పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

12, ఏప్రిల్ 2012, గురువారం

మా మాచర్ల చెన్నకేశవుని రధోత్సవం..

మా పల్నాటి సీమకే మకుటాయమానంగా వెలుగొందే మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవుని రధోత్సవం నిన్న (11-04-2012 )
జరిగింది. ఊరంతా సందడిగా, సంతోషంగా రధోత్సవం లో పాల్గొన్నారు.చెన్నకేశ స్వామి రధం లాగితే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అందుకే పోటీలు పడి మరీ మగవాళ్ళు రధం లాగుతారు.ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజున కల్యాణం,మూడవ రోజున రధోత్సవం జరుగుతాయి.
శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి దేవాలయం చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందింది. దేవాలయం వద్ద లభించిన శాసనాల ప్రకారం హైహయ వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది. శ్రీ లక్ష్మీ చేన్నకేశ స్వామిని త్రేతాయుగం లో కార్త వీర్యార్జునుడు ప్రతిష్టించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి.ఈ ఆలయం కృతయుగం నాటిదన్న భావన కూడా ఉంది.బ్రహ్మనాయుడు కూడా ఈ ఆలయంలోనే పూజలు నిర్వహించేవాడు..
ఈ ప్రాంతం లో చంద్రవంక నది తన గమన దిశను మార్చుకుని,ఉత్తరవాహిని అయ్యింది.అందువల్లే ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా కీర్తి పొందింది.శ్రీనాధుడి పల్నాటి చరిత్ర ఇక్కడ ప్రాధాన్యతను తెలియ చేస్తుంది.శ్రీనాధుడు ఈ ఆలయం నుండే పల్నాటి వీర చరిత్రను రచించటం ప్రారంభించాడట.ఈ ఆలయంలో మండప స్తంభాలు చోళరాజుల కాలం నాటి శిల్ప కళా శోభకు ప్రత్యక్ష సాక్ష్యాలు.గర్భాలయం ముందున్న నాలుగు స్తంభాలపై భారత,భాగవత,రామాయణ గాధలు,దశావతారాలు అత్యంత మనోహరంగా చెక్కబడి ఉంటాయి.
స్వామి వారి బ్రహ్మొత్సవాల్లో మొదటి రోజున అంకురార్పణ,ధ్వజారోహణం, కల్యాణోత్సవం,హనుమద్వాహనం,
శేషవాహనం, గరుడ వాహనం,రవిపొన్న వాహనం,రధోత్సవం,అశ్వవాహనం,శుక వాహనం,పుష్పయాగం,
ద్వాదశ ప్రదక్షిణలు,ఏకాదశ కలశ స్థాపన,పవళింపు సేవ ఇలా 15 రోజుల పాటు రోజుకో సేవ తర్వాత 16 రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి..ఇవీ మా మాచర్ల చెన్న కేవుని రధోత్సవ విశేషాలు..


మా తిరునాళ్ళ స్పెషల్ స్వీట్స్.

Related Posts Plugin for WordPress, Blogger...