సాయంత్రం రూమ్ కి వెళ్ళగానే హేమంత్ ని అడిగాను రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి అని.. మరి వాళ్ళు కూడా కావ్య ఇంటికి వస్తున్నారో లేదో తెలుసుకోవాలి కదా! రేపు మన క్లాస్ మేట్ రవి వాళ్ళన్నయ్య పెళ్లి . రఫీ,సోహిల్ కూడా వస్తున్నారు నువ్వు వస్తావా అన్నాడు హేమంత్.. లేదులే హేమంత్ నాకు రావాలని లేదు మీరు వెళ్ళండి నేను అక్కడికి వచ్చినా కొత్త వాళ్ళతో కలవలేను , మీకు కూడా ఇబ్బంది నా వల్ల అనగానే రఫీ కూడా రారా మాధవ్ ఒక్కడివి ఏమి చేస్తావు రూమ్ లో అన్నాడు .. లేదులే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను ఠక్కున అబద్ధం చెప్పాను. తెలిస్తే ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా రాలేదు ఆ క్షణం.
వాళ్లటు పెళ్ళికి వెళ్ళగానే 10 గంటలకల్లా నేను కావ్య ఇంటికి వెళ్లాను. ఒక్కడినే వాళ్ళింటికి వెళ్ళటం కొత్తగా, కొంచెం కంగారుగా కూడా ఉంది. పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ వాకిట్లోనే ఆంటీ కనబడ్డారు. రా మాధవ్ కావ్య చెప్పింది నువ్వొస్తావని. హేమంత్ పెళ్ళికి వెళ్ళాడట కదా అంటూ నన్ను లోపలి తీసుకెళ్ళింది..ఎప్పటిలాగే నీట్ గా ప్రశాంతంగా ఉంది ఇల్లు. అంకుల్ ఆఫీస్ కి, కావ్య చెల్లి,తమ్ముడు స్కూల్ కి వెళ్ళారు. ఏదో రికార్డ్ వర్క్ చేసుకుంటున్న కావ్య కూడా బయటికి వచ్చింది. ఆంటీ ఆ రోజు వెరైటీ టిఫిన్ పెట్టారు రవ్వ ఇడ్లీ అట .. అప్పటిదాకా మినపిడ్లీ తిన్నాను కానీ ఎప్పుడూ ఇవి తినలేదు.
ఎంతైనా ఆంటీ వెరైటీ గా వంటలు చేస్తారు అదే మాట అనగానే, ఆంటీ నవ్వి అంకుల్ జాబ్ కోసం మేము కొత్త ప్లేస్ లు చాలా తిరిగాము మాధవ్ ..అక్కడ నేర్చుకున్నాను ఇవన్నీ.నాకు ఫ్రెండ్ కూడా ఎక్కువే. అంటూ మీ అమ్మ వంట బాగా చేస్తారా అంది. నాకెందుకో అమ్మ విషయం రాగానే మనసుకు బాధ అనిపించింది.. ఎవరైనా మనసుకి దగ్గరగా అనిపించినా, కాస్త బాగా పలకరించినా నా మనసులో ఉన్నదంతా చెప్పెయ్యటం, ఇంటి విషయాలు కూడా దాచుకోకుండా చెప్పటం నాకొక బలహీనత ఇది మంచి అలవాటా, చెడ్డదా అని నాకు తెలియదు.
అలాగే ఆంటీ అమ్మ గురించి అడగగానే చిన్నప్పటి నుండి జరిగిన సంగతులన్నీ ఆంటీకి చెప్పాను . అక్కడే వున్న కావ్య కూడా మౌనంగా కూర్చుని వింటుంది . మనం ఎవరికైనా మన విషయాలు ఏవైనా చెప్పేటప్పుడు ఎదుటివాళ్ళు ఆ మాటల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ స్పందన ఎలా వుంటుంది అనే విషయాలన్నీ ముందే ఆలోచించుకోవాలి.. అమ్మ గురించి చెప్పిందంతా విన్న ఆంటీ మాధవ్ కొంత మంది మగవాళ్ళు ఉంటారు వాళ్ళు భార్యల్ని కొట్టరు,తిట్టరు,నలుగురికి కనపడేలా భార్యల్ని హింసించరు కానీ వాళ్ళ ప్రవర్తనతో ఎదుటి మనిషికి జీవితం మీద విరక్తి కలిగేలా చేయగలరు.
ఎవరిదాకా ఎందుకు మా అక్క వాళ్ళ ఆయన కూడా అంతే .. ఆ రోజుల్లోనే డిగ్రీ చదివిన అక్కని జాబ్ చేయొద్దు అన్నాడు సరేనని ఇంట్లోనే వుండిపోయింది. తన హాబీస్ , చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో ఆమెకంటూ ఒక లోకం ఉండటం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్ తో ముచ్చట్లు , సరదాలు ఎక్కువయ్యాయి అంటూ అక్కని అనేవాడు. మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఏంటి ఈ మధ్య కలవట్లేదు అని ఎవరైనా అడగగానే తనకి ఎవరితో కలవటం ఇష్టం ఉండదని అతనే ముందు వాళ్ళతో చెప్పేవాడు.చివరికి పిల్లల విషయం కూడా నువ్వు చెప్పకపోతే వాళ్ళకేమి చేయాలో నాకు తెలియదా అనేవాడు ఇలా ప్రతి విషయం ఏమి చేస్తే తప్పో , ఏమి చేస్తే ఒప్పో తెలియక, బయటి వాళ్లకు మాత్రం ఆమెకేమి తక్కువలే అనుకునేటట్లుగా ఉండేది అక్క పరిస్థితి.
ఆడవాళ్ళు ఎప్పుడూ హక్కులు,పోరాటాలు అంటూ మగవాళ్ళనివేధిస్తారన్నది అపోహ మాత్రమే మాధవ్. మేము కోరుకునేది కనీసం సమానత్వం కూడా కాదు మాకంటూ ఒక స్థానం. భార్య కోసం పెళ్ళికాకముందు ఉన్న బంధాలు వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ పెళ్ళితో కొత్తగా వచ్చిన బంధాల్ని కూడా సరైన స్థానంలో నిలుపుకుని కాపాడేవాడే భర్త.
ఆడవాళ్ళు పెళ్లి కాగానే పుట్టింటిని పూర్తిగా వదిలేస్తారు. భర్త ఇల్లే తన ఇల్లు అనుకుంటారు కాబట్టి భార్యకి ఒక్క ఇంటి బాధ్యతే ఉంటుంది.కానీ మగవాళ్ళు అలా కాదు తల్లి,తండ్రి,ఉంటే అక్కచెల్లెళ్ళు ఒక కుటుంబం, భార్య,పిల్లలు మరొక కుటుంబం అన్నట్లు ఉంటుది పెళ్ళైన తర్వాత మగవాళ్ళ పరిస్థితి .. ఎవరి మనసు నొప్పించకుండా, తనూ బాధపడకుండా పరిస్థితులను చక్కదిద్దగలిగే మగవాళ్ళే ఆడవాళ్ళ కంటే గొప్ప . ఆ మాట మాత్రం నిజమే అంటాను నేను.. ఈ విషయంలో నేను మాత్రం అదృష్టవంతురాలినే మాధవ్ అంకుల్ చాలా మంచి మనిషి అంటూ ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడి ఉపన్యాసం చెప్పినట్లున్నాను అంటూ నవ్వేశారు..
ఆంటీని చూసిన నాకు అనిపించింది జీవితం నేర్పించే పాఠాలు చాలా గొప్పవి, అవి నేర్చుకోవాలంటే ఏదో పెద్ద పెద్ద చదువులు,ఉద్యోగాలు చేయాల్సిన పనిలేదు.. సరే మాధవ్ నేను వంట చేస్తాను భోజనం చేసి వెళ్దువుగాని అనగానే వద్దాంటీ నేను బయట తింటాను లెండి అన్నాను.. ఎందుకు మాధవ్ మొహమాటం మా హేమంత్ ఎలాగో నువ్వు అలాగే ఏమీ పర్లేదులే అని వెళ్ళబోతూ ఆంటీ అన్నారు..
మాధవ్ నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట నువ్వు మాత్రం పెళ్ళైన తర్వాత నీ భార్యని బాగా చూసుకో మీ నాన్నలాగా డాక్టర్ అయ్యావు కానీ భార్య విషయంలో మాత్రం మీ నాన్నను ఫాలో అవ్వకు అన్నారు.నాకు ఒక్క క్షణం ఎందుకో మనసు కలుక్కుమంది ఏంటో మన వాళ్ళను మనం ఎన్ని తిట్టుకున్నా ఏమీ ఉండదు కానీ బయటి వాళ్ళు చిన్నమాట అన్నా బాధ అనిపిస్తుంది వాళ్ళు నిజమే చెప్పినా సరే. ఏమైనా నేను ఆరోజే డిసైడ్ అయ్యాను నా భార్య,పిల్లల్ని మాత్రం నేను బాగా చూసుకోవాలని .. "ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు" ..
ఆంటీ వంట చెయ్యటానికి వెళ్ళిన తర్వాత కావ్యతో మాట్లాడుతుండగా హేమంత్ వాళ్ళు వెళ్ళిన పెళ్లి గురించి కావ్య చెప్పింది మా క్లాస్ మేట్ రవి అన్నయ్య సుమన్ పెళ్లి అతని క్లాస్ మేట్ తోనే అట. వాళ్లిద్దరూ ఇప్పుడు పీజి చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రేమించి,ఇష్టపడని పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారని, పెళ్లి తర్వాత వెంటనే మా రూమ్ కి దగ్గరలోనే ఫామిలీ పెట్టటానికి ఇల్లు కూడా రెంట్ కి తీసుకున్నారని, చెప్పింది.
ఏమిటో నాకు ఏ సంగతులు తెలియవు,ఎవరు చెప్పరు పోనీలే కావ్య వల్ల కొన్ని తెలిశాయి అనుకున్నాను. ఈ లోపు ఆంటీ వంట చేశారు, అంకుల్ కూడా రాగానే అందరం లంచ్ చేసి కాసేపు కూర్చుని, ఇక వెళ్తానని చెప్పి రాబోతుండగా నా వెనకే వచ్చిన కావ్య మాధవ్ నువ్వు నాకొక హెల్ప్ చేయాలి చేస్తావా ? అంది.. నేను ఏంటి అనగానే "నువ్వు చేస్తాను అంటేనే చెప్తాను" అంది మళ్ళీ.. నాకు ఒక్క క్షణం అర్ధం కాలేదు ఏమి అడుగుతుంది, ఏమి చెయ్యమంటుందీ అమ్మాయి అయినా.. తనకి నేనేమి చేయగలను అని ఆలోచిస్తూనే సరే చేస్తాను అన్నాను ...