నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుండీ ఇష్టమే..చిన్నప్పుడు అంటే నాకు సినిమా చూసే జ్ఞానం వచ్చినప్పటి నుండి అన్నమాట.అలా నేను చూసిన సినిమాలు రెండు విభాగాలు.కొన్ని సినిమాలు మా ఫ్యామిలీ అందరం అంటే అమ్మ,నాన్న,తమ్ముడూ,చెల్లి అందరం కలిసి చూసినవి..కొన్ని సినిమాలు మా అమ్మ,అమ్మ స్నేహితులు, పిన్ని, అత్తయ్యలు,మా చిన్నపిన్ని స్నేహితులు నన్నుతోడుగా తీసుకెళ్ళిన సినిమాలు.(ఏంటో ఆ రోజుల్లో కాలేజ్ కి వెళ్ళే ఆడపిల్లలకి మాలాంటి చిన్న పిల్లలే తోడు సినిమాలకి వెళ్ళాలంటే.)
ఇంక అప్పట్లో కొన్ని ఆడవాళ్ళు మాత్రమే చూసే సినిమాలు ఉండేవి వాటికి మగవాళ్ళు అంతగా వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకి ఘర్షణ,సింధూరపువ్వు,నీరాజనం,స్వాతి చినుకులు,జీవనజ్యోతి , ఇంకా కొన్ని రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు ఇలాంటివన్నీ ఆడవాళ్లకే ప్రత్యేకమైన మ్యాట్నీ సినిమాలు...
ఇంక రెండో విభాగం లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు ఉండేవి.మా చిన్నప్పుడు మా వూరిలో పోకిరి మగపిల్లలు ( మా పెద్దల దృష్టి లో )ఇలాంటి సినిమాలకి వచ్చేవాళ్ళు..అందుకని ఇలాంటి సినిమాలకి వెళ్ళాలంటే నాన్న తప్పనిసరి మాతో పాటూ ... ఇదీ మా సినిమాల విభజన.
ఇంకో సినిమా విభాగం నా ఫ్రెండ్ రాజేశ్వరితో చూసిన సినిమాలు.. వాళ్లకి ఒక సొంత సినిమా హాల్ ఉండేది.ప్రతి ఆదివారం వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్ళకుండా వూర్కునేది కాదు.ఒక్కో సినిమా నెలరోజులు,ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆడే ఆరోజుల్లో కొన్ని సినిమాలు కనీసం ఐదారుసార్లన్నా చూసి ఉంటాను దాని గొడవ వల్ల.అలా ఐదారుసార్లన్నాచూసిన వాటిలో చెట్టుకింద ప్లీడర్ ఒకటి..అందుకే ఆ సినిమా నిద్రలో లేపి అడిగినా స్టోరీ అంతా గుర్తుంటుంది.ఎంతైనా అప్పటి సినిమాలు బాగుండేవి.ఇప్పటికీ టీవీలో వస్తున్నా వాటిని చూడాలి అనిపిస్తుంది.
అప్పటి సినిమాల్లో కొన్ని కామన్ విషయాలు చాలా ఉండేవి. అలాంటి వాటిల్లో తప్పిపోయి,కలుసుకునే పాటలు ఒకటి.ఉదాహరణకు ఒక కుటుంబం ఆనందంగా పుట్టినరోజో,పండుగో చేసుకుంటూ పాట పాడుకుంటూ ఉంటారు. సడన్గా రౌడీ వచ్చి అక్కడ విధ్వంసం చేస్తాడు.పాపం కుటుంబం అంతా చెల్లా చెదురై పోతారు.కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దయ్యి వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు చిన్నప్పుడు పాడుకునే పాట పాడుతూ ఉంటారు..ఇంతలో పక్కనుండి ఇంకెవరో వచ్చి అదే పాట పాడగానే అన్నయ్యా,తమ్ముడూ,అమ్మా,నాన్నా అంటూ అంటూ హ్యాపీగా కలుసుకుంటారు.ఇప్పుడంటే ఎదో కామెడీగా అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూస్తుంటే మళ్ళీ వీళ్లెలా కలుస్తారబ్బా అని ఆలోచిస్తూ చాలా బాధగా ఉండేది :)
నాకొక సందేహం నిజంగా అంత చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలకి ఆ పాట ఎలా గుర్తుంటుంది??
వీళ్ళు పాడుతున్నప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు విని వాళ్ళు కూడా వచ్చి పాడే ప్రమాదం లేదా??
ఏది ఏమైనా ఆ పాటలు పాడుకున్న వాళ్ళందరూ కలిసి, కధలు సుఖాంతం అయ్యాయి కాబట్టి
ఇప్పుడు ఈ సందేహాలతో నా బుర్ర పాడు చేసుకుని, పక్కన వాళ్ళ బుర్ర కూడా పాడు చేయటం ఎందుకు.
ఇలాంటి తప్పిపోయినప్పుడు పాడుకునే పాటల్లో నాకు గుర్తున్న కొన్ని పాటలు
ఆనాటి హృదయాల ఆనందగీతం - అన్నదమ్ముల అనుబంధం
సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం - ముగ్గురు కొడుకులు
అమ్మంటే మెరిసే మేఘం .. కురిసే వానా - ముగ్గురు మొనగాళ్ళు
ఇంకెవరికైనా ఏవైనా కుటుంబ గీతాలు గుర్తుంటే గుర్తు చేయగలరు :)