పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, సెప్టెంబర్ 2014, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 4




మొదటి సంవత్సరం అయిపోయింది అందరం మంచి మార్క్స్ తో పాసయ్యాము .. నేను రఫీ హాస్టల్ లో ఒకే రూం లోకి మారాము. కొన్నిసార్లు  నన్ను పిలవకుండానే రఫీ,సాహిల్ ఎక్కడికో వెళ్ళేవాళ్ళు ..వీకెండ్స్ లో, ఎప్పుడన్నా హాఫ్ డే ఖాళీ దొరికినప్పుడు సినిమాలకి, చుట్టుపక్కల ప్రాంతాలు చూడటానికి వెళ్ళేవాళ్ళం . నేను మాత్రం మా నానమ్మ తరుపు బంధువులు ఉండేది కూడా ఆ ఊళ్లోనే కావటంతో ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళే వాడిని.. ఒకసారి రఫీ,సోహిల్  బయటికి వెళ్తూ నన్ను కూడా తనతో రమ్మని పిలిచారు ..

ఫ్రెండ్ రూం కి తీసుకెళ్ళారు .అక్కడ పరిచయమయ్యాడు హేమంత్...  హేమంత్ అమ్మ,నాన్న ఇద్దరు డాక్టర్లే .. హాస్టల్ ఫుడ్,వాతావరణం నచ్చలేదని హేమంత్,  మరో ముగ్గురు మా క్లాస్మేట్స్ కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నారు.  కొన్నాళ్ళుగా రూమ్మేట్స్ కి తనకి పడటం లేదని, ప్రస్తుతం ఆ  రూమ్ లో వుండే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి, రఫీని,సోహిల్ ని మీరు రావచ్చు కదా మా రూమ్ కి..   అని అడిగాడు .. దానికి రఫీ సరే మరి అంటూ నన్ను అడిగాడు నీ సంగతేంటి వస్తావా? అంటూనే  "వస్తావా కాదు రా"  అంటున్నాను .. సంవత్సరం నుండి ఇద్దరం కలిసి ఉంటున్నాము .. ఇప్పుడు ఇక్కడికి కూడా కలిసే మారదాం. ఇక్కడైతే హాస్టల్ లాగా  ఫుడ్ సమస్య, వాటర్ సమస్య , ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు ఉండవు కదా అని, నా అభిప్రాయం అడిగాడు.నేను నాన్నని అడిగి చెప్తానని చెప్పాను ..

నాలో ఆలోచన మొదలయ్యింది ఇప్పుడేమి చెయ్యాలి .. రూం అంటే నాన్న ఏమంటారో ? ఇటు రూమ్ కి మారను అంటే ఫ్రెండ్ దూరమవుతారు .. అసలే ఒంటరిగా ఉండే అలవాటు లేదు, అలాగని కొత్తవాళ్ళతో తొందరగా పరిచయాలు పెంచుకోలేను.. ఇటు చూస్తే రఫీ, సోహిల్ ఇద్దరూ హాస్టల్ ఖాళీ చేయటానికి డిసైడ్ అయినట్లే ఉన్నారు . సరేనని టెలిఫోన్ బూత్  కి వెళ్లి ఇంటికి ఫోన్ చేశాను.. అమ్మ ఫోన్ తీసింది . మాధవ్ ఎలా ఉన్నావు , వేళకి తింటున్నావా.. ఈ ఆదివారం రాకపోయావా ఇంటికి అంటూ తనదైన శైలిలో పక్కన వాళ్లకి కూడా వినపడనంత నిదానంగా మాట్లాడి , నాన్న గురించి అడగ్గానే నాన్న హెల్త్ సెంటర్ కే  వెళ్ళారు మరి.. ఏమన్నా చెప్పాలా అని అడిగింది .

ఏమీ లేదమ్మా సరే నేను ఇంటికి వచ్చి మాట్లాడతానులే నాన్నతో అంటుండగానే ఎవరూ .. అంటూ నాన్నమ్మ వచ్చి అమ్మ దగ్గర ఫోన్ లాక్కుని నువ్వెందుకు నాయనా రావటం. మీ నాయనే రేపు నీ దగ్గరికి వస్తాడంట . ఉదయం చెప్పాడు నాతో.. మీ నాయన రాంగానే నేను చెప్తాలే నువ్వు పోన్ చేశావని.. సరే ఉంటా అంటూ ఫోన్ కట్ చేసింది . నాన్న నా దగ్గరికి వస్తానన్న విషయం అమ్మకి తెలియదనమాట పాపం అందుకే నన్ను రమ్మంది . ఇదే కాదు అమ్మకి చాలా విషయాలు తెలియవు ఇంట్లో అన్ని విషయాలు చర్చించి, నిర్ణయాలు చేసేది నాన్నమ్మ,నాన్నలే .. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ ఫీల్ అవుతుంటుంది. కానీ ఎప్పుడు బయటపడదు. సరే ఇంకేం చేస్తాం నాన్న ఎలాగు రేపు వస్తాడు కదా. అప్పుడు డైరెక్ట్ గానే అడగొచ్చులే అనుకున్నాను .

రెండో  రోజు ఉదయాన్నే నాన్న వచ్చారు.. నాన ఎప్పుడూ ఒక డాక్టర్ లాగా మెయింటెన్ చెయ్యరు. నాన్నతో పాటూ అందరు కార్లు కొంటే నాన్న మాత్రం ఇప్పటికి మోపెడ్ మీదే హాస్పిటల్ కి వెళ్తాడు .ఊర్ల ప్రయాణం బస్సులు, రైళ్ల లోనే  చేస్తాడు..కనీసం బయట ఏమీ తినడు ,తాగడు మేము పిల్లలం ఎప్పుడన్నా ఎందుకు నానా  అందరిలాగా మనం ఉండొచ్చుగా అంటే సమాధానం మా నానమ్మ చెప్తుంది .. ""ఇప్పడు ఇలా  కూడబెట్టి బ్రతికితేనే మేము ముసలితనంలో రాజాల్లాగా ప్రశాంతంగా  బతకొచ్చు మీ మీద ఎవరిమీదా ఆధారపడకుండా"". ఎంత ముందుచూపు, నమ్మకమో మా నాన్నకి,నాయనమ్మకి  "ఇప్పుడు వాళ్ళు తినీ తినకుండా దాచినదంతా భవిష్యత్తులో వాళ్ళే తింటారని"..!

ఉదయాన్నే నాన్న వచ్చాడు.  నేను చెప్పిన రూమ్ విషయం విని , హాస్టల్ కి, రూమ్ కి డబ్బు ఖర్చు విషయం లెక్కలు వేసి, రూమ్ చూసి నా  ఫ్రెండ్స్ తో మాట్లాడి సరే మరి నీ ఇష్టం, ఎక్కడున్నా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. నీకు ఇక్కడ బాగానే ఉంటుందనుకుంటే హాస్టల్ మారు  అని చెప్పి అవసరమైన డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఒక పెద్ద భారం దిగింది . అప్పటికే సిద్ధంగా ఉన్న రఫీ,సోహిల్ తో కలిసి హాస్టల్  నుండి రూమ్ కి మారింది జీవితం .నిజంగా హాస్టల్ కంటే ఇక్కడే బాగుంది నీట్  గా ఉన్న గదులు,వంటమనిషి. చేసే వంట. 
మొత్తానికి హాస్టల్  హింస తప్పింది .. రఫీ మాట విని మంచిపని చేశాలే అనిపించింది.

 ఒక రోజు కాలేజ్ నుండి రూం కి వచ్చేసరికి అంతా సందడిగా ఉంది . లోపల ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. వాకిట్లో ఆడవాళ్ళ చెప్పులు కనపడ్డాయి .. అసలే కొత్తవాళ్లని చూస్తె నాకు మొహమాటం. గబా గబా లోపలికి  వెళ్లి నా రూమ్ వైపు వెళ్తున్న నన్ను మాధవ్  ఇలా రా అని పిలిచాడు హేమంత్. తప్పక వెళ్ళిన నాకు వచ్చిన వాళ్ళు అతని పిన్ని,పిన్ని పిల్లలు ( చెల్లెళ్ళు) అని  పరిచయం చేశాడు..  వాళ్ళలో ఒకమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపించింది .. నేనలాగే చూస్తుంటే నా ప్రశ్నార్ధకం మొహం అర్ధం అయిందేమో మాధవ్  She Is My Cousin
"కావ్య " మన క్లాస్ మేట్ కూడా అని హేమంత్ అనగానే చిన్నగా నవ్వుతూ హాయ్ అంది కావ్య ..

నీ క్లాస్ మేట్  నీకు తెలియదా అని వాళ్ళ పిన్ని ఆశ్చర్యంగా అడిగింది .మాధవ్ మా నలుగురితో తప్ప క్లాస్ లో అబ్బాయిల్తోనే ఎక్కువగా కలవడు ఇంకా అమ్మాయిలతో పరిచయం ఎలా ఉంటుంది అంటూ అందరూ నవ్వేశారు .. కొత్తవాళ్ళతో మాట్లాడటానికి అంతగా ఇష్టపడని నాకు వాళ్ళతో మాట్లాడటం, రోజంతా వాళ్ళు అక్కడుండటం ఎందుకో ఇబ్బందిగా అనిపించలేదు ....  "అలా మొదలయ్యింది"  నా రెండో సంవత్సరం కాలేజ్ లైఫ్..
 

Related Posts Plugin for WordPress, Blogger...