అబద్ధం చెప్పటం మనిషికి సరదా కాదు,కావాలని ఎవరూ అబద్ధాలు చెప్పరు.. కానీ జీవితంలో ఒక్కసారైనా అబద్ధం చెప్పని మనిషి వుండరేమో.."నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు" అని ఎవరైనా అంటే అంతకు మించిన అబద్ధం ఉండకపోవచ్చు నాకు తెలిసి :)
కొంతమందికి అబద్ధం ఆపద్ధర్మం ఐతే.. మరి కొంతమందికి అబద్దం ఆడటమే హాబీ కూడా కావచ్చు.
వీళ్ళని అబద్ధాల కోరులు అని కూడా అంటారు లెండి..
ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఆడే అబద్ధాలు వారిమధ్య సంబంధాలను కాపాడుకోవటానికి, అది ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు...లేదా ఇతరులనుండి రహస్యాలు దాచటానికైనా కావచ్చు. మొత్తంగా ఏదో ఒక విషయంలో ఎపుడో ఒకపుడు అబద్ధాలు చెప్పేస్తూంటాము ...
ఒక్కోసారి మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనకోసం ప్రేమగా వంట చేస్తే అది బాగా లేకపోయినా,
వాళ్లకి నచ్చిన డ్రెస్ మనకు నచ్చకపోయినా , ఇంటికి వస్తున్నామని ముందుగా చెప్పకుండా వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ మీకేమన్నా ఇబ్బందా? అంటే మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం అబ్బే అదేమీ లేదండీ అంటూ ... ఎదుటి వాళ్ళ మనసు బాధపడకూడదని చెప్పే మొహమాటపు అబద్ధాలు,
నువ్వు చాలా అందంగా వున్నావని,నీ ముందు ఎవరైనా తక్కువే అంటూ ఇష్టమైన వాళ్ళను పొగిడేసి,వాళ్ళను సంతోషపెట్టే అందమైన అబద్ధాలు..చిన్నప్పుడు స్కూల్, ఎగ్గొట్టి తాతయ్యనో అమ్మమ్మనో చంపేసే అల్లరి అబద్ధాలు,ఆఫీస్ కి లేట్ గా వెళ్లినప్పుడు హెడ్ కి చెప్పే కట్టుకదల అబద్ధాలు...
ఇంకా మన బ్లాగ్ లోకం లో ఐతే ఏ పోస్ట్ పెట్టినా,అది పూర్తిగా నచ్చినా,నచ్చకపోయినా చాలా బాగుంది అని మెచ్చుకునే అబద్ధాలు..అంటే ఇలాంటి అబద్ధాలు కొత్త వాళ్ళని ప్రోత్సహించి,వాళ్ళు మరింత బాగా రాయటానికి ఉపయోగ పడుతుంటాయి కూడా...నాకు ఈ పరిస్థితి రాలేదు లెండి ఎందుకంటే మన బ్లాగర్లందరూ చక్కగా రాస్తారు కదా అందుకని..
రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన "ఏప్రిల్ ఒకటి విడుదల" సినిమా అందరికీ తెలిసిందే..
అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం (రాజేంద్రప్రసాద్) ఒక అనాధ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరం లో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి (శోభన) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళి కి ఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దాలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి (కృష్ణ భగవాన్) సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
భువన ట్రాన్సుపర్ మీద రాజమండ్రి వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
అప్పటి నుండి అతడు నిజాలు చెపుతుండటం వలన ఆతనికి ,ఇంకా ఆ కాలనీలో చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి.చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే అతడిని తల్లిలా పెంచిన వసుంధర గోపిని చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపదసమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.
ఇదీ సినిమా కధ.. అబద్ధం చెప్పటం హాబీగా పెట్టుకున్న మనిషికి నిజాలే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే అది ఎంత ఘోరంగా వుంటుందో సరదాగా చూపించారు..అప్పుడప్పుడు అబద్ధం అనే ముసుగు వేసుకోకపోతే తనకే కాక ఎదుటివారికి కూడా ఎంత ప్రమాదమో ఈ సినిమా చెప్తుంది.
రాజేంద్రప్రసాద్ సరదా నటన, సంభాషణలు,,శోభన సహజమైన అందం,నటన ఇంకా మిగిలిన హాస్యనటుల
హాస్యం ఈ సినిమాను హాస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచేలా ఇప్పటికీ టీవీలో వస్తున్నా చూడాలనిపించేలా చేయగలిగింది...
ఈ సినిమాలో పాటలు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్.. "మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా " పాట వింటే చాలు సినిమా అంతా కళ్ళముందు కదులుతూ ఒక చిన్న నవ్వు వచ్చేస్తుంది వెంటనే..
ఈ మధ్య FM లో ఈ పాట వినగానే ముఖ్యంగా ఈ పాటలో ఒక లైన్ ...
భోజనానికి పిలిచి, వంట గురించి అభిప్రాయం అడిగిన వాళ్ళతో
"అపార్ధం చేసుకోరుగా ... అనర్ధం చేయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటది ... పదార్ధం చెత్తగున్నది
ఇది విందా నా బొందా ... తిన్నోళ్ళు గోవిందా"
అని వినగానే నాకు అనిపించింది నిజంగా కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడకుండా తప్పించుకోలేము,అది చాలా కష్టం కూడా కదా అని..
"ప్రాణ మాన విత్త హానులదప్పింప కల్లలాడువారుకవులుసుమ్ము" అని,
"వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి" అని ఇలా అబద్ధం విషయంలో మన పెద్దలు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు...అలాగని పెద్దలే చెప్పమన్నారు కదా అని అదే పనిగా అబద్ధాలు చెప్తూ వుంటే నాన్నా పులి లాగా అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్ కదా ..!
"మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా"