పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మన జీవితం...!


రోజులు,గంటలు,నిమిషాలు,క్షణాలంటూ
కాలం కొలతల్లో బంధించిన మన జీవితం
ఆగకుండా కదిలే కాలచక్రంతో పోటీ పెట్టుకున్న
ఉరుకులు పరుగుల పరుగుపందెం...

పరుగుపందెంలో అలసి,ఆగిపోతున్న
అనుభూతులు, అనుబంధాలు,ఆప్యాయతలు
ఎంతగా అలసిపోయినా సేదతీరేందుకు సమయం లేదు!

ప్రతి మనిషికి ముందు చూపే
తన చుట్టుపక్కల ప్రపంచం ఏమైపోతుందో
తెలుసుకోవాల్సిన అవసరం, అవకాశం లేదు!

జీవిత ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలకు
సమాధానాలు వెతకటమే తప్ప
ఈ ప్రయాణం సరైనదేనా అని సమీక్షంచుకునే
సందర్భం కూడా రాదు!

జీవితపు బరిలో బంధువులు,స్నేహితులే మన ప్రత్యర్ధులు
అందరూ అయినవారే ... అయినా ఎవరికి వారే పోటీ
ఒకరికంటే నేను బాగుండాలనే ఈ తాపత్రయంలో
గెలుపు,ఓటములు ... లాభ నష్టాల కూడికలు తీసివేతలే ఈ జీవితం!

ఉన్నది లేదనుకుని ... లేనిది కావాలనుకుని
ఏదో సాధించాలనుకుని ... ఎక్కడికో చేరాలనుకునే
ఈ ఆశలు,ఆశయాల పరుగు
ఎక్కడికో ?? ఎందాకనో ???




Related Posts Plugin for WordPress, Blogger...