ఈ లోకంలో మనిషికో పిచ్చి వుంటుంది ఒకళ్ళకి సినిమాల పిచ్చి,మరొకరికి డబ్బు పిచ్చి,ప్రేమ పిచ్చి,ఇంకొకళ్ళకి పేరు ప్రతిష్టలు, పదవుల కోసం పిచ్చి.. ఇలా పిచ్చి రకరకాలు. ఎవరైనా అర్ధం లేకుండా మాట్లాడుతున్నా విసిగిస్తున్నా నీకేమైనా పిచ్చెక్కిందా అంటుంటాము.. కానీ ఇప్పుడు నేను చెప్పేది అలాంటి పిచ్చి గురించి కాదు.. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పిచ్చి అనే వ్యాధి గురించి..
మనసు ఎంత బలమైనదో అంత బలహీనమైనది కూడానట.అందుకేనేమో ఎదుటి మనిషి ప్రవర్తనను బట్టి మన మనసు స్పందిస్తూ వుంటుంది..మన అనుకున్న వాళ్ళు ప్రేమిస్తే సంతోషించటం, చిన్నమాట అన్నా బాధపడటం అన్నిటికీ మనసే కదా మూలం.మనసుకు బాధ కలిగినప్పుడు కొన్ని మనసుల భాష మౌనమైతే మరి కొన్ని మనసుల బాధ పిచ్చి...ఎలాంటి వ్యాదికైనా నివారణ ఉన్నట్లే ఈ మానసిక వ్యాధికి పరిష్కారం వుంది.. అలాగే ఎవరికైనా పిచ్చిలేకపోయినా పిచ్చెక్కిస్తా అంటూ.. పిచ్చివాళ్ళగా తయారుచేసే అవకాశం కూడా వుంది ..
అవునండీ నేను చెప్పేది నిజమే..! మనం ఎవరినైనా పిచ్చి వాళ్ళు అని నిరూపించాలనుకుంటే పిచ్చెక్కించటం చాలా సులభం ..మనకి సంఘం లో కొంత పలుకుబడి,డబ్బు,పరిచయాలు ఉంటే చాలు ఎవరినైనా పిచ్చి వాళ్ళను చేసేయొచ్చు..రెండు రోజుల క్రితం న్యూస్ లో చూశాను ఒక లాయర్ తన భార్య పిచ్చిదని నిరూపించి విడాకులు తెచ్చుకోవాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా తనకు తెలిసిన ఒక మానసిక వైద్యునితో కలిసి భార్యకు మత్తు మందులు ఇచ్చి కరెంట్ షాక్ తో పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం చేశాదు కానీ ఆ భార్య ఎలాగో తప్పించుకుని, మీడియాను ఆశ్రయించి ఈ విషయాన్ని బయటపెట్టింది..ఇది బయటపడిన ఒక మనిషి సమస్య మాత్రమే ..కానీ నిజంగా మానసిక సమస్య లేకపోయినా మానసిక వైద్యం పేరుతో శిక్ష అనుభవిస్తున్న ఇలాంటి మానసిక రోగులు ఎందరో ..
ప్రేమలో విఫలమయ్యామని ,జీవితంలో అనుకున్నది జరగలేదని, ఎదుటివాళ్ళు తమను సరిగా అర్ధ చేసుకోవటం లేదని, ఇంకా రకరకాల కారణాలతో మానసిక రోగులుగా తయారయ్యేది కొందరైతే, ఒక మనిషి మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు వాళ్ళు ఎలాంటి నేరం చేసినా దాన్ని నేరంగా పరిగణించదుచట్టం.దీన్ని ఆసరాగా చేసుకుని,శిక్ష తప్పించుకోవటానికి పిచ్చి అని నిరూపించుకునే వాళ్ళు కొందరు, అలాగే ఆస్తుల కోసం, ఇంకా రకరకాల కారణాలతో సొంత వాళ్ళనే కావాలని పిచ్చివాళ్ళను చేసేవాళ్ళు కొందరు
ఎవరికైనా జ్వరం వస్తే అది ఏ జ్వరం అని టెస్ట్ చేసి నిర్ణయిస్తారు డాక్టర్లు.కానీ నాకు తెలిసి మానసిక వైద్యులు ఒక మనిషిని పిచ్చివాడు అని నిర్ణయించటానికి ఎక్కువగా ఆధారపడేది టెస్టుల కంటే రోగికి సంబంధించిన సొంత మనుషుల మాటల మీదనే.. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగా లేదని సైకాలజిస్టు దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ రోగిని బయటికి పంపి, అతని కుటుంబ సభ్యులను కొన్ని ప్రశ్నలు అడిగి,ఆ రోగి పరిస్థితి గురిచి ఒక అంచనాకు వస్తారు..ఇక్కడ కుటుంబ సభ్యులు రోగి గురించి ఇచ్చే సమాచారమే కీలకంగా మారుతుంది..ఇదే మంచి అవకాశంగా తీసుకుని ఎదో కొంచెం మెంటల్ డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని కూడా అతని ప్రవర్తనను గోరంతలు కొండంతలుగా వర్ణించి,డాక్టర్ ను కూడా నమ్మించి,పిచ్చి కోసం ట్రీట్ మెంట్ ఇప్పించి ఆ వ్యక్తిని పూర్తి స్థాయి మానసిక రోగిగా మార్చిన సందర్భాలు కూడా లేకపోలేదు..
పిచ్చిని నిర్ధారించటాని చేసే క్లినికల్ సైకాలజీ టెస్ట్ ల ద్వారా రోగి ప్రవర్తనా సరళిని గమనించటం, రోగిని ప్రశ్నించడం ద్వారా తెలుసుకునే విషయాలను అన్నిటినీ కలిపి ఒక వ్యక్తి మానసిక ఆరోగ్య పరిస్థితిని గురించి ఒక అవగాహనకు వస్తారు సైకాలజిస్టులు ..మానసిక వైద్యం కోసం ఒక మనిషిని ఎవరైనా తీసుకు రాగానే పరోక్షంగా రోగి ప్రవర్తనను ఇతరుల ద్వారా తెలుసుకోవటం , ఒక నిర్ణయానికి వచ్చేసి ట్రీట్ మెంట్ ప్రారంభించడం మాత్రమే కాకుండా , న్యూరో సైకలాజికల్ విధానం అమలు చేసి, రోగి ఇచ్చే సహకారం, అతనిలో ఉత్కంఠత ( Anxiety ) , ఇంకా ఇతర ప్రవర్తనలను అంచనా వేయడం జరుగుతుంది. రోగి మెదడు ఆకస్మికంగా పని చేయకపోయినట్లయితే అనేక కారణాల రీత్యా అంచనాలు జరగవలసి ఉంటుంది.ప్రాథమిక పరీక్షల వల్ల, ప్రశ్నించడం వల్ల రోగికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. వ్యక్తిగతంగా రోగిని పరీక్షించి, సైకలాజికల్ అనాలసిస్ చేయటం వలన అసలు
ఆ రోగికి ఎటువంటి చికిత్స అవసరమో వైద్యులకు అర్థమవుతుంది.దాని ద్వారా అతనికి ట్రీట్ మెంట్ చేయటం సులభం అవుతుంది.
ఇదంతా దైవంతో సమానమని నమ్మే వైద్యులు ఒక మానసిక రోగిని కాపాడటానికి చేసే ప్రయత్నాలు..కానీ అన్ని చోట్లా మోసం,అవినీతి ఉన్నట్లే డబ్బు,పరిచయాలు,స్నేహాల కోసం ఒక మనిషిని పిచ్చివాడిగా నిరూపించగలిగే సైకాలజిస్టులు కూడా ఉంటారనేది అందరికీ తెలిసిన నిజమే.ఒకప్పుడు పాత సినిమాల్లో,ఇప్పటికీ కొన్ని సీరియల్స్ లో మామూలు మనుషుల్ని పిచ్చివాళ్ళ గా తయారు చేయటం లాంటి కధలు ఉండేవి.అలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతున్నాయని ఈ లాయర్ విషయం ద్వారా మరోసారి బయటపడింది...
ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు అయ్యో ఇలా జరుగుతుందా అని బాధపడటం,తర్వాత
ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోవటం.ఇంతకన్నా ఏమీ చేయలేని సగటు మనుషులము కదా అంతే మరి..
ఇదంతా నా మనసుకు అనిపించింది ... చెప్పేశాను..ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం అంటారు కదా...
ఏది ఏమైనా కానీ కలత పడిన మనసుకు మరొక మనసు మాత్రమే స్వాంతనను కలిగిస్తుంది అనేది మాత్రం నిజం. స్వచ్ఛమైన మనసు, ప్రేమపూర్వక స్పర్శ, చిన్న ఓదార్పు మానసికంగా ధైర్యాన్నిస్తుంది..మనసుకు ఎంతో ఆత్మీయతను అందిస్తుంది.. కొండంత అండను, ఉపశమనాన్ని ఇస్తుంది..
మనసొక మధుకలశం పగిలే వరకే
అది నిత్య సుందరం