ఏ అడ్డుగోడనైనా తొలగించే
ఏ పర్వతాన్నైనా పెకిలించే
ఏ సాగరాన్నైనా మధించే
ఏ ఆకాశాన్నైనా అధిగమించే
ఏ లక్ష్యాన్నైనా భేధించే
ఏ అలవాటునైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది
మనస్పూర్తిగా ప్రయత్నిస్తే లక్షలమందికి స్ఫూర్తిఅవుతారు
మీరు గెలిస్తే కోట్లాది మందికి వెలుగవుతారు
అనుకున్నది సాధిస్తే చరిత్ర పుటల్లో చేరిపోతారు
చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించి ,ఆ చీకటిని తొలగించటం వివేకం.జీవితం ఒక ప్రయాణం మాత్రమే గమ్యం కాదు..నిన్నటి నుండి పాఠాలు నేర్చుకుంటూ, ఈ రోజు సంతోషంగా జీవిస్తూ, రేపటి కోసం ఆశను పెంచుకోవటమే జీవితం.మనలో ఉన్న అనంతమైన శక్తిని తెలుసుకుని,సాధించాలని సంకల్పించి సాధించి చూపించటమే ఆత్మస్థైర్యం.
అపజయాలు ఎదురైనప్పుడు క్రుంగిపోవటం,బాధపడటం సహజం కానీ ఆ ఓటమిని విజయంగా మార్చినవారే విజేతలు..ఈ ప్రయత్నంలో తమకుతాము స్ఫూర్తి పొందేది కొందరైతే..గొప్పవాళ్ళ మాటలు,సూక్తుల ద్వారా స్ఫూర్తి పొందేది కొందరు..నాకు కూడా ఇన్స్పిరేషన్ కొటేషన్స్,పాటలు,చిత్రాలు సేకరించటం, చదవటం,వినటం ఇష్టం.
నేను ఈ మధ్య చూసిన ఒక మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ నాకు చాలా నచ్చింది."గులాల్" హిందీ సినిమాలోని ."Aarambh hai prachand" పాటను Lyricist, Singer, Stage Performer "విప్లవ సేన్.అప్పరాజు" గారు స్వయంగా తెలుగు లిరిక్స్ రాసి,పాడిన ఈ పాట ఇన్స్పిరేషన్ సాంగ్స్ లో ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు.
ThankYou "Viplov Sen. Apparaju" గారు..
మీరు మరెన్నో మంచి స్ఫూర్తిదాయకమైన పాటలను అందించాలని కోరుకుంటూ అభినందనలు..
ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం
తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ
సమరానికి సిద్దమెప్పుడు వీరుడు
కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి
యుద్ధానికి జంకడెపుడు యోధుడు
అనునయులే ఎదిరించిన సహచరులే వారించిన
ధర్మానికి బద్ధుడెపుడు ధీరుడు
తలవంచని స్వభావాలు రాజసమే ఆనవాలు
ఒడిదుడుకుల కెదురేగే తత్వము
అలుపెరుగని సాహసాల ఎగరేయి ఇక బావుటాలు
నలుదిక్కుల చాటు ఆధిపత్యము
ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం ...
అధైర్యవంతమా భావన శౌర్యవంతమా స్పందన
ఓటమిదా ఆక్రందన ఎంచుకో ..
నిలువరించి ఆవేదన దీక్షబూని చేయ్ సాధన
ప్రతిఘటించి బలహీనత వదులుకో
బ్రహ్మాండమంత నిలదీసిన ఒంటరిగా వెలివేసిన
సంకల్పం సడలకుండా నడుచుకో
సమయమునే వృధాపరచు సుఖములకై పరితపించు
హృది తలపుల సంకెలనే తెంచుకో
ఉప్పెనలా బడబాగ్ని రక్తములో మరిగేట్టు
పోరాటపు పౌరుషమే పెంచుకో
ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం ...
తుది సమరమే ఆరంభం ...