పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, జులై 2016, శుక్రవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - మహాబలిపురం


"A Journey through a magical Land"

మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కధ  చెప్పగ వచ్చాడు బాలరాజు..

చిన్నప్పటినుండి ఈ పాట వినీ వినీ ఇప్పటికి వెళ్ళగలిగాము.చిన్నప్పుడు స్కూల్ డేస్ లో టూర్ అంటే చెన్నై తీసుకెళ్ళేవాళ్ళు మా St.ann's 'సిస్టర్స్. అప్పడు మాతమ్ముడు వెళ్ళాడు కానీ నేను,చెల్లి వెళ్ళేవాళ్ళం కాదు.కానీ చూడాలి అనుకునేవాళ్ళం ఇప్పటికి కుదిరింది వెళ్ళటం. ఆ పాటలో బాలరాజు చెప్పినట్టు మహాబలిపురం నిజంగానే భారతీయ కళాజగతికి గొప్పగోపురం.ఎటు చూసినా "శిలలపై శిల్పాలు చెక్కినారూ" అన్న పాటే గుర్తొస్తుంది.అప్పటి శిల్పకళాకారుల వారసులే మళ్ళీ ఇప్పుడు చెక్కుతున్నారేమో అన్నట్లున్న ఎన్నెన్నో అందమైన శిల్పాలతో ఎన్నో షాపులు మహాబలిపురంలో అడుగడుగునా కనిపిస్తాయి.కనుచూపు మేరా ఎటుచూసినా సముద్రం, చాలా రిసార్ట్లు, హోటల్స్ అన్నీ సముద్ర తీరాన్ని ఆనుకునే ఉన్నాయి. రూమ్ కిటికీలు తీస్తే సముద్రపు హోరు వినిపించేది. ఎక్కడ అడుగుపెట్టినా అంతా ఇసుకే.కంచి నుండి రాత్రికి మహాబలిపురం చేరుకొని ఉదయాన్నే ముందు Sea Shore Temple కి బయలుదేరాము.
  
మహాబలిపురంలో మా తమ్ముడు, మరిది గారు

చరిత్ర - 
పల్లవులు మొదటిమహేంద్రవర్మ (571 – 630 CE) మరియు మొదటి నరసింహవర్మ (630 – 668 CE) హయాంలో అధికారంలోకి వచ్చారు.వీరు కాంచీపురం రాజధానిగా 9వ శతాబ్ది చివరివరకు దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు తమిళ ప్రాంత ఉత్తర భూభాగాలపై ఆధిపత్యం చలాయించారు.వాస్తుశిల్ప శాస్త్రాన్ని పల్లవులు ఎంతగానో ఆదరించారు. వీరు  నిర్మించిన ఎన్నో అద్భుతమైన శిల్పనిర్మాణాలను, దేవాలయాలను మహాబలిపురం లో చూడవచ్చు. పల్లవులు మధ్యయుగ దక్షిణభారత శిల్పనిర్మాణ శాస్త్రానికి పునాదులు వేశారని చెప్పొచ్చు .సరికొత్త శైలిలో శిలలను శిల్పాలుగా మలచడంలో పల్లవులు ముఖ్యపాత్ర పోషించారు. పల్లవులు మూలంలో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు ప్రాంతానికి చెందినవారని,అందుకే  ఈ  ప్రాంతాన్ని ఇప్పటికీ పల్నాడు (పల్లవనాడు) అని పిలుస్తుంటారని అంటున్నా దానికి తగిన  చారిత్రిక ఆధారాలు లేవని తెలుస్తుంది.

మొదటి నరసింహవర్మ -
పల్లవ రాజులందరిలోకి అగ్రగణ్యుడు మొదటి నరసింహవర్మ. ఇతడు రెండో పులకేశిని మూడుసార్లు ఓడించడమే కాకుండా క్రీ.శ 642లో మణిమంగళ యుద్ధంలో పులకేశిని అంతం చేశాడు. చాళుక్యుల రాజధానిని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదును పొందాడు.ఇతడికి మహాబలి, మహామల్ల - "maamallan" the great Wrestler , అనే బిరుదులు ఉన్నాయి.ఇతని పేరు మీదనే మహాబలిపురానికి మామల్లాపురం, మహాబలిపురం అని పేరు వచ్చింది. అలాగే ప్రహ్లాదుడి మనవడైన బలి చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి కూడా ఆ పేరు వచ్చిందనే చరిత్ర కూడా ఉంది.''
  
రెండవ నరసింహవర్మ - 
మహాబలిపురంలో బంగాళాఖాతం సముద్రతీరంలో రాతితో నిర్మించిన ఆలయం Sea Shore Temple 1984 లో UNESCO World Heritage Site గా గుర్తించబడ్డాయి. Sea Shore Temple (c. 700 - 728) 7 వ శతాబ్దంలో రాజసింహన్ అని కూడా పిలిచే రెండవ నరసింహవర్మచే నిర్మించబడ్డాయి.మొదటి నరసింహవర్మ కొండలను తొలిచి గుహాలయాలను నిర్మిస్తే ,రెండవ నరసింహవర్మ గ్రానైట్ దిమ్మెలను రకరకాల ఆకారాల్లో మలచి,ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మాణాలు చేయడం ఈ శిలాలయాల ప్రత్యేకత.ఈ ఆలయాలని సెవెన్ పగోడాస్(Seven Pagodas) అంటారు. ఈ ఆలయంతో పాటు ఇంకా వేరే 6 ఆలయాలు కూడా ఉండేవని అవి సముద్రంలో కలిసిపోయాయని ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారట.

టికెట్ తీసుకునే గేట్ దగ్గరి నుండి కనిపిస్తున్న Sea Shore Temple

ఈ ఆలయంలో తూర్పుముఖంగా ఉన్న ప్రధాన ఆలయంలో ధారాలింగం, శివలింగం వెనకనే శివపార్వతుల మధ్యలో సుబ్రహ్మణ్యస్వామి ఉన్నట్లు సోమస్కంధ విగ్రహం గర్భగుడి గోడల మీద చెక్కి ఉంటుంది.ధారాలింగం 16 ముఖాలు కలిగి  6 feet (1.8 m) black basalt stone తో చేసిన శివలింగం పైభాగం దెబ్బతిన్నా ఇప్పటికీ మెరిసిపోతూ ఉంది.వెనుకవైపు గుడిలో ప్రశాంతంగా పడుకుని ఉన్న విష్ణుమూర్తి "అనంతశయన విష్ణు" విగ్రహం ఉంటాయి.గుడి గోపురాలు ఎంతో  చక్కని డిజైన్లతో దూరంనుండే కనిపిస్తూ ఎంతబాగున్నాయో అనిపించేలా ఉంటాయి. చుట్టూ శిల్పాలే ..ఎంతసేపున్నా ఇంకా చూడనివి చాలా ఉన్నట్లే అనిపిస్తుంది.ఈ ఆలయానికి చుట్టూ సముద్రమే.. గుడి ఫెన్సింగ్ లోపల ఉంది.టెంపుల్ చుట్టూ నంది విగ్రహాలు పచ్చటి లాన్,చెట్లతో మేము ఉదయాన్నే వెళ్ళటంతో అప్పటికి ఎండలేకుండా  పరిసరాలు చాలా ఆహ్లాదంగా అనిపించాయి

టెంపుల్ దగ్గర..  మా అమ్మ


తూర్పు ముఖంగా, సముద్రానికి ఎదురుగా ఉన్న 
"క్షత్రియసింహ పల్లవేశ్వర శివాలయం" మెట్లు ఎక్కి లోపలికి  వెళ్ళాలి.  
గర్భగుడిలో గోడలమీద చెక్కిన 
శివపార్వతుల మధ్యలో కుమారస్వామి విగ్రహం

శివాలయానికి వెనుకవైపున "అనంతశయన విష్ణుమూర్తి"


సింహం పైకి ఎక్కుతున్న దుర్గా అమ్మవారి విగ్రహం 
గుడి ఆవరణలో నంది విగ్రహాలు.మేము లెక్క పెట్టలేదు కానీ ఇవి మొత్తం వంద నదులు ఉంటాయట 



 




ఆలయం ఆవరణలో నీళ్ల ట్యాంక్,
మధ్యలో మినియేచర్ టెంపుల్. 











చుట్టూ సముద్రం కనిపిస్తూ, సముద్రపు హోరుశబ్దం వింటూ,ఆ Shore Temple దగ్గర నించుంటే ఇప్పటి రోజుల్లో సముద్రతీరాల్లో రిసార్ట్స్,కాటేజీలు కట్టుకుంటున్నట్లు అప్పట్లో రాజులు దేవుడికోసం అలా సముద్రతీరంలో గుడి కట్టించారేమో  అనిపిస్తుంది.ఆలయం చుట్టూప్రహరీ గోడలు, శిల్పాలు,రాతిమెట్లు, కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి.ఆహ్లాదంగా, ఆశ్చర్యపరిచేలా ఉన్న గుడి పరిసరాలను వదిలి రావాలనిపించక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తూ పక్కనే ఉన్న బీచ్ కి వెళదామని బయలుదేరాము. 
Sea Shore Temple దూరంగా

ఉధృతంగా వస్తున్న సముద్రం అలల ముందు కొంచెం భయం అనిపించినా,పరిగెత్తుతూ వచ్చి చల్లగా తగులుతున్న నీళ్లలో ఆడుతూ ఆ ఒడ్డున ఎంతసేపున్నా బాగానే ఉంటుంది.నీలాకాశంతో పోటీపడుతూ కనుచూపు మేరా కనపడుతున్న సముద్రం చాలా బాగుంది.చాలామంది భయం  లేకుండా చాలా లోపలికి  వెళ్లి ఆడుతున్నారు. మేము కూడా చాలాసేపు ఆ సముద్రం,అలల విన్యాసాలు అలాగే చూస్తూ ఉండిపోయాము.సముద్రం దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంది బయటికి వచ్చాక ఇసుకలో నడవటం మాత్రం చాలా కష్టం, అసలే మే నెల కదా ఎండమాత్రం చాలా ఎక్కువగా ఉంది
మహాబలిపురం సముద్రం

మహాబలిపురం ఊరి మధ్యలో ఉండే శయన విష్ణుమూర్తి దేవాలయం
 

పెరుమాళ్ టెంపుల్ వెనకవైపునే మొదటి నరసింహవర్మ నిర్మించిన  గుహాలయాలుంటాయి.కృష్ణమండపం, పాండవకేవ్స్, అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం.ఇక్కడ టికెట్ ఏమీ ఉండదు.రోడ్డు మీదికే కనపడేలా ఉంటాయి.

కృష్ణ మండపంలో గోవర్ధనగిరి ఎత్తుతున్న కృష్ణుడు 
 పంచపాండవ మండపం












 అన్నిటికంటే చూడగానే ఆశ్చర్యంగా అనిపించే  శిల్పాలు పంచపాండవ మండపం పక్కన 25 మీటర్ల వెడల్పు,12 మీటర్ల ఎత్తుతో ఉన్న ఒక కొండలో చెక్కి ఉన్నాయి.ఇలాంటి కట్టడాన్ని Bas Reliefs అంటారు.Bas Reliefs అంటే నున్నటి ఉపరితలం మీద ఉబ్బెత్తుగా పైకి కనబడేలా చెక్కినవి. ఈ విగ్రహాలన్నీ ఒక కొండరాతి మీద చెక్కారు ఇప్పటిదాకా ఉన్న అలాంటి monuments లో ఇదే అందమైనదని,worlds largest అని చెప్తారు.ఇందులో ఎడమ వైపు ఒంటికాలుమీద రెండు చేతులు పైకెత్తి పాశుపతాస్త్రం కోసం కఠోరతపస్సు చేస్తున్న అర్జునుడు,పక్కనే శివుడు,విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, కిన్నెర కింపురుషులు,గంధర్వులు,భూతగణాలు,ద్వారపాలకులు,దేవీదేవతలే కాకుండా తపస్సు చేస్తున్న సాధువులు, మనుషులు,పెద్ద ఏనుగులు,జంతువులు,భగీరధుడు తపస్సుకి మెచ్చి గంగావతరణంకి సంబంధించిన శిల్పాలు ఇలా మొత్తం దాదాపు 150 శిల్పాలు ఇందులో ఉన్నాయట. 

అర్జున తపస్సు

ఇక్కడికి పక్కనే కూర్చుని తలలో పేలు చూసుకుంటున్న కోతులు :)

ఇక్కడినుండి కొండమీదకి వెళ్తే వినాయకుడి గుడి,వరాహస్వామి మందిరం మందిరాల్లో రకరకాల శిల్పాలు చాలా ఉన్నాయి.ఈ వరాహ మండపంలో వరాహస్వామి,భూదేవి,గజలక్ష్మి,దుర్గాదేవి,త్రివిక్రముడు శిల్పాలున్నాయి.

వరాహ మండపం. 

భూదేవి,వరాహస్వామి 



 చతుర్భుజ దుర్గాదేవి 

తామరపువ్వుపైన కొలువైన గజలక్ష్మీ అమ్మవారు 


వామనావతారంలో భూమి మీద ఒక కాలు,ఆకాశం మీద ఒక కాలు పెట్టిన త్రివిక్రముడు 

వినాయకుడి రధం (ఆలయం )
ఇందులో వినాయకుడి విగ్రహం ఉంటుంది. 










 రాయలగోపురం - ఇక్కడ పూర్తికాని నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి.ఆకాశాన్నంటుతున్నట్లుండే భారీ స్తంభాలతో, చూడగానే బాహుబలి సినిమాలో సెట్టింగ్స్ లాగా అనిపిస్తుంది.ఈ పిల్లర్స్ మీద దశావతారాలు చెక్కి ఉన్నాయి.ఇది పల్లవుల కాలంలో నిర్మించింది కాదని  తర్వాత కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు రాజ్యంలో నిర్మించారని తెలుస్తుంది. నిలువుగా ఉన్న ఈ స్థంభాల మీద దశావతారాలు,వివిధ దేవతా విగ్రహాలు చెక్కి ఉన్నాయి

రాయలగోపురం


రాయల గోపురం స్థంభాల మీద చెక్కిన దశావతారాలు

రాయల గోపురం Side View
ఏటవాలు కొండమీద పడిపోకుండా నిలుచున్న big rock . కృష్ణుడి చేతి వెన్నముద్ద అని చెప్తారు. మానవుల మేధస్సుకు అందని ఎన్నో ప్రకృతి అద్భుతాల్లో ఇది కూడా ఒకటేమో అనిపిస్తుంది.
  లైట్ హౌస్ 

ఇక్కడి నుండి పాండవుల రథాలు కొద్దిగా దూరం. టికెట్ తీసుకోవాలి. విశాలమైన ప్రదేశంలో 7 వ శతాబ్దంలో నరసింహవర్మ నిర్మింపచేసిన అయిదు రాతి రధాలకు పాండవరధాలు అని పేరు. ధర్మరాజు , భీముడు, అర్జునుడు, నకులసహదేవుడు,ద్రౌపది పేర్లమీద చెక్కినవే ఈ రథాలు. మహాభారతంలో ఈ రధాలకు ఏమీ సంబంధం లేదు కానీ వాళ్ళపేరుతో వీటిని పంచపాండవుల రథాలు అంటారు.పూర్తిగా చెక్కని ఈ రధాలతో పాటు ఇక్కడ పెద్ద ఏనుగు, సింహం శిల్పాలు ఫొటోలకి ప్రధాన ఆకర్షణ. 

పాండవుల రథాలు
ధర్మరాజు రధం 
చుట్టూ  అందమైన నిలువెత్తు విగ్రహాలు చెక్కి ఉంటాయి. 



భీమరధం 
దీర్ఘ చతురస్రాకారంలో అన్ని రథాల కంటే పెద్దగా ఉంటుంది.










అర్జున రధం  
ఈ రధం ముందు శివాలయం ముందు ఉన్నట్లు నది విగ్రహం ఉంటుంది

 













నకుల సహదేవులు రధం
వెనకనుండి చూస్తే ఏనుగు వెనక భాగం లాగానే ఉండటం ఈ రధం ప్రత్యేకత
ద్రౌపది రధం 
చిన్నగా అన్ని రధాలకంటే విభిన్నంగా ఉన్న ఈ రధంలో చతుర్భుజ దుర్గాదేవి నిలుచుని ఉన్న విగ్రహం ఉంటుంది. 








 మహాబలిపురం అంతా షాపింగ్ చూడటానికి,చేయటానికి కూడా నీరసం వస్తుంది. అన్నీ శిల్పాలు, ఫైటింగ్స్, రకరకాల ఆర్ట్ కి సంబంధించిన వస్తువులు,పూసల గొలుసులు,గవ్వలు ఇలా అన్నీ కొత్త కొత్త రకాలున్నాయి.

 రకరకాల శిల్పాలు

 మేము ఈ షాప్ లో కొన్ని చిన్న మార్బుల్ విగ్రహాలు కొన్నాము.ఆ శిల్పాలు చూస్తుంటే వీళ్ళు మిషన్లతో చేసినా, అప్పటి శిల్పకళాకారులకి అసలైన వారసులు అనిపిస్తుంది అంత  జీవం ఉట్టిపడేలా ఉంటాయి ఆ శిల్పాలు.మనం ఏదైనా ఫోటో ఇస్తే 3 నెలలో విగ్రహం చెక్కి,మనం ఇచ్చిన అడ్రెస్ కి ఇంటికి పంపిస్తారట.ఇక్కడ ఆర్ట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు కూడా ఇలా విగ్రహాలు తయారు చేస్తారని చెప్పారు.

ఈవిడకి బజ్జీలు నచ్చాయట. మండే ఎండలో 
పద్ధతిగా మంచి డ్రెస్ వేసుకుని,పాండవుల రథాల దగ్గర కూర్చుని హాయిగా బజ్జీలు తింటుంది. 
(ఫోటో ఆవిడ్ని అడిగే తీసాము)
may 16 తమిళ్ నాడు ఎలక్షన్స్ కోసం పార్టీల ప్రచారాలు.మేము ఎలక్షన్స్ టైమ్ లో వెళ్లటంతో ఎక్కడ చూసినా ప్రచారాలే.   









 
మహాబలిపురం బీచ్ లో గవ్వలపైన పేర్లు,డిజైన్స్ , బీచ్ లో తిరువాళ్వార్ విగ్రహం


మహాబలిపురం సమ్మర్ స్పెషల్స్ 
మసాలా మామిడికాయలు,మజ్జిగ, నిమ్మకాయ సోడాలు

ఇవీ  మానవ నిర్మిత మహాద్భుతం మామల్లాపురం,మహాబలిపురం విశేషాలు.ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. మాకు తెలియక కొన్ని మిస్ చేశాము. పైగా మాకు చూడాల్సిన ప్లేసెస్ ఎక్కువ, టైమ్ తక్కువగా కూడా ఉంది కాబట్టి  అక్కడినుండి బయలుదేరాము.


మహాబలిపురానికి చాలా దగ్గర్లో ఓల్డ్ మహాబలిపురం రూట్ లో తిరకలుకుండ్రం (Tirukalukundram)అనే పట్టణంలో కొండమీద వేదగిరీశ్వర్ దేవాలయం ఉంది.ఇక్కడ పైన గుడిలో శివుడు, కింద ఉన్న మరొక గుడిలో అమ్మవారు త్రిపురసుందరీ దేవి.ఈ క్షేత్రాన్ని పక్షితీర్ధం, డేగల దేవాలయం అని కూడా అంటారు.ఇక్కడ కొండమీద ఉన్న గుడిలో ఇప్పటికీ మధ్యాహ్నం 12 గంటలకు రెండు క్రౌంచ పక్షులు వచ్చి,పూజారి కొండమీదపెట్టే స్వామివారి ప్రసాదాన్ని తిని వెళ్తాయట.ఆ మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు నైవేద్యంగా పెడతారు.ఆ పక్షులు రెండూ శాపవశాత్తూ పక్షులుగా మారిన ఋషులని స్థల పురాణం. వచ్చిన భక్తుల్లో ఎవరైనా పాపాత్ములు ఉంటే ఆపక్షులు రావని అక్కడ నమ్మకం. నాలుగు వేదాలు ఇక్కడ కొండ రూపంలో కొలువున్నాయని అందుకే స్వామిని వేదగిరీశ్వర్ అంటారని కూడా తెలుస్తుంది. ఈ కొండ నిటారుగా ఉండి,565 మెట్లు ఎక్కటం కూడా కష్టం.మేము మహాబలిపురం నుండి వచ్చేటప్పటికే  చీకటిపడటంతో కింద గుడి వరకు దర్శనం చేసుకున్నాము.

తిరకలుకుండ్రం (Tirukalukundram) టెంపుల్

Related Posts Plugin for WordPress, Blogger...