీవ స్వరూపాలైన స్త్రీలను సగౌరవంగా చూని కారణంగానే భారతజాతి హీన స్థితికి దిగజారింది."ఎక్కడైతే నారీలోకం గౌరవించబడుతుందో అక్కడే దేవతలు హర్షంతో ప్రజలను దీవిస్తారు".మొత్తం మానవ జాతి ఒక్కటే, అందరూ సర్వసమానతాభావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు కోరుకుంటూ పరస్పర సహకారంతో జీవిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.

మనిషి - ఆత్మవిశ్వాసం

వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు.తాను బలహీనుడిని అని భావిస్తే బలహీనుడవుతాడు. బలవంతుడిని అని భావిస్తే బలవంతుడౌతాడు .కార్యసాధనా యత్నంలో సంభవించే ఆటంకాలను,పొరబాట్లను లెక్కచేయకూడదు.ఓటములను లక్ష్యపెట్టకూడదు.తిరోగమనాలను కూడా సహించాలి.అనుకున్నదిసాధించటానికి వేల ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా వెనుకాడకూడదు.

బలహీనతను తొలగించుకోవాలంటేదాన్ని గురించే చింతిస్తూ కూర్చోకూడదు. బలాన్ని సమకూర్చుకునేప్రయత్నం చేయాలి..ఎవరేమన్నా పట్టించుకోకు నీ విశ్వాసాన్ని సడలనీయకు... ఎవరో ఒక వ్యక్తిని నమ్ముకోకుండా నీయందు నీవు పూర్తి విశ్వాసముంచుకో..అన్ని శక్తులు నీలోనే వున్నాయి.అది తెలుసుకుని వాటిని వినియోగించు."వ్యక్తికి బలమే జీవనం బలహీనతే మరణం.నిరాశకు తావివ్వకుండా గమ్యాన్ని చేరు"

  మానవసేవ - మాధవసేవ

"ప్రతి వ్యక్తిలోనూ పరబ్రహ్మ శక్తి ప్రజ్వరిల్లుతుంటుంది.పేదప్రజలకు సేవ చేయటం ద్వారా ప్రజలు తనకు సేవ చేయాలని పరమాత్మ ఆకాంక్షిస్తాడు".నరకప్రాయమైన ఈ ప్రపంచం లో ఒక వ్యక్తి  హృదయానికి కనీసం ఒక్క రోజైనా శాంతిని,సంతోషాన్ని అందించగలిగితే అదే నిజమైన సేవ అవుతుంది..  తన సహచరులకు మంచి చేసే ఆలోచన లేని సన్యాసి ఒక మూర్ఖుడే కానీ సన్యాసు కాబోడు..

ఆనందం అంటే??

జీవితంలో కొంతమందికి కొన్ని అవసరం కావచ్చు.కానీ అందరికీ అన్నీ అవసరం కాదు. మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నాయన్న దానిమీద మన సంతోషం ఆధారపడదు.సంతోషం అనేది ఒక మానసిక స్థితి. "ఆనందం అనేది మనసులో ఉండేదే" కదా!అభివృద్ది అవసరమే! పురోగతి కావలసినదే!కానీ అవి ఎంతవరకు అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయి? ఈ విషయాలను మనం తప్పక మనస్సులో ఉంచుకోవాలి...


1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో
ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు -
“One infinite pure and holy—
beyond thought beyond qualities I bow down to thee”


 


 నేను చదివి,సేకరించే పుస్తకాల్లో, కొటేషన్స్ లో వివేకానంద పుస్తకాలు కూడా ఉంటాయి. ఎప్పుడు పుస్తకాలు కొన్నా వివేకానందుడివి కూడా సేకరించటం అలవాటయ్యింది.మంచి మాటలు ఎవరు చెప్పినా విని ఆచరించటం తప్పు కాదు .. ఇతరులకు సందేశాలను ఇచ్చేంత గొప్పవాళ్ళం కాకపొయినా ఇలాంటి మహనీయుల మాటలను అప్పుడప్పుడన్నా గుర్తుచేసుకుంటే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మహానుభావులకి,మూర్ఖులకు తేడా తెలుసుకుని,మనం కనీసం మంచి మనిషిగా ఐనా ఎలా బ్రతకాలో తెలుసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.

నాకు చాలా ఇష్టమైన వివేకానందుని మాటల్లో ఒకటి..
 "వ్యక్తులు ప్రపంచంలోని మొత్తం ధనసంపద కంటే విలువైనవారు" 


వివేకానందుడి 150 వ జయంతి సందర్భంగా ...


Related Posts Plugin for WordPress, Blogger...