పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

3, మార్చి 2017, శుక్రవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - జంబుకేశ్వరం / తిరువనైకోవిల్మధురై నుండి 2 గంటల్లో శ్రీరంగం వచ్చేశాము.అక్కడ వెంటనే దర్శనానికి వెళ్లాలనుకున్నాము కానీ మధ్యాహ్నం దర్శనం విరామం సమయం కావటంతో గుడి మూసేసి ఉంది.ఈలోపు శ్రీరంగం ప్రాకారాల మధ్యలో ఉన్న షాపింగ్,ఆలయం అంతా తిరిగి చూసి,ముందు జంబుకేశ్వర్ ఆలయానికి వెళ్లి రావచ్చని అక్కడికి వెళ్ళాము.

శ్రీ జంబుకేశ్వరుడు,శ్రీ అఖిలాండేశ్వరీ దేవి 

పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం.తమిళనాడులోని తిరుచ్చికి 11 కి.మి దూరములో ఉంది. శ్రీరంగం ఆలయం నుండి 10 నిమిషాల్లో జంబుకేశ్వరుని సన్నిధికి చేరుకోవచ్చు.జంబుకేశ్వరానికి తిరువనైకోవిల్ అనే పేరు కూడా ఉంది.పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది.తిరువనైకోవిల్ /జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో జలలింగం.ఇక్కడ చిన్న గర్భాలయంలో స్వామి జలలింగంగా కొలువై ఉన్నారు.శివలింగం ఎప్పుడూ నీటిలో తడిసే ఉంటుందట.అమ్మవారు సమస్తలోకాలను పాలించే అఖిలాండేశ్వరిగా కొలువైవుంది.జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది.కావేరి నదిలో స్నానం చేయటం,జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని పూజించటం ఎంతో పుణ్యంగా భావిస్తారు.ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో,అందమైన శిల్పకళతో ఉంది.కానీ గర్భగుడి చాలా చిన్నది.వంగి లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.

సాలీడు,ఏనుగు,అమ్మవారు,శంభుమహర్షి స్వామిని పూజించుట 

పురాణకధనం ప్రకారం శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి మహా శివభక్తుడు.శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయగా శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయి వరం కోరుకోమనగా శంభుడు శివయ్యని ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు.భోళాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగరూపములో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజిస్తావని చెప్పి,శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి నమ్మకం.పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా అవతరించి,ఈ జంబు వృక్షం కిందే కావేరి నది నీటితో శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేసింది.శివుడు ప్రత్యక్షమై అమ్మవారికి శివజ్ఞానాన్ని ఉపదేశించాడు.అందుకే ఈ క్షేత్రాన్ని ఉపదేశ స్థలం,జ్ఞానక్షేత్రం  అని కూడా అంటారు.ఇక్కడ అమ్మవారు శివుని ఉపదేశాలు పొందింది కాబట్టి స్వామివారిని గురువుగా,అమ్మవారిని శిష్యురాలిగా భావిస్తారు.కాళహస్తి స్థలపురాణంలాగానే ఇక్కడ కూడా స్వామివారిని ఏనుగు, సాలిపురుగు పోటీ పడి పూజిస్తుండేవట.

గర్భగుడిలో స్వామి,అమ్మవారు 

అమ్మ అఖిలాండేశ్వరి చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు,నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు,క్రింది చేతులు అభయహస్తంతో,వరదముద్రతో నిలువెత్తు అమ్మవారి విగ్రహం అమ్మ మనముందు సాక్షాత్కరించిందా అన్నట్లు అనిపిస్తుంది.అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చి,అమ్మవారి ముందు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని నమ్మకం.

ఆలయం లోపల 

చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని,సుమారు 1800 సంవత్సరాలక్రితం(Kochchenganan),కొచ్చెన్ గనన్  చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత ఆలయ నిర్వహణ, స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు  విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది.విశాలమైన 5 ప్రాకారాలు,ఎత్తైన అందమైన విగ్రహాలతో నిండినగోపురాలు,వేయిస్థంభాల మండపంలోని స్థంభాలపైన శిల్పాలు,ఆలయం లోపలి కొన్ని చిన్న ఆలయాలు  అన్నీ ఆశ్చర్యపరిచే శిల్పకళతో నిండి ఉంటాయి.

ఆలయగోపురాలు 


వేయి స్తంభాలమండపం 

ఆలయంలో శిల్పకళ 


ఆలయం లోపలి ప్రాకారం 

ఇవీ జంబుకేశ్వర ఆలయ విశేషాలు.జంబుకేశ్వరుని దర్శనంతో పంచభూత లింగాలని చూడాలన్న నా కోరికని శివయ్య తీర్చాడు అనిపించింది.ఇంతకుముందే 2012 లో అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాము.ఈ ట్రిప్ లో ఒకేసారి కాళహస్తి వాయులింగేశ్వరుడు,కంచి ఏకామ్రేశ్వడు-పృథ్విలింగం,చిదంబరం నటరాజేశ్వరుడు -ఆకాశలింగం, జంబుకేశ్వరం - జలలింగం దర్శనభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం అనిపించింది.పంచభూతలింగాల విశేషాలు ఈలింక్ లో చూడొచ్చు.  ----  http://raji-rajiworld.blogspot.in/2016/06/blog-post_23.html

ఓం నమో జంబుకేశ్వరాయ నమః 

జంబుకేశ్వరంలో మా తమ్ముడు 

Related Posts Plugin for WordPress, Blogger...