మనిషి జీవితంలో వివిధ దశలు...
బాల్యం...ఒక తెల్లకాగితం
యవ్వనం...ఒక రంగులకల
వృద్ధాప్యం...ఒక నలిగిన పుస్తకం
ప్రతి మనిషి తన జీవితంలోని మొదటి దశల్లో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని,ఎదురు దెబ్బలు తిన్నా
ఆ గాయాలను లెక్క చేయకుండా ఎన్నో విజయాలను సాధించి అజేయుడిగా నిలుస్తాడు కానీ...
చివరి దశ ఐన వృద్ధాప్యం మాత్రం మనిషి మీద ఏదో ఒక విధంగా విజయం సాధించి జీవితంలో ఓడిపోయేలా చేస్తుంది.
నా పిల్లలు బాగుండాలి,మంచి స్థాయిలో వుండాలి అని కష్టపడి పెంచిన తల్లిదండ్రులు
వాళ్ళ స్వార్ధం చూసుకోకుండా పిల్లల కోసం కూడబెట్టి, ఉన్నదంతా వాళ్లకి అప్పచెప్పి
చివరి రోజుల్లో పిల్లలే మాకు ఆధారం అని నమ్మిన ఎందరో తల్లిదండ్రులు
ఆ పిల్లల చేతిలోనే మోసపోయిన సంఘటనలు ఎన్నెన్నో.
ప్రతి మనిషికీ తెలుసు మనం కూడా ఒకనాటికి ముసలి వారు అవుతామని కానీ
ముసలి వాళ్ళని చూస్తే చిరాకు,
వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మనకు చాదస్తం,
ముసలి వాళ్లకి తిండి పెట్టటం కష్టం,
వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే వైద్యానికి అయ్యే ఖర్చు కూడా దండగ.
కొందరు పిల్లలు కావాలని తల్లిదండ్రులను నిరాదరిస్తారు,
కొందరు పరిస్థితుల ప్రభావంతో అలా చేయాల్సి వస్తుంది.
ముసలివారితో మనకి ఎలాంటి చుట్టరికం వుంది,
వాళ్లకి సేవ చేయటం వలన మనకి కలిగే లాభం ఏమిటి అనే విషయాలు
నేటి సమాజంలో వృద్ధుల తలరాతని నిర్ణయించే అతి ముఖ్యమైన విషయాలు.
తల్లిదండ్రులు కొడుకుల దగ్గరే వుండాలన్నది మన సమాజంలో ఒకప్పుడు నియమం.
కాలక్రమేణ ఇలాంటి ఆలోచనలు తగ్గిపోయి,ఆడపిల్లను కూడా కొడుకుతో సమానంగా చదివించి,
ఆస్తి పంచిన తల్లిదండ్రులు ఎంతమంది తమకి అవసరమైన సమయంలో కూతురి సహాయం పొందగలుగుతున్నారు?
పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటి గురించి ఆలోచించడమే తప్పు అని ఆలోచించే పురుషులున్న సమాజంలో ఒక ఆడపిల్ల తన తల్లిదండ్రులకి సహాయం చేయాలన్న ఆలోచన వచ్చిన చేయగలదా...
ఆస్తి వున్న అత్తా,మామలను,బంధువులను ఆదరించి గౌరవించినట్లే..
ఏమి లేని నిస్సహాయ పరిస్థితిలో వున్న ముసలి వారిని ఆదరించే వ్యక్తులు ఆడవారైనా,మగవారైనా
ఎందరు ఉన్నారంటారు?
భర్తైనా,భార్యైనా వారి వారి కుటుంబాల్ని వారు ప్రేమించే దాన్ని బట్టే మిగతా కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా వుంటుంది.
భర్త నా తల్లిదండ్రులే నాకు ముఖ్యం అనుకోకూడదు,తన జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు కూడా తనవారిగా భావించ గలగాలి..
అలాగే భార్య అటు భర్త కుటుంబాన్ని గౌరవిస్తూనే తన పుట్టింటికి తనతో వున్న అనుబంధాన్ని,అక్కడ తన అవసరాన్ని మర్చిపోకూడదు.
అప్పుడే కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి.
ఇప్పటిదాకా ఈ పరిస్థితులను చూసిన ఎందరో వృద్ధాప్యం లో తమకంటూ ఒక ఆధారం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఉన్నదంతా పిల్లలకి ఇచ్చి వారితో మాటలు పడటం కంటే వారికంటూ కొంత పొదుపు చేసుకుని,
ముసలి వయసులో కూడా వారికంటూ కొన్ని వ్యాపకాలతో వారికి ఇష్టమైనట్లు ఆనందంగా జీవించగలుగుతున్నారు.
నేటి సమాజంలో గతకొంత కాలంగా వస్తున్న ఈ మార్పు ఎంతో హర్షించదగినది,ఆహ్వానించదగినది.
డబ్బున్న వారు వాళ్లకి ఇష్టమైన చోట మనసు చంపుకుని బ్రతకగలుగుతున్నా...
ఆ డబ్బు కూడా లేక అనాధల్లాగా బ్రతుకుతున్న వృద్ధుల పరిస్థితి దేవుడికే తెలియాలి...
వాళ్లకి మనమేమి మర్యాదలు చేసి,నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు,
ప్రేమతో కూడిన చిన్న పలకరింపు,కొంత సేపు వారితో గడపటం,వారి ఆరోగ్యం గురించిన శ్రద్ధ ఇవి చాలువారు మరికొన్నాళ్ళు ఆనందంగా బ్రతకడానికి.
మనల్ని కని, కష్టపడి పెంచిన అమ్మ,నాన్నలు ఇలాంటి పిల్లలనా మనం కని పెంచింది అని బాధపడే రోజు
ఎవరికీ రాకూడదని కోరుకుంటూ...
పెద్దలందరికీ నమస్కరిస్తూ...
ఎవరికీ రాకూడదని కోరుకుంటూ...
పెద్దలందరికీ నమస్కరిస్తూ...