ఏమి చేయాలో అర్ధం కాలేదు ఇప్పుడు పంతాలు,పట్టుదలలకి పొతే ఎలా? ఎవరో ఒకరి ద్వారా పని చేయించుకోకపోతే నాకే నష్టం. పైగా నాన్న ఎంత కష్టపడితే ఆ చైన్ వచ్చింది? నాన ఎంత డాక్టర్ అయితే మాత్రం డబ్బులు ఊరికే వస్తాయా? నేను నా ఆలోచనతో బాధపడుతూ ఉండగానే అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యి కొత్తగా రిలీజ్ అయిన "ప్రేయసి రావే" సినిమాకి బయల్దేరారు.పెద్ద మాధవ్ వచ్చి ఏంటి మాధవ్ సినిమాకి వస్తావా అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది అసలే చైన్ పోయిందని నేనేడుస్తుంటే సినిమాకి పోవాలంట సినిమాకి.!అయినా ఎవడి నొప్పివాడికే బాధ కానీ పక్కవాడికి ఏముంటుంది?
ఇంతలో హేమంత్ వచ్చి సరే మాధవ్ మేము వచ్చేదాకా ఆలోచించుకో నువ్వు వెళ్దామంటే మేము సినిమా నుండి రాగానే మా పిన్ని వాళ్ళింటికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.నాకు ఇంక తిండి కూడా తినబుద్ధి కాలేదు.మా నాన్నమ్మ ఎప్పుడూ ఒక మాట అనేది.తప్పని పరిస్థితుల్లో వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట.ఇప్పుడు నాకు కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోక తప్పదు అనుకుని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడ్డాను.
సాయంత్రం హేమంత్ వస్తూనే వెళ్దామా మాధవ్ అనగానే సరే పద అని ఇద్దరం బయల్దేరి వెళ్ళాము.వెళ్తున్నానే కానీ కావ్య ఎదురైతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ దేవుడు నా మొర విన్నట్లు కావ్య తన చెల్లి,తమ్ముడితో కలిసి సినిమాకి వెళ్లిందట.మేము వెళ్ళగానే ఆంటీ మాధవ్ బాగున్నావా అని పలకరించి టీ ఇచ్చారు. అది తాగేలోపే హేమంత్ విషయం అంతా చెప్పగానే ఆంటీ తన ఫ్రెండ్,CI గారి భార్యకి ఫోన్ చేసింది. అటునుంచి ఆవిడ వెంటనే నేను మా వారితో ఇవాళ చెప్తాను వాళ్ళని రేపు స్టేషన్ కి వెళ్ళమనండి అన్నారట.
మాధవ్ రేపు స్టేషన్ కి వెళ్తే CI గారు ఆ పనమ్మాయిని పిలిపించి మాట్లాడుతారు.కేస్ పెట్టే పనిలేకుండానే పని అయ్యేలా చేస్తారులే అంది ఆంటీ .నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటిదాకా కదిపితే కన్నీళ్లు అన్నట్లుంది నా పరిస్థితి కానీ ఇప్పుడు హమ్మయ్య సమస్య ఒక కొలిక్కి వచ్చింది అనుకున్నాను. ఇంతలో ఆంటీ మాధవ్ మాకు తెలిసినావిడ ఇలా ఎవరివన్నా వస్తువులు పోయినా,ఇంట్లో మనుషులు కానీ పశువులు కానీ కనపడకపోయినా పూజలో కూర్చుని అవి ఎక్కడ ఉన్నాయి,దొరుకుతాయా లేదా అని చెప్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్దామా అంది.
నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు.అసలే నేను వివేకానంద శిష్యుడిని. ఇలాంటి మూఢనమ్మకాలని ప్రోత్సహించను.కానీ ఇప్పుడేమి చేస్తాం వాళ్ళ సాయం కోరి వచ్చాము కదా తప్పదు అనుకున్నా.. నా మనసులో కూడా ఏమో వెళ్తే ఒకవేళ ఏదన్నా తెలుస్తుందేమో అనే ఆశ కలిగింది.అందుకే అంటారేమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదు అని.సరే వెళ్దాం అనుకుని నేను,ఆంటీ హేమంత్ బయల్దేరి వెళ్ళాము.
వాళ్ళ ఇల్లు ఆంటీ వాళ్లకి పక్క లైన్ లో ఉంది.మేము వెళ్ళేటప్పటికి అక్కడ జాతకాలు చెప్పే ఆవిడ పూజలో కూర్చుని వుంది.నేనింకా ఎంత పెద్దావిదో అనుకున్నాను.కానీ 25 సంవత్సరాలకి మించని వయసుతో పెద్ద బొట్టు పెట్టుకుని,ఎర్రచీరలో ఎదురుగా అమ్మవారి ఫోటోకి నిమ్మకాయలదండ వేసి ధూపం వేస్తూ పూజ చేస్తుంది.ఆంటీ ఆమె దగ్గరికి వెళ్లి నన్ను చూపించి విషయం చెప్పగానే నన్ను వచ్చి ఎదురుగా కూర్చోమని చెప్పి,కాసేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి .. చైన్ గురించి నీ అనుమానం నిజమే నీ గొలుసు పనమ్మాయె తీసింది కానీ అది నీకింక దొరకదు ఆశ వదులుకో.అలాగే నీ జీవితంలో అందని దానికోసం ఆశపడి చాలా కష్టాలుపడాల్సి వస్తుంది జాగ్రత్త అంది.
నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు.చాలా బాధ అనిపించింది.అందుకే నేను ఇలాంటివి నమ్మను అనవసరంగా వచ్చాను అనుకుంటూ ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వచ్చాను.పాపం ఆంటీ,హేమంత్ కూడా బాధపడ్డారు.రెండో రోజు కాలేజ్ నుండి మధ్యానమే వచ్చి హేమంత్ ని తీసుకుని C I తో మాట్లాడటానికి పొలీస్ స్టేషన్ కి వెళ్ళాము.మేము వెళ్ళేటప్పటికి ఎవరినో వెర్రి కేకలు పెడుతూ వార్నింగ్స్ ఇస్తున్నాడు C I .నాకు అక్కడికి వెళ్ళటమే ఇష్టం లేదు కానీ ఏమి చేస్తాం తప్పని స్థితి.
అప్పటిదాకా ఆగ్రహంగా ఊగిపోతున్న ఆయన హేమంత్ వెళ్లి ఫలానా అని పరిచయం చేసుకోగానే నవ్వుతూ..ఆ ఆ నిన్న చెప్పారు మీకు పనిమనిషి మీద డౌట్ అంట కదా పిలిపిద్దాం మరి ఏమంటుందో? అంటూ కానిస్టేబుల్ ని పిలిచి మేము చెప్పిన పనమ్మాయి అడ్రెస్ కి పంపాడు. ఒక్క అరగంటలో పనమ్మాయి,ఆమె భర్త స్టేషన్ కి వచ్చారు.అక్కడ మమ్మల్ని చూస్తూనే కొంచెం అనుమానంగా మొహం పెట్టిన వాళ్ళిద్దరూ గొలుసు గురించి C I అడగ్గానే రాముడా దేముడా మేము అల్లాంటి వాళ్ళం కాదు సామీ. ఏదో కులానికి,కూటికి తక్కువోల్లమే గానీ ఇట్టాంటి పాడు పనులు మేమెందుకు చేస్తాం అంటూ ఏడుపు లంకించుకున్నారు.
వాళ్ళ నాటకం అర్ధం అయిన C I సరే అయితే మీఇష్టం వాళ్ళు మీమీద దొంగతనం కేసు పెడతారంట అనగానే వాళ్ళు వెంటనే పెట్టండయ్యా నేను కూడా పెడతాను నేను కులం తక్కువదాన్నని తిట్టి,హింసించటానికే మీరంతా ఇలా దొంగకేసు పెట్టారని అని ఏడుస్తూ.. మేమేదో వాళ్ళని కులం పేరుతో దూషించినట్లుగా సీన్ క్రియేట్ చేయటానికి సిద్దపడ్డారు.ఆ దెబ్బతో C I గారికి కూడా మాటల్లేవు ఆయనెక్కడ ఇరుక్కుంటాడో అని.పైకి మాత్రం బింకంగా మీరు నిజం చెప్పకపోతే మాకు తెలుసు ఎలా కనిపెట్టాలో తర్వాత పిలుస్తాం రండి అంటూ వాళ్ళని అక్కడి నుండి పంపేశాడు.
వాళ్ళు వెళ్ళిన తర్వాత చూశావుగా హేమంత్, వాళ్ళు అంతా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు.ఇప్పటికి ఇలా ఎన్ని చోట్ల చేశారో.. మనం వాళ్ళమీద కంప్లైంట్ రాసి FIR చేస్తేనే మంచిది.లేకపోతే వాళ్ళు మాట వినరు అంటూ ఇంక తనేమి చేయలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు .ఏమి చేద్దాము మాధవ్ అన్నాడు హేమంత్..నేనేమీ మాట్లాడలేకపోతున్నాను.కేస్ పెట్టటం ఇష్టంలేదు.ఉన్న ఒక్క ఆశా పోయింది.గొలుసు దొరుకుతుందన్ననమ్మకంపోయింది.ఇంకా ఏమి మిగిలింది మాట్లాడటానికి అనుకుని ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశాను.ఏంటి మాధవ్ అలా వచ్చేశావు నీకసలు ఏమీ తెలియదు.పాపం అంకుల్ మనకోసం ఇంత చేశాడు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా అంటున్న హేమంత్ ని చూస్తుంటే పిచ్చి కోపం వచ్చింది నాకు.
ఇంతకీ గొలుసు దొరకలేదు పాడూ లేదు.నాకు మాట్లాడటమే ఇష్టం లేని
కావ్య ఇంటికి తీసుకెళ్ళాడు.మూఢనమ్మకాలని నమ్మని నన్ను ఆ పూజలు చేసే ఇంటికి తీసుకెళ్ళాడు.పోలీసులంటే మంచి అభిప్రాయంలేని, ఇష్టపడని నన్ను దొంగలు,జులాయిలు తిరిగే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడు.ఇంకా ఏమి మాట్లాడాలి వీడితో అనుకుని ఆవేశంగా రూమ్ కి వచ్చేశాను.అనవసరంగా నన్ను నేను వసుదేవుడిలాగా ఊహించుకుని ఈ గాడిదలందరి (అంతే మరి హెల్ప్ చేస్తే దేవుళ్ళు లేకపోతె గాడిదలే ) కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? అదేదో గొలుసు పోయిందని ఒక్కమాట మా పెద్దలకి చెప్పి, తప్పయిందని వాళ్ళ కాళ్ళే పట్టుకుంటే సరిపోతుంది కదా అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత నా మనసు శాంతించింది...
గొలుసుదొంగ పనిమనిషి పని మానేసిన తర్వాత కొత్త పనిమనిషిని ఈసారి అన్ని
ఎంక్వైరీలు చేసి మరీ పనిలో పెట్టారు. పనిమనిషి లేక ఒక వారం అన్నిటికీ
ఇబ్బంది పడ్డ మా రూమ్ మేట్స్ కి అది కూడా నా తప్పులాగే అనిపించింది.వీడు
చైన్ తెచ్చుకోవటమేంటి,అది పోవటమేంటి మనకి ఈ తిండి తిప్పలేంటి అంటూ నాలుగు
రోజులు హోటల్లో తిని కనీసం నా చైన్ పోయిందన్న బాధ కూడా లేకుండా నా గురించి
మాట్లాడుకున్నారు చాటున. పోయిన చైన్ పోగా మాటలు కూడా పడాల్సి వచ్చింది
ఇంటా బయటా .. అలా నా గొలుసు సరదా మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది...