పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జులై 2010, శనివారం

మా చిన్ని ప్రపంచానికి స్వాగతం...



మావిచిగురుతిని మీకు శుభమని మేలుకోలిపెను గండుకోయిలా..
మంచికబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల..
ఇంతలో కల పండగా ఇంటిలో తొలిపండుగా..

నా
చిన్నారి మేనకోడలికి , నా చిన్ని ప్రపంచానికి హృదయపూర్వక స్వాగతం...

ఇప్పటిదాకా కొడుకుగా,తమ్ముడిగా, అన్నగా వున్న నా తమ్ముడు వంశీ రోజు తండ్రి అయ్యాడు.

రోజు నా చిన్ని ప్రపంచంలోకి అడుగుపెట్టి ,నన్ను మేనత్తని చేసిన నా చిన్నారి మేనకోడలిని
నిండు మనసుతో దీవిస్తూ , మనసారా నా చిన్ని ప్రపంచానికి స్వాగతిస్తున్నాను...
కొత్త బంధాలను,కొత్త కొత్త సంతోషాలను నా చిన్ని ప్రపంచానికి తీసుకువచ్చిన మా చిన్నారి ఆటపాటల తో మా చిన్ని ప్రపంచం ఇంకా అందంగా,ఆనందంగా వుండాలని,

నా మేనకోడలికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను,సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని,
పాపాయి బోసినవ్వులతో,అల్లరితో మా చిన్నిప్రపంచం కళకళలాడాలని ...
నా చిన్ని ప్రపంచం ఎప్పుడూ భగవంతుడి చేతుల్లో పదిలంగా వుండాలని కోరుకుంటూ..

నా చిన్ని ప్రపంచంలోని అందరి దీవెనల జల్లులతో మా చిన్ని ప్రపంచానికి స్వాగతం చిన్నారీ...

రాజి




21, జులై 2010, బుధవారం

ఆషాడమాసం...

జీవితం ఎప్పుడూ రొటీన్ గా వుంటే ఏమి బాగుంటుంది.
ఎప్పుడూ ఏదో ఒక విశేషం వున్న జీవితం నిత్య నూతనంగా వుంటుంది.
కాడ్బరీస్ చాక్లెట్ యాడ్ లాగా తియ్యని వేడుక చేసుకోవటానికి ఏదో ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూడాలి
అందిన అవకాశాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయాలి ఇది నా అభిప్రాయం.

ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇది ఆషాడమాసం కదా
సంవత్సరంలో కొన్ని నెలల లాగా ఎలాంటి విశేషం లేకుండా ఉండకుండా
కొన్నిచిన్న చిన్న సరదాలు తెచ్చే ఆషాడమాసం అంటే నాకు చాలా ఇష్టం.

ఆషాడమాసం లో కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు కలిసి వుండకూడదు.అత్తా,కోడలు ఒకే గడప దాటి నడవకూడదు ఇది ఆషాడం లో ముఖ్యమైన నియమం.
ఇది మన పెద్దలు ఎందుకు పెట్టారో తెలియదు కానీ తర్వాత కాలంలో దీనికి "సైంటిఫిక్ రీజన్స్" కనిపెట్టేసారు.

గోరింటాకు

ఆషాడం లో ఆరుసార్లు గోరింటాకు పెట్టుకోవాలన్నది నాకు చాలా చాలా నచ్చే సరదా...
గోరింటాకు అంటే గోరింటాకే పెట్టుకోవాలి లేకపోతే మానేయాలి ఇది నా నిర్ణయం.

మా చెల్లి కోన్ తో మంచి డిజైన్లు పెడుతుంది కానీ నాకు అస్సలు ఇష్టముండేది కాదు కోన్ తో మెహంది పెట్టుకోవటం.
అయితే గోరింటాకు ఎప్పుడు దొరకదు కదా అందుకని ఆషాడం లో ఇంటిదగ్గరకి అమ్మడానికి వచ్చే గోరింటాకు కోసం ఎదురు చూసి కొనుక్కుని పెట్టుకుంటే ఆ ఎర్రగా పండిన గోరింటాకు చేతుల అందం,చేతులకి ఆ గోరింటాకు వాసనా ఎంత బాగుంటుందో...

ఈ సంవత్సరం మాత్రం నా గోరింటాకు సరదా తీరిపోయింది.
మేము ఇప్పుడుండేది రూరల్ ఏరియా కావటంతో మా పనిమనిషి పని కట్టుకొని మరీ
నాకు గోరింటాకు తెచ్చి పెడుతుంది. ఒక్క ఈ నెలలోనే కాదు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.

ఆషాడంలో వచ్చే మరో సంబరం బోనాలు.


ఆషాడం లో మహంకాళి భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే నైవేద్యమే ఈ బోనాలు.
ఈ పండుగ ఎక్కువగా హైదరాబాద్,తెలంగాణా,ప్రాంతాలో చేస్తుంటారు.
పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు,నగలతో, తలమీద బోనాల కుండతో అమ్మవారి స్వరూపాల్లాగా వుంటారు.

మా చిన్నప్పటినుండి మా అమ్మ అమ్మవారి పూజ చేసేది కాబట్టి
మా వూరికి దగ్గరలో వున్న నిదానంపాడు అమ్మవారి గుడిలో బోనాలు సమర్పించటం
మాకు ఎప్పటినుండో వస్తున్నఆచారం.
హైదరాబాద్ లో జరిగే బోనాలు లాగానే వుంటుంది ఇక్కడి బోనాల పండగ కూడా.

ఆషాడం డిస్కౌంట్ సేల్...


ఆషాడంలో మా కుటుంబం అందరికీ నచ్చే అతి పెద్ద సరదా ఆషాడం ఆఫర్లలో బట్టల షాపింగ్ చేయడం.
అంటే మిగతా రోజుల్లో బట్టలు కొనము అని కాదు ..
ఎవరు ఏమనుకున్నా కానీ... డిస్కౌంట్ లో షాపింగ్ చెయ్యటం చాలా సరదాగా వుంటుంది.

హైదరాబాద్ చైతన్యపురి సాయిబాబా గుడి దగ్గరినుండి మొదలవుతుంది మా షాపింగ్
ఈ నెలలో సాయంత్రాలు షాపింగ్ కి ఆ ప్రాంతానికి వెళితే చాలు కళ కళలాడుతూ విద్యుత్ దీపాల వెలుగులతో, రకరకాల ఆఫర్లతో సరికొత్త షాపింగ్ ప్రపంచం మనకు స్వాగతం పలుకుతుంటే మనల్ని మనం నిగ్రహించుకోగలమా షాపింగ్ చేయకుండా...

ఇవీ ప్రతి సంవత్సరం ఆషాడంలో నా చిన్నిప్రపంచంలో మా సరదాలు...
ప్రస్తుతానికి ఆషాడంని ఎంజాయ్ చేస్తూ రాబోయే శ్రావణమాసం శుభప్రదంగా వుండాలని కోరుకుంటూ ....

రాజి

7, జులై 2010, బుధవారం

చిరుగాలి వీచే వీచే


ఇవాళ ఉదయం నిద్ర లేచి తలుపు తీయగానే నాకు గుర్తొచ్చిన పాట "చిరుగాలి వీచే వీచే" ....
రాత్రి నుంచి పడుతున్న వర్షానికి తడిసి ముద్దైన ప్రకృతి అందం వర్ణనాతీతం.
సన్నగా పడుతున్న వర్షాన్ని చూస్తూ ఆ చలిగాలిలో నించున్న నా మనసులో వెంటనే ఈ పాట మెదిలింది.

నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఈ పాట ఒకటి.నాకు ఇష్టమైన పాటలు చెల్లితో వీడియో మిక్సింగ్ చేయించటం నా హాబీఅలాగే ఈ పాట కూడా నాకోసం చేసింది మా చెల్లి.

చల్లటి ఆహ్లాదకరమైన ప్రకృతిని చూసిన ప్రతిసారి నాకు ఈ పాట గుర్తొస్తుంది.
ఎంతో అందమైన, నా మనసుకు హత్తుకున్న పాట ఇది.



చిరుగాలి వీచే వీచే
చిరు
మబ్బు కరిగే కరిగే

చిరుజల్లు
కురిసే కురిసే

హృదయాన్ని
తడిపేసింది ఆకాశం...


సిరిమల్లె పాటే పాడే
సిరివెన్నెల
ఆటే ఆడే

చిరుగువ్వలు
కువకువలాడే

దిశలన్నీ మురిపించిందీ
మధుమాసం..




రాజి

6, జులై 2010, మంగళవారం

ఆకాశం నేలకు వచ్చిందీ...


మూడు కాలాల్లోను నేను ఇష్టపడే కాలం వర్షాకాలం .
వర్షం ఎప్పుడు పడినా ఒక అధ్బుతమే.
హోరున వర్షం, చల్లగాలి చక్కిలిగింతలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి.

చిన్నప్పుడు వాన పడుతుంటే తుంపరలలో తడవటం,
కాగితపు పడవలు నీళ్ళలో వదులుతూ పోటీ పడటం ఒక ఆట.
అమ్మ కోప్పడితే అయిష్టంగా లోపలికి వచ్చినా మా చూపులన్నీ బయట వర్షం మీదే...
వర్షం పడినప్పుడు స్కూల్ మానేయడం కూడా ఒక సరదా మాకు అప్పట్లో.



నిన్న సాయంత్రం టీ తాగుతూ బాల్కనీలో కూర్చున్నాము ...
ఆకాశంలో ఒక్కసారిగా మేఘాల మెరుపులు, ఉరుముల విన్యాసాలతో వర్షం మొదలైంది.

చల్లగాలితో వర్షం తుంపరలు,ఆకాశం అంతా పరచుకున్న ఇంద్రధనస్సుతో
మా ఇంటి దగ్గర వర్షం ప్రకృతిని ఎంతో రమణీయంగా మార్చేసింది.

ఆకాశం నేలకు వచ్చిందీ
చిరుజల్లుగా మారి నాతోటి చిందులు వేసిందీ..

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా


ఆకాశం నేలకు వచ్చింది.



ఇంద్రధనస్సులో ఎన్ని రంగులో
బ్రహ్మ సృష్టిలో ఎన్ని వింతలో




4, జులై 2010, ఆదివారం

మేము సైతం...


మాకు కూడా ఒక్క చాన్స్ వస్తే ఇలాగే  చెయ్యాలి 













Related Posts Plugin for WordPress, Blogger...