హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులయ్యింది కదా కధ చెప్పి ...
ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మావాళ్ళు మా కజిన్ భార్య (వదిన) గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు కానీ అక్కడ పరిస్థితులేవో తేడాగా ఉన్నాయనిపించింది.అయినా నాకెందుకులే పెద్దవాళ్ళ విషయాలు అని ఆలోచించటం మానేశాను.నాకు అప్పుడే తెలిసిన ఒక కొత్త న్యూస్ ఏంటంటే అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం అందరికీ నచ్చిందట.నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే త్వరలో పెళ్ళికి రావచ్చన్నమాట.
దసరా సెలవలు,పండగ హడావుడి,అయిపోగానే మళ్ళీ కాలేజ్ కి వచ్చేశాను. వచ్చేటప్పుడు నాన్నకి చెప్పి వెళ్దామని ఊరికి వెళ్లాను. నాన అవసరమైన డబ్బుతో పాటూ నా చేతికి ఒక గోల్డ్ చైన్ ఇచ్చాడు. నాకేమీ అర్ధం కాలేదు. అమాయకంగా చూస్తూ ఏంటి నాన్నా ఇది అనగానే నాన్న నీకే మాధవ్ వేసుకో.. పండక్కి నీకోసం చేయించా అన్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అనుకోని గిఫ్ట్ అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా. అప్పటిదాకా అన్నకే కార్ కొన్నాడు కానీ నాకేమీ ఇవ్వడు నాన్నఅని నాన్న గురించి తప్పుగా ఆలోచించినందుకు నా మనసు అపరాధభావంతో రగిలిపోయింది.
సరేనని కాలేజ్ కి బయల్దేరగానే నాన్నమ్మ జాగ్రత్త నాయనా అంది .. ఆహా నాగురించి నాన్నమ్మ కి ఎంత జాగ్రత్త అనుకునేలోపే గొలుసు గురించి చెప్తుండా పిల్లకాయలు దొబ్బెయగల్రు జాగ్రత్తగా పెట్టెలో పెట్టుకో తియ్యంగానే అంది.అంటే జాగ్రత్త నా గురించి కాదా అనుకుని పెద్దది కదా జాగ్రత్త చెప్తుందిలే ఎంతైనా మా నాన్నమ్మ కదా అలా తప్పుగా అనుకోకూడదు అనుకుని నాన్నకి,నాన్నమ్మ కి చెప్పి,వాళ్ళ ఆశీస్సులు తీసుకుని కాలేజ్ కి నా ప్రయాణం మొదలయ్యింది.
రూమ్ కి వెళ్ళగానే మరొక సర్ ప్రైజ్ మా రూమ్ లోకి కొత్తగా మరో సభ్యుడు వచ్చి చేరాడు. అతని పేరు కూడా మాధవరావ్ అట. ఒకరిని పిలిస్తే ఇద్దరం పలికే ప్రమాదం ఉండటంతో నేను కొంచెం పొట్టిగా,అతను కొంచెం పొడుగ్గా ఉన్నాడని నన్ను చిన్న మాధవ్ అతన్ని పెద్ద మాధవ్ అని పిలిచే నిర్ణయం జరిగింది.అదేంటో నన్ను చిన్నపిల్లోడని ఎవరన్నా నాకేమీ బాధ అనిపించదు ఎందుకంటే మా ఇంట్లో కూడా మా పెద్దలందరిలో నేనే చిన్న పిల్లోడిని కదా అందుకని .
ఆరోజుకి రెస్ట్ తీసుకుని తెల్లారగానే మా నాన ఇచ్చిన చైన్, మా అన్న కొన్న కొత్త బట్టలు వేసుకుని మరీ హుషారుగా కాలేజ్ కి బయల్దేరాను..కాలేజ్ ఎప్పటిలాగే మొదలయ్యింది. కావ్య కోసం నా కళ్ళు వెతికాయి కానీ కనపడలేదు.కనపడకపోతే పోనీ.. అయినా తనతో నాకెందుకు నన్ను అంత అవమనించాక కావ్య ఏమన్నా మా పెద్దలా ఎంత అవమానించినా దులిపేసుకుని పోవటానికి. ఇంట్లో వాళ్ళు ఎంత అవమానం చేసినా భరిస్తాం వాళ్ళు మన దేవుళ్ళు కాబట్టి.. కానీ బయటి వాళ్లకి ఏమి హక్కు ఉంది అనుకుని అప్పటికి కావ్య విషయం మర్చిపోయాను.
కాసేపటికే ఫ్రెండ్స్ తో క్లాస్ కి వచ్చిన కావ్య నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది.ఆమె నవ్వగానే నేను నవ్వాలా? మొహం పక్కకి తిప్పుకున్నాను.పాపం కావ్య ఫీల్ అయినట్లుంది. ఫీల్ అయితే అవ్వనీ నాకేంటి? లంచ్ టైమ్ లో కూడా కావ్య నన్ను చూడగానే మాధవ్ మాధవ్ అని పిలుస్తున్నా వినపడనట్లు వెళ్ళిపోయాను.లేకపోతే నన్ను పట్టుకుని పక్కన అమ్మాయి పర్స్ దొంగతనం చేయమంటుందా?
ఆరోజంతా కావ్య నన్ను పలకరించాలని చూసినా నేను మాట్లాడలేదు.ఇలాగే వారం గడిచిపోయింది.కావ్య కూడా రెండు రోజులు నన్ను మాట్లాడించాలని ప్రయత్నించి తర్వాత మానేసింది. ఆరోజు ఆదివారం రూమ్ లోనే పడుకుని10 అయినా బద్ధకంగా లేచి ఫ్రెష్ అయి వచ్చి నా డెస్క్ లో చూసేసరికి అన్నీ ఉన్నాయి కానీ నా చైన్ కనపడలేదు.ఒక్కక్షణం గుండెఆగినట్లు అనిపించింది.పిచ్చివాడిలాగా రూమ్ లో, బాత్ రూమ్ లో, నా పెట్టెలో చివరికి ఇల్లంతా వెతికినా చైన్ కనపడలేదు.
మా నాన్నమ్మ మాటలు గుర్తొచ్చాయి.ఎంత జాగ్రత్త చెప్పింది,పాపం నాన్న ఎంత ప్రేమగా చేయించాడు నాకోసం.. కన్నీళ్లు పొంగుతున్నాయి. రూమ్ మేట్స్ ,కొత్తగా వచ్చిన పెద్ద మాధవ్ అంతా కంగారుగా వెతికారు.దొరక్కపోతే వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుందని భయపడ్డారు అందరూ. అయినా మాధవ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా.. ఇప్పుడు ఎవరినని అడుగుతావు నువ్వు అన్నాడు హేమంత్. అందరం కలిసి మాట్లాడాక మా అనుమానం వంటపని,ఇంట్లో పని ఒక్కతే చేసే పనమనిషి మీదకి మళ్ళింది.కానీ అడిగితె చెప్తుందా?
మా అనుమానం నిజం చేస్తూ రెండో రోజు పనిమనిషి పనికి రాలేదు. ఆరోగ్యం బాగాలేదు రెండురోజులు పనికి రానని వాళ్ళాయనతో కబురు చేసింది. ఇప్పుడు మా అనుమానం నమ్మకంగా మారింది.ఇప్పుడేమి చేయాలి?నాన్నతో
చెప్తే ఇప్పటికే నన్ను ఏమీ తెలియని,లోకజ్ఞానం లేని వెఱ్రిపీనుగ అనుకుంటున్నారు ఇంట్లో అందరూ.. ఇప్పుడీ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అందుకే నేనే సొంతగా ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాను.
నా బాధ చూసిన హేమంత్ టౌన్ సి.ఐ గారి భార్య,మా పిన్నిమంచి ఫ్రెండ్స్ తన దగ్గరికి వెళ్తే కంప్లైంట్స్,కేసులతో పనిలేకుండా ఈజీగా పని అవుతుంది ఏమంటావు మాధవ్ అన్నాడు.. హేమంత్ పిన్ని అంటే కావ్య వాళ్ళ అమ్మ.
రెండురోజుల క్రితం దాకా కావ్య పలకరించినా పలక్కుండా తిరిగిన నేను ఇప్పుడు కావ్య వాళ్ళమ్మని హెల్ప్ అడగాలా .. దేవుడా ఎందుకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తెస్తావు ??