పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

6, మార్చి 2013, బుధవారం

ఆడించి అష్టా చెమ్మా ఓడిద్దామా...



అష్టా చెమ్మా వెనకటి రోజుల నుంచీ చాలా ఫేమస్  ఆట.  అప్పట్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళు, అరుగుల  మీద చేరిన జనాలు  ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ అష్టా చెమ్మా కి అభిమానులే. నా చిన్నప్పుడు పిన్ని వాళ్ళు , అమ్మ వాళ్ళు అష్టా చెమ్మాఆడుతుంటే చూడటం సరదాగా ఉండేది. అమ్మమ్మ వాళ్ళింట్లో ప్రత్యేకంగా ఈ ఆట కోసం ఒక బండని కేటాయించి దాని మీద అష్టా చెమ్మా గడులు చెక్కించారట మా తాతయ్య..  

ఈ ఆట ఆడుతున్నప్పుడు పోటీ చూడాలి...  అవసరమైన పందాలు వేసుకుని, గడులు దాటి పంట అవుతున్న వాళ్ళు సంతోషిస్తుంటే ఓడిపోయిన వాళ్లకి ఉక్రోషం తన్నుకుని వస్తుంది . ఒకళ్ళ మీద ఒకళ్ళకి పంతాలుకోపాలు పెరిగి పోతుంటాయి.  కొట్టుకునేదాకా వచ్చేది వ్యవహారం. కొంత మంది ఎప్పుడు ఎంత పందెం కావాలో అంత  అవసరమైన పందాలు వేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం గెలవటం కష్టం.  వీళ్ళని తొండి  చేస్తున్నారు అని కూడా అనే వాళ్ళు .. ఇలా అన్ని పనులు, నిద్రాహారాలు మానుకుని మరీ ఈ ఆటలు ఆడేవాళ్ళు.  

వెనకటి కాలమే కాదు మా రోజుల్లో కూడా చాక్ పీస్ తో అష్టా చెమ్మా గడులు గీసుకుని గవ్వలు, చింత పిక్కలతో అష్టా చెమ్మా ఆడుకునే వాళ్లము. సమ్మర్ హాలిడేస్ లో వూరి నుండి వచ్చే పెద్దమ్మ కూతురు,మా పెద్దక్క సంధ్య ఈ ఆటలని ఆడించేది. తనకేమో పల్లెటూర్లో ఈ ఆటలు ఆడటం,గవ్వల్ని,చింత పిక్కల్ని ఎలా పట్టుకుంటే ఎంత పందాలు పడతాయి అన్న విషయాల్లో బాగా అనుభవం ఉంది.. మాకు కొత్తగా నేర్చుకున్న సరదానే కానీ టాలెంట్ లేదు ... ఇంకేముంది అది వరసగా అన్ని ఆటలు గెలిచేది .. మమ్మల్ని ఓడించిందన్న ఉక్రోషం తో ఒక్కోసారి మా చేతిలో దెబ్బలు కూడా తినేది పాపం .. 


ఐతే ఈ అష్టా చమ్మా, పాము పటం (   Snakes and Ladders ), పచ్చీస్   ఇలాంటి ఆటలు ఇంట్లో ఆడకూడదు మంచిది కాదు అని ఆడనిచ్చే వాళ్ళు కాదు పెద్దవాళ్ళు.. రాను రాను ఈ ఆటలన్నీ మూలన పడ్డాయి దాదాపు మర్చిపొయ్యాము కూడా. మా ఇంట్లో ఇప్పటికీ  గవ్వలు,ఆటలో పెట్టే పిన్స్ అన్నీ కలెక్షన్ లలో మిగిలి ఉన్నాయి.. ఇప్పుడు వాటితో ఆడాలన్న తీరికా లేదు, కోరికా లేదు.. 

ఆటలు,పాటలు, చదువులు  అన్నీ నెట్ ప్రపంచంలోనే  అయిపోయిన ఈ రోజుల్లో నలుగురితో కలిసి కూర్చుని చేసే పనులు చేయటం కుదరదు కదా అందుకే మన పక్కన ఉన్న మన మనుషుల్ని వదిలేసి  ఎక్కడో పక్క దేశం లో ఉన్నవాళ్ళని  ఆడించి వాళ్ళని ఓడించాలని నిర్ణయించుకున్నాను. 

"king.com" ఈ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనతో పాటు మెంబర్స్ అయిన  అన్ని దేశాల వాళ్ళతో ఆడి వాళ్ళని ఓడించవచ్చు.. కంప్యూటర్ గేమ్స్ ఆడటం నాకు చాలా ఇష్టమైన హాబీ  ఈ సైట్ లో  " Ludo "  లేదా " పచ్చిస్ "   నాకు నచ్చిన ఆట .. ఈ ఆట నలుగురితో కలిసి  ఆడాలి.. ఇక్కడ కూడా మన వాళ్ళ లాగానే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ భాషల్లో తిడుతూనో , పొగుడుతూనో కామెంట్స్ ఇస్తుంటారు .. అలాగే నేను కూడా :-).. ఈ ఆట ఆడుతుంటే నాకు చిన్నప్పటి మా అష్టా చెమ్మా పోటీలు గుర్తుకొస్తాయి... కలర్ ఫుల్ గా,సరదాగా ఉండే ఈ Ludo చాలా బాగుంటుంది.
ఒక్క Ludo మాత్రమె కాదు చాలా రకాల స్ట్రాటజీ, పజిల్ ,అన్ని రకాల గేమ్స్ 
చాలా బాగుంటాయి...   
 





Related Posts Plugin for WordPress, Blogger...